శ్రీ కాళహస్తీశ్వర శతకము

శ్రీకాళహస్తీశ్వర శతకమును మహాకవి ధూర్జటి రచించినారు. ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.

ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.

ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.

పద్యాలు మరియు వాటి తాత్పర్యము

శా||  శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనొబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!      1
తా|| సంపదలనెడి మెరుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన పాపములనెడి నీటిధారాచేత నామన: పద్మము కాంతిలేక చిన్నబోయినది.  నీ దయయను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మన: పద్మము వికసించుటే కాదు సర్వసమృద్ధులు గలవాడనై నీ చిన్మూర్తిని ధ్యానించుచు బ్రతికెదను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాతిమంతము లగును).

శా|| వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణశ్రీ  జెఱపట్ట జూచిన విచారద్రోహమో, నిత్య క
ణ్యాణ క్రీడల బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ
శ్రేణీ ద్వారము దూర జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!         2
తా||  ఈశ్వరా!  బ్రహ్మాదులకు గూడ అలభ్యమైఅ నీ యింటి సింహద్వార దేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టుద మను ఆలోచన, నా వంటి అల్పుడు చేసినందువల్లనో యోమోకాని, నీ సేవాభాగ్యమునకు దూరమై, అధములైన రాజులను సేవించు నట్లు చేసినావు గదా!

శా||అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా!        3
తా|| ఆలోచించినచో ఈ జగతత్తంతయును మాయయేగదా! మానవు డా సంగతి తెలిసియుండియు, భార్యయు, పుత్రులు, ధనములు, తన శరీరము అన్నియు శాశ్వతములని భావించి మోహమునొందుచు, జీవనమునకు పరమార్థభూతుడైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననను ధ్యానించడు గదా! ఎంత అజ్ఞానము!

శా|| నీ నా సందొడబాటుమాట వినుమా! నీచేత జీతంబు నే
గానిం బట్టక సంతతంబు మది వేడ్కంగొల్తు, నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుదే
జీ నొల్లన్ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!                4
తా|| ఈశ్వరా! నీకును నాకును అంగీరమైన మాట ఒక్కటి చెప్పెదను వినుము. నీనుండి ఏగానియైనను జీతమాశింపక నిత్యము నిన్ను సేవించెదను. నీవు నన్ను కామక్రోధాదులైన లోపలి శత్రువులకు ఒప్పగింపక రక్షింపుము. ఆ యనుగ్రహము చాలును. ఇంక నాకు గుఱ్ఱాలు వద్దు. ఏనుగులు వద్దు. ఐశ్వర్యములు వద్దు. అటువంటివేమియు కోరను.

మ|| భవకేళి మదిరా మదంబున మహా పాపత్ముడై వీడు న
న్ను వివేకింప డటంచు నన్ను నరకార్ణోకాశి పాలైన బ
ట్టవు, బాలుండొక చోట నాటతమితోడన్ నూత గూలంగ దం
డ్రి విచారింపక యుండునా? కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!    5
తా|| జనన మరణ రూపమైన సంసార మనెడి ఆటలోబడి, కల్లు త్రాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని యీ నరుడు మహాపాపియై నన్ను (భగవంతుని) తెలిసికొనలేకున్నాడని, నరక సముద్రములో మునిగిపోవుచుండగా చూచుచు ఊరూకుందువా? ఆటలధోరణిలో బాలుడు నూతిలో బడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండునా? నీవు నన్ను రక్షింపకుండుత న్యాయము గాదని భావము.

శా|| స్వామిద్రోహము చేసి వేఱొకని గొల్వం బోతినో? కాక నే
నీ మాట ల్విననొల్ల కుండితినో? నిన్నే దిక్కుగా జూడనో?
యేమీ, యిట్టి వృథాపరాధి నగు న న్నీ దుః ఖవారాశి వీ
చీ మధ్యంబున ముంచి యుంపదగునా? శ్రీకాళహస్తీశ్వరా!     6
తా||  ఈశ్వరా! నిన్నుకాదని స్వామి ద్రోహముచేసి మరొక దేవుని సేవింపబోయితినా? పోనీ, నీవు చెప్పిన వేదవాక్యములందు ప్రమాణ బుద్ధిలేక నిరాదరణచేసి, నాస్తికుడైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ యపరాధమును చేయని నన్నీ సంసార దుఃఖ సముద్రములో ముంచి, చూచుచు వినోదించుట నీకు న్యాయమా? న న్నుద్ధరించుట నీ కర్తవ్యము కాదా? (పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వానిని నమ్మనివారిని నాస్తికులందురు.)

మ|| దివిజక్ష్మారుహ ధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు; నిథీశ్వరుండు సఖు డర్ణోరాశి కన్యా విభుం
డు విశేషార్చకు డింక నీ కెన ఘనుండుం గల్గునే? నీవు చూ
చి విచారింపవు; లేమినెవ్వడుడుపున్? శ్రీకాళహస్తీశ్వరా!    7
తా|| కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండియున్న బంగారు పర్వతము నీకు విల్లు. నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీ ప్రియమిత్రుడు. లక్ష్మీపతియైన నారాయణుడు నీ పరమభక్తుడు. ఇన్ని యున్న నీకంటె ఘనుడెవ్వడు? వీరిలో ఏ ఓక్కరితోనైన చెప్పి నా దారిద్ర్యమును దీర్చగల సామర్థ్యము నీకున్నది. ఐనను ఆ పని చేయవు. నిన్ను మఱ్చిపోవుదునని భయమా? నాయెడల నీ యనుగ్రహ దారిద్యమును దీర్చువాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు?
మరొక భావము: ఇంతమంది ఐశ్వర్యవంతులు నీ వాళ్ళున్నారు. వారిలో నెవరు నీ దారిద్ర్యమును పోగొట్టుగలరని యెప్పుడును ఆలోచించవు. అదే నీ ఘనత. ద్వంద్వాతీతులైన నీవంటి పరాఆంపురుషులు కలిమిలేముల వంటి సామాన్యవిషయములను పట్టించుకొనరు.

శా|| నీతో యుద్ధముసేయనోప; గవితా నిర్మాణశక్తి న్నినుం
బ్రీతుం జేయగలేను; నీ కొఱకు దండ్రింజంపగా జాల; నా
చేతన్ రోకట నిన్ను మొత్త వెఱుతున్; జీకాకు నా భక్తి, యే
రీతిన్ నాకిక నిన్ను జూడగలుగున్? శ్రీకాళహస్తీశ్వరా!       8
తా|| అర్జునునివలె నీతో యుద్ధము చేయలేను; నీవలె కవిత్వము చెప్పి సంతోషపరచలేను; శివభక్తునివలె తండ్రిని జంపలేను; శివభక్తురాలి వలె నిన్ను రోకలితో మొత్తలేను; నా భక్తియే నాకు అడ్డమై నీ దయను పొందనీయకున్నది. నిన్ను జూచెడి అవకాశమింక నాకెట్లు కలుగును?

