అష్టాదశపురాణములు – శ్రీమద్భాగవతము

నైమిశారణ్యము

శ్రీమంతమైన ఆర్యావర్తములో నైమిశారణ్యమని ఒక అరణ్యమున్నది. అది శౌనకాదిమహర్షుల యజ్ఞక్షేత్ర సాధకులైన మహాయోగులకు తపోభూమి. పుణ్యకర్మములు చేయు సజ్జనులకు కర్మభూమి.

అట్టి నైమిశారణ్యములో శౌనకాది మహామును లందరు జేరి, కలియుగములో పుణ్యకర్మములు వృద్ధియై అధర్మము నశించుటకు వేయి సంవత్సరములు దీక్షతో సత్రయాగము చేయనారంభించిరి. ఆ సమయములో అక్కడికి రోమమహర్షుని పుత్రుడను వ్యాసశిష్యుడును సమస్తపురాణవేత్తయును అగు సూతుడు వచ్చెను.

అతనిని మునులందరును సత్కరించి “పుణ్యకథలతో గూడిన పురాణములు నీ నోటినుండి వినవలెనని యున్నది. యాగాసమయములో పురాణశ్రవణము శ్రేయస్కరముకదా! విష్ణుభక్తి ప్రధానమగు శ్రీమహాభాగవతమును ముందు వినిపించి, ఆ తరువాత పురాణము లన్నియు వినిపింపు” మని అడిగిరి. సూతుడు అందుకు ఆమోదించి పురాణములు చెప్పుట ప్రారంభించెను.

పురాణ నిర్వచనము – భాగవతము

మునీంద్రులారా! ముందు పురాణ మనగానేమో తెలిసికోనవలెను. “పురా – ఆసక్తి” = పూర్వ విషయములను సృశించునది అనియు, “పురా పినవమ్” = ప్రాచీన విషయములు చెప్పుచున్నను ఎప్పటి కప్పుడు క్రొత్తగా కనబడునది అనియు, “పురావిశాయాన్ నయతీతి పురాణమ్” = పూర్వ సంప్రదాయములైన ధర్మాదివిషయములను మన కందించునది, అనియు పురాణమునకు నిర్వచనము లున్నవి.

“ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృహంయేత్” (ఇతిహాస పురాణముల ద్వారా వేదధర్మములను విస్తరిమ్పజేయవలెను/లేదా వ్యాప్తి చేయవలెను) అని ఆర్యోక్తి. కావున ఆ మహాకార్యము జరిగినపుడే పురాణముల ఉనికియు, పఠణశ్రవణములును సార్థకమగును.

“స్వర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ,
వంశాను చరితంచేతి పురాణం పంచలక్షణమ్”

ఆదిసృష్టి, బ్రహ్మవలన తరువాత జరిగిన సృష్టి, రాజ, ఋషి వంశములు, స్వాయంభువాది చతుర్దశ మన్వంతరములు, ఈ మనువులనుండి వ్యాపించిన వంశములలో ప్రసిద్ధుల చరిత్రములు అను ఐదు లక్షణములు గలది పురాణము. శ్రుతి స్మృతులలోని ధర్మములను మిత్ర సమ్మితముగా బోధించుచుండును. ఆయా కథలలోనున్న నీతులను ధర్మములను కవి చెప్పినను చెప్పకపోయినను పాఠకులు (శ్రోతలు) గ్రహించుచుండ వలెను. పురాణము లనగా భారతీయ విజ్ఞాన సర్వస్వములు. “న హి విజ్ఞాన సర్వస్వం పురాణా ద్వేదసమ్మితాత్” అని పెద్దల వాక్కు.

మహర్షులారా! మీరు ముందు భాగవతమును వినిపింపు మనుటలోని రహస్యము నా కర్థమైంది. పురాణము లన్నియు చాలావరకు భాగవతకథలతో నిండినవైనను, భాగవతమువలె పరిపూర్ణత నొందినవికావు. అది విన్నవారిలో భగవంతునియందు భక్తితాత్పర్యములు కలుగు ననుటలో సందేహము లేదు. భక్తిభావన లేకుండ ఆయన కథలు వినుటవలన ప్రయోజనము లేదు, గాడిద గంధపుచెక్కలు మోసినట్లు పురాణశ్రవణము నిరర్థకమగును.

భక్తి కలిగినపుడే భాగవతకథలు వినుటకు శ్రద్ధ కలుగును. అందుకు భాగావటమే సాధనము. ఇవి  అన్యోన్యాశ్రమాములు.

భాగవతమనగా భగవంతునికి సంబంధించిన మహాత్యములు, కథలు గలది. (భగవత ఇదం భాగవతం) భగవంతుని భక్తులు భాగవతులు. వారి పుణ్యచరిత్రలు కలది. (భాగవతి భక్తాః భాగవతాః, భాగవతానాం ఇదం భాగవతమ్)

భగవంతుని కథలు నేల వినవలెను? భగవంతు డనగా నెవ్వడు? అను ప్రశ్నలు పుట్టును.

“ఐశ్వరస్య సమగ్రస్య సత్యస్య యశసః శ్రియః,
జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా”

తా|| సృష్టిని, ప్రళయమును, జీవుల జనన మరనములను, విద్యలను, అవిద్యలను అన్నింటిని దెలిసినవానిని భగవాను డనిరి.

అంతటి సర్వశక్తి సంపన్నుడును, సర్వజగన్నాథుడును, సర్వజీవులకు గమ్యస్థానమైన వాడును అగు భగవంతుని గూర్చి కాక, ఆశాశ్వతములైన విషయములను గూర్చి బుద్ధిమంతులు వినుట కుత్సహింపరు. మీ రందరును సర్వ విద్యాపారంగతులు; మహాప్రాజ్ఞులు. మీకు తెలియని విషయము లేముండును? అయినాను నన్ను భగవత్కథాసంకీర్తనలతో ధన్యుని జేయదలచి యిట్లడగినారు. వ్యాసభగవానుని యనుగ్రహముచే నాకు కలిగిన పురాణపరిజ్ఞానమును, నె నవగాహన చేసికోన్నంత వరకు మీకు కెల్లరకును వినిపించెదను” అని వారికి శ్రీమద్భాగవతము మొదలుకొని అష్టాదశ పురాణములను చెప్పుటకు ఉపక్రమించెను.

సృష్టిక్రమము

మాయావిభుడైన పరమేశ్వరుని మహత్త్వత్త్వమునుండి, తమోగుణ ప్రథానమై ద్రవ్యజ్ఞాన క్రియాత్మకమైన అహంకారము పుట్టెను. అది ద్రవ్య శక్తియైన తామసము, క్రియాశక్తియైన రాజసము, జ్ఞానశక్తియైన సాత్త్వికము అని మూడు విధము లయ్యెను. తామసాహంకారమునుండి శబ్దగుణము గల ఆకాశము పుట్టెను. దానినుండి శబ్దస్పర్శగుణములు గల వాయువు పుట్టెను. అది ప్రాణ రూపమున దేహములందునుండి ఇంద్రియదైతన్యము కలిగించును. వాయువువలన శబ్ద స్పర్శ రూపములు గల అగ్ని పుట్టెను. అగ్ని నుండి శబ్దస్పర్శరూప రసములు గల నీరు పుట్టెను. దానినుండి శబ్దశ్పర్శరూప రసగంధములనెడి అయిదు గుణములుగల భూమి పుట్టెను.

వికారము (మార్పు) చెందిన సాత్త్వికాహంకారమునుండి మనస్సు, దిక్కులు, సూర్యుడు, అశ్వినులు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతి, వాయుదేవుడు, అనువారు పుట్టిరి.

తేజోరూపమైన రాజసాహంకారము నుండి చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు, అను జ్ఞానేంద్రియములును, వాక్కు, కరములు, చరణములు, గుదము, జననేంద్రియము అను కర్మేంద్రియములును, బుద్ధియు, ప్రాణములును పుట్టినవి.

ఇట్టివానితో భగవానుడు బ్రహ్మాండశరీరమును సమకూర్చి, దానిలో చేతనములు, అచేతనములు అగు వస్తువులను సృష్టించెను. అండము పదివేలయేండ్లు నీటిలో నుండెను. కాల కర్మస్వభావములకు ప్రేరకుడైన భగవంతుడు ఇది జడముగా నుండుట చూచి తాను జీవరూపుడై దీనిలో ప్రవేశించెను. అపుడా బ్రహ్మాండదేహుడైన భగవానునికి భూర్భువస్సువర్మహర్జన స్తపస్సత్యలోకములనెడి యూర్థ్వలోకములు నడుమునుండి ఊర్థ్వదేహమును, అతల, వితల, సుతల, తలాతల,రసాతల, మహాతల, పాతాళములనెడి యథోలోకములు అథో (క్రింది) దేహమును అయ్యెనని చెప్పుదురు. ప్రపంచపురుషుడైన విరాట్పురుషుని ముఖమునుండి బ్రాహ్మణులును, భుజములనుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులును, పాదములనుండి శూద్రులును జన్మించిరి.

ఆ బ్రహ్మాండ  (విరాట్) పురుషునికి భూలోకము కటి ప్రదేశమనియు, భువర్లోకము నాభియనియు, సువర్లోకము హృదయము, మహర్లోకము వక్షము, జనోలోకము కంఠము, తపోలోకము స్తనద్వయము, బ్రహ్మనివాసమైన సత్యలోకము శిరస్సు, ఉపకటి (నడుమునకు మొంచెము క్రింద) అతలము, తొడలు వితలము, మోకాళ్ళు సుతలము, పిక్కలు తలాతలము, చీలమండలు రసాతలము, పాదములు మహాతలము, అరకాళ్ళు పాతాళము అనియు చెప్పుదురు.

కొందరు పాదములనుండి భూలోకమును, నాభినుండి భువర్లోకము, శిరమునుండి స్వర్ణోకమును బుట్టినవందురు.

భాగవతావతరణము

ఇరువది ఎనిమిదవ ద్వాపరామున పరాశరునకు సత్యవతియందు కృష్ణద్వైపాయనుడు జనించెను. అతడు విష్ణువు వంశమున బట్టినవాడు. అతడు సరస్వతీనదిలో స్నానము చేసి బదరికాశ్రమమున ఒంటరిగా కూర్చుండి భూతభవిష్యద్వర్తమానములను గురించి యోచించుచు, రాబోవు కలియుగాములోని మానవులు బలహీనులై, విధ్యుక్తకర్మము లాచరించు శక్తిలేని వారగుదురని భావించి, సర్వవర్ణాశ్రమములకు తగినట్లుగాను, యజ్ఞయాగాదులకు విరామము లేకుండునట్లుగాను, ఏకరాశిగానున్న వేదమును ఋక్, యజుస్, సామ, అధర్వణములని నాలుగు భాగాములుచేసి, ఇతిహాస పురాణము లన్నియు పంచమవేద మని నిర్దేశించెను.

ఇన్ని చేసినను వ్యాసునకు మనశ్శాంతి కలుగక విచారించుచుండగా నారదుడు అచ్చటికి వచ్చెను. వ్యాసుడ తనిని పూజించెను. నారదుడు వ్యాసుని, “నీ విచారమునకు కారణమేమి” అని అడిగెను. వ్యాసుడు, “నీకు తెలియని దేమున్నది? నాచింతకు మందు నీవే చెప్పు” మనెను. నారదుడు “నీ వెన్ని పురాణములు వ్రాసినాను వానిలో విష్ణుకథ లంతంత మాత్రముగానే చెప్పినావు. కాని, సమగ్రముగా చెప్పలేదు. శ్రీహరి మహత్యమును గ్రహించి భక్తితో అతని లీలావిశేషములను వర్ణింపుము. నీకు చింత దీరి బ్రహ్మానందము కలుగును. పూర్వజన్మములో శూద్రుడనైన నే నిట్లుండుటకు, హరినామ స్మరణమే కారణము” అని చెప్పి వెళ్ళెను.

వ్యాసుడంతట ధ్యానరతుడై విష్ణుదేవుని స్మరించి అతని మహిమా విశేషములను భాగవత గ్రంథముగా రచించి తన కుమారుడైన శుకమహర్షిచేత చదివించెను. ఆ సమయమున అక్కడనే యున్న రోమమహర్షుణుడును, అతని పుత్రుడు ఉగ్రశ్రవుడును వ్యాసుని యనుగ్రహమున భాగవతమును విని గ్రహించిరి. ఈ యిద్దరును సూతులే. (సూత వంశము వారని అర్థము).

పరీక్షిత్తు – శాపము

అభిమన్యుని భార్యయైన ఉత్తర గర్భమున పరీక్షిత్తు ప్రాణము లేకుండ పుట్టెను. శ్రీకృష్ణుడు అతనిని బ్రతికించెను. అందుచేత విష్ణురాతుడని పేరుపొందెను. అతడు వేటకు వెళ్ళినపుడు, గోరూపములో ఒంటికాలిపై నిలిచిన ధర్మదేవతను శూద్రరూపుడైన కలిపురుషుడు తన్నుచుండెను. పరీక్షిత్తు అతనిని చంపబోగా అతడు, “నేను కలిపురుషుడను. ఇది నా యుగము. ఇచట ధర్మమొక్క పాదముతో నిలిచినను సహించను” అనగా రాజు “నా పరిపాలమున ధర్మము నాలుగు పాదములతో నడవవలసినదే. నీవు నా రాజ్యములో కనబడరాదు కనబడినచో చంపెదను” అనెను. కలి తానూ ఉండుటకు చోటు చూపుమనెను. రాజు కరుణించి “ప్రాణివధ, స్త్రీవ్యసనము, మద్యపానము జూదము జరుగుచోటులలో నీవుండు” మని కలిపురుషుని పంపి ధర్మదేవతను నాలుగుపాదాలతో నడిపించెను.

పరీక్షిత్తు మరొకసారి వేటకుపోయి మృగములను వేటాడి దాహముతో నీటికై వెదకుచు, తపోనిష్ఠలో నున్న శమీకమునిని నీళ్ళు ఇమ్మని అడిగెను. అతడు వినిపించుకొనలేదు. కోపము వచ్చి రాజు ఒక చచ్చిన పామును శమీకుని మెడలో వేసి వెళ్ళిపోయెను. కొంతసేపటికి మునికుమారుడు శృంగి వచ్చి తండ్రి మెడలోని పామును చూసి కోపించి, “ఈ అకృత్యము చేసిన వాడు ఏడు రోజులలో తక్షకుని చేతిలో మరణించుగాక” అని శపించెను. శమీకుడు లేచి దివ్యదృష్టితో జూచి, ధర్మరక్షకుడైన రాజును శపించినందుకు కొడుకును మందలించి విషయమును వెంటనే పరీక్షిత్తునకు తెలియజేసెను. పరీక్షితుడు తానూ చేసిన అకార్యమునకు పశ్చాత్తాపము చెంది, తన కుమారుడైన జనమేజయునకు పట్టాభిషేకము చేసి, వెంటనే గంగాతీరమునకు బోయి ప్రాయోపవేశము చేసెను.

