శ్రీ మద్బాగవత పరిశిష్టము

పురంజనోపాఖ్యానము

సూచన: పరమార్ధమునుకోరు ప్రతి మానవుడు అవగాహన చేసికోనదగిన మహావేదాంత రహస్యములు ఈ పురంజనోపాఖ్యానమున ఉన్నవి. కనుక దీనిని ప్రత్యేకముగా వ్రాయుట జరిగినది.

పూర్వము ప్రాచీనబర్హియను ఒక రాజు యజ్ఞయాగాది కర్మముల యందు అమితమైన ఆసక్తి కలవాడై అనేక యజ్ఞముల నొనరించెను. అతడా యజ్ఞములందు పరచిన దర్భలు భూమండల మంతయు నిండిపోయెను. ఒకనాడు నారదుడు రాజు నొద్దకు వచ్చి, “రాజా! నీవు కోరుకొన్న శ్రేయస్సు (మోక్షము) ఈ యజ్ఞయాగాదుల వలన లభింపదు. కేవలము స్వర్గాదిపుణ్యలోకములలో భోగములు ప్రాప్తించును. పుణ్యక్షయముకాగానే మరల జన్మము లెత్తుట తప్పదు. (క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి) కావున జ్ఞానమార్గమున నడిచినచో నీవు కోరిన ఫలము నీకు లభించును” అని చెప్పగా ప్రాచీనబర్హి నారదునకు నమస్కరించ యిట్లనెను. “మునీంద్రా! నేను కర్మము లాచారించుటలో మునిగి మోక్షసాధనమైన జ్ఞానమును సంపాదించ లేక పోయితిని. నా కా జ్ఞానమార్గమును ఉపదేశింపుము”.

నారదుడు “రాజా! నీవు చేసిన యజ్ఞములలో వేలకువేలు పశువులను చంపితివి. అవి అన్నియు నీ మరణమును కోరుచున్నవి. నీవు పరలోకమునకు రాగానే ఇనుప కొమ్ములతో నిన్ను చీల్చి చెండాడుటకు సిద్ధముగా నున్నవి. ఇటువంటి దురవస్థనుండి తప్పించుకొనుటకు నీకు జ్ఞానబోధకమైన ఒక ఇతిహాసమును వినిపించెదను. వినుము” అని చెప్పసాగెను.

పూర్వము పురంజనుడు అను ఒక రాజు కలడు. అతనికి అందరును చూచునట్లు పనులు చేయు అవిజ్ఞాతుడు అను స్నేహితుడు ఉండెను. 

రాజు తాను నివసించుటకు అనుకూలమైన పురము కొఱకు వెదకుచుండెను. ఎన్ని పురములను చూచినాను, తన కోరికలను తీర్చగల పురము ఒక్కటియు కనబడక తిరుగుచుండెను. ఒకనాడు అతడు హిమవత్పర్వత ప్రాంతము లందు తిరుగుచు, ఒకచోట, నవద్వారములు, కిటికీలు, గోపురములు, ప్రాకారములు, ఉద్యానవనములు, రాజమార్గములు, అంగడులు, మణి మయములైన సౌధములు (మేడలు) కలిగిన ఒక పురమును చూచెను. అక్కడ పదిమంది అనుచరులతోను, ఐదు శిరములు గల సర్పరూపుడైన ప్రతిహారి (జవాను) తోను వచ్చుచున్న కామరూపిణియైన ఒక స్త్రీని చూచెను. ఆమె భర్తకోసమై వెదకుచుండెను. ఆ స్త్రీ రత్నమును జూచి రాజు ఆకర్షితుడైయ్యెను. అతడు ఆమెతో, “నీవెవ్వతెవు ? వీ రందరూ ఎవరు? నీ విచ్చట ఏల సంచరించుచున్నావు? నిన్ను జూడగానే నాకు పెండ్లాడవలెనని కోరిక కలిగినది” అనగా ఆమె సిగ్గుపడుచు, “రాజా! నా పెద్ద లెవ్వరో ఎరుగను. ఈ పురములోనే ఉందును కాని ఈ పురమును నిర్మించువారు ఎవరో నాకు తెలియదు. నా అదృష్టవశమున నీ విచ్చటికి వచ్చితివి. నీకంటె నాకు ప్రియుడు ఎవడున్నాడు? నన్ను పెండ్లాడి ఈ నవద్వారములతో గూడిన ఈ పురమును నీవు స్వాధీనము చేసికొని కోరిన భోగములను నూరేండ్లు అనుభవింపుము. గృహస్థాశ్రమము చాల గొప్పది. పితృదేవతలకును, దేవతలకును, ఋషులకును, సర్వభూతగణములకు తృప్తి కలిగించ గలిగినది ఈ యాశ్రమమే. నీవంటి వీరుని, అందమైనవానిని ఏ కన్య వరించదు?” అని పలికినది. 