పూర్వగాథలు
1. పూర్వము అర్జునుడు పాశుపతాస్త్రము కొఱకు తపము చేయుచూండగా శివుడు కిరాతరూపములో అతనిని పరీక్షించుటకు పందిని తరుముకొని వచ్చెను. వారిద్దరును ఒకేసారి పందిని కొట్టిరి. అది చచ్చెను. దానికై యిద్దరును యుద్దమూడిరి.
2. ఒక భక్తునికి రాజసన్మనాము చేయించవలెనని శివుడాతనికి పద్యము వ్రాసియిచ్చి రాజసభలో చదువుమనెను. “కేశపాశము సహజగంధ” మని అందులోనుండెను. నత్కీరుడును ఆస్థానకవి, దాని నాక్షేపించెను. అపుడు శివుడు తాను కవి వేషముతో వెళ్ళి, ఆ పద్యములో తప్పేమి యని యడిగెను. కేశములకు సహజముగా సువాసన యున్నదనుట, కవిసమయము కాదని యాక్షేపించెను. శివుడు మూడవ కన్ను చూపగా నత్కీరుడు “నీవు తలచుట్టును కన్నులు పెట్టుకొన్నను తప్పు తప్పే” యని మొండిగా వాదించి శాపము నొందెను.
3. ఒక భక్తుడు శివుని బూజించుచుండగా తండ్రి వద్దనెను. అతడు మానలేదు. తండ్రి శివలింగమును తన్నెను. కొడుకు కోపముతో తండ్రిని జంపెను.
4. ఒక శివభక్తురాలి యింటికి శివుడు విప్రవేషమున వచ్చి భోజనము నడిగెను. ఆమె, శివప్రసాదమిది, పారవేయకుండ తినుమని పెట్టెను. అతడా పదార్థాములు రుచిగాలేవని విడిచిపెట్టగా, శివప్రసాదమును దిరస్కరించినాడను కోపముతో రోకలి పుచ్చుకొని విప్రుని బాదినది.

శా|| ఆలున్ బిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నా మెడ గట్టినాడ విక ని న్నేవేళ జింతింతు, ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలో గ్రుంకి, యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా! 9
తా|| ఈశ్వరా! భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనెడి పాశములను నా మెడకు చుట్టినావేమి? ఈ వ్యామోహములో బడి నిన్ను నేనెట్లు స్మరింపగలను? ఈ బరింపరాని దుఃఖము నెట్లు పోగొట్టెదవో శంకరా! నీదయ. (విపద్విస్మరణం శంభోః స్మరణం సర్వసంపదః = శివుని మరచుట ఆపద, సంస్మరించుటే మహైశ్వర్యము).

శా||  నిప్పై పాతకతూలశైల మడచున్ నీ నామమున్ మానవుల్
తప్పన్ దవ్వుల విన్న నంతకభుజార్పోద్ధత క్లేశముల్
దప్పున్, దారును ముక్తులౌదురనిశాస్త్రంబుల్ మహాపండితుల్
చెప్పంగా దమకింక శంకవలెనా? శ్రీకాళహస్తీశ్వరా!    10
తా|| శ్రీకాళహస్తీశ్వరా! నామమును స్మరించినంతనే కొండలవంటి పాపములు నశించుననియు, యముని వల్ల కలుగు నరకబాధలు తప్పుననియు వేదశాస్త్రాలు, పండితులు చెప్పుచుండగా ఈ మానవులకింకను సందేహములెందుకు? నీ నామమును స్మరించుటకు సిద్ధపడరెందుకు?

శా|| వీడెం బబ్బినయప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో
గూ డున్నప్పుడు, శ్రీవిలాసములు పై కొన్నప్పుడున్ గాయకుల్
పాడంగా వినునప్పుడున్ జెలగు దంభప్రాయ విశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!    11
తా|| ఈశ్వరా! నిన్ను, నీ ధ్యానమును మఱచి, తమకు తాంబూలము దొరకినప్పుదును, అనగా భోగములు కలిగినప్పుడును, (తాంబూలము భోగ చిహ్నము) తమ నెవ్వరైన పొగడినప్పుడును, కడుపునిండ తిండియున్నప్పుడును, ఐశ్వర్యవైభవములు బాగుగానున్నపుడును, గాయకులు పాడినప్పుడును తమ గొప్పదనమును చూపుటకై ఆడంబరముగా దానధర్మములు చేయుచు విఱ్ఱవీగు వారి నేమనవలెనో తెలియదు.

మ|| నిను సేవింపగ నాపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ, మహాత్ము డననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా!    12
తా||  ఈశ్వరా! నేను నిన్ను సేవించుచుండగా, నాకు కష్టాలే రానీ, సుఖాలే రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహచారము నన్ను క్రుంగదీయనీ, లేక మంచియే చేయనీ అవియన్నియు నాకు ఆభరణముల వంటివే యగును. నీ పాదసేవ చేయుచున్న నాకు అన్నియు నీ యనుగ్రహములు గానే కనిపించును.

శా|| ఏ వేదంబు పఠించె లూత? భుజంగ బే శాస్త్రముల్ సూచె దా
నే విద్యాభ్యసనం బొనర్చెగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా? కావు;  నీ పాద సం
సేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!    13
తా|| ప్రాణికోటులకు మోక్షము గలుగుటకు నీ పాదములు సేవించు భక్తి యొక్కటియే కారణమగును గాని, చదువులెన్ని చదివినను జ్ఞానమును, మోక్షమును గలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికిని జ్ఞానము గలిగినదా? మోక్షము కలిగినదా? నీ దయచే మోక్షము నొందిన సాలెపురుగు ఏ వేదము చదివినది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది? ఎరుకలవాడే మంత్రజపము చేసినాడు? వీరందరును ముక్తినొందుటకు చదువులే కారణమైనవా?