ఆ సమయములో అతని అదృష్టముకొలది శుకమహర్షి పరీక్షిత్తువద్దకు వచ్చెను. రాజు అతనిని పూజించి, తనకీ ఏడురోజులలో భాగవత కథలు వినిపించి ముక్తిమార్గమును చూపుమని ప్రార్థించెను. ఆవు దగ్గర పాలు పితుకునంతకాల మైనను ఒక్కచోట నిలువని శుకుడు, రాజు ప్రార్థనను మన్నించి అతనికి భాగవతము నుపదేశించుటకు అంగీకరించెను.

సప్తసంఖ్యా విశిష్టత

సప్తసంఖ్య సర్వసిద్దులకును మూలము, జపముగాని, యజ్ఞముగాని, ఏడురోజులు ఏకాగ్రతతో చేసినచో సిద్ధి కలుగుతుంది అని నారదుడు ధ్రువునితో చెప్పెను. చిత్రకేతువు ఏడురోజులలో మంత్రము జపించి సిద్ధి పొందెను. పరీక్షిత్తునకు ఏడురోజులలో మరణము కలుగునని శాపము. అతడు భాగవతము విన్నది ఏడు దినములు. ఏడురోజులలో అతనికి జీవనపరమావార్థసిద్ధి కలుగావలెను. అనగా మృత్యువును తరించి జన్మరాహిత్య (అమృత) సిద్ధి కలుగావలెను. అందుకే శుకుడు అతనికి విద్యాస్వరూపమైన భాగవతమును ఏడురోజులలో వినిపించుట కారంభించెను. “విద్యయా మృత మశ్నుతే” (విద్యచేతనే అమృతత్వమును బొందును) అని శ్రుతి.

మన శరీరములో నున్నవి సప్తధాతువులు. మహత్తు, అహంకారము పంచభూతములతో గలిసి ఏడైనవి. శరీరము సాప్తధాతుకము, సాప్తభౌతికము గూడ నైనది. అంతేకాదు. “సప్తశీర్షణ్యాః ప్రాణాః సూర్యా ఇత్యాచార్యాః” అని శ్రుతి వాక్యము. అనగా ఇంద్రియములలో ప్రధానమైన రెండు కన్నులు, రెండు ముక్కురంధ్రములు, రెండు చెవులు, ఒక నోరు అను ఏడును శిరస్సునందు ఉండు ప్రాణము అనియు, అవి సప్తభూతాత్మకములైన సూర్యులే అని భావము. “సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయాన్నిహితా స్సప్త సప్త” అని ఉపనిషత్తు చెప్పును. అనగా భూర్భువస్సువరాది సప్తలోకములలోను ప్రాణములు తిరుగుచుండునట్లుగా భాగావానుడీ సప్తసంఖ్యలతో కూడిన పదార్థములను సృష్టించెనని దీని యర్థము. భూలోకమనగా మూలాధారము, భువర్లోకము అనగా స్వాధిష్ఠానము, సువర్లోకము మణిపూరము, మహార్లోకము అనాహతము, జనోలోకము విశుద్ధము, తపోలోకము ఆజ్ఞాచక్రము, సత్యలోకము సహస్రారము. అనగా ఈ లోకములన్నియు మన శరీరములోనే యున్నవి. సహస్రారము గూడ చేధించుకొని బిందురూపమైన యమృతస్థానము చేరినచో జీవునకు మోక్షసిద్ధి గలుగును. వీనిని యోగరూపముగా భావించినచో యమనియమాదులైన మొదటి యేడును సప్తలోకములును, సప్తచక్రములును అగును. చివరిదైన సమాధియోగమే బిందు రూపమైన అమృతస్థానము.

గృహస్థాశ్రమమున ధన్యతచెందుటకు వేయు అడుగు లేడు. (సప్తపాదాలు). చైతన్య కారకుడైన సూర్యుని రథమును లాగేది గుఱ్ఱములు ఏడు. భారతీయులమైన మనము ఆరాధించు అగ్నికి జ్వాలలు ఏడు. జపతపోనిష్ఠలలో మన కార్యదర్శ పురుషులైన ఋషలు ఏడుగురు. లోతుగా ఆలోచించినచో మన జీవన యాత్రలో సప్తసంఖ్యయొక్క ప్రాథాన్యము అవగతమగును. జీవనయాత్రలో చివరిమజిలీకి కూడ ఏడు కట్ల వాహనమే గతి.

సాధకుడైనవాడు ఏడురోజులలో సప్తసంఖ్యగల అంతరములను దాటి అమృతస్థానము చేరుకొనును. అనగా సప్తసప్త పదార్థములతో నిర్మింపబడిన దేహమందలి జీవుడు సప్తసంఖ్యతోనే సిద్ధినొందవలెను.

ఈ యభిప్రాయముతోనే శుకమహర్షి పరీక్షిత్తునకు ఏడురోజులలో సప్తభూమికలు దాటి అమృతస్థితికి చేరుటకై భాగవతమును బోధించుట ఆరంభించెను.

జయవిజయులు.

వైకుంఠధామమున శ్రీమహావిష్ణువు మందిరమునకు కావలివారు జయవిజయులు. ఒకనాడు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను బ్రహ్మమానసపుత్రులు ఐదేండ్ల బాలకులై శ్రీహరిని జూచుటకు వచ్చిరి. జయవిజయులు వారిని లోనకి బోనీయక అడ్డగించిరి. వారు బ్రహ్మజ్ఞానులమైన మమ్ము మీరు అడ్డగించుట న్యాయము కాదనిరి. ఐనను వారు వినలేదు. మునులు వారిని భూలోకములో రాక్షసులై పుట్టమని శపించిరి. శ్రీహరి వచ్చి విషయము తెలిసికొని సనకాదులను లోనికి తీసుకొని వెళ్ళెను. తరువాత ద్వారాపాలకులు మాధవునకు నమస్కరించి నిలిచిరి. విష్ణువు వారిని ఓదార్చి మూడు జన్మము లెత్తి నాచే సంహారింపబడి తరువాత వైకుంఠమునకు వచ్చెదరులె అని చెప్పెను. వారు మొదటి జన్మమున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రెండవ జన్మమున రావణకుంభకర్ణులు, మూడవ జన్మమున శిశుపాల దంతవక్త్రులుగా పుట్టిరి.

దితి ఒకప్పుడు సంతానము గోరి, భార్తయగు కశ్యపప్రజాపతిని జేరెను. ఆమెకు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కవల పిల్లలుగా జన్మించిరి. వారు బ్రహ్మను గూర్చి ఉగ్రతపము చేసి అనేక వరములు సంపాదించిరి. ఆ వరగర్వముతో లోకములకు పీడ కలిగించుచుండిరి. హిరణ్యాక్షుడు మరింతగా లోకములను బాధించుచు తనని ఎదురించు వారు కనిపించక వరుణునిమీదికి దండయాత్రకు బోయెను. వరుణుడు అతనిని గెలుచుట తనవలన కాదని గ్రహించి, “నిన్ను ఎదిరించువాడు ఒక్క విష్ణువే కావున వైకుంఠమునకు” బొమ్మనెను. వాడు అచటికి వెళ్ళి, విష్ణువు యజ్ఞవరాహ మూర్తియై రసాతలమున నున్నాడనివిని అచ్చటికి పోయెను.

యజ్ఞవరాహావతారము

పూర్వమొకప్పుడు బ్రహ్మ సృష్టి చేయవలెనని సంకల్పించి స్వాయంభువమనువును మానసికముగా సృజించెను. అతనిని సృష్టి కొనసాగింపుమని ఆదేశించెను. మనువు “ తండ్రీ! భూమి యంతయు జలములో మునిగియున్నది. దానిపై సృష్టిచేయుటెట్లని” యడిగెను. బ్రహ్మ, కుమారా! శ్రీమహావిష్ణువు సర్వశక్తి సంపన్నుడు. అతనివలననే భూమిఉద్ధారణ జరగవలెను” అని పలికి, యిట్లాలోచించెను. “ మొదట జలమును సృజించి తరువాత భూమిని సృజించినాను. అదిప్పుడు నీటిలో మునిగి యున్నది. దానిని బయిటకి దెచ్చుటెట్లు?” అని శ్రీ మహావిష్ణువును ధ్యానించుచుండగా అతని ముక్కురంధ్రములనుండి బోతనవ్రేలంతా రూపముతో యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించెను. పుట్టగానే ఏనుగంత శరీరము కలవాడై దిక్కులు పగులునట్లు ఘుర్ఘుర ధ్వని చేసెను. ఆ మూర్తిని జూచి బ్రహ్మ యానందించెను. మునులు వేదమంత్రములతో స్తుతించిరి. వరాహమూర్తి సముద్రాలను కలిచివేయుచు భూమిని ఎత్తుద మానుకొన్న సమయంలో హిరణ్యాక్షుడు వచ్చి అడ్డుపడెను.

హిరణ్యాక్షుడు గదచేత బూని వరాహమూర్తిని నెదిరించగా, అతడు వానిని తన వజ్రసమమైన దంష్ట్ర ( కోర ) తో చీల్చివేసి ఆ కోరమీదనే భూమిని నిలుపుకొని సముద్రమునుండి పైకి వచ్చెను.

దేవతలును, మునులును ఆ వరాహమూర్తిని యజ్ఞపురుషునిగా తెలిసికొని అనేక విధములు స్తుతించిరి.

కపిల దేవహూతి సంవాదము

కర్దమప్రజాపతి, స్వయంభువమనువు కూతురైన దేవహూతుని బెండ్లాడెను. వారికి విష్ణుకళతో కపిలుడు జన్మించెను. బ్రహ్మవచ్చి, “ మీ తపః ఫలముగా విష్ణువు మీకు కొడుకుగా పుట్టినాడు” అని, దేవహూతునితో “ అమ్మ! నీవు నీ కుమారుని వలన జ్ఞానోపదేశము నొందుదు” వాణి దీవించెను.

దేవహూతి కపిలునొద్దకు వచ్చి, నాయనా! నాకున్న యీ ప్రాపంచిక మోహము తొలగునట్లు జ్ఞానబోధ చేయు” మని యడుగగా అతడు, “ అమ్మ! సంసారబంధనముకుగాని, మోక్షములకుగాని మనస్సే కారణము. ఆ మనస్సే సత్వరజస్తమోగుణములచే ఆవరింపబడినప్పుడు కేవలము సంసారబంధములకే కారణ మగుచున్నది. కావునా త్రిగుణాతతీతుడైన శ్రీహరిని భక్తితో ధ్యానించినచో సంసారబంధములు వీడి, ముక్తిని బొందవచ్చు” నని విష్ణుభక్తి ప్రాధాన్యమును వివరించి, సృష్టిక్రమమును, జీవుడు తల్లి గర్భమున బ్రవేశించి కర్మవశంభున జన్మముల నొందు ప్రకారమున, ఆత్మపరమాత్మల స్వరూపమును, భక్తి యోగమున సాలోక్య, సామీప్య , సారూప్య, సాయుజ్యములను చతుర్వధముక్తులు పొందుమార్గామును, పాపాత్ములు నరకములో పొందు యాతనలును దెలిపి, కేవల కర్మమార్గాముకంటెను జ్ఞాణ మార్గమే మోక్షము నొందుటకు సాధనమనియు, భక్తిమార్గము గూడ జ్ఞానకారణ మగుననియు, ఇట్టి సంఖ్యయోగారూపజ్ఞానము గలవారు జన్మరాహిత్యమును బొందుదురనియు తల్లికి కపిలుడు ఉపదేశించెను.

ధ్రువోపాఖ్యానము

స్వాయంభువమనువునకు శతరూపయందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు నను కుమారులు కలిగిరి. ఉత్తనపాదునకు సురుచి, సునీతియను భార్యలు గలరు. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు యను కుమారులు గలిగిరి. ఉత్తనపాదునకు సురుచియందు ప్రేమ ఎక్కువ.

ఒకనాడు ఉత్తానపాదుడు చిన్నకొడుకును ముద్దు చేయుచుండగా ధ్రువుడచ్చటికి వచ్చి తానును తండ్రి తొడమీద నెక్కబోయెను. సురుచి వానిని కిందకి లాగి, “ నీకు తండ్రి తోడనెక్కు భాగ్యమున్నచో నా కడుపునే పుట్టియుండెడి వాడవు. అట్లు కావలె నన్నచో శ్రీనాథుని గూర్చి తపముచేసి వరమునొందు” మనెను. ధ్రువు డేడ్చుచూ తల్లి దగ్గరకు బోయి చెప్పెను. తల్లి కుమారా! నీ సవతితల్లి చెప్పినట్లు శ్రీపతి పాదములను భక్తితో ధ్యానింపు” మని ప్రోత్సహించెను. ధ్రువుడు శ్రీహరిని గూర్చి తపము చేయ నిశ్చయించి అడవికి బయిలుదేరెను. దారిలో నారదుడు కనిపించి, “ ఇంత చిన్న వయసులో నీవు తపము ఏమి చేయగల” వని యడిగి అతని పట్టుదల చూచి ఆనందించి ద్వాదశాక్షరీమంత్రము నుపదేశించి, యే మంత్రమైనను ఎడురోజులు దీక్షగా జపించినచో సిద్ది కలుగునని భోదించెను. ధ్రువు డాయనకు నమస్కరించి దీవెనలు పొంది యమునాతీరములో గల మధువనమునకు బోయి తపమారంభించెను.

నారదుడు ఉత్తానపాదుని వద్దకు వెళ్ళెను. అతడు ధ్రువుడు ఇంటినుండి వెళ్ళిన సంగతి చెప్పెను. నారదుడు, “ నీ కొడుకు శ్రీహరిని సేవించి ఇతరులు పొందలేని మహోన్నతపదము నొందగల” డని చెప్పెను.

ధ్రువుడు నారదుడు వర్ణించిన మాధవుని రూపమును మనసులో నిలుపుకొని నిరాహారుడై ఒంటికాలిపై నిలిచి తపము చేసెను. ఆ తపమునకు జగత్తులు చెలించెను.

దేవతలు బయపడి ఇంద్రునితో చెప్పగా అతడు విఘ్నములు కలిగించెను గాని ధ్రువుడు చెలించలేదు. విష్ణువు ధ్రువుని ఎదుట సాక్షాత్కారించెను. ఆయనను జూచి పరమానందపడి సాష్టాంగప్రణామముచేసి, స్తుతించుటకు మాటలురాక నిలుచుండెను. శ్రీహరి శంఖము నాతని బుగ్గలకు తాకించగా సకల విద్యలును గలిగి మహాజ్ఞానియై

శ్లో. యోంతః ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్తాం
సంజీవయ త్యఖిలశక్తిధర స్స్వధామ్నా,
అన్యాంశ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్
ప్రాణా న్నమో భగవతే పురుషాయ తుభ్యమ్!!

తా: ఏ పరమాత్మ నాలో ప్రవేశించి వాక్కును ప్రాణేంద్రియములను ప్రేరణచేసి చైతన్యవంతములుగా చేయునో అట్టి పరమపురుషునకు నమస్కారము. అనుచు స్తుతించెను. విష్ణుమూర్తి అతనితో, “ నీ తపమునకు మెచ్చినాను. సప్తర్షమండలముకంటెను ఉన్నమైన ధ్రువ (విష్ణు) పదమును నీకిచ్చుచున్నాను. నీవు నీ తండ్రి తరువాత ఇరువదియారు వేలేండ్లు రాజ్యమేలెదవు. నీ తమ్ముడు ఒక యక్షుని చేతిలో మరణించెను. నీ సవతితల్లి దావగ్నిలోబడి మృతినొందును” అని చెప్పి అంతర్థాన మయ్యెను.

