మనుస్మృతి (మనుధర్మ శాస్త్రం)…

రఘు వంశం రెండో సర్గం మొదట (శ్లో 2) దీలిప మహారాజు ధర్మపత్ని అయిన సుదక్షిణాదేవి వేదార్థాన్ని స్మృతి మాదిరిగా నందినీధేనువు వెళ్ళే దారిని అనుసరించిందని కాళిదాసు వర్ణించాడు. (….మనుష్యేశ్వర ధర్మపత్నీ శ్రుతేరి వార్థం స్మృతి రన్వగచ్చత్) శ్రుతి అంటే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. “వేదో ధర్మ మూలం” అని గౌతముడు, సమస్త ధర్మాలకూ వేదమే మూలం. ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదిస్తూ శాసించేదే ధర్మశాస్త్రం. ఇదీ వేదంలో సమానమై పధ్నాలుగు విద్యల్లో ఒకటయింది.

ధర్మశాస్త్రం ధర్మాన్ని తెలుపుతుంది. జైమిని “చోదనా లక్షణోర్థో ధర్మః” అని చెప్పాడు. చోదన అంటే పురికోల్పటం అని అర్థం. వ్యక్తి చేయదగిన విధుల్ని బోధించేది ధర్మం. ధర్మాలు సామాన్యమనీ, విశేషమనీ రెండు రకాలు. సత్యం, అహింస, దయ, శౌచం మొదలయినవన్నీ సామాన్య ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాలు విశేష ధర్మాలు.

భారతదేశంలో ధర్మశాస్త్రాలు చాలా ప్రాచీనమైనట్టివి. మానవసమాజం తోనే సామాన్య విశేష ధర్మాలు రూపొందాయి.  వేదాల్లోనే ధర్మాల్లోకి కొన్ని కనబడుతున్నాయి. సమాజం స్థాణువు కాదు కాబట్టి, పరిణామం చెందే తత్త్వం కలిగింది కావునా ధర్మాలను కూడా కాలానుగుణంగా మార్పుల చేర్పులతో నిర్ణయించు కోవటం తప్పనిసరియింది. అప్పుడు శిష్ట పరిషత్తులు వేదవిరుద్దంగా దేశ కాల కులాచారాలను సమీక్షించి ధర్మాలను ప్రతిష్టించాయి.

భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజ్ఞవల్కస్మృతి, పరాశరస్మృతి మొదలయినవి లెక్కకు వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యపరులకెవరికైనా అర్థమవుతుంది. అయితే ఈ మనువేవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యము. ఋగ్వేదములో పితృ మనువు ప్రస్తావన ఉన్నది. శతపథ బ్రాహ్మణంలోని జలప్రళయ కథలో మనువు కనబడతాడు. పురాణాల ప్రకారం పధ్నాలుగురు మనువులు గోచరిస్తారు. వీరిలో మొదటివాడు బ్రహ్మ పుత్రుడైన స్వాయంభువ మనువు. ఇతని సంతతివారే మానవులు. అమరకోశం కూడా మనువు వలన పుట్టినవారు మానవులనీ (మనోర్జాతా మనుజాః) మనువు సంబంధమయినవారు మానవులనీ (మనోరిమే మానవాః) పేర్కొంటున్నది. అయితే రామాయణం మాత్రం కశ్యపప్రజాపతికి ఎనిమిది మంది భార్యలున్నారనీ, వారివల్ల మానవునితోపాటు సమస్త ప్రాణులూ జన్మించాయనీ (అరణ్య కాండం 14 సర్గం) చెప్తున్నది. కశ్యప ప్రజాపతి భార్యల్లో మనువు ఒకటి. ఆమె బ్రాహ్మణాది వర్ణములతో కూడిన మనుష్యులను కన్నది. (శ్లో 29)

మనువుల్లో రెండవవాడు స్వారోచిషుడు. ఇతడు స్వరోచికి, వనదేవతకూ పుట్టినవాడు. అల్లసాని పెద్దన్న మనుచరిత్రలో ఇతని వృత్తాంతం ఉన్నది. మనువుల్లో ఏడవవాడు వైవస్వత మనువు. ఇతడు సూర్య పుత్రుడు. సూర్యవంశ రాజుల మూలపురుషుడు. కాళిదాసు వేదాలకు ఓంకారం మాదిరిగా రాజులకు మొట్టమొదటి వాడయిన వైవస్వతునికి ప్రసిద్ధికెక్కిన మనువున్నాడని రఘువంశంలో (సర్గం 1. శ్లోకం 11) వర్ణిస్తాడు.