శా|| కాయల్గాచె వధూ నఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్
రాయన్ ఱాపడె ఱోమ్ము,  మన్మథవిహారక్లేశ విబ్రాంతిచే,
బ్రాయంబాయెను,  బట్టగట్టె దల, చెప్పన్ రోత సంసారమే
జేయాంజాల విరక్తు జేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా!    14
తా||  ఈశ్వరా! స్త్రీల గోళ్ళగాటులచే నా శరీరము కాయలు గాచినది. వారి స్తనముల రాపిడిచే నా రొమ్ము రాయివలె గట్టిపది పోయినది. మన్మథక్రీడలందలి వ్యామోహములో బడి వయసు గదిచిపోయినది. తల బట్టతలయై వెంట్రుకలు రాలిపోయినవి. ఇట్లు చెప్పుకొనుచు బోయినచో చాలయున్నవి. ఇప్పుడీ సంసారమన్నచో అసహ్యము గలిగినది. ఇక నాకు పరిపూర్ణ వైరాగ్యమును గలిగించి భవబంధవిముక్తుని జేయుము.

శా|| నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో? స్త్రీ
చన్నో? కుంచమొ? మేక పెంటియొ? యీ సందేహముల్ మాపి, నా
కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే
చిన్నీరేజ విహారమత్త  మధుపా!  శ్రీకాళహస్తీశ్వరా!    15
తా|| ఈశ్వరా! మోకాలో, స్త్రీ యొక్కస్తనమో, కుంచమొ, మోకపెంటియో నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును?  నా యీ సందేహములన్నియు పోగొట్టి నీ సగుణమూర్తిని నాకు చూపి ధన్యుని జేయుము.

పూర్వకథలు
1. అర్జునుడు ఒకసారి శివపూజ చేయుటకు శివాలయమునకు బోవుచుండెను. కృష్ణుడతని జ్ఞానమును పరీక్షించవలెనని ఎక్కడికి బోవుచున్నావనెను. శివుని పూజించుటకు  గుడికి వెళ్ళుచున్నానని అర్జునుడనగా శివుని బూజించుటకు గుడికి పోవలెనా? యని హరి ప్రశ్నించెను.  అర్జునుడు తెల్లబోయి చూచుండగా కృష్ణుడు తన మోకాలు చూపి, ఇది శివలింగముగ్గ కనబడుత లేదా యని యడిగెను. అర్జునుడు తెలివి తెచ్చుకుని కృష్ణుని మోకాలినే శివలింగముగా భావించి పూజించెను.
2. ఇద్దరు శివభక్తులుండిరి. వారిద్దరును మిత్రులు .  వారికి వేశ్యాసంపర్కముండెదిది. వారిలో ఒకడు కాశీయాత్రకు బోయెను. రెండవవాడు ఇంటిలోనే యుండెను. శివరాత్రి వచ్చెను. రెండవవాడు ఆ రాత్రి అలవాటు చొప్పున వేశ్యయింటికి బోయెను. అప్పుడాతనికి చింత గలిగెను. ఇప్పుడు  లింగోద్భవకాలమగుచున్నది. నామిత్రుడు కాశిలో విశ్వనాథునికి అభిషేకము చేయుచుండగ నేనిట్లు వ్యర్థుడనై యుంటిని. ఎమి చేయుదును? అని విచారించు చుండగా ప్రక్కన నిద్రించుచున్న వెశ్య నిద్రలో ఆటునుండి యిటు దొరలెను. చీర తొలగి స్తనము పైకి కనబడెను. అది యా భక్తునికి స్తనముగా కాక శివలింగముగా గోచరించెను. అతడు భక్త్యావేశముతో ఆ లింగమునకు అభిహేకార్చనలు చేయగా శివుడు ప్రత్యక్షమై వారిద్దరికిని మోక్షమిచ్చుటయే కాక, తానచ్చట “ఆచంట” ఈశ్వరుడుగా వెలసెను. (ఇది పశ్చిమగోదావరి జిల్లాలో ఆచంట గ్రామమని చెప్పబడుచున్నది)
3. ఒక ధాన్యపు వర్తకుడు శివభక్తుడు. నిత్యము శివపూజ చేసెడివాడు. ఒకనాడు పూజా సమయమునకు వేరొక గ్రామములో ఉండిపోవలసి వచ్చెను. బోర్లించి యుంచిన కుంచమును శివలింగముగా భావించి భక్తిశ్రద్ధలతో పూజింపగా ఆ కుంచమే శివలింగమయ్యేను. అతనికి “కుంచేశ్వరుడు” డని పేరువచ్చెను.
4. ఒక గొల్లవాడు శివభక్తుడై తాను పూజించుటకు శివలింగము లేకపోయెనని విచారించుచుండగా ఒక ముని, ఎందుకు విచారించెదవు? మేక పేంటికనే శివలింగముగా భావించి పూజింపుమనగా వాడు అట్లే చేసి శివలోకమును పొందెను. గొల్లవాని పేరు కోటయ్య. అతనిపేరుతో ఆ శివుడు “కోటేశ్వరుడు” డయ్యెను.

మ|| నిను నా వాకిలి గావుమంటినో? మరున్నీలాలకభ్రాంతి గుం
టెన పొమ్మంటినో? యంగిలిచ్చి తిను, తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రషింప జే
సిన నా విన్నపమేల చేకొనవయా? శ్రీకాళహస్తీశ్వరా?    16
తా|| ఈశ్వరా! బాణాసురుని వలె నిన్ను నాగుమ్మము నొద్ద కావలి కాయుమన్నానా? దేవతా స్త్రీలపై మొహపడి వారివద్దకు రాయబారిగా వెళ్ళామన్నానా? తిన్ననివలె ఎంగిలి మాంసము పెట్టి తింటేగాని వీలులేదన్నానా? ఏమపరాథము చేసినాను? సజ్జనులను రక్షింపుమన్నాను. అంతేకదా! నాప్రార్థన వినిపించుకోవేమి?

శా|| ఱాలన్  ఱువ్వగ జేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచునే
జాలన్ జంపగ, నేత్రముల్ దివ్యగా శక్తుండనే గాను, నా
శీలం బేమని చెప్పనున్న దిక్ నీ చిత్తంబు నా భాగ్య మో
శ్రీలక్ష్మీ పతి సేవింతాంఘ్రియుగళా! శ్రీకాళహస్తీశ్వరా!    17
తా|| అజ్ఞానియైన యొక కిరాతకుడు పూలులేవని రాళ్ళటో పూజించినట్లు నేను చేయలేను. సిరియాళునివలె కుమారుని బిలిచి చంపి వంటచేసి జంగమదేవులకు పెట్టలేను. తిన్ననివలె కన్నులు పెరికి నీకు సమర్పింపలేను.  ఇంక నా భక్తి గాడమైనదని యెట్లు చెప్పగలను? ఈ మాత్రపు భక్తికి నీవు హృదయములో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము.