ధ్రువుడు “నేను వైకుంఠుడు ఇచ్చిన ఉన్నతపదముతో తృప్తి పడితినేమి? మోక్షము కోరకపోయితి” నని విచారించి ఇంటికి వచ్చెను. తండ్రి ఆదరించెను. తండ్రి తరువాత ధ్రువుడు రాజయ్యెను. తమ్మునొక యక్షుడు చంపగా కోపించి యక్షులతో యుద్దము చేసి చాలామందిని చంపెను. అది చూచి చిత్రరథుడు(ధ్రువుని) తాత మనువు వచ్చి, “ నీవంటి విష్ణు భక్తులకీ జీవహింస తగదు. యక్షులు శివభక్తులు. వారిని చంపినందుకు శివుని ప్రసన్నుని జేసికొను” మని చెప్పగా ధ్రువుడు శివుని ప్రార్థించెను.

26000 ఏండ్ల తరువాత విష్ణుదూతలు వచ్చి ధ్రువుని విమానము ఎక్కమనిరి. అతడు తన తల్లిని గురించి విచారింపగా అ దూతలు ముందు ఒక విమానములో ఉన్న సునీతిని చూపిరి. ధ్రువుడు సర్వతేజోమండలములను దాటి పైనున్న విష్ణుపదము ( ఆకాశము, వైకుంఠము ) చేరెను. నరులు, మునులు, దేవతలు ధ్రువుని విష్ణు భక్తిని ప్రశంసించిరి.

దీక్ష ఉన్నచో ఎవ్వరైనను ఉన్నతస్థానమును పొందగలరు అనుట కీ ధ్రువోపాఖ్యానమే ఉదాహరణము.

వృత్రాసురుడు

పూర్వము త్వష్టయను ప్రజాపతికి సర్వజ్ఞుడైన విశ్వరూపుడను కొడుకు పుట్టెను. అతనికి మూడు తలలు. దేవత లతనిని గురువుగా భావించిరి. ఇంద్రుడతని యొద్ద, “ నారాయణ కవచము” ఉపదేశము పొందెను.

విశ్వరూపుడు ఒక నోట సురాపానము, ఒక నోట సోమపానమును చేయును. మూడవ నోటితో అన్నము తినెను. అతడు రాక్షసులకు గూడ యజ్ఞాభాగము లిప్పించుచుండగా ఇంద్రుడు అతని తలలు ఖండించెను. దానివలన అతనికి బ్రహ్మహత్యాదోషము కలిగెను. దానిని ఒక ఏడు భరించి అది పోగొట్టుకోనుటకై ఇంద్రుడు, ఎంత గోయియైన పూడునట్లు వరమిచ్చి భూమికి నాలుగవవంతు పాపమును, ఎన్ని కశ్మలములు చేరినను పవిత్ర మగునట్లు వరమిచ్చి నీటికొక నాల్గవ వంతును, ఎన్నిసార్లు కొట్టివేసినను చిగిరించినట్లు వరమిచ్చి చెట్లకొక నాల్గవ వంతును, కామసుఖములతో పాటు సంతానము కూడా కలుగునట్లు వరమిచ్చి, స్త్రీలకొక నాల్గవ వంతునుఆపాపమును పంచి ఇచ్చి తానా బ్రహ్మహత్యాదోష మునుంచి విముక్తుడయ్యెను. భూమికి చవిటినేలలు, నీటికి నురుగు, చెట్లకు జిగురు, స్త్రీలకు రజస్సు ఈ దోషము పంచుకొన్నందుకు గుర్తులు.

విశ్వరూపుని ఇంద్రుడు చంపుటచేత త్వష్టకు పుత్రశోకము గలిగెను. దానిని సహింపలేక అతడు ఇంద్రుని జంపు కొడుకు పుట్టవలెనని యజ్ఞము చేసెను. యజ్ఞాకుండములోనుండి భయంకరరూపముతో రాక్షసుడు ఒక్కడు పుట్టెను. వాడే వృత్రుడు. బ్రహ్మనుగూర్చి తపముచేసి వరములొంది లోకకంటకుడై ప్రవర్తించుచుండెను. దేవతలు అతనిపైకి యుద్ధమునకు రాగా వారి నందరను వృత్రుడు ఓడించెను. ఇంద్రుడు యుద్ధము చేయుచుండగా అతని చేతి ఆయధము జారిపడెను. వృత్రుడు ఇంద్రునితో, “ ఆయుధము లేని వానిని, పారిపోవు వానిని నేను చంపను పొమ్మ” ని విడిచిపెట్టెను.

దేవతలందరూ శ్రీహరిని ప్రార్ధింపగా ఆయన “ దధీచి మహామునిని అతని వెన్నుముక్క నడుగుడు. ఆయన దాత. ఇచ్చును. దానితో విశ్వకర్మ ఇంద్రునికి ఆయుధము చేసి ఇచ్చెను. దానితో వృత్రుని ఇంద్రుడు చంపును” అని చెప్పెను.

దేవతలట్లే దధీచి నడిగిరి. ఆయన అది దేవకార్యమని గ్రహించి “ నేను యోగశక్తితో ప్రాణము విడుతును. నా ఎముకలు మీరు తీసికొను” డని యోగమార్గమున శరీరము చాలించెను. విశ్వకర్మ ఆయన వెన్నుముక్కతో వజ్రాయుధము చేసి ఇంద్రునికి ఇచ్చెను. దేవతలు ఉత్సాహముతో వృత్రుని పైకి దండయాత్ర చేసిరి. ఆ మహాయుద్ధములో వృత్రుడు ఐరావతముతోను, వజ్రాయుధముతోను గూడా ఇంద్రుని మ్రింగి వేసెను. ఇంద్రుడు అతని కడుపు చీల్చి చంపి బయిటకి వచ్చెను. కానీ వృత్రుని చంపి మరల బ్రహ్మహత్యాపాతకము గట్టుకొన్న ఇంద్రుని, దేవఋషి పిత్రుగణములు విడిచి పోయిరి.

వారు అట్లేల ఇంద్రుని విడిచిపోయిరని పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇట్లు చెప్పెను.

వృత్రపరాక్రమునకు భయపడి దేవతలు, మునులు ఇంద్రునొద్దకు వచ్చి, “ నీవు వృత్రాసురుని వధింపు” మనగా అతడు “ పూర్వము ఇట్లే మీమాటలు విని విశ్వరుపుని జపింనాను. ఆ దోషము పోగొట్టుకొనుటకు నాకు తల ప్రాణం తోకకు వచ్చింది. మరల ఇంకొక బ్రహ్మహత్యకు ఒడిగట్టలే” నని నిరాకరించెను. దానికి మహర్షులు “ నీ చేత మీము అశ్వమేధయాగము చేయించి పాపవిముక్తుని జేయుదు” మని చెప్పి సురరాజును ఒప్పించిరి. అందుకే వృత్రుని జంపి ఇంద్రుడు బ్రహ్మహత్యపాతకమును మూటగట్టుకొనెను.

ఆ పాపము ఒక చండాల స్త్రీరూపమున ఇంద్రుని వెంటబడెను. ఇంద్రుడు పారిపోయి మానస సరస్సులోని తామరకాడలో దాగుకొనెను. అందున్న దారాలతో కలిసిపోయి ఒక రూప మన్నది లేక వేయేండ్లు ఉండెను. అది శివునిదిక్కు( ఉత్తరము). కాన చండాల అచటికి పోలేక ఇంద్రునికై బయటకాచుకొని కూర్చుండెను.

అంతకాలము స్వర్గారాజ్య మరాజకము కాకూడదని, భూలోకమునుండి నూరు అశ్వమేధ యాగములు చేసిన నహూషుడను రాజును దెచ్చి దేవతలు, ఋషులు ఇంద్రపదవిలో నిలిపిరి. అతడా పదవితో మదించి, శచీదేవిని భార్యగా నుండుమని నిర్బంధించెను. ఆమె, “బ్రహ్మర్షులు మోసెడు పల్లకిలో రమ్ము. నిన్ను వరించెద” ననెను. నహుషు డట్లే వచ్చుచు అగస్త్యుని “ సర్ప- సర్ప”(దగ్గరకు సమీపింపుము) అని కాలితో దన్నెను. ఆ ముని కోపించి నీవు సర్పమై భూలోకమున పడియుండు” మని శపించెను. దానితో సహుషుని ఇంద్రపదవి మట్టిలో గలిసెను.

ఇంద్రు డా పద్మనాళములోనుండి యిన్నెండ్లును హరిధ్యానము చేయుచుండెను. మునులును, దేవతలును ఇంద్రుడు ఉన్న చోట తెలుసుకొని వచ్చి అతనిని మన్నించమని కోరి స్వర్గమునకు తెచ్చిరి. పాపరూపినియైన చండాలి, అంతకాలమూ విష్ణుధ్యానము చేసిన ఇంద్రుని చేరలేకపోయెను. మునులింద్రునిచేత అశ్వమేధయాగము చేయించి పాపవిముక్తుని జేసిరి.

ఈ వృత్రాసుర వధను జదివిన వారును వినినవారును అఖండ భోగాభాగ్యములతో తులతూగి, తుదకు మోక్షము నొందుదురు.

శత్రు వెంతవాడైనను ఉపేక్షింపరాదు, ఇది రాజనీతి.

పరీక్షిత్తు శుకుని జూచి, “ మహాత్మా! అసురుడైన వృత్రుని అంతటి ధర్మము జ్ఞానము ఎలా కలిగినవి?” అని యడుగగా శుకమునీంద్రు డిట్లు చెప్పెను.

చిత్ర కేతూపాఖ్యానము

చిత్రకేతుడు శూరసేనదేశమునకు రాజు. సంతానము కొరకు కోటిమంది స్త్రీలను పెండ్లాడెను. కాని ఫలము లేకపోయెను. ఒకనాడంగిరసుడను ముని అతని మందిరమునకు రాగా, రాజు పూజించి, తన అపుత్రత్వమును గూర్చి చెప్పెను. అంగిరసుడు రాజుచేత పుత్రకామేష్టి చేయించి యజ్ఞ ప్రసాదము నతని పట్టపురాణి కృతద్యుతికి ఇచ్చెను. రాజునకు కుమారుడు పుట్టెను. రాజు ఆ పుత్రుని మొహములో బడి, వానిని వాని తల్లిని మిక్కిలి ఆదరించుచుండెను. ఇది తక్కిన రాణులకు కంటగిం పయ్యేను. వారు బాలునికి విషము పెట్టి చంపిరి. మరణించిన బాలునికై రాజును రాణియు విలపించుచుండగా అంగిరసుడు నారదునితో వచ్చి రాజుతో ఇట్లనెను. “రాజా! ఋణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయః” అందురు. (పశువులు, భార్యలు, కొడుకులు ఇండ్లు మొ|| ఋణమును బట్టి వచ్చుచు పోవుచుందురు.) జగత్తు స్వప్నమువంటిది. స్వప్నము నిజమగునా? కర్మవశమున జీవులు పుట్టి గిట్టుచుందురు. నీకు వీ డే మగును? వానికి నీవే మగుదువు? ఇదంతయు భౌతికదేహ మున్నంతవరకే. నీవు శ్రీహరిని ధ్యానించుచు మొహవికారములను త్యజింపుము”. నారదుడు, “రాజా! నీకును వీనికిని బంధుత్వ మేమున్నదో చూడు” మని బాలుని దేహమును జూచి, “జీవా! మీ తల్లిదండ్రులును బంధువులును నీకై దుఃఖించుచున్నారు. నీవు తిరిగి ఈ దేహములో ప్రవేశించి వీరికి సంతోషము గలిగింపు” మనెను.

బాలుడు, “కర్మబద్ధుడనై అనేక జన్మము లేత్తుచున్న నాకు వీరే జన్మములో తల్లిదండ్రులు? ఒక్కొక్క జన్మనులోను వేర్వేరు తల్లిదండ్రులు బంధువులు నా కేర్పడుచున్నారు. సర్వేశ్వరుడైన శ్రీపతి తన మాయాధీనులను జేసి జీవులను పుట్టించుచు తిరిగి తనలో లీనము చేసికోనును”.

క. పతులెవ్వరు? సతులెవ్వరు?
   సుతు లెవ్వరు? మిత్రశత్రుసుజన ప్రియసం
   గతు లెవ్వరు? సర్వాత్మక
   గతుడై గుణసాక్షి యైన ఘను డొక్కనికిన్!!

తే. కర్మవశమున నెందు సుఖమ్ములేక
   దేవ తిర్యజ్ఞృయోనుల దిగురు నాకు
   వెలయ నే జన్మమందున వీరు తల్లి
   దండ్రు లైనారు? చెప్పవే తాపసేంద్ర!

అని పలికి ఆ జీవుడు వెళ్లిపోగా చిత్రకేతుడు మోహమువిడిచి బాలునికి యమునానదిలో ఉత్తరక్రియలు చేసెను. నారదునకు నమస్కరింపగా అతడు రాజునకు నారాయణమంత్రము ఉపదేశించెను.

నియమనిష్ఠలతో ఏమంత్రమునైనను ఏడురోజులు జపించినచో సిద్ధి కలుగును. రాజట్లు ఏకాగ్రతతో ఏడురోజు లా మంత్రమును జపించగా ముకుందుడు ప్రసన్నుడై విద్యాధరాదిపత్యమును, విమానమును అనుగ్రహించెను.

ఒకనాడతడు విమానముపై కైలాసము మీదుగా బోవుచు కొలువులో నున్న శంకరుని దర్శనము చేసికొని నమస్కరించెను. ఒక పీఠముపై పార్వతిని తొడమీద కూర్చుండబెట్టుకొన్న శివుని జూచి “మీరు ప్రకృతి పురుషులు కావచ్చు. ఏకాంతసమయములో నిట్లు కూర్చుండ వచ్చును గాని నిండుసభలో నిట్లుండుట న్యాయమా?” అని యాక్షేపించెను. పార్వతి కోపించి, “ఇందరును ఏ మనలేదుగాని నీవు మాత్రము మమ్ము అధిక్షేపింతువా? ఇంత అహంకారముగల నీవు రాక్షసజన్మ మెత్తుము” అని శపించెను. చిత్రకేతుడు తన తప్పు తెలిసికొని ఉమాశంకరులకు నమస్కరించి “అమ్మా! జీవులకు వారివారి కర్మములవలన జననమరణములు, సుఖదుఃఖములు కలుగుచుండుననుట కిదియే నిదర్శనము. నన్ను అనుగ్రహింపుము. నీ శాపమునకు నెను భయపడుట లేడు. జగత్పితరులైన మిమ్ము అధిక్షేపించినందుకు చింతించుచున్నా” నని మ్రొక్కి వెడలిపోయెను.