పురంజనుడు ఆమెను పెండ్లాడెను. ఆమేతో భోగములు అన్నియు అనుభవించుచు ఉండెను.

ఆ పురము నిర్మాణ మెట్టిదనగా: తూర్పున ఐదు ద్వారములు ఉన్నవి. దక్షిణమున ఒకటికి. ఉత్తరమున ఒకటి, పడమట రెండు మొత్తము తొమ్మిది ద్వారములు ఉన్నవి. ఆ పురము మధ్యలో ఒక ఈశ్వరుని  ఆలయమున్నది.         

ఆరాజు తూర్పు ద్వారము లైదింటిలో, , హవిర్ముఖి అను రెండు ద్వారముల అన్నింటిని చూచుచుండును. నళిని, నాళిని, అను మరి రెండు ద్వారముల ద్వారా వాసనలను అనుభవించుచుండెను. ముఖ్య అను ద్వారము ద్వారా రస (రుచులు) రూపమైన వస్తువులనుభవించును. పితృహువు, దేవహువు అను దక్షిణోత్తరద్వారముల వలన సమస్తమును వినుచుండును. పశ్చిమ ద్వారములలొ ఒకటి ఆసురి అనబడును. దానిద్వారా కామోపభోగము లనుభవించును. రెండవది నిరృతి అనబడును. దీని ద్వారా వైశసము (అనవసరమైనవానిని వెళ్ళగొట్టుట) అను సౌఖ్య మనుభవించును.

మరియు, పురంజనుడు, నిర్వాక్కులు, పేశస్కరులు అను అందుల వలన నడచుట, పనులు చేయుట అను వ్యాపారములను పొందును. అంతఃపురములో చేరినపుడు కర్మాసక్తుడై  మహిషి (రాణి) యందు తగుల్కొని యుండును. రాణి ఎమి చేసిన తానును అదే చేయుట ఆమెయే లోకముగా నుండెను.

ఒకనాడు అతడు, ఐదు గుర్రాలు, రెండు చక్రాలు, ఒకే పగ్గము, ఒకే సారథి గలిగిన రథము ఎక్కి పదకొండుగురు సైనికులతో నగరమునుండి బయలుదేరి రాక్షస ప్రవృత్తితోవేటాడి మృగములను జంపెను. రాజైనవాడు శ్రాద్ధముల కొఱకు, కొన్ని ప్రత్యేకమైన జంతువులనే, అడవిలో మాత్రము వేటాడవలెనని నియమము ఉన్నది. ఆ నియమ మీ పురంజనునకు లేకపోయెను. 

అట్లు వేటాడి అలసిపోయి యింటికి వచ్చి స్నానముచేసి, భుజించి, కూర్చుండి తన రాణి యేది యని పరిచారికల నడిగెను. వారు “ప్రభూ! మహారాణి వట్టి నేలమీద పండుకొన్నది. కారణము తెలియదు” అనిరి.

అతడు రాణి పరుండిన చోటికి వెళ్ళి ఆమెను బ్రతిమాలి ప్రసన్నురాలిని చేసికొనెను. ఆమె అలంకరించుకొని వచ్చెను. అతడు ఆమేతో భోగములను అనుభవించుట తన ఆయువు తీరుచున్నడను తెలివి లేక అహోరాత్రములు గడుపుచుండెను. అతడు ఆమెయందు పదునొకండు వందల మంది పుత్రులను, నూటపదిమంది కూతుళ్ళను గనెను. అతనికి సగముపైగా వయసు గడచెను. కొడుకులకును కూతుండ్రకును పెండ్లిండ్లు చేసెను. యజ్ఞ యాగములు చాలా చేసెను. ముసలి తనము వచ్చెను.

చండవేగు అనువాడు ఒకడు  గంధర్వాదీశుడు. అతడు మూడువందల ఆరువదిమంది గంధర్వులతోను, అంతే మంది గంధర్వస్త్రీలతోను పురంజనుని పురముపై దాడిచేసి చాలా చీకాకు పెట్టుచుండగా పురాధ్యక్షుడైన . ప్రజాగారుడు వారి నెదిరించి నూరు సంవత్సరములు తా నోక్కడే యుద్ధము చేసెను. కాని చండవేగుడు బలవంతుడయ్యెను. క్షీణబలుడైన (=బలహీనుడైన) పురంజనుడు, దొరికిన అల్పభోగములతో తృప్తి పడుచు మృత్యువును గురించి ఆలోచించక కాలము గడుపు చుండెను.