శా||  రాజుల్ మత్తులు వరిసేవ నరక ప్రాయంబు, వాఇచ్చు నం
భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యథా
బీజంబుల్, తదపేక్ష చాలు, బరి తృప్తిం బొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!    18
తా|| ఈశ్వరా! రాజులైశ్వర్య మదమత్తులు. వారి సేవ నరకము వంటిది. వారు దయతో నిచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుఱ్ఱాలు, భూషణములు మున్నగునవి సంసార బంధములు పెంచి దుఃఖమును గలిగించును. వీనినన్నిటిని అనుభవించి సంతృప్తి పడినాను. ఇంక వీనిపై వ్యామోహము చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల గలిగెడు మోక్షమును నాకు ప్రసాదింపుము.

శా|| నీరూపంబు దలంపగా దుదమొద ల్నేగాన, నీవై ననున్
రా రా రమ్మని యంచు జెప్పవు, వృథారంభంబులింకేటికిన్
నీరన్ ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడం జుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగళా! శ్రీకాళహస్తీశ్వరా!    19
తా|| ఈశ్వరా! నీ రూపము నూహింతమన్నచో, దాని తుదమొదళ్ళు నాకు ఎలియవు. పోనీ, నీవైన నన్ను రమ్మని పిలుతునా? పిలువవు. ఇంక నేను నీ దయకై యెన్ని పాట్లు పడిన నేమి ప్రయోజనము? నన్ను నీట ముంచినను  పాలముంచినను నీదే భారము. నిన్నే నమ్ముకొనియున్నాను.

మ|| నీకున్ మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
జోకైనట్టి కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకంబొప్ప ఘటించి, చేతిపునుకున్ భక్షింప కా బోయచే
జేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!    20
తా|| ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక గలిగినచో, నీ చేతిలో లేడి యున్నది; గండ్రగొడ్డలి యున్నది; నీ మూడవకంటిలో నిప్పున్నది; తలమీద నీరున్నది; కొంచెము శ్రమపడి వంట చేసికొని శుచిగా రుచిగా తినలేక పోయినావా? ఆ తిన్న డెంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? నీవంటి వా డిట్లు చేయవచ్చనా?

శా|| రాజైదుష్కృతి జెందె జందురుడు, రారాజై కుబేరుండు దృ
గ్రాజీవమున్మ గాంచె దుఃఖము; కురుక్ష్మాపాలు డామాటనే (కై)
యాజిం గూలె సమస్త బంధువులతో; ఆ రాజ శబ్దంబు ఛీ!
ఛీ! జన్మాంతరమందు నొల్లనుజుమీ! శ్రీకాళహస్తీశ్వరా!    21
తా|| చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించి పాపమును మూటగట్టుకొనెను. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖము నొందెను. ధుర్యోధనుడు గూడ పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావలెనన్న కాంక్షతో యుధ్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతోను నాశనమయ్యేను. కాంక్షతో యుధ్ధమునకు దిగి సమస్త బంధుమిత్రులతోను నాశనమయ్యేను. ఈ రాజశబ్దములో ఇంత దోషమున్నది. కావున మరొక జన్మలో గూడ రాజు కావలెనని కోరను. నీ దయారస వీక్షణమున్నచో చాలును.

శా|| రాజ రాజర్థా తురు డైనచో నెచట ధర్మంబుండు? నేరీతి నా
నా జాతి క్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు? రూ
పాజీవాళికి నేది దిక్కు? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియింతురే తెఱగునన్? శ్రీకాళహస్తీశ్వరా!    22
తా||  పరిపాలకుడైన రాజు ధనుమందు ఆశ కలిగి పరిపాలనము సరిగా చేయనిచో రాజ్యములో ధర్మమెక్కడ నుండును? వర్ణాశ్రమ ధర్మములెట్లు సక్రమముగా నడచును? సజ్జనులైనవారికి సుఖం ఎట్లు కలుగును? వేశ్యలు మొదలైన వివిధ వృత్తులవారికి జీవనమెట్లు నడచును? నీ భక్తులు స్వేచ్ఛగా నిన్నెట్లు సేవింపగలుగుదురు?

మ|| తరగల్ , పిప్పల పత్రముల్, మెఱుగుట్టద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్
సురవీథీ లిఖితాక్షము లసువుల్ జ్యోత్స్నాపయః పిండముల్
సిరు; లందేల మదాంధు లౌదురుజనుల్ శ్రీకాళహస్తీశ్వరా!    23
తా!! శంకరా! సంపదలు, నీటి కెరటాలవలె, రావియాకులవలె, మెఱుపు టద్దాలవలె, గాలిలోని దీపాలవలె, ఏనుగు చెవులవలె, ఏండమావులవలె, మిణుగురుపురుగుల మెరపులవలె, ఆకాశములోని అక్షరాలవలె, జీవులలోని ప్రాణములవలె, వెన్నెల ముద్దలవలె చాల చంచలములును, అశాశ్వతములును గదా! మనుష్యులు అటువంటి సంపదలతో మదించి సంచరింతురేమి?

శా|| నిన్ను నమ్మినరీతి నమ్మనొరులన్ నీకన్న నా కెన్న లే
రన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురండాపత్సహాయుండు, నా
యన్నా! యెన్నడు నన్ను సంసృతి విషాదాంభోధి దాటించి య
చ్ఛినానంద సుఖాబ్ధి దేల్చెదొ కదే! శ్రీకాళహస్తీశ్వరా!    24
ఈశ్వరా! నేను నిన్ను నమ్మినట్లు ఇతరులెవ్వరిని నమ్మను. నాకు నీకంటె అన్నలుగాని, తమ్ములుగాని, తల్లిదండ్రులుగాని, గురువులుగాని, కష్టాలలో అదుకొను ఆప్తులు గాని ఇంకెవ్వరును లేరు. నన్ను ఈ సంసార విషసముద్రమును దాటించి చిదానంద స్వరూపమైన సౌఖ్యసముద్రములో ఎప్పుడు తేలియాడించెదవో గదా! అంతయు నీ దయ.

శా|| నీ పంచంబడియుండగా గలిగినన్ భిక్షాన్నమే చాలు, ని
క్షేపం బబ్బిన రాజకీటముల నే సేవింపగా నోప, నా
శాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్థమై, బంటుగా
జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!    25
తా|| ఈశ్వరా! నీచూరు క్రింద నిలువబడగలిగినచో నా కాయదృష్టమే చాలు; భిక్షాన్నమైనను తిని బ్రతికెదను. పురుగులవంటి అధములైన ఈ రాజులను సేవింపలేను. నీవు నీ సెవకునిగా అంగీకరించునంత దయ గలిగినచో నన్ను ఇంక ఆశాపాశములతో బంధించి ఈ సంసార తాపత్రయములో బడవేయక, విముక్తుని చేయుము.