తరువాత అందరును వినుచుండుగా పార్వతితో శివుడు “చూచితివా? విష్ణుభక్తుల నిస్సృహత్వము! వారికి సుఖదుఃఖములు సమానములు. తిరిగి నీకు శాప మియ్యగలవాడైనను శాంతుడుకాన నీ శాపమును తలదాల్చి వెడలిపోయెను” అని పలికెను.

అతడే త్వష్ట చేసిన పుత్రకామేష్టిలో దక్షిణాగ్నియందు వృత్రాసురుడుగా జనించెను. అతనికి ఆ ధర్మము, జ్ఞానము పూర్వజన్మమునుండి సంక్రమిమచినవే.

ప్రహ్లాదచరిత్ర

తన సోదరుడైన హిరణ్యాక్షుని జంపినాడను కోపముతో హిరణ్యకశిపుడు శ్రీహరిని వధించుటకై బయలుదేరెను. విష్ణు వది యెరిగి సూక్షరూపుడై ఆ రాక్షసుని గుండెలలోనే దాగియుండెను. అన్ని లోకములును శ్రీహరికై వెదకి వెదకి, అతడు కానరాకపోవుటచే, తన పరాక్రమము విని శ్రీహరి గుండెలు పగిలి చచ్చియుండునని తలచి రాక్షసుడు వెదకుట విరమించెను.

హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు. వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు.

ప్రహ్లాదుడు మాతృగర్భములో నున్నప్పటి సంగతి ఇది. ఒకసారి హిరణ్యకశిపుడు ఇంటిలో లేని సమయము చూచి ఇంద్రుడు గర్భవతియైన లీలావతి నెత్తుకొని పోవుచుండగా నారదుడు ఎదురై “ఇదేల?” అని ప్రశ్నించెను. “హిరణ్యకశిపునకు బుట్టెడి వా డిం కెంత దుర్మార్గుడు అగునో అని ఈమెను, గర్భస్తశిశువును చంపుదా మనుకోన్నాను” అని ఇంద్రుడు అనగా నారదుడు, “ఈమె గర్భమున బుట్టెడివాడు దేవతలకు మిత్రుడే. ఈమెను నా ఆశ్రమములో నిలిపి రక్షించెద” నని ఆమెను గొనిపోయెను. ఆమెకు విష్ణుకథలు వినిపించుచు ఆమెను, ఆమె కడుపులో నున్న ప్రహ్లాదుని విష్ణుభక్తులుగా తీర్చిదిద్ది, హిరణ్యకశిపు నింట దిగవిడిచెను.

ప్రహ్లాదుడు భూతదయ గలవాడు. పెద్దలయందు వినయము గలవాడు. పరస్త్రీలను తల్లులుగా భావించెడివాడు. ఆటలలోగూడ అసత్యమాడడు. సర్వకాల సర్వావస్థలయందు హరినామస్మరణ చేయుచుండెడివాడు.

రాక్షసరాజు తన కొడుకును జూచి చదువనివాడు అజ్ఞాని అగునని చండామార్కులను బిలిచి అప్పగించెను. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు గూడ తన హరినామస్మరణము మానలేదు.

హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని చదువు పరీక్షించ దలచి పిలిచి అడుగగా, “చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు” అనుచు విష్ణు మహిమను గూర్చి యుపన్యసించెను. రాక్షసరాజు గురువులపై కోపించాగా వారాతనిని మరల గురుకులమునకు తీసుకొనిపోయి రాక్షసోచిత విద్యలు నేర్పసాగిరి. తిరిగి కొన్నాళ్ళకు తండ్రి పరీక్షింపగా ప్రహ్లాదుడు “చదువులలో మర్మమెల్ల చదివినా” ననుచు “విష్ణుభక్తియే సంసారతరణోపాయము” అనెను. అదివిని హిరణ్యకశిపుడు మహాకోపముతో భటులను బిలిచి వీనిని చంపుడని యాజ్ఞాపించేను. వారు శూలముతో బొడిచిరి. ఏనుగులచే త్రోక్కించిరి. పాములచే గరిపించిరి. సముద్రములో ముంచివేసిరి. కొండకోమ్ముల మీదనుండి పడద్రోసిరి. విషము బెట్టిరి. అగ్నిలో త్రోసిరి. అన్నము నీరు పెట్టక మాడ్చిరి. ఎన్ని చేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరి నామస్మరణము మానలేదు. కొంచెము గూడ భయపడలేదు. కందలేదు.

ఎన్ని చేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి, చింతించుచుండగా చండామర్కులు “చిన్నతనము చేత  వీడిట్లున్నాడు కాని పెద్ద అయినచో బాగుపడును. వీనికి మరల విద్యలు బోధించెదమని తీసికోనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేత కూడ హరినామ సంకీర్తన చేయించెడివాడు.

గురువులు ఆందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీ కొడుకును మేము చదివించలేము. వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడ చెడగొట్టుచున్నాడు” అని చెప్పిరి. హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని పిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నాడో చూపగాలవా?” అని యడుగగా ఆ భక్తుడు,

“ఇందు గల డందు లే డను
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెండెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణీ! వింటే”

అని సమాధానము ఇచ్చెను. దానికి దానవరాజు మరింత మండిపడి యీ స్తంభముణ వానిని జూపు మనుచు ఒక స్తంభమును గదతో కొట్టెను. దానినుండి నరసింహమూర్తి యావిర్భవించెను. హిరణ్యకశిపు డతనితో యుద్ధమునకు తలపడెను. కాని నరసింహుడాతనిని బట్టుకొని తొడలపై బెట్టుకొని గోళ్ళతో చీల్చి సంహరించెను. ఆ ఉగ్రనరసింహుని జూచి లోకము లన్నియు భయపడెను. కాని ప్రహ్లాదుడు భయపడక అతనికి నమస్కరింపగా అతడు ప్రహ్లాదుని శిరస్సుపై చేయుంచెను. ఆ బాలుడు మహాజ్ఞానియై దేవుని స్తుతించెను. ఆయన “నీ కే వారము కావలెనో కోరు” మనగా, “కామములు వృద్ధి పొందని వర మి” మ్మని ప్రార్థించెను. ఆ దేవుడు మెచ్చి, ప్రహ్లాదా! నీవు నిష్కామబుద్ధితో ఈశ్వరార్పణముగా సకలకార్యములు చేయుచు రాక్షసరాజ్యమును పాలించి చివరికి నన్ను చేరెదవు” అని పలికి, తనను జూడ వచ్చిన బ్రహ్మతో  “రాక్షసుల కిట్టి వరము లెన్నడు ఇయ్యకు” మని చెప్పి అదృశ్యమయ్యెను.

ప్రహ్లాదుడునరసింహమూర్తిని జూచి భయపడలేదట. జ్ఞాని యైనవానికి భయము కలుగదు. భక్తి ముదిరినచో జ్ఞానమగును. “భజ్” ధాతువులోని చివరి జకారమును “డుకృఇం” (కరణే) లోని ఇ కారమును కలిపినచో “జ్ఞ” అగును. “జ్ఞా” ధాతువునకు తెలియుట అని యర్థము. జ్ఞానికి సర్వమును ఆత్మస్వరూపముగా కనబడును. తన్నుజూచి తానే భయపడువాడు ఉండునా? ప్రహ్లాదుని అప్పటి స్థితి అది. అందుచే భయపడలేదు. “యదా హ్యేవైష ఏతస్మి న్నదృశ్యే నాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్ఠాం. అధసో భయంగతో భవతి యదాహ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే! అథ తస్య భయం భవతి” (కనిపించని అనిర్వచనీయమైన పరమాత్మ యందే బుద్ధి స్థిరముగా నిలిచినా జ్ఞానికి భయముండదు. సృష్టిని పరమాత్మకంటే వేరుగా జూచునానికే భయము అని యర్థము). (తై. ఉపనిషత్తు).

ప్రహ్లాదుడు కామములు వృద్ధి పొందని వర మిమ్మనుటలోని అంతరార్థమిది: కోర్కెలు అనంతములు. అవి తీరనిచో క్రోధము గలుగును. (కామాత్ర్కోధో భిజాయతే – గీత) దానివలన అనేక దుఃఖములు కలుగును. కోరికలే లేనిచో? మనస్సు ప్రశాంతముగా నుండి అందులో దైవచింతనము చేయు సంకల్పము కలుగును. అది ఇహపరసాధనము.

గంజేంద్ర మోక్షము

త్రికూట పర్వతారణ్యములో ఒక గజరా జుండెను. అతనికి దశలక్ష భార్యలు గలరు. అతడు ఒకనాడు భార్యలతో అడవిలో తిరుగుచు దాహమువేసి, ఒక చెరువులో దిగి నీళ్ళు ద్రావి, కరిణులతో జలక్రీడలకు దిగి, చెరువు నంతను కలచివేసెను. ఆ చెరువులో ఒక పెద్ద మొసలి యున్నది. అది వచ్చి గజరాజు కాలుపట్టుకొనెను. ఏనుగు విదల్చి కొట్టెను. మొసలి మరల పట్టుకొని విడువలేదు. లోపలికి లాగుచుండెను. గజము ఒడ్డునకు లాగుచుండెను. పోరు ఘోరమయ్యెను. వేయు యేండ్లు గడచెను. స్థానబలముచేత నీటిలోని మొసలి మరింత విజృంభించెను. గజరాజునకు బలమూ సన్నగిల్లెను. మొసలిని గెలువగలనా లేదా యని సందేహము కలిగెను. రక్షించువా రెవ్వ రనుకొనెను. పూర్వసుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిరబుద్ధి కలిగెను. అప్పుడు –

శా|| లా వొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
       ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చె, తనువుం దస్సెన్ శ్రమం బయ్యెడిన్
       నీవేతప్ప నితః పరం బెరుగ, మన్నింప పందగుం దీనుకిన్
       రావే! యీశ్వర! కావవే వరద! సమ్రక్షింపు భద్రాత్మకా!

అని మొరపెట్టుకొనెను. ఆమోర విని విష్ణుదేవుడు కరిగిపోయెను. తాను విశ్వమయుడు గాన, గజేంద్రుని రక్షింపదలచెను.

అహంకారము జీవలక్షణము. అది జీవుని అంత త్వరగా వదలదు. అది ఉండుట, అవసరమే అయినను మితి మీరకూడదు. ఆత్మరక్షణకై సకలజీవులు ప్రయత్నించును. అది తప్పుకాదు. తానే బలవంతుడ నను అహంకారము అనర్థము తెచ్చును. గజేంద్రుడు తన్ను దాను రక్షించుకొనుటకై పోరాడునంత కాలమును శ్రీనాథుడు పట్టించుకొనలేదు. మన యవసరము లేదు లెమ్మని యూరకున్నాడు. ద్రౌపది విషయములో గూడ ఇంతేకదా! దుశ్శాసనుడు చీర లొలుచుచుండగా ఆత్మరక్షణకై చాల ప్రయత్నించిన దామె. శత్రువుముందు తమ బలము చాలదని గ్రహించిన తరువాతనే వారు దైవమును శరణు వేడిరి. అంతవరకును చూచుచు ఊరకుండిన శ్రీహరి అప్పుడు రంగములోనికి దిగినాడు. అది అతని శరణాగత రక్షణ గుణమునకు పరాకాష్ఠ. సర్వమునకు దైవమే శరణ్య మని నమ్మిన భక్తులను ఆయన ఆత్మీయులుగా భావించి రక్షించును.

శ్రీహరి గజరాజు మొర వినగానే ప్రక్కనున్న లక్ష్మితో గూడ చెప్పకుండ పరుగులమీద వచ్చి చక్రాయుధముతో మొసలిని జంపి గజరాజును కాపాడినాడు.

అని శుకముని పరీక్షిత్తునకు జెప్పి, “రాజా! గజేంద్రుడు పూర్వజన్మములో ఇంద్రద్యుమ్ను డను రాజు. విష్ణుభక్తుడు. ఒకనాడు అతడు శ్రీహరి ధ్యానములో నుండగా అగస్త్యుడు అక్కడకు వచ్చెను. రాజు అతనిని జూడలేదు. ఆందుచే ఆముని కోపించి “నీవు మదముతో నాకు మర్యాదలు చేయవైతివి కావున మదగాజమవై పుట్టు” మని శపించెను. పూజించదగిన మహాత్ములను పూజించకుండుట  శ్రేయోభంగకరము గదా!

అట్లు ముని శాపముణ ఆ రాజు గజరాజై పుట్టెను. పూర్వజన్మవాసన చేత మనసులో హరిభక్తి అంకురించి విష్ణుదేవుని యనుగ్రహమునకు పాత్రుడయ్యెను. మొసలి, హహూ అను గంధర్వుడు. దేవలుని శాపముచే అట్లయ్యేను. శ్రీహరి చక్రధారచే చచ్చి పుణ్యగతికి పోయెను.

విషమ పరిస్థితులలో చిక్కుకొన్న వా రెవ్వరైనను ఈ గజేంద్ర మోక్షణ కథను భక్తితో చదివినను, విన్నను సర్వాపదలు తొలగిపోయి సుఖపడుదురు. ఉత్తమగతిని గజేంద్రునివలె పొందుదురు.

క్షీరసాగర మథనము – కూర్మావతారము

ఒకనాడు దూర్వాసుడు స్వర్గలోకమునకు వెళ్ళుచు దారిలో ఊర్వశి మందారమాలతోకనబడగా, మాలను తన కిమ్మని యడిగి పుచ్చుకొనేను. దానిని ఇంద్రునికి కానుకగా నియ్యాగా నతడు ఐరావతమునకు ఇచ్చెను. అది మాలను పాడుచేసెను. దానికి ముని కోపించి, “ఐశ్వర్యగారవమున న న్నవమానించితివి కాన నీయైశ్వర్యము సాగరములో కలియుగాక” అని శపించి వెళ్ళిపోయెను. ముని శాపమున ఇంద్రుని సర్వసంపదలు నశించిపోయెను. బ్రహ్మదగ్గరకు పోయి ప్రార్థింపగా అతడు శ్రీవిష్ణువున కీ విషయము చెప్పి ఉపాయమును చెప్పు మనెను. శ్రీనాథుడు, “ఇంద్రుని సంపదలతోపాటు అమృతమును గూడ సాధించుటకు సముద్రమథనము చేయవలెను. ఇది ఒక్క దేవతలవల్లగాదు, రాక్షసులను గూడ అమృతము దొరుకునని యాసపెట్టి కలుపుకోనవలె” ననెను.

ఇంద్రుడు రాక్షసరాజైన ప్రహ్లాదుని యెద్ద కేగి, “అప్పసెల్లెండ్ర బిడ్డలము. మనలో మనకు భేదము లేల? అమృతము సాధించుటకు పాలకడలిని మధింపవలెనని శ్రీహరి ఆనతిచ్చెను. మన మండరమును గలసి ఈ కార్యమును సాధించె” దమని చెప్పి ఒప్పించెను.

దేవదానవులు మందరపర్వతమును కవ్వముగా దెచ్చి, వాసుకిని త్రాడుగా జేసి, రాక్షసులు తలవైపునకు, దేవతలు తోకవైపునను పట్టుకొని పాలకడలిని మధింపసాగిరి.