కాల పుత్రికయగు దుర్భగ యనునది, యయాతి కుమారుడైన పూరునిచే వరింపబడినది. తరువాత అతనినుండి విడివడినదై ఎవ్వరును వరించువారు లేక నన్ను (నారదుని) వరింపు మని అడిగినది. నేను కాదంటిని. ఆమె ఒక చోట నిలుకడ లేక తిరుగుదువు గాక అని నన్ను శపించినది.

ఆమెకు నేను, భయుడను పేరుగల యవనరాజు దగ్గరకు పొమ్మని చెప్పితిని. ఆమె అతని వద్దకు వెళ్ళి తనను పెండ్లాడుమని కోరగా, అతడు “నీవు అమంగళవు. కావున, నా సైన్యముతోను, ప్రజ్వారుడను నా సోదరునితోను కలిసి ప్రజానాశనము చేయుచుండుము. నీవు నాకు సహోదరివి”. అని చెప్పెను. ఆమె అంగీకరించెను.

దుర్భగ, ప్రజ్వారునితోను, యవనసైన్యముతోను గలిసి పురంజనుని పురముమీద బడి బలాత్కారముగా అతని పురమును ఆక్రమించెను. అది చూచి వెంటనే యవనులు అన్ని ద్వారములనుండి పురములో ప్రవేశించి పీడించసాగిరి.

పురంజనుడు వారిని ఎదిరించు శక్తి లేక పోయినాను  పెనుగులాడ సాగెను. చివరికి పురమును విడుచుటకు మగుచుండగా ప్రజార్వుడు పురమును దహింప సాగెను. 

నేను పోయినచో నా భార్యయు, పుత్రులును, పుత్రికలును ఏ మైపోదురో యని విచారించుచుండగా భయుడు (యవనరాజు) పురంజనుని లాగుకొని పోయెను. ఆ సమయములో గూడ అతనికి మొదటి స్నేహితుడు అవిజ్ఞాతుడు గుర్తుకు రాలేదు. 

అట్లు మరణించిన పురంజనుడు భార్యనే తలచుచున్నందువలన తరువాతి జన్మమున విడర్భారాజునకు ప్రమదోత్తమగా పుట్టెను. ఆమెను పాండ్యరాజు మలయకేతనుడు పెండ్లాడెను. కొడుకులను కుమార్తెలను గని చివరికి భర్తతో వనమునకు వెళ్ళెను. అతడు మరణించగా అతనితో సహా గమనము చేయ బూనెను. ఆ సమయమున పూర్వమిత్రుడైన అవిజ్ఞాతుడను వాడు వచ్చి ఆమెతో “నీ వెవరు? ఈత డెవరు? ఎట్టి సంబధము మీ కున్నది? విచారించెద వేమి? న న్నెరుగుదువా? సృష్టికి ముందు నీ వెవనితో సఖ్యముగా ఉంటివో ఆ మిత్రుడను.

నీవును నేనును పూర్వము మానససరస్సులో నుండు హంసలము. నీవు భోగము లనుభవించు కోరికతో పురమును ఆశ్రయించితివి. ఇట్లు దయనీయమైన అవస్థలను పొందితివి.

నీవు విదర్భరాజకుమార్తెవు కావు, ఇతడు నీకు భర్తయు కాడు, నీవు పురంజనుడవును కావు. ఇదంతయు నా మాయ చేత కల్పింపబడినది. నేనే నీవు గాని ఇందులో పరులు ఎవ్వరును లేరు. పండితులు మన యిద్దరి మధ్య భేదభావము కలిగియుందురు.” అని వరించి చెప్పగా విని ఆమె (అతడు) ఆత్మజ్ఞానమును పొందెను.

నారదుడు ఇట్లు వినిపించగా రాజు “స్వామీ! ఈ కథ అంతరార్థమును గూడ నీవే వివరించి చెప్పవలె” నని కోరగా నారదుడు ఈ కథలోని పాత్రల నిట్లు వివరించెను.

పురంజనుడు = జీవుడు (పురం జనయతి ఇతి = దేహమును ధరించువాడు)
అవిజ్ఞాతుడు = ఈశ్వరుడు (కంటికి కనిపించని వాడు)
పురము = శరీరము (నవ ద్వారములు గలది)
ప్రమదోత్తమ = విషయానుభవములకును, అహంకార మమకారములకు కారణమైన బుద్ధి.
దానికి సుఖములు = ఇంద్రియ గుణములు – వాని వ్యాపారములు
పంచముఖొరగము = ఫ్రాణ అపాన వ్యాన ఉదాన సమానములను ఐదు విధములైన ప్రాణశక్తి.
ఏకాదశభటుడు = చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు అను ఐదు జ్ఞానేంద్రియములకును నోరు, చెయ్యి, కాలు, గుదము, జననేంద్రియము అను ఐదు కర్మేంద్రియములకును ఆధిపత్యము (నాయకత్వము) వహించు మనస్సు.