శా|| నీపేరున్, భవదంఘ్రి తీర్థము, భవన్నిష్య్ఠూత తాంబూలమున్
నీ పళ్ళెంబు ప్రసాదముం గొనికదా నే బిడ్డనైనాడ! న
న్నీపాటిం గరుణింపు మోపనిక నే నివ్వారికిన్ బిడ్డగాన్
జేపట్టందగు, బట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వరా!    26
తా||  నీ నామస్మరణము, నీపాద తీర్థము, నీవు నమలి విడిచిన తాంబూలము, నీకు నివేదన చేసిన ప్రసాదము వీనిని స్వీకరించి గదా నీ పుత్రుడనైనాను! నీకిట్లు కొడుకునైన తర్వాత మరెవ్వరికిని కొడుకుగా జనించలేను. నన్ను నీదరికి జేర్చుకొనుము. చేరుచుకొన్న తరువాత మరల విడిచి పెట్టగూడదు సుమా! (అనగా నీ సేవ చేయు నాకు పునర్జన్మము లేని మోక్షమును ప్రసాదింపుమని భావము).

శా||  అమ్మా  యయ్య యటంచు నెవ్వరిని నే నన్నన్ శివా! నిన్నునే
సుమ్మీ! నీమది దల్లిదండ్రుల నటంచుజూడగాబోకు, నా
కిమ్మై దల్లియుదండ్రియున్ గురుడు నీవే కాన సంసారపుం
జిమ్మం జీకటి కప్పకుండ గనుమా! శ్రీకాళహస్తీశ్వరా!    27
తా||  ఈశ్వరా! అమ్మాయని, నాన్నాయని నేనెవ్వరిని ఏ జన్మములో బిలిచినను ఆ పిలుపులన్నియు నిన్నేయని గ్రహింపుము. ఆ జన్మలనిచ్చిన తల్లిదండ్రులను కాదని గూడ గ్రహింపుము. ఇప్పుడు నే నీ జన్మమునెత్తినాను. నాకిప్పుడు గూడ నీవే తల్లివి, తండ్రివి, గురుడవు. కావున న న్నీ జననమరణరూప సంసారమనెడి చీకటిలో బడకుండ కాపాడుము. (కొడుకు చీకటిలో దారి తెలియక తల్లడిల్లు చుండగా తల్లిదండ్రులు చూచుచు ఊరకుండగలరా? వానిని వెలుగులోనికితేరా?  అట్లే నన్నును జ్ఞానప్రకాశములోనికి ద్రెచ్చి రక్షింపుము.)

మ||  కొడుకుల్ పుట్టరంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులు లేని యా శుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!    28
తా|| ఈశ్వరా! లోకములోని జనులెంత అవివేకులు! కొడుకు పుట్టాలేదనియు, తమకు ఉత్తంగతులు లేవనియు అజ్ఞానముచే ఏడ్చుచుందురు. కౌరవచక్రవర్తి యైన ధృతారష్ట్రునకు వందమంది కొడుకులు పుట్తిరిగదా! వారివల్ల అతడెంత ఉత్తమగతికి బోయినాడు? బ్రహ్మచారిగా నుండి అపుత్రకుడైన  శుకమహర్షికి ఏ దుర్గతులు గలిగినవి? ఇదంతయు భ్రాంతి తప్ప మరొకటి కాదు; అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసికొని పోవునా? వట్టిది. “జ్ఞానేనహి నృణాం మోక్షః”.

మ|| గ్రహదోషంబులు  దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహముం బేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగా నోపునే?
దహనుం గప్పగ జాలునే శలభ సంతానంబు? నీ సేవ జే
సి హతక్లేశులు గారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా!    29
తా||  ఈశ్వరా! విషమస్థానములో నుండి గ్రహములు కలిగించు బాధలుగాని, అపశకునములు గాని, నిత్యము నీ నామస్మరణము చేయు పుణ్యపురుషులనును కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానములో బడి నిన్ను సేవింపక దుఃఖములనుభవించుచున్నారుగాని, మిడుతలదండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నరేమి? ఇదెంత చిత్రమైన విషయము?

మ|| అడుగం బో నిక నన్యమార్గరతులన్ బ్రాణావనోత్సాహినై,
యడుగంబోయిన బోదు నీదు పద పద్మారాధకశ్రేణి యు
న్నెడకున్, నిన్ను భజింపగా గనియు నాకేలా పరాపేక్ష? కో
రెడి దింకేమి? భవత్ర్పసాదమ తగున్ శ్రీకాళహస్తీశ్వరా!    30
తా|| ఈశ్వరా! నా జీవయాత్రసాగుటకై శైవులుకాక యితర మార్గానుసారులను యాహించను. ఒకవేళ యాచించినను, నీ చరణదాసులైన భక్తులనే యాచింతును. అయినను, నిన్ను సేవించు పద్ధతులు తెలిసికొన్న నాకు ఇతరులను యాచించు అవసరమేమి యున్నది? నీయనుగ్రహము గలిగినచో ఈ అల్పములైన ప్రాపంచిక సుఖములెందుకు కోరుదును? అసలు కోరుటకు వీనిలో సారమేమున్నది?

మ|| మదమాతంగము లందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్
ముదితల్ చిత్రకూలముల్ పరిమళంబుల్ మోక్షమీ జాలునే!
మదిలో వీని నపేక్షచేసి నృపథామ ద్వారదేశంబు గా
చి దినంబుల్ వృథపుత్తు రజ్ఞు లకటా! శ్రీకాళహస్తీశ్వరా!    31
తా|| ఏనుగులు, గుఱ్ఱాలు, మేనాలు, పల్లకులు, రత్నములు, పట్టుబట్టలు, సుగంధద్రవ్యములు ఇవియన్నియు మనకు మోక్షము నిచ్చునా?  అజ్ఞానులైన మనుష్యులు ఈ పైవానినన్నింటిని వాంఛించుచు రాజద్వారముల వద్ద పడిగాపులు పడి దినములు వ్యర్థముగా గడుపుచున్నారు. నీ యారాధనచేసి శాశ్వత మోక్షానందమును బొందవచ్చునని గ్రహింపలేకున్నారు.