వాసుకి సర్పము, పామునకు విషము తలయందుండును. అనగా అది మృత్యుస్వరూపము. రాక్షసులు తామసులు. తమస్సు పాప భూయిష్ఠము. దానిని అణచివేసిన గాని, లోమందైనను మనసునందైనను ప్రకాశము కలుగదు.

అందుచేత శ్రీపతి రాక్షసులను మృత్యుస్వరూపమైన వాసుకి ముఖము దగ్గర నిలిపెను. ఈ రహస్యమును రాక్షసులు గ్రహింపలేకపోయిరి.

పర్వతము బరువుగా నుండి, క్రింద ఆధారము లేకపోవుటచే సముద్రములో మునిగిపోయెను. దేవదానవు లేమి చేయవలెనో తోచక చూచుచుండిరి. అంతలో శ్రీహరి లక్షయోజనముల విస్తీర్ణముగల బొరుసుతో మహాకూర్మరూపుడై కనబడెను. అతడు మందరగిరిని వాసుకితోపాటు పైకి ఎత్తెను. దేవదానవులు ఉత్సాహముతో సముద్రమును మథింపసాగిరి.

సముద్రమునుండి మొదట భయంకరమైన విషము పుట్టెను. ఈశ్వరుని ప్రార్థింపగా ఆయన దానిని నేరేడుపండంత చేసి మ్రింగి కంఠములో దాచుకొనెను. ఆయన కేమియు కాలేదు. మృత్యుంజయుడుగదా!.

మరల సురాసురులు సాగరమథనము చేసిరి. కామధేనువు పుట్టగా ఋషులు పుచ్చుకొనిరి. ఉచ్చైశ్రవమును బలిచక్రవర్తి తీసికొనెను. ఐరావతము నింద్రుడు తీసికొనెను. కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు పుట్టిరి. ఆ తరువాత లక్ష్మీదేవి పుట్టెను. సంపదలకు తల్లియని అందరు ఆమెను పూజించిరి. ఆమె విష్ణువును వరించెను. తుదకు ఆయుర్వేద విద్యావిశారదుడైన ధన్వంతరి అమృతకలశముతో పుట్టెను. అసురులు వెంటనే అమృతకలశమును లాగుకొనిపోయిరి. దేవతలు గోలపెట్టిరి.

విష్ణువు మోహినియగుట

దేవతల ప్రార్థనపై విష్ణువు దేవతలకు అమృతము పంచుటకై మోహినీరూపము ధరించెను. రాక్షసులలో కలి గూడ ఉండెను. వాని చలువ వలన అమృతము కొఱకు వారిలో వారికి కలతలు వచ్చెను. కొందరు, దేవతలు గూడ సమానభాగస్వాములే కావున వారికి గూడ సుధను పంచవలె ననిరి. మరికొందరు బలవంతులు అమృతపాత్ర నెత్తుకొనిపోయిరి. వారిముందు మోహిని అవతరించెను.

సృష్టిలో చాల వరకు స్త్రీ సౌందర్యమే పురుషులకు మత్తు గొలుపును. అందులోను ఆమె జగన్మోహిని, ఇంకేమి కావలెను? జగత్తులో కాంతాకనకములను జూచి ఆకర్షితుడు కాని వాడెవ్వడు. మోహిని అపురూప సౌందర్యమునకు వారు మోహితులైరి. అట్టి స్త్రీ రూపమునకుగాని మూర్ఖులైన రాక్షసులు లొంగరు. ఈ సృష్టి రహస్యము తెలిసినవాడు కావున మాధవుడు జగన్మోహిని యయ్యెను.

రాక్షసు లామె వెంట పడిరి. ఆమె “అమృతకలశమును నా కిచ్చినచో అందరికిని సమానముగా పంచెద” ననెను. వా రిచ్చిరి. దేవతల నొక బంతిగాను, రక్కసుల నొక బంతిగాను కూర్చుండబెట్టి దేవతలకు అమృతము పోయుచు, రాక్షసులను కన్నుగీటి, పైటజార్చి, మైమరపించు మాటలు చెప్పి “ఇదిగో, మీకును అమృతమును పోయుచున్నా” నని యూరించుచుండెను. ఎదురు మాటాడిచొ ఆమెకు తమపై ప్రేమ నశించునేమో యని రక్కసులు ఊరకుండిరి.

రాహువు సూర్యచంద్రులు మధ్యకు రాగా వారు మోహినికి సంజ్ఞతో తెలిపిరి. శ్రీహరి చక్రముతో వాని తల తరిగెను. అమృతము  కంఠములోనికి దిగుటచే వాడు అమరుడయ్యెను. బ్రహ్మ వానిని రాహుకేతువులను రెండురూపములుగా చేసి గ్రహస్థానమును నిలిపెను.

మోహిని అమృత మంతయు దేవతలకే పోయుటచే రాక్షసులు కోపించి దేవతలతో దెబ్బలాటకు దిగిరి. దేవదానవులకు మహాసంగ్రామమయ్యేను. హరి కటాక్షము నొందిన దేవతలు గెలిచిరి.

సముద్రమథనమున అంతరార్థమున్నది. సాధకుడు మంచి చెడ్డలు తెల్చుకొనుటకై మనసును మథించవలెను. సిద్ధికై సాధన చేయుట కూడ మథనమే. అపుడు విషమువంటి విషమ పరిస్థితులు వాని కెదురగును. వానిని లెక్కచేయక సాధన సాగించినచో కామధేనువు, కల్పవృక్షము వంటి చిన్న చిన్న లాభములు మనసును లాగుటకు ప్రయత్నించును. వానితో తృప్తి పడినచో సాధన అక్కడితో ఆగిపోవును. అట్లుకాక ముందునకు సాగినచో అమృత (మోక్ష) ప్రాప్తి కలుగును. జీవునకు మోక్షమే పరమావధిగదా!

వామనావతారము

బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. ఎంత దానధర్మపరుడైనను దేవతల మీద గల సహజవిరోధము వలన వారిపై దండెత్తి స్వర్గరాజ్యము నాక్రమించెను. దేవతలకు నిలువ నీడ లేకపోయెను. శ్రీహరి దగ్గర మొరపెట్టుకొనగా ఆయన, “నేను వామనుడనై నీ సంపదలు తెచ్చి యిచ్చెద” నని ఇంద్రుని నోదార్చేను.

అదితి కశ్యపులకు విష్ణువు వామనుడై శ్రవణానక్షత్రములో బుట్టెను. పుట్టగానే జ్ఞానవంతు డయ్యెను.

శ్రవణా నక్షత్రజాతకులు త్రిలోకములందు ప్రసిద్దు లగుదురు. విష్ణువునకు శ్రోణ పత్ని వంటిది. (“మహీందేవిం విష్ణుపత్నీమజూర్యమ్” అని శ్రుతి) అంతేకాదు, పూర్వము విష్ణువు భూమిని, దివిని, అంతరిక్షమును వ్యాపించినట్లు ఈ నక్షతము కూడ అంతటి కీర్తిని గోరును. యజమానికి (ఆ నక్షత్రములో బుట్టిన వానికి) అది సమకూర్చునుగూడ. అట్టి నక్షత్రమున వామనుడు జన్మించెను. అతడు త్రిలోకములలో కూడ పాదము లుంచుటలో ఆశ్చర్యమేమి? ఈ విషయమునే శ్రుతి యిట్లు చెప్పుచున్నది: – “త్రేధా విష్ణు రురుగాయో విచక్రమే, మహీం దివం పృథివీ మంతరిక్షం, తచ్చ్రో ణైతి శ్రవ ఇచ్చమానా, పుణ్యగ్గ్ శ్లోకం యజమానాయ కృణ్వతీ” అని.

వామనుడు దాత లెచ్చట నున్నారని అడిగి, బలిచక్రవర్తి మహాదాత యని విని వాని యొద్దకు వెళ్ళెను. బలిచక్రవర్తి యజ్ఞము చేయుచుండగా శాలలో ప్రవేశించి వామనుడు అందరితోను ముచ్చటించుచు పనసలు చదువుచు బలి దృష్టి నాకర్షించెను. వామనుడు బలిని ఆశీర్వదించెను. బలి నమస్కరించి, “నీవు వచ్చుటచే నా యజ్ఞము సార్ధకమైనది. నీ వెవ్వరివాడవు? ఏమి కోరుడువో చెప్పు” మనగా వామనుడు “నే నందరివాడను. నాకు తపము చేసికొనుటకు మూడు అడుగుల నేల యిచ్చినచో బ్రహ్మాండ మంతయు ఇచ్చినట్లు సంతోషింతు” ననెను. బలి, “నీకు అడుగుట కూడ చేతకాద” నెను. వామనుడు, “నా కంత ఆశ లేదు. మూడు అడుగుల నేల చాలును అనెను”.

వామనుడు మూడు అడుగులే కావలెనని అడుగుటలోని విశేష మేమని పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇట్లనెను.

భూః, భూవః, సువః, అని ప్రథానవ్యాహృతులు మూడు. మొదట పుట్టిన వీ లోకములే. వ్యహృతులు అనగా చెప్పబడినవి అని యర్థము. వీని నా పేరులతో పిలిచిరి. ఈ మూడును సర్వలోకములకు ఉపలక్షణములు. వేదములు మూడు. సత్వరజస్తమోగుణములు మూడు. త్రివిక్రముడనగా ఈ మూడు మూడుగానున్న వానిపై ఆధిపత్యముగలవాడు. ప్రస్తుతము ఆ యాధిపత్యము బలిచక్రవర్తిది. దానిని స్వాధీనము చేసికొనుటకై మూడు అడుగులను అడిగెను. ఈ మూడు అడుగులును పై త్రివర్గాములకు ప్రతీకలు.

వామనునకు దాన మిచ్చుటకు బలి సిద్ధపడగా శుక్రుడు “ఈతడు వామనరూపుడైన శ్రీహరి. మూడు అడుగులు ఇచ్చినచో నీకు నిలువ నీడ లేకుండ జేయు” ననగా బలి “నేను మాట తిరుగలేను”. అంతేకాదు.

శ్లో. ఆదిన్ శ్రీసతి కొప్పుకై తనువుపై నంసోత్తరీయంబుపై
పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై, నూత్న పై
ర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదై నాకరం బుంట మే
ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

అనుచు తన పత్ని వింధ్యావళి నీరు పోయగా, “త్రిపాదధరణిందాస్యామి” అనుచు దానధార వామనుని చేతిలో వదిలెను. వెంటనే వామనుడు ఇంతింతై, అంతంతై పెరిగి సత్యలోకముదాక వ్యాపించి, తన తేజశ్శరీరముతో ఒక పాదమున భూమిని, రెండవ పాదమున ఆకాశమును ఆక్రమించి, “మూడవ పాదమునకు చోటేది?” అని బలి నడిగెను. బలి వింతగా చూచెను. “నా కియ్యవలిసిన మూడవ అడుగు కొఱకు నిన్ను బంధించుచున్నా” నని వామనుడు బలిని పాశములతో బంధించెను. వింధ్యావళి పతిభిక్ష పెట్టుమని ప్రార్థించెను. బ్రహ్మ, “దానమిత్తునన్న యాతని నింక బంధించుట ఎందుకు?” అని యడుగగా వామనుడు “నా భక్తులు (దాతలు) అహంకారమమకార రహితులు కావలెను. అందుకే బంధించితి” ననెను. బలి, “మూడవ పాదము నా తలపై నుంచు” మనెను. వామనుడు అతనితో “బ్రహ్మసావర్ణి మన్వంతరములో నీ వింద్రుడ వగుదువు. అంతవరకును సుతలలోకమున నుండును. నా ధ్యానముచే నీలోని అసురత్వము తొలగును. నీకు నే నెప్పుడును రక్షకుడుగా నుండును.” అని బలిని సపరివారముగా సుతలమునకు పంపెను.

“నే నిచ్చుచున్నాను గనుక, ఈ యాచకుడు బ్రతుకుచున్నాడు” అని దాతయైనవాడు అహంకారింప కూడదు. దానము చేసిన వస్తువు మీద దాతకు మమకారము పనికిరాదు. ఒక్క కన్యాదానములో తప్ప మిగిలిన యే వస్తువులు దానము చేసినన్ను “న మమ” (ఇంక ఇది నాది కాదు.) అందురు. అవసరమైనచో దౌహిత్రుడు వంశకర్త కావలెను గనుక కన్యాదాన సమయములో “న మమ” అనగూడదు. అట్టి అహంకార మణుచుటకే బలిని బంధించుట.

మరొక విషయము: వామను డనగా చిన్న దేహము కలవాడు. యాచించుట చిన్నతనమే గదా! ఎవ్వరైనను యాచనకు దిగినచో ఇట్లే చిన్నతనమును బొందుదురు సుమా యని శ్రీహరి తన వామనరూపముతో మనకు సూచించెను.

“తృణం సర్వాల్లఘతరం తృణా దపి చ యాచకః”

అన్నిటికంటెను గడ్డిపరక తేలిక; దానికంటెను యాచకుడు తేలిక”  అని సూక్తి.

మత్స్యావతార కథ

ఇప్పటి శ్వేతవరాహకల్పమునకు ముందు వరాహకల్పములో ద్రవిడరాజైన సత్యవ్రతుడు హరిని గూర్చి తపము చేసెను. అతడోకనాడు నదిలో హరికి తర్పణము చేయుచుండగా ఒక చేపపిల్ల అతని దోసిట బడెను. దానిని నీళ్ళలో వదలగా అది “రాజా! పెద్దచేపలు నన్ను మ్రింగును. లేదా జాలరులు పట్టుదురు. నన్ను రక్షింపు” మనగా అతడు కమండలములో వేసెను. మరునాటి కది కమండలము పట్టనంత పెద్ద దయ్యెను. గంగాళ వేయగా ఆ మరునాటికి అదియు చాలలేదు.  చెరువులో వేయగా అదియు చాలకపోవుటచే సముద్రములో విడిచెను. అప్పుడా చేప, “రాజా! నన్ను రక్షించి పెంచితివి. ముందు ఏడురోజులలో ప్రళయము రానున్నది. అప్పుడొక పెద్దవాన సప్తఋషులతో నీవద్దకు వచ్చును. నీవు ఓషధుల బీజములు (విత్తనాలు) నీటిలో నాని చెడకుండ నావలో వేసికొని నావలో నెక్కుము. నే నీ మీనావతారముతో వచ్చి నావను లాగుకొని పోవుదును. నావ సముద్రపు కెరటాలలో తిరుగబడకుండ మహాసర్ప మొకటి రక్షించును” అని అదృశ్యమయ్యెను.

ఏడు రోజు లైనవి. బ్రహ్మకు పగలు గడిచినది. నిద్ర వచ్చినది. దానితో ప్రళయము వచ్చెను. లోకము లన్నియు ఏకావర్ణ మైనవి. సప్త మహర్షులతో నావ వచ్చినది. రాజు విత్తనములతో ఎక్కెను. ఒక త్రాతితో నావను చేపకొమ్మునకు గట్టెను. (సోరచేపకు వీపు మీద కొమ్ముండును) ఆ మహామినము సప్తర్షులను, సత్యవ్రతుని లాగుకొని పోవుచు సాంఖ్యయోగమును పురాణరూపమున వినిపించుచుండెను.