ఒక్కొక్క మనువు జీవిత కాలానికి మన్వంతరం అని పేరు. ఒక్కొక్క బ్రహ్మకల్పంలో పధ్నాలుగు మంది మనువులు మారతారు. ఒక మనువు పరిపాలనా కాలం నాలుగు లక్షల ముప్పైరెండువేల మనుష్య సంవత్సరాలని భాగవతం మూడో స్కందంలో ఉన్నది. మనువు విశ్వపరిపాలనం చేసే ధర్మం నిర్ణేత అని భారతీయుల విశ్వాసం.

ఇది మనువృత్తాంతం. ఇప్పుడు మనకు లభించిన మనుస్మృతిని రచించిందెవరు? పౌరాణిక విశ్వాసం వేరు. చారిత్రక పరిశోధనం వేరు. మనుస్మృతి క్రీ.పూ.500లో అవతరించిందని కొందరు పరిశొధకులు పేర్కొన్నారు. మరి కొందరు క్రీ.పూ. 2వ శతాబ్ది మధ్య కాలంలో ఇప్పటి మనుస్మృతి రూపొందిందన్నారు. ఏది ఏమయినా భృగు వంశీయులు మనుస్మృతిని రచించి ప్రజలకు దానియందు భయభక్తి గౌరవాలు కలగటానికి మనువు దాని సృష్టి కర్త అని చాటరనే మాట మాత్రం సత్యం. మనుస్మృతి మొదటి అధ్యాయమే దీనికి సాక్ష్యం. దీనిలో మనువు తన దగ్గరకు వచ్చిన ఋషులకు సృష్టి క్రమాన్ని వివరించి తర్వాత సకల మానవులకు ఉపయోగకరంగా తాను వారిసృజించిన స్మృతిని వారికి ఉపదేశింపుమని భృగువునాజ్ఞాపించాడు. మనుస్మృతి భృగుసంహితగా పేరు పొందిందని మనం మరచిపోరాదు. భృగువంశీయులు భారతం మహాభారతం గావటానికి కారకులయ్యారు. ఈ విధంగా దివ్యులను శాస్త్రకర్తలుగా పేర్కొనటం భారతీయుల పరిపాటి. తార్కాణంగా శాస్త్రాన్ని, నాట్యశాస్త్రాన్ని చూపవచ్చు.

ఇంతేగాకుండా మనుస్మృతిలో ప్రక్షిప్తాలున్నాయి. అందువల్ల దానిలో స్వవచన వ్యాఘాతాలు, పునరుక్తులూ చోటు చేసుకున్నాయి. మహాభారత మనుస్మృతుల్లోని సమానమయిన శ్లోకాలను అర్థ భావాలను మనం గుర్తింపవచ్చు.

పతంజలి మహాభాష్యంలో మనుప్రస్తావన ఉన్నది. శబరస్వామీ, శంకరాచార్యులు రచించిన భాష్యాల్లో మనుస్మృతి శ్లోకాలున్నాయి. క్షీరస్వామి అమరకోశ వ్యాఖ్యాత కొన్ని శ్లోకాలుదహరించాడు. భారవి, యశస్తిలక చంపూ రచయిత సోమదేవసూరి మనుధర్మాన్ని ప్రస్తావించారు. వలభిరాజుల శాసనాల్లో కూడా దానిని మనం చూస్తాము.

మనుస్మృతి వర్ణ ధర్మాలూ, ఆశ్రమ ధర్మాలూ, ధర్మ నిర్ణయాలూ, అభియోగ విచారణమూ వివిధ దండన విధానాలూ, రాజ్య సంబంధి విషయాలూ మొదలయిన వాటిని విపులంగా ప్రతిపాదిస్తుంది. నామకరణం, భిక్షాటనం మొదలయిన విషయాల్లో మనుస్మృతి తీరు విచిత్రంగా నిరంకుశంగా గోచరిస్తుంది. ఇది శూద్రుల పట్ల కఠినాతి కఠినంగా, క్రూరంగా వ్యవహరిస్తుంది. స్త్రీలపట్ల ఔదార్యం చూపదు. మనుస్మృతి శిక్షాపద్ధతులు నిర్దేశిస్తూ చెప్పిన మాటలు కొన్ని వర్తమాన కాలంలో కూడా చెల్లుతాయి.

(ఇంకాఉంది…)

3 comments on “మనుస్మృతి (మనుధర్మ శాస్త్రం)…

  1. మనుధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించే నవీన మానవ మేధావులు…. ఇల్లు గడవక ఒకడేడుస్తుంటే…. చుట్ట వెలిగించుకుంటాను అని ఒకదాన్నాడట…… పరిస్తితులు దరిద్రంగా వుంది…. ఎం చెయ్యాలో పాలుపోని పారిస్తితుల్లో… నిలువెల్లా కక్ష నింపుకుని మాట్లాడితే….. అతుకునా గతకునా…..

  2. Murthy mydavolu says:

    Nice

  3. Rajan says:

    Super

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s