శా|| రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్,
బాసీ పయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి, వాంఛాలతల్
కోసీ కోయదు నామనం బకట! నీకుం బ్రీతిగా సత్క్రియల్
చేసీ చేయదు,  దీని త్రు ళ్ళడపవే శ్రీకాళహసీశ్వరా!     32
తా||  ఈశ్వరా! నా మనసు చంచలము. ఇది స్త్రీ సౌఖ్యములను పూర్తిగా విడనాడదు; పుత్రులు, మిత్రులు, సంపదులు వీనిమీద భ్రమను పూర్తిగా విడువదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ప్రీతిగా సత్కార్యములు చేయుటకు గూడ ఇచ్చగించదు. అట్లని సంపూర్ణముగా నిన్ను మరచి ఆ విషయములందే కూరుకుపోదు. ఈ చంచలమైన మనసునకు స్థిరత్వమును ప్రసాదింపుము.

శా|| ఎన్నేళ్ళుండుదు? నేమిగందు? నిక నే నెవారి రక్షించెదన్?
నిన్నే నిష్ఠభజించెదన్ నిరుప మొన్నిద్రా ప్రమొదంబు  నా
కెన్నం డబ్బెదు? నెంతకాల మిక నేనిట్లున్న నేమయ్యెడిన్?
జిన్నం బుచ్చక నన్ను నేలుకొనవే! శ్రీకాళహస్తీశ్వరా!    33
తా||  ఈశ్వరా!  ఎన్నాళ్ళు బ్రతుకుదును? చూడవలసిన వన్నియు చూచినాను. ఇంకేమి చూడవలెను? ఇంతకాలము భార్యపుత్రులను బోషించినాను; ఇంకెంత కాలము పోషింపగలను? నిన్నే నమ్మి సేవించెడి నాకు తురీయావస్థలోని (జాగ్రద వస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునుకి మూడు అవస్థలుండును. ఆ మూడింటిని మించి నాలుగవ అవస్థ కూడ ఉండును. దానిని తురీయమందురు. ఆ తురీయావస్థకు (అనగా ధ్యానసమాథికి) చేరుకొన్న యోగసిద్ధులు ఆత్మసాక్షాత్కారము నొంది యానందింతురు.) ఆ యానందము నాకెప్పుడు కల్గును? ఎంతకాల మీ నిరీక్షణలో గడిపినను ప్రయోజనమేమి యున్నది? నన్ను నిరాశపఱచక దయచూపి రక్షింపుము.

శా|| చావం గాలము చేరువౌ టెఱిగియున్ జాలింప గాలేక త
న్నే వైద్యుండు చికిత్స బ్రోవగల డో? ఏ మందు రక్షించునొ?
ఏ వేల్పుల్ కృప జూతురో యనుచు నిన్నింతైన జింతింపడా
జీవచ్ఛ్రాద్ధము చేసికొన్న యతియున్ శ్రీకాళహసీశ్వరా!    34
తా|| తన శ్రాద్ధము తాను చేసికొన్న సన్యాసికూడ, తనకు రోజులు దగ్గర పడుచున్నవనియు, మరణము తప్పదనియు తెలిసికూడా బ్రతుకుమీద ఆశచంపుకొనలేక, వచ్చిన రోగమును ఏ వైద్యుడు తగ్గించునో, ఏ మందుపనిచేయునో, ఏ దేవతలు రక్షింతురోయని యాలోచించుచు, ఉన్న కొద్ది సమయమును వ్యర్థము చెయునే కాని నిన్ను ఒక్కక్షణమైనను ధ్యానినంపడు.

మ||దినముం జిత్తములో సువర్ణముఖరీ తీరప్రదే శామ్రకా
నన  మధ్యోపరివేదికాగ్రమున, నానందంబునం బంకజా
సన నిష్ఠ నిన్ను జూడ గన్న నద్వో సౌఖ్యంబు లక్ష్మీ విలా
సిని మాయానటనల్ సుఖంబు లగునే? శ్రీకాళహసీశ్వరా!    35
తా|| శంకరా! సువర్ణముఖీ నదీతీరము నందలి మామిడితోటలోని ఱాతియరుగు మీద పద్మాసనము వేసికొని కూర్చున్న నిన్ను ప్రతిదినము మనసులో చూడగలిగినచో అదే ఆనందము; అదే సౌఖ్యముగాని చంచలస్వభావము గల లక్ష్మీదేవి చూపు నటనలు (ఒకసారి అనుగ్రహించుట, ఒకసారి తిరస్కరించుట అను భిన్న భావములు) సౌఖ్యమునిచ్చునా?

శా|| ఆలంచున్ మెడగట్టి, దానికి నపత్యశ్రేణి గలిపంచి, త
ద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధము గావించి, యా
మాలాకోటిని బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పగా
సీలన్ సీల నమర్చి న ట్లోసగితో శ్రీకాళహాసీశ్వరా!    36
తా|||  ఒక స్త్రీని భార్యయని మెడకుదగిలించి, దానియందు సంతానము గలిగించి, ఆ తర్వాత వారికి పెండ్లిపేరంటములనుచు ఇచ్చిపుచ్చుకొను బంధవ్యములు సమకూర్చి, మాలికలో కొలికిపూస చుట్టును మిగిలిన పూసలు తిరుగునట్లును, యంత్రములో సీలతో సీలను గలిపి త్రిప్పినట్లును ఈ సంసారమును ఏర్పరచితివిగదా!

మ|| తనువే నిత్యముగా నొనర్పు; మదిలేదా1 చచ్చి జన్మింపకుం
డ నుపాయంబు ఘటంపు, మా గతులు రెంట న్నేర్పులేకున్న లే
దని నాకిప్పుడ చెప్పు; చేయగల కార్యం బున్న సంసేవ జే
సి నునుం గాంచెదగాక కాలముననో శ్రీకాళహసీశ్వరా!    37
తా|| ఈశ్వరా! ఈ శరీరమును శాశ్వతముగా నుండునట్లు చేయుము. లేదా చచ్చిన తరువాత మరల జన్మింపని యేర్పాటు చేయుము; ఈ రెండు పనులును నీకు చేతకానిచో ఇప్పుడే నా కా సంగతి చెప్పుము. బ్రతికి యున్నపుడే సకాలములో నేను చేయవలసిన పన్నులన్నింటిని చక్కబెట్టుకొని, మరణానంతరము నిన్ను జూచుటకు వచ్చెదను.

మ|| పదునా ల్గేలె మహాయుంగంబు లొక భూపాలుండు; చెల్లించె న
య్యుదయాస్తాచల సంధి నాజ్ఞ నొక డాయుష్మంతు డై వీరి య
భ్యుదయం బెవ్వరు చెప్పగా వినరో యల్పుల్ మత్తులై యేల చ
చ్చేదరో రాజుల మంచు నక్కట కటా! శ్రీకాళహస్తీశ్వరా!    38
తా|| శంకరా! ఒక రాజు పదునాలుగు మహాయుగములుపాలించెను. (మహాయుగమనగా కృతత్రేతాద్వాపర కలియుగములు నాలుగును గలిసినది.) మరియొక రాజు ఉదయగిరి నుండి అసగిరివరకు నున్న భూమిని నిరాఘాటముగా పాలించెను. ఇటువంటి మహారాజుల చరిత్రలను ఈ అల్పులైన రాజులు విని యుండలేదా? తామును రాజూమేయని యేల గర్వపడుచుందురో!