ఇట్లు బ్రహ్మ నిద్రించుచుండగా హయగ్రీవుడు అను రాక్షసుడు (ఇతడే సోమకాసురుడు) బ్రహ్మదగ్గర నున్న వేదములను అపహరించి సముద్రములో దాగుకొనెను.

తెల్లవారెను. అసురునిచేతిలో బడిన వేదము లాక్రోశించుచుండెను. అది విని మత్స్యరూపుడు హయగ్రీవుని జంపి, అప్పుడే నిద్రనుండి లేచి యావులించుచున్న బ్రహ్మకు ఆవేదముల నొసగెను.

విష్ణుభక్తులగు వారికి ప్రళయకాలమునందు గూడ నాశనము కలుగదు.

శ్రీరామావతారము

విష్ణుభవన ద్వారపాలకులైన జయవిజయులు, రావణకుంభకర్ణులుగా భూమిపై జనము లెత్తినపుడు వారిని సంహారించుటకై శ్రీమన్నారాయణుడు దశరథ కుమారుడు శ్రీరాముడుగా అవతరించెను. అతని సోదరులు లక్ష్మణ భరతశత్రుఘ్నులు. విద్యలు నేర్చి, విశ్వామిత్రుని యాగసంరక్షణము చేసి రాముడు శివధనుస్సు విరచి సీతను పెండ్లాడెను. పితృవాక్య పాలనమునకై పదునాలుగేండ్లు సీతా లక్ష్మణులతో  అడవుల కేగి రాక్షస బలములను చెందాడెను. రావణుడు సీత నెత్తుకొని పొగ ఆమెను వెదకుచు హనుమంతుని సహాయమున సుగ్రీవునితో మైత్రి సంపాదించి, వాలిని వధించి అతనికి కిష్కింధారాజ్య మిచ్చెను. వానరులను బంపి సీతజాడ తెలిసికొని వానరసైన్యములతో వెళ్ళి, సముద్రముమీద సేతువును నిర్మించి లంకకు బోయి రావణకుంభకర్ణులను వధించి, తనకు శరణాగతుడైన విభీషణునికి లంకారాజ్యమిచ్చి, అగ్నిశుద్ధయైన సీతతో అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తు డయ్యెను. లోకాపవాదమునకు భయపడి గర్భవతియైన సీతను అరణ్యములో విడిచిపెట్టెను. సీత వాల్మీకి ఆశ్రమము చేరి అక్కడ కుశలవులను గనెను. వాల్మీకి వారికి జాతకర్మాది సంస్కారములు చేసి తాను రచించిన రామాయణముతోపాటు సకలవిద్యలను నేర్పెను.

రాముని యజ్ఞకాలములో వారు రామాయణము గానము చేసిరి. రాముడు వారిని తన కొడుకులుగా గురించి సీతను పిలిపించాగా ఆమె వచ్చి కొడుకులను రామున కొప్పగించి తాను భూమిలో లీనమయ్యెను. రాముడు పదునోకండు వేలేండ్లు రాజ్యమేలి కుశునకు రాజ్య మిచ్చి అయోధ్యాప్రజలతో సహా పరమ పదమునకు చేరెను.

పరశురాముని కథ

చంద్రవంశంలో గాధి యను రాజు గలడు. అతని కుమార్తె సత్యవతిని ఋచీకుడు అను ముని పెండ్లి చేయుమని యడుగగా “వేయి గుఱ్ఱముల నిచ్చినచో పిల్ల నిత్తు” ననెను. ముని, వరుణుని అడిగి వేయి గుఱ్ఱములు దెచ్చి రాజునకు ఇచ్చి సత్యవతిని పెండ్లాడెను. గాధి, మునితో “నాచే పుత్రకామేష్టి చేయింపు” మనెను. ఋచీకుడు రాజుతోపాటు తానుగూడ యజ్ఞముచేసి రెండు చరువులు (హోమద్రవ్యములు – మిగిలిన ప్రసాదములు) ఒకటి రాజోచిత మంత్రములతోను, మరొకటి విప్రొచిత మంత్రములతోను అభిమంత్రించి హోమానంతరము తాను అనుష్ఠానములు తీర్చుకొనుటకు వెళ్ళెను. సత్యవతి, తల్లికి బ్రాహ్మణ చరువు నిచ్చి, తాను రాజు చరువును స్వీకరించెను. ముని వచ్చి భార్యతో “ఏల తొందరపడి చరువులు మార్చినావు? నీకు క్రూరుడైన కొడుకును, నీ తల్లికి బ్రహ్మజ్ఞానియైన కొడుకును పుట్టుదు” రని చెప్పెను. సత్యవతి ప్రార్థింపగా “నీ మనుమడు క్రూరు డగు” ననెను.

సత్యవతికి జమదగ్ని పుట్టెను. అతనికి రేణుకయందు పరుశురాముడు జనించెను. అతడు వేదశాస్త్రములతోపాటు యుద్ధవిద్యలు గూడ నేర్చెను. మహాశూరుడు అయ్యెను.

రఘువంశమున బుట్టినవాడును రాముడే. భృగువంశమున బుట్టిన యితడును రాముడే. ఇద్దరును విష్ణు నంశమున జనించినవారే. రాఘవ రాముడు, ఇతని యొద్దనుండియే వైష్ణవధనుస్సు తీసికొని గర్వభంగము చేసి కోదండరాముడయ్యెను. భార్గవరాముడు పరమేశ్వరుడు ఇచ్చిన పరశువును (గండ్రగొడ్డలిని)ధరించి పరశురాముడు అయ్యెను.

మాహిష్మతీ నగరము నేలు కార్తవీర్యార్జునుడు ఒకనాడు రేవానదికి రాణులతో వెళ్ళి స్నాన మాడుచు, తన రాణుల స్నానమునకు యోగ్యముగా (లోతు తక్కువగా) నుండుటకై, దత్తాభంగము త్రేయుని వరమువలన తాను సంపాదించిన వేయి చేతులను ప్రవాహమున కడ్డు పెట్టెను. పైన నది నీరు పొంగి రావణుని శివారాధనకు భంగము కలిగించెను. రావణుడు కోపించి యుద్దమునకు రాగా అర్జునుడు అతనిని తన వేయి చేతులతో బంధించి పురమునకు దెచ్చి “ఇంకెప్పుడును బలవంతుడవని గర్వంపకు” మణి విడిచిపుచ్చెను.

అట్టి కార్తవీర్యుడు ఒకనాడు, వేటకై వెళ్ళి జమదగ్ని ఆశ్రమమున బస చేసెను. జమదగ్ని రాజునకును పరివారమునకు తనహోమధేనువు దయవలన విందు చేసెను. ఇట్టి గోవు ఒక్కటి యున్నను చాలునని రాజు ఆ గోవును బట్టి తెమ్మని భటులను పంపెను. వారు తెచ్చిరి. రాజు గోవుతో పురమున ప్రవేశించెను.

పరశురాముడు ఆశ్రమమునకు వచ్చి జరిగినది తెలిసికొని రాజుమీదికి యుద్ధమునకు బోయెను. అర్జునుడు ఎదిరించెను. రాముడు వానిని తన శస్త్రాస్త్రబలముచే వేయిచేతులు నరికి పరశువుతో శిరసుఖండించెను. గోవును దెచ్చి ఆశ్రమములో గట్టివేసెను.

రాము డర్జునుని జంపినందుకు అర్జునుని కుమారులు వందమంది రాముదింటిలో లేని సమయము చూచి జమదగ్నిని చంపిపోయిరి. రాముడు వచ్చి చూచెను. తల్లి రేణుక, తండ్రిపై బడి యిరువది యొక్క సార్లు ఏడ్చెను. అదిచూచి రాముడు, రాజులపై పగబూని తపముచేసి శివుని మెప్పించి పరశువును గ్రహించి యిరువదియొక్కసార్లు దండెత్తి రాజులను సంహరించెను. (అనగా వారిలో ఏమాత్రము దుష్టత్వ మున్నను పట్టి జంపెను. జనకదశరథాదులను జంపలేదు.) రాజుల రక్తముతో శమంతపంచకమున తొమ్మిది మడుగు లేర్పరచి, తండ్రిశిరమును దెచ్చి దేహముతో గలిపి తన తపశ్శక్తిచే బ్రతికించెను. రాజులను జంపిన పాపము పోవుటకై ఒక మహాయజ్ఞము చేసి సరస్వతీనదిలో ఆవబృథ స్నానము చేసి పాపవిముక్తు డయ్యెను.

భగవానుడు పుత్రుడై చేతను, స్వయముగా తపస్సిద్ధి నొందుటచేతను జమదగ్ని సప్తమహర్షిమండలములో నొకడై ప్రకాశించెను. పరశురాముడు రాబోవు సూర్యసావర్ణి మన్వంతరములో సప్తర్షులలో ఒకడగును.

చంద్రవంశం

చంద్రవంశంలో యయాతి అను రాజు గలడు. అతడు శుక్రుని కూతురు దేవయానిని పెండ్లాడెను. ఆమె వృషపర్వుడను రాక్షసరాజు కూతురును దాసిగా దెచ్చుకొనెను. రాజునకు దేవయానివలన యదు, తుర్వసులను కొడుకులు పుట్టిరి.

యయాతి దేవయానికి తెలియకుండ వృషపర్వుని కూతురు శర్మిష్ఠను పెండ్లాడెను. వారికి ద్రుహ్యుడు, అనువు, పూరుడు అను కొడుకులు పుట్టిరి. దేవయాని కీ సంగతి తెలిసి తండ్రితో చెప్పెను. శుక్రుడు యయాతిని వృద్దుడవు గమ్మని శపించెను. యయాతి తన కొడుకులను పిలిచి ముసలితనమును పుచ్చుకొని యౌవనమును ఇమ్మని అడిగెను. పై నలుగురు తిరస్కరించిరి. కనిష్టుడైన పూరుడు తండ్రికి తన యౌవన మిచ్చి వార్ధక్యమును పుచ్చుకొనెను. యయాతి తనమాట వినని పై నలుగురు కొడుకులను రకరకాలుగా శపించెను. అందులో పెద్దవానిని, (యదువును) నీ వంశమువారికి రాజ్యార్హత లేకపోవుగాక యని శపించెను.

యయాతి చాలాకాలము భోగము లనుభవించి విరక్తుడై, పూరునకు తిరిగి యౌవనము ఇచ్చి వార్ధక్యమును తాను గ్రహించి, తన రాజ్య మాతనికి ఇచ్చెను. పూరుని వంశములోని దుష్యంతుడు శకుంతలను కణ్వాశ్రమములొ గాంధర్వ వివాహ మాడి, ఆమె కుమారుడైన భరతునితోరాగా “మనకు సంబంధ మెక్కడిది పొమ్మ” నెను. ఆకాశవాణి చెప్పగా శకుంతలను పత్నిగాను, భరతుని కొడుకుగాను స్వీకరించెను. భరతుడు తండ్రి తరువాత రాజై భూమండలమును పాలించెను. అతనికి ముగ్గురు భార్యలు. వారు తమకు బుట్టిన కొడుకులను భరతు నంతటివారు కాలేరని చంపివేసిరి. భరతుడు బృహస్పతి కొడుకు భరద్వాజుని వితథుడు పేరుపెట్టి తెచ్చి పెంచి రాజ్యమిచ్చెను. ఆ వంశమునే శంతనుడు పుట్టెను. అతనికి గంగయందు భీష్ముడును, సత్యవతియందు చిత్రాంగద విచిత్రవీర్యులును పుట్టిరి. విచిత్రవీర్యునికి క్షేత్రజులై వ్యాసునివలన ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టిరి. ధృతరాష్ట్రునకు గాంధారియందు దుర్యోధనాదులు వందమంది పుట్టిరి. పాండురాజునకు కుంతీమాద్రులందు ధర్మ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతల ప్రసాదమున ధర్మరాజు, భీమ, అర్జున, నకుల సహదేవులును పుట్టిరి.

శ్రీకృష్ణావతారము

యయాతి జ్యేష్ఠ పుత్రుడు యదువు వంశము పవిత్రమైనది. శ్రీహరి ఆ వంశమందే కృష్ణుడుగా అవతరించెను. యదువంశమున దేవామీఢునికి వసుదేవుడు మున్నగు పదుగురు పుత్రులును, కుంతి మున్నగు ఐదుగురు పుత్రికలు పుట్టిరి. ఆ వసుదేవునకు దేవకియందు అష్టమగర్భమున శ్రీకృష్ణుడు జన్మించెను. ఆయన కథలు విన్నవారికి సంసారదుఃఖములు తొలగును.

ద్వాపరయుగములో చాలామంది రాజులు రాక్షసాంశములతో బుట్టి ప్రజలను పీడించుచుండగా భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకొనెను. ఆయన “శ్రీహరి వాసుదేవుడుగా అవతరించి భూభారమును దీర్చు” నని చెప్పెను.

మధుర రాజధానిగా ఉగ్రసేనుడు మాధురశూరసేనముల నేలుచుండెను. అతని కుమారుడు కంసుడు రాక్షసాంశ గలవాడు. కూతురు దేవకీ. ఆమెను వసుదేవునికి ఇచ్చి పెండ్లిచేసిరి. చెల్లెలిని అత్తవారింటికి పంపుచు కంసుడు కూడ వెంట వెళ్ళెను. దారిలో ఆకాశవాణి, “నీ చెల్లెలి అష్టమగర్భసంజాతుని వలన నీకు చావు గలుగును” అని చెప్పగా వాడు చెల్లెలిని చంపబూనెను. “ఆమెను జంపవల దనియు, పుట్టిన బిడ్డలను  నీ కోప్పగింతు” ననియు ప్రార్థింపగా వాడు విడిచెను.

తండ్రిని చెరలో పెట్టి కంసుడు గద్దె నెక్కెను. దేవకీవసుదేవులకు వరుసగా ఆరుగురు మగబిడ్డలు పుట్టిరి. వారిని కంసుని కియ్యగా వాడు, “వీరివలన నాకు హాని లేదు. తీసికొని పో” మ్మనెను. దేవకికి ఏడవ గర్భము రాగా శ్రీహరి మాయాదేవిని పిలిచి, “ఈ దేవకీ కడుపులోని పిండమును వసుదేవుని మరొక భార్యయైన రోహిణి గర్భములోనుంచు” మనెను. ఆమె అట్లే చేసెను. దేవకికి గర్భస్రావ మయ్యెనని అందరును అనుకొనిరి. నారదుడు ఒకనాడు కంసుని యొద్దకు వచ్చి, “నీవు రాక్షసుడవు. వసుదేవాదులు దేవతలు. చక్రి దైత్యసంహారము చేయుటకు దేవకీవసుదేవులకు అష్టమ గర్భమున బుట్టు” నని చెప్పగా వాడు దేవకీవసుదేవులను చేరలో పెట్టి, వారి ఆరుగురు పుత్రులను ఒక్కసారే వధించెను. దేవకి ఎనిమిదవసారి గర్భము దాల్చినది. ఆమెకు శ్రావణబహుళాష్టమి రాత్రి రోహిణీ నక్షత్రమున మేనమామ గండములో శ్రీకృష్ణుడు జన్మించెను. విష్ణుని ఆజ్ఞపై మాయాదేవి యశోదకు పుత్రికగా జనించెను. శ్రీకృష్ణుని ప్రేరణతో వసుదేవుడు ఆరాత్రి యమునను దాటి శ్రీకృష్ణుని యశోద ప్రక్కలో పరుండబెట్టి మాయాదేవిని తీసికొని వచ్చెను. దేవకి ప్రసవించిన వార్త కంసునకి దెలిసి వచ్చి ఆడపిల్ల అనియైన చూడక చంపబోగా మాయాదేవి “నిన్ను చంపువాడు పుట్టినాడులె”మ్మని చెప్పి అదృశ్యమయ్యెను. 