నవద్వారములు: కన్నులు – 2, ముక్కులు – 2, చెవులు – 2, నొరు – 1, గుదము – 1, జననేంద్రియము – 1 = మొత్తము తొమ్మిది.

తూర్పు ద్వారములు 5 = కన్నులు – 2, ముక్కులు – 2, నొరు – 1 మొత్తము 5.

నవద్వారములు: కన్నులు – 2, ముక్కులు – 2, చెవులు – 2, నొరు – 1, గుదము – 1, జననేంద్రియము – 1 = మొత్తము తొమ్మిది.

తూర్పు ద్వారములు 5 = కన్నులు – 2, ముక్కులు – 2, నొరు – 1 మొత్తము 5.

దక్షిణ ఉత్తర ద్వారములు = చెవులు – 2
పశ్చిమ ద్వారములు – 2, గుదము -నననేంద్రియము
ఖద్యోత హవిర్ముఖులు = నేత్రములు
విభ్రాజితము = రూపము
ద్యుమంతుడు = కన్ను
నళెనీనాళినులు = ముక్కు రంధ్రములు
సౌరభము = సువాసన (పూర్వజన్మవాసన)
అవధూత = ముక్కు
విపణము = వాక్కు
రసజ్ఞుడు = నాలుక
అపణము = వ్యవహారము (ఇచ్చి పుచ్చుకొనునది)
బహుదనము = వివిధములైన అన్నములు
పితృహువు = కుడి చెవి
దేవహువు = ఏదమ చెవి
నిర్వాక్కు , పేశస్కరుదు = కాళ్ళు, చేతులు.
ఆసురి – మూత్ర ద్వారము (విషయ భొగముల కిది ఆధారము కూద)
నిరృతి = మలద్వారము
చండవేగుడు = కాలమునకు చిహ్నమైన సంవత్సరము
గంధర్వులు = పగటి వేళలు
గంధర్వ స్త్రీలు = రాత్రి వేళలు
కాలకన్యక (దుర్భగ) = ముసలితనము
భయుడు (యవనరాజు) = మృత్యువు
అతని సైనికులు = మాసిక, శారీరక వ్యాధులు
ప్రజ్వారుడు = శీతోష్ణ భేదము గల జ్వరము
శ్రుతధరుడు = చెవి
రథము = దేహము
మహిషీవశుడగుట = బుద్ధి సూచించినరీతిగా ఇంద్రియవ్యాపారములలో నిమగ్నుడగుట
తురంగములు = ఇంద్రియములు
చక్రద్వయము = పుణ్యపాపములు
పగ్గము = మనస్సు
సారథి = బుద్ధి
వేటాడుట = పంచేంద్రియవశుడై హింసాదికముచే సుఖము లనుభవించుట.
ప్రజ్వారప్రభావము = ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక దుఃఖములచే పీడింపబడుట.

సూచన: ఈ వివరంగాఉలతో సమన్వయించుకొనుచు చదివినచో ఈ కథలోని పరమార్థము, వేదాంతరహస్యము బోధపడును.

జీవుడు సాట్ట్వికములైన కర్మల ననుష్ఠించుటచేత తేజోలోకములను పొందును. రాజసములైన కర్మలచేత  దుఃఖము నిచ్చు లోకములను తామసికములైన కర్మలచేత, చీకటి, దుఃఖము గల లోకములను పొందును.

ఆ కర్మలవలననే స్త్రీ, పురుష, నపుంసక రూపములను గూడ పొందును. వాని వలననే కామక్రోధాదులు గలిగి పుట్టుచు చచ్చుచు అనేక జన్మములు ఎత్తుచుండును.

అన్నము కోసము చాటుగా ఇంటిలో దూరిన కుక్కకు అన్నమో లేక దెబ్బలో ఏదో ఒకటి దొరుకును. అట్లే  జీవునకు ప్రారబ్దకర్మముల వలన సుఖముగాని దుఃఖముగాని కలుగుచుండును.

ఈ సత్యమును గమనించి మానవుడు సత్కర్మము లాచరించి ఈ లోకమున సుఖములను అనుభవించి పరములో గూడ సుఖములను సంపాదించవలెను.

శ్రీమద్భాగవతము సంపూర్ణము.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s