శా|| రాజన్నంతనే పోవునా? కృపయు, ధర్మం బాభిజాత్యంబు,ని
ద్యాజాతక్షమ, సత్యభాషణము, విద్వన్మిత్ర సమ్రక్షయున్,
సౌజన్యంబు, కృతంబెఱుంగుటయు, విశ్వాసంబు, గాకున్న దు
ర్బీజ శ్రేష్ఠులుగా గతంబు గలదే? శ్రీకాళహస్తీశ్వరా!    39
తా||  ఈశ్వరా! రాజు అవగానే దయాధర్మములు, అభిమానము, విద్యావివేకములు, దానివల్ల గలుగు ఓర్పు, సత్యవాక్పరిపాలనము, పండితులను, స్నేహితులను పోషించుటయు మంచితనమును, కృతజ్ఞతయు, విశ్వాసము అన్నియును నశించిపోవునా? ఏమో! లేకపోయినచో రాజులిట్లు పరమనీచులుగా నుండుటకు కారణమేమి?

మ|| మును నీచే సపవర్గ రాజ్య పదవీ ముర్ధాభిషేకబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో! చింతించి చూడంగ నె
ట్లనినన్ గీట ఫణీంద్రపోత మదవేదం డోగ్ర హింసా విచా
రిని గాగా, నిను గాన గాక మదిలో శ్రీకాళహాస్తీశ్వరా!    40
తా|| శంకరా! ఇదివర్లో నీవల్ల మోక్షమునొందినపుణ్యాత్ములును నేనును సమానులమే.  ఎట్లందువా? సేవా విషయములో సాలెపురుగు, పాము, ఏనుగు, కిరాతకుడైన తిన్నడును, నేనును సమానులమే కదా! వారు నిన్ను ఆత్మలో దర్శించినవారు, నేను దర్శింపలేదు; అంతే, చిన్న భేదముగదా! వారికిచ్చినట్లు నాకు గూడ మోక్షమీయరాదా!

మ|| పవమానాశన భూషణ ప్రకరముల్,భద్రేభ చర్మంబు, నా
టవికత్వమ్ము బ్రియంబులై భుజగ శుండా లాటవీ చారులన్
భవదుఃఖంబుల బాపుటొప్పు జెలది బాటించి కైవల్య మి
చ్చి వినోదించుట కేమి కారణమయా? శ్రీకాళాహస్తీశ్వరా!    41
తా|| శంకరా! నీకు పాముల నగలన్నను, ఏనుగుతోలన్నను, కిరాత వేషమన్నను, చాలా అభిమానమనియు, అందుకే పామునకును, ఏనుగునకును, కిరాతకునకును, మొక్షమిచ్చినావనియు తెలిసికొన్నాము. కాని పనికిమాలిన సాలెపురుగునకు కూద పెద్దపీటవేసి మొక్షమెందుకిచ్చినావో తెలియుటలేదు.

మ|| అమరస్త్రీల రమించినన్ జెడదు మోహంబింతయున్ బ్రహ్మ ప
ట్టము సిద్ధించిన నాస తీరదు, నిరూఢ క్రోధమున్ సర్వలో
కములన్ మ్రింగిన మాన, దిందుగల సౌఖ్యంబొల్ల, నీ సేవ చే
సి మహాపాతక వారిరాశి గడతున్ శ్రీకాళహస్తీశ్వరా!    42
తా|| శంకరా! నా మోహము దేవతాస్త్రీలను రమించినను చావదు. నా యాశ బ్రహ్మపదవి వచ్చినను తీరదు; నా జీవలక్షణమైన క్రోధము సర్వలోకములను మ్రింగినను శమించదు. ఇంక ఈ ళొకమందలి సౌఖ్యములు నే నాశింపను. నీ సేవచేసి పాపసాగరములను దాటి నీకడకు వచ్చెదను.

మ|| చనువారిం గని యేడ్చువారు జముడా! సత్యంబుగా వత్తు మే
మనుమానం బిక లేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్
మునుగం బోవుచు బాసచేయుట సుమీ ముమ్మాటికింజూడగా
జెనటు ల్గానరు దీని భావ మిదివో శ్రీకాళహస్తీశ్వరా!    43
తా: శంకరా! చనిపోయిన వారిని గూర్చి పదవనాడు రేవులో మునుగుచు బంధువులు ఏడ్చుచుండుట, యముడా! మేము మాత్రము శాశ్వతముగానుందుమా? ఏదో ఒకనాడు నిజముగా వచ్చెదమని ప్రమాణములు చేయుటకే. ఈ భావము ఆ యేడ్పులోనే యిమిడియున్నది. వివేకహీనులు మాత్రము ఈ భావమును గ్రహింపలేరు.

మ||భవధుఃఖంబులు రాజకీటములనే బ్రార్థించినన్ బాయునే?
భవదంఘ్రిస్తుతిచేత గాక, విలసద్బాల క్షుధాక్లేశ దు
ష్టవిదుల్ మానునె? చూడ మేక మేడ చంటన్ దల్లి కారుణ్య దృ
ష్టివిశేషంబున నిచ్చు చంట బలెనో శ్రీకాళహస్తీశ్వరా!    44
తా: శంకరా! సంసార దుఃఖములు నీ పాద సేవ చేసినచో తొలగును గాని అథములైన రాజులను సేవించి ప్రార్థించినచో తొలగునా? పసిబ్డ్డయాకలి, తల్లి ప్రేమతో యిచ్చు, చనుబాలతో తీరునుగాని మేక మెడక్రింది చన్ను గుడిచినచో తీరునా?

మ|| పవి పుష్పం బగు, నగ్ని మం చగు, నకూపారంబు భూమీస్థలం
బవు, శత్రుం డతి మిత్రుడౌ, విషము దివ్యాహారామౌ నెన్నగా
నవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాష ణోల్లాసికిన్
శివ! నీ నామము సర్వవశ్య కరమౌ! శ్రీకాళహస్తీశ్వరా!    45
తా: శంకరా! లోకములో శివనామోచ్చారణము చేయు పుణ్యాత్మునికి, వజ్రము పువ్వగును; అగ్ని మంచు అగును; సముద్రము నేల యగును; శత్రువు మిత్రుడగును; విషము అమృతాన్న మగును. పరమశివా! నీ నామము లోకములోని యందరును వశము చేసికొను ఉత్తమసాధన మగును.