కంసుడు ఆ మాటలు విని పశ్చాత్తాపముతో దేవకీవసుదేవులను జూచి, “నేను మీకు చాల దుఃఖము కలిగించినాను. నన్ను మన్నింపు” డని వారిని విడిచిపెట్టెను.

తరువాత కంసుడు మంత్రులతో ఆలోచించగా వారు, “గ్రామములలో వెదకి బాలకులకు చంపుద” మని చెప్పిరి. కంసుడు ఆ ప్రయత్నములలో ఉండెను.

ఇక్కడ వ్రేపల్లెలో యశోదకు కొడుకు పుట్టినాడని విని, నందుడు స్నానముచేసి అలంకరించుకొని బ్రాహ్మణులకు రెండులక్షల గోవులను దూడలతో దానమిచ్చెను. ఆకాశమునుండి పుష్పవర్షము కురిసెను. దివ్య దుందుభులు మ్రోగెను.

గోపికలందరును వచ్చి నల్లని బాలుని జూచి సంతోషముతో స్నానము చేయించిరి. వేడుకలు చేసిరి.

నందుడు కంసునికి కానుకలు సమర్పించి, వసుదేవుని జూడబోయి “నీవు కొడుకులను గోలుపోయి విచారించుచున్నావు. మనము ప్రాణమిత్రులము. నా కొడుకు నీ కొడుకు కాడా?” అని ఓదార్చెను.

శ్రీకృష్ణుని బాల్యక్రీడలు

కంసుని పంపున బాలఘాతిని యైన పూతన వ్రేపల్లెకు సుందరీరూపముతో వచ్చి, శ్రీకృష్ణుని జూచెను. అందరును వలదని వారించుచున్నను వినక శ్రీకృష్ణునికి పాలిచ్చెను. శ్రీకృష్ణుడు దాని పాలతోపాటు ప్రాణములుగూడ పీల్చివేయగా అది చచ్చి పడెను. బాలునికి రక్షరేకు కట్టి నందనాదులు శాంతిక్రియలు చేసిరి.

తరువాత తృణావర్తుడు సుడిగాలివలె వచ్చి శ్రీకృష్ణుని పై కెత్తుకొని పోగా ఇతడు వానికి బరు వయ్యెను. అక్కడనే వానిని జంపెను.

ఒకనాడు కృష్ణుడు మన్ను దినుచుండెను. భూమికి ప్రియుడుగదా మరి! గోపబాలురు యశోదకు ఈ సంగతి చెప్పిరి. ఆమె “ఏది నీ నోరు చూపు” మనగా నోరు తెరచి ఆమెకు బ్రహ్మాండము లన్నియు చూపెను. ఆమె విభ్రాంతి నొందెను.

శ్రీకృష్ణుడు గోపబాలురతో గలసి గొల్లల యిండ్లలో పాలు పెరుగు వెన్నలను తాను మెక్కి తోడి బాలురకు గూడ పెట్టెడివాడు. గోవుల యొద్దకు దూడలను విడిచి పాలు కుడిపెడి వాడు. ఇట్టి పనులెన్నో! ఆ లీలలు వర్ణించుటకు ఆదిశేషుని కైనను శక్తి చాలదు. 

శ్రీకృష్ణుడు చిన్నతనములో కొంటెపనులతో పాటు అనేక లీలలు చూపెను. సామాన్యబాలకులు చేయలేని పనులు చేసెను. అంతకు మించి అల్లరి చేష్టలు చేసెను. ఇవన్నియు జనాకర్షణముకోసమును, శత్రుసంహారము కోసమును. చురుకైనవానిని మెచ్చుకొన్నట్లు ప్రజలు మందుని మెచ్చరుగదా! అంతేకాదు. ఎవరిది వారు తినుటకంటె పదిమందికి పెట్టి తినవలెనన్న నీతిని బోధించుటకే యీ లీలలు. మొదటి నుండియు గొల్లలు, పాలు పెరుగు వెన్నలను అమ్ముకొని మిగిలినవి తినుటేకాని, ఒకరికి పెట్టి యెరుగరు. అట్టివారికి త్యాగగుణము బోధించి తరింపజేయుట వీనిలోని పరమార్థము. త్యాగాముతోనే అమృతత్వసిద్ధి కలుగునుగదా! “త్యాగే నైకే అమృతత్వ మానుశుః” అని వేదవాక్కు.

శ్రీకృష్ణుడు రో లెక్కి ఉట్టిపైనున్న వెన్న మీగడల నందుకొని కోతులకును గోపబాలురకును బెట్టెను. గోపికలు యశోదకు చెప్పిరి. ఆ గొడవలు భరించలేక కృష్ణుని యశోద రోటికి గట్టివేసెను. కృష్ణుడా రోటిని మద్ది చెట్ల మధ్యనుండి లాగి గుహ్యకులకు శాపమోక్షము కలిగించెను.

వ్రేపెల్లలో ప్రమాదము లెక్కువగా నున్నవాని నందాదులు బృందావనమునకు బోయిరి.

ఒక రాక్షసుడు కొంగరూపమున వచ్చి కృష్ణుని మ్రింగబోగా వానిని జంపెను. సర్పరూపుడైన రాక్షసుని గొంతులో నిలిచి ఊపిరి చంపెను. గార్దభరూపములో వచ్చిన ధేనుకాసురుని చంపి కృష్ణబలరాములు గోపబాలురకు తాటిపండ్ల విందు చేసిరి. వారు గోపబాలకులతో ఆడుచుపాడుచు చలుదు లారగించుచు వినోదించిరి.

కాళీయుడు యమునాజలమును విషపూరితము చేయగా కృష్ణుడు మడుగులో దుమికి వానిని మర్దించి సముద్రముకు వెడలగొట్టి యమునాజలమును స్నానపాన యోగ్యముగా చేసెను.

బ్రహ్మ లేగాలను గోపబాలకులను అపహరించగా కృష్ణుడు ఒక సంవత్సరము గోవత్స, గోపబాలక రూపములతో విహరించి, బ్రహ్మమాయను చేధించెను.

గోపికా వస్త్రాపహరణము

కాత్యాయనీవ్రతము చేయుచున్న గోపకన్యలు మార్గశిరమాసములో నదీస్నానమునకు బోయి వివస్త్రలై స్నాన మాడుచుండిరి. కృష్ణుడు వారి చీర లెత్తుకొనిపోయి ఒడ్డున ఉన్న నడిమి చెట్టుపై కూర్చుండెను. వారు చీర లిమ్మని ప్రార్థించిరి. కృష్ణుడు “గట్టుమీదకు వచ్చి పుచ్చుకొను” డనెను. చివరికి వా రట్లే చీరలు పుచ్చుకొనిరి. కృష్ణుడు వారితో “మీరు కాత్యాయనీవ్రతము చేయుచు దిగంబరలై స్నాన మాదవచ్చునా? వ్రతము చెడిపోదా?” అని మందలించెను. వారు “మా వ్రతము చెడకుండ కాపాడు” మనిరి. కృష్ణుడు అట్లే వర మిచ్చెను.

ఈ గోపిక లందరును పూర్వజన్మములో మహర్షులు. శ్రీహరి రామావతారములో నున్నప్పుడు ఆయన సాంగత్యమును గోరినారు. ఆయన “నేనీ యవతారములో ఏకపత్నీవ్రతుడను గాన ద్వాపరయుగములో కృష్ణావాతార మెత్తినప్పుడు మీ కోరిక తీర్చెద” ననెను. ఆ మహర్షులే గోపికలుగా బుట్టి బృందావనములో శ్రీకృష్ణునితో రాసలీలా వినోదము లనుభవించి ధన్యులైరి.

గోవర్ధనోద్ధరణము

గోపకులందరును ఏటేట చేయు ఇంద్రయాగామును మాన్పించి శ్రీకృష్ణుడు గిరిపూజ చేయించెను. దానికి ఇంద్రుడు కోపించి ఏడురోజుల పాటు వడగండ్లవాన కురిపించెను. పశువులతోపాటు గోపకులు బాధపడుచుండగా గోవర్ధన పర్వతమును తన చిటికెన వ్రేలిపై నెత్తి కృష్ణుడు వారందరను రక్షించెను. ఇంద్రుడు వచ్చి మన్నింపుమని ప్రార్ధించెను.

శ్రీకృష్ణుడు గోపికలతో యమునాతీరమున బృందావనములో వెన్నెలవేళ రాసక్రీడలు సలుపుచు వేణుగానముతో అందరి మనస్సులను పర్రవశింపజేయుచు బృందావనమునకే శిరోభూషణముగా వేలుగుచుండెను. ప్రతీ గోపికయు  ఇట్లు తలచుచుండేడిది.

చ. శిరమున పింఛమున్, కరకుశేశయమందున వంశయష్టి, క
     స్తురి తిలకంబు మోమునను, సుందరహాసము మొవిపై, మనో
     హరతర పీతవస్త్రము, గళాంతరసీమను దివ్యమాలయున్
     బొరసిన దివ్యవేణుమధుమోహనమూర్తి స్పురించు నామదిన్ !

కంసవధ

శ్రీకృష్ణుని జంపుట కెన్నో ప్రయత్నములు చేసి విఫలుడైన కంసుడు ధనుర్యాగము పేరుతో మధురకు పిలిచి చంపవలెనని నిశ్చయించి, అక్రూరుని బిలిచి, “నీవు బృందావనమునకు బోయి బలరామకృష్ణులకు ధనుర్యాగమున కాహ్వానించి తీసికొని ర”మ్మని పంపెను. అక్రూరుడు కృష్ణభక్తుడు. నిజముగా సార్థకనామధేయుడు. పరమశాంతుడు. విధిలేక కంసుని సేవించుచుండెను. ఎప్పుడును అతని నోట హరినామమే తిరుగుచుండును. అతని మనసు భక్తిరసముతో నిండిపోయెను. భక్తియనగా సేవ. అతడు శ్రీకృష్ణుని సేవకుడు. కంసుని యాజ్ఞవిని, శ్రీకృష్ణుని దర్శన మగునని యానందించెను. వ్రేపల్లెకు బోయి కంసుని యాగమును గూర్చి చెప్పి వారని ఆహ్వానించెను. వారు ఉత్సాహముతో రథమెక్కి పయనమైరి. దారిలో అక్రూరుడు యమునలో స్నానమాడుటకై మునిగి నీటిలో బలరామకృష్ణుల రూపములు చూచి, లేచి రథములో నున్నవారిని జూచి ఆశ్చర్యపడి వారిని స్తుతించెను.

బలరామకృష్ణులు మధురలో రథము దిగి అక్రూరుని పంపివేసిరి. రాజుగారి చాకలి ఉతికిన బట్టలు  తీసికొనిపోవుచుండగా, “ఇవి రాజోచితముగా నున్నవి. మా కి” మ్మనిరి. వాడు ఇవ్వలేదు. తన్ని పుచ్చుకొని ధరించిరి. రాజభవనములో సైరంధ్రిగా నున్న ఒక కుబ్జ (గూనిది) ను జూచి “ఆ గంధములు, అత్తరువులు పన్నీరులు మా కిమ్మ” నిరి. ఆమె వీరిని చూచి ముగ్ధురాలై యిచ్చెను. వారు పూసుకొనిరి. కృష్ణుడు ఆమెను గడ్డము క్రింద వ్రేలుపెట్టి పైకి ఎత్తెను. ఆమె గూనిపోయి బంగారు తీగవలె సాగెను. కృష్ణుని తనయింటికి రమ్మనగా అతడు పని చూచుకొని వత్తు ననెను.  సుదాముని పూలమాల లిమ్మనగా వాడు సమర్పించెను.

అక్కడినుండి ధనుశ్శాలకు బోయి ఆ ధనస్సును విరిచి వచ్చిరి. మరునాడు రాజసభకు బోగా కంసుడు వీరిమీదకు ఏనుగును ద్రోలించెను. కృష్ణుడు దానిని జంపెను. సభలో కంసుడు చాణూర ముష్టికులను మల్లులను పురిగోల్పెను. కృష్ణుడు చాణూరుని, రాముడు ముష్టికుని ఎదుర్కొని సంహరించిరి. వెంటనే కృష్ణుడు కంసుని మీదకు కురికి క్రిందకు ద్రోచి ముష్టిఘాతములతో మడియించెను. కృష్ణబలరాముల బలము చూచి సభలోనివారు కిమ్మనలేకపోయిరి. తరువాత చెరలో నున్న ఉగ్రసేనుని విడిపించి గద్దె నెక్కించిరి. ఆపైన దేవకీ వసుదేవుల వద్దకు పోయి నమస్కరించి దీవెనలందిరి.

రామకృష్ణుల విద్యాభ్యాసము

రామకృష్ణులకు వసుదేవుడు పనయనములు చేసి విధ్యాభ్యాసమునకై సాందీప ముని యొద్దకు పంపెను. వారు గురువునొద్ద వేదములు, సర్వ శాస్త్రములు, 64 కళలు, రోజు కొక్కక్కటి చొప్పున వినుచు గ్రహించిరి. గురువు వారి మహిమ కాశ్చర్యమొందెను. విద్యాభ్యాసము అయిన తరువాత గురుదక్షిణ కోరు డనగా, ఆయన “నా కుమారుడు ప్రభాస తీర్థములో మునిగి చనిపోయినాడు. వానిని దెచ్చి యిండ” ని కోరెను. వారు సముద్రుడుని అడుగగా, “పంచజనుడు అను రాక్షసుడు మ్రింగె”నని చెప్పెను. సముద్రములో వెదకి వానిని బట్టి చీల్చిచూడగా గురుపుత్రునికి బదులు ఒక అద్భుతశంఖము దొరికెను. కృష్ణుడు దానిని బుచ్చుకొనెను. అదే పాంచజన్యము. వారు యమునికడకు పోయి మా గురుపుత్రు నిమ్మనిరి. అతడు వానిని దెచ్చి సమర్పించెను. రామకృష్ణులు వానిని గురువునకు అర్పించి దీవెనలు పొంది మధురకు చేరిరి.

జరాసంధుడు కంసునికి మామగారు. అతడు పదేపదే మధురపైకి దండెత్తి వచ్చుచున్నందున, కృష్ణుడు విశ్వకర్మను పిలిచి “సముద్ర మధ్యమున ద్వారకానగరము నిర్మింపు” మని, దానిలోనికి బంధుమిత్రసపరివారముతో ప్రవేశించెను.

రుక్మిణీ కళ్యాణము

కుండిన పురాధిపతి భీష్మకుడు. అతనికి రుక్మి మున్నగు కుమారులును, రుక్మిణియను పుత్రికయును బుట్టిరి. రుక్మి శిశుపాలునికి మిత్రుడు. తన చెల్లెలిని అతనికి ఇచ్చిదననెను. భీష్మకుడు కొడుకును నివారింపలేకపోయెను.

రుక్మిణి చిన్నతనమునుండియు కృష్ణుని రూపగుణశీలములు విని అతనియందు ఇష్టము పెంచుకొనెను. రుక్మిణిని శిశుపాలుని కిచ్చి పెండ్లి చేయుటకు ముహూర్తము పెట్టిరి. ఆమె కేమి చేయుటకును తోచక అగ్నిద్యోతనుడు అను బ్రాహ్మణుని ద్వారకానగారమునకు వెళ్ళమని ప్రార్థించి

చ. అంకిలి సెప్పలేదు చతురంగబలంబుతోడ నెల్లి యో
    పంకజనాభ! నీవు శిశుపాలజరాసుతుల న్వధించి, నా
    వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
    యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొని పొమ్ము వచ్చెదన్

అని సందేశము పంపెను. శ్రీకృష్ణుడు కుండినపురమునకు ప్రయాణముకాగా బలరాముడు అతనిని సైన్యములతో అనుసరించెను. గౌరీపూజకు వచ్చిన రుక్మిణిని రథముపై నెక్కించుకొని కృష్ణుడు ద్వారవతి చేరబోయెను. శిశుపాలాదులు  తరుమగా బలరాముడు వారిని ఓడించెను. రుక్మి కృష్ణుని తరుమగా వాడిని ఓడించి అవమానించి పంపెను. ద్వారకకు వచ్చి కృష్ణుడు రుక్మిణిని ఒక సుమూహుర్తమున పరిణయ మయ్యెను.

శ్యమంతకోపాఖ్యానము

ద్వారాకనగమున సత్రాజిత్తును ఒక సూర్యభక్తుడు సూర్యు నారాధించి ఒక మణిని సంపాదించెను. అది ప్రతిదినము ఎనిమిదిబారువుల బంగారము నిచ్చును. దానిని ప్రజాక్షేమమునకై ఉగ్రసేనున కిమ్మని కృష్ణుడు అడుగగా సత్రాజిత్తు నిరాకరించెను. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు పోగా మణిని మాంస మనుకొని ఒక సింహము వానిని జంపి మణిని పట్టుకొని పోవుచుండగా జాంబవంతుడు దానిని జంపి మణిని తన కుమార్తె కిచ్చెను. 

సత్రాజిత్తు, తన తమ్ముని జంపి కృష్ణుడు మణిని కాజేసినాడని ఊరంతట చెప్పుకొని యేడ్చెను. శ్రీకృష్ణుడు తనపై వచ్చిన అపవాదమును పోగొట్టుకొనుటకు సైన్యముతో అడవికి వెళ్ళి వెదకి చివరికి జాంబవంతుని గుహలో ప్రవేశించెను. మణిని తీసికొనిబోగా జాంబవంతుడు అడ్డుపడి యిరువది ఎనిమిది రోజులు కృష్ణునితో పోరాడెను. చివరికి బలహీనుడై కృష్ణుని అవతారపురుషునిగా గుర్తించి, స్తుతించి, తన తప్పు క్షమింపుమని కోరి, మణిని తన కుమార్తె జాంబవతిని గూడ సమర్పించెను. కృష్ణుడు వెంటనే ద్వారకకు వచ్చి సత్రాజిత్తును బిలిచి జరిగినది చెప్పి మణిని అతని కిచ్చివేసెను. వినాయకచతుర్థినాడు చంద్రుని చూడరాదు. కృష్ణుడు పాలగ్లాసులో అతని ప్రతిబింబమును జూచుట తటస్థించెను. అందుకే అతనిపై యీ నీలాపనింద వచ్చెను. ఆ తరువాత జాంబవతిని కృష్ణుడు వివాహమాడెను. 

శ్రీరాముడు అందరికి అన్నియు ఇచ్చుచు జాంబవంతుని చూచి నీకేమి కావలెనని యడుగగా ఇతడు, “నీతో మల్లయుద్ధము చేయవలెనని యున్నది” అనెను. రాముడు నవ్వి “ద్వాపరయుగములో నేను కృష్ణావతార మేట్టినపుడు నీ కోరిక తీర్తు” ననెను. ఆందుకేజాంబవతునితో యిరువది ఎనిమిది రోజులు యుద్దము.

సత్రాజిత్తు శ్రీకృష్ణుని నిష్కారముగా నిందించినందుకు పశ్చాత్తాపము నొంది, శ్రీకృష్ణుని ప్రసన్నుని జేసికొనుట ఎట్లని యాలోచించి తన కుమార్తె సత్యభామను కృష్ణున కిత్తునని రాయబారము నడపెను. శ్రీకృష్ణుడు అంగీకరించగా మహావైభవముగా కాళ్ళు కడిగి కన్యాదానము చేసెను. కట్నముగా శ్యమంతకమణిని ఇచ్చెను. కృష్ణుడు, “మాకు కన్యామణి చాలు” అనుచు శ్యమంతకమును తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చెను.

నరకాసుర వధ

విష్ణుదేవుడు వరాహావతార మెత్తినపుడు భూదేవిని భార్యగా గ్రహించెను. వారికి పుట్టినవాడే యీ నరకాసురుడు. దేవతలకు బుట్టినను, వారు పుట్టిన వేళావిశేషములను బట్టి రాక్షసులు కావచ్చును. అతడు తపస్సు చేసి వరములోంది స్వర్గము మీదికి దాడిచేసి ఇంద్రుని తరిమివేసి, అదితి కుండలముల సంహరించెను.

ఇంద్రుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి తన యవస్థ చెప్పుకొని, “వానిని సంహరించి మమ్ము కాపాడుటకు నీవే సమర్ధుడ” వని ప్రార్థించెను. శ్రీకృష్ణుడు నరకుని మీదికి దండెత్తబోవుచుండగా సత్యభామ “నన్ను గూడ యుద్ధమునకు తీసికొని పో” మ్మని యడిగెను. శ్రీకృష్ణుడు నవ్వి “ఇదేమి పెండ్లియా? పేరంటమా? ఆడువారు సుకుమారులు. వద్దు” అనెను. సత్య “నాకును యుద్ధ విద్యలు వచ్చును. నా ముచ్చట తీర్పు” డనెను. కృష్ణుడు సమ్మతించి గరుడునిపై నెక్కి ప్రాగ్జ్యోతిషపురమునకు వెళ్ళెను. నగరరక్షకుడైన మురాసురుని చక్రధారచే సంహరించెను. సైన్యములను చీల్చి చెండాడెను.

నరకుడు యుద్ధమునకు వచ్చెను. అతనిని జూడగానే సత్యభామ యుద్ధమునకు సిద్ధపడెను. కృష్ణుడు “లేమా! దనుజుల గెలువగలేమా! ఎందుకు నీవు శ్రమపడుదవు? కాదన్తివా, ఈ విల్లందుకొని రణము చేయు” మనెను. ఆమె నరకుని వైపు కోపముగాను క్రుషునివైపు ప్రేమగను జూచుచు నరకుని, అతని సైన్యములను శరపరంపలతో చీకాకు పరచెను. ఆమెధాటి కాగాలేక సైన్యములు నరకుని వెనుకకు బోయి దాగెను. కృష్ణుడు ఆమె పరాక్రమమును మెచ్చుకొని తాను విల్లందుకొని రణమునకు సిద్ధపడెను. నరకుడు శ్రీహరిని చూచి పరిహసించుచు “ఆడువారు పోరాడుచుండగా మగవారు ఊరకుండుట మగతనము కాదు. మేము వీరాధివీరులము కనుకనే ఆడువారిపై కత్తిదుయ్యలేదు” అనెను. కృష్ణుడు నరకునితో పోరాడి చివరికి చక్రాయుధము చేత అతని తల నరకెను.

అప్పుడు భూదేవి వచ్చి శ్రీకృష్ణుని స్తుతించి అదితి కుండలములను సమర్పించి “దేవా! నరకుడు నీ కొడుకు. దుర్మార్గుడు కాన శిక్షించితివి. వీడు నరకుని కొడుకు భగదత్తుడు. వీనిని కరుణింపు” మనగా కృష్ణుడతని నాదరించి ప్రాగ్జ్యోతిషమునకు రాజును చేసెను. తరువాత నగరములో ప్రవేశించి నరకుడు చెరబట్టిన పదియారువేలమంది కన్యలను విడిపించెను. వారు “నీవే మాకు రక్షకుడవు. భర్తవు. నిన్ను విడిచి పోలేము” అనిరి. కృష్ణుడు వారిని, నరకుడు కొల్లగొట్టిన దానములను వాహనములపై ద్వారకకు పంపివేసెను. తాను సత్యభామతో స్వర్గమున కేగి అదితిదేవికి కుండలములు సమర్పించి, దేవేంద్రుని వలన సకల మర్యాదలు పొంది తిరిగి వచ్చుచు పారిజాతవృక్షమును దెచ్చి సత్యభామ పెరటిలో నాటెను. మంచి ముహూర్తమున కృష్ణుడు అందర కన్నిరూపులై పదియారువేలమంది కన్యలను పెండ్లాడెను. వారికి వేర్వేరు వసతులు ఏర్పాటు చేసెను.

ఆ కన్యలు నరకుని చెరలో కొంతకాము ఉండిరి. వారిని విడిపించి లోకములోనికి వదిలినచో వారి నెవ్వరు పెండ్లాడుదురు? వారి గతి ఏమి?

కట్టుబాట్లలో నున్నవారి కోక్కసారిగా స్వేచ్ఛ లభించినచో వారి ప్రవృత్తులేట్లుండును? వారిని పట్టా పగ్గములు ఉండునా? ఇవన్నియు ఆలోచించి లోక సంరక్షణము చేయుటకై వారని పెండ్లాడి, వారికి సంఘములో గౌరవస్థానము కలిగించినాడు. అటువంటి సంఘసంస్కర్త శ్రీకృష్ణుడు.

యాదవ వంశక్షయము

భారత యుద్ధములో శత్రురాజులు చచ్చిరి. యాదవులకు పనిలేక తినుచు త్రాగుచు మదించి యుండిరి. శ్రీకృష్ణుని దర్శించుటకు మునులు కొందరు ద్వారకకు వచ్చిరి. యాదవులు వారిని పరిహసించుటకై సాంబునకు స్త్రీవేషము వేసి పొట్టకు గుడ్డలుచుట్టి “ఈమె కే బిడ్డ పుట్టునో చెప్పు” డని యడిగిరి. మును లీ కపతమును గ్రహించి “యాదవ వంశక్షయము చేయు ముసలము పుట్టు” నని శపించిరి. సుజనుల మనసును నొప్పించుట క్షేమము కాదుగదా! యాడవు లీ విషయమును కృష్ణుని కేరింగించిరి. అతడు “కానున్నది కాక మాన” డని యూరకుండెను.

సాంబుని కడుపునుండి రోకలి పుట్టినది. శ్రీకృష్ణుని యాజ్ఞపై యాదవులు దానిని అరుగదీసి సముద్రములో గలిపిరి. చిన్న ముక్క ఒక బోయవానికి దొరుకగా వాడు దానిని బాణపు ములికిగా జేసికోనెను. రోకలి గంధము తుంగగా మొలిచెను. యాదవులు తమలో తాము వేడుకగా పోట్లాడుకొనుచు ఆ తుంగతో కొట్టుకొనిరి. ఆ కాడలు వజ్రాయుధములై వారి ప్రాణములు దీసినవి.

శ్రీకృష్ణుడు దారకునితో “నీవు అర్జునుని బిలిచికొని రమ్ము. పదారువేల మంది స్త్రీలను, వృద్ధులను అతడు హస్తినకు దీసికొని పోయి రక్షించును” అని చెప్పెను. బలరాము డనంతునిలో గలిసెను. కృష్ణుడు వనములో బండుకొని కా లాడించు చుండగా బోయవాడు అదొక లేడిచెవి యనుకొని ఆబాణముతో గొట్టెను. శ్రీకృష్ణుని హాహాకారములు విని బోయవాడు వచ్చి “తన యపరాధమును మన్నింపు” మని శ్రీకృష్ణుని ప్రార్ధించి భాగావానునకు హాని చేసిన తాను బ్రతుకురాదని ప్రాయోపవేశము చేసి మరణించెను.

శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడై శతకోతి సూర్యుల కాంతితో ప్రకాశించుచు వైకుంఠము నలంకరించెను.

చతుర్వేదముల వ్యాప్తి

ఆదియందు చతుర్ముఖ బ్రహ్మ హృదయములో నాదము పుట్టెను. అదే ఓంకార మయ్యెను. అది అకార ఉకార మకారములతో నేర్పడినది కనుక దాని నుండి వర్ణ సమామ్నాయమును బ్రహ్మ కల్పించెను. ఆ వర్ణము లాధారముగా వేదము లుద్భావించెను. అందుచేత “ఓంకారము” సర్వమంత్రములకు మూలమై వెడమాట అయ్యెను. బ్రహ్మ, వేదములను మహర్షులకు ఉపదేశించెను. ఈ వేదముల నన్నింటిని తరువాతివారు సమగ్రముగా అధ్యాయమును చేయలేని అశక్తు లగుటచేత ద్వాపర యుగమున విష్ణుకళతో వ్యాసుడు అవతరించి ఆ వేదరాశిని ఋక్, యజుస్, సామ, అధర్వణములను నాలుగు శాఖలుగా విభజించెను. ఋగ్వేదమును పైలునికిని, యజుర్వేదమును వైశంపాయనునికిని, సామవేదము జైమినికిని,  అధర్వణ వేదము సుమంతునికి ఉపదేశించి వానిని వ్యాపించి జేయుడని వ్యాసుడు ఆదేశించెను. వారు గురువాజ్ఞాను శిరసావహించి అట్లే ప్రచారము చేసిరి. వ్యాసుడు తాను రచించిన పురాణములను రోమ మహర్షినికిని, ఉగ్రశ్రవునకును ఉపదేశించెను.

ఇట్లు భగవంతుని మహిమలను వివరించి శుకమహర్షి పరీక్షిట్టుతో “రాజా! చనిపోవుదునను భయము మానుము. ఎల్ల జీవులకును మరణము తప్పదు. శ్రీమన్నారాయణుడే శరణ మని నమ్మి, అతని గుణ కీర్తనము నిత్యమూ చేయు వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహించును” అని భాగావతమును వినిపించి శుకుడు తపమునకు వెళ్ళెను.

(శ్రీ మద్బాగవత పరిశిష్టము)

Advertisements

One comment on “అష్టాదశపురాణములు – శ్రీమద్భాగవతము

  1. VAMSI MOHAN BONDADA says:

    Mee prayathnam adbhutham andi. Mee blog chaalaa baagundi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s