శా|| లేవో కానల గందమూల ఫలముల్, లేవో గుహల్, తోయముల్
లేవో యేఱుల, బల్లవాస్త్రణము ల్లేవో; సదా యాత్మలో
లేవో నీవు వరక్తులన్ మనుప, జాలింబొంది భూపాలురన్
సేవల్ చేయగ బోదు రేలకొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!    46
తా: శంకరా! నిజముగా వైరాగ్యమే కలిగినచో అట్టివారు నివసించుటకు గుహలులేవా? తినుటకు కందమూల ఫలములులేవా? త్రాగుటకు లెలయేటి హృదయములో నీవు లేవా? ఎందుకీ ప్రజలు రాజులకు సేవించి వారిచ్చు ధనములతో జీవించవలెనని తాపత్రయము నొందుదురో కదా!

మ|| మునునే బుట్టిన పుట్టులెన్ని గలవో! మోహంబుచే నందు జే
సిన కర్మంబులప్రోవు లెన్నిగలవో, చింతించినం గాన, నీ
జననంబే యని యున్నవాడ, నిదియే చాలింపవే, నిన్ను గొ
ల్చిన పుణ్యంబునకుం గృపా రతు డవై శ్రీకాళహస్తీశ్వరా!    47
తా: శంకరా! ఇదివరలో నేనెత్తిన జన్మములన్నియో, వానిలో మాయామోహితుడనై నేను చేసిన కర్మములెన్నియో యెంత యాలోచించినను తెలిసికొన లేకున్నాను. ఈ జన్మమే పరమార్థమని భ్రాంతిలో నున్నాను. నిన్నింత వరకును సేవించిన పుణ్యవిశేముచే సంతృప్తినొంది ఈ జన్మముతో మోక్షమును ప్రసాదించి నన్ను అనుగ్రహింపవా?

మ|| తనువెందాక ధరిత్రినుండు నను నందాకన్ మహోరోగ దీ
పన దుఃఖాదులు బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి, యా
వెనుకన్ నీ పదపద్మముల్ తలచుచున్ విశ్వప్రపంచంబు బా
సిన చిత్తంబున నుండజేయు గదవే, శ్రీకాళహస్తీశ్వరా!    48
తా: ఈశ్వరా! ఈ తనువెంత వరకు భూమిమీదనుండునో అంతవరకును రోగాడి బాధలు లేకుండ రక్షించి, ఆపైన వైరాగ్యముతో ఈ ప్రపంచమునే తృణప్రాయముగా భావించు స్థితిలో నుండునట్లు చేసి నన్ను ఉద్ధరింపుము.

మ|| మలభూహిష్ఠ మనోజ ధామము సుషుమ్నా ద్వారమో! యారుకుం
డలియో! పాద కరాక్షియుగ్మములు షట్కంజంబులో! మోము తా
జలజంబో! నిటలంబు చంద్రకళయో! సంగంబు యోగంబో? గా
సిలి సేవింతురు కాంతలన్ భువిజనుల్, శ్రీకాళహస్తీశ్వరా!    49
తా: శంకరా! ప్రజలు స్త్రీ సాంగత్యము కొరికంత ప్రయాస పడుదురేల? మలభూయిష్టమైన మర్మాంగము మూలాధారచక్రమా? నూగారు కుండలియా? పద్మములతో పోల్చబడు కాళ్ళు, చేతులు, కన్నులు షట్చక్రములా? మొగము సహాస్రారపద్మమా? నుదురు చంద్రకళయా, అమృతము స్రవించుటకు సంయోగమే యోగసిద్ధియా? ఎందుకీ వెఱ్ఱితనము?

మ|| జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యము
ల్కల శబ్దధ్వను లంచి తాంబర మలంకారంబు దీప్తుల్ మెఱుం
గులు నైవేద్యము మాధురీమహిమగా గోల్తున్నినున్ భక్తి రం
జిల దివ్యార్చన కూర్చినేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!    50
తా: శంకరా! కావ్యమండలి రసములే స్నానముగాను, పద్యములే పూలుగాను, శబ్దములవల్ల దోచెడు అర్ధధ్వనులే భేరీవాద్యములుగాను, అలంకారములు వస్త్రములుగాను, కవితాసౌందర్యములే దీపములుగాను, మాధుర్యగుణమే నైవేద్యముగాను సమకూర్చి, నా చేటనైనట్లు భక్తితో నిన్ని కవితార్చానము చేసి సేవించెదను.

శా|| ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ర్పేక్షా ధ్వనివ్యంగ్య శ
బ్దాలంకార విశెషభాషల కలభ్యంబైన నీ రూపమున్
జాలుంజాలు గవిత్యముల్ నిలుచునే సత్యంబు వర్ణించుచో
చీ! లజ్జింపరుగాక మాదృశ కవుల్, శ్రీకాళహస్తీశ్వరా!    51
తా|| ఉపమ, ఉత్ర్పేక్ష మొదలైన అర్థాలంకారాలతోను, ధ్వని వ్యంగ్య, శబ్దాలంకారములతో గూడిన మనోహరమైన శైలిగల కావ్యభాషకు అందని నీ రూపమెట్లు స్తుతింపగలము? నావంటి కవులు సిగ్గులేక యిట్లు పద్యాలలో స్తుతించుటకు సిద్ధపడుచున్నారు గాని, సత్యస్వరూపమైన పరబ్రహ్మమును వర్ణించుటకు ఈ సామన్య లౌకిక కవిత్వములకు శక్తియున్నదా?

శా|| పాలుం బువ్వయు బెట్టెదం గుడువరా పాపన్న! రా యన్న, లే
లే లెమ్మన్న, నరంటిపడుకొని తే , లేకున్ననే నొల్ల నం
తే లాలింపరె తల్లిదండ్రు లపు డట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలావచనంబులం ఘుదుపరా? శ్రీకాళహస్తీశ్వరా!    52
తా|| శంకరా! ఓ చిన్నిపాపడా!పాలును అన్నమును బెట్టెదము తినరా బాబూ! యనగా వాడు, నాకు అరటిపండు తెచ్చి పెట్టినచో తిందుననును. అపుడు తల్లిదండ్రులు ఆ అరటిపండు గూడ తెచ్చి ఆ పాపనికి ఆదరవచనములతో ఆప్యాయతతో తినిపింపరా? అనగా, నీవు నాకు తండ్రివి. నేను అజ్ఞానినైన పసిబాలుడను. నీవు నాకిచ్చిన ఇహలోకభోగములకు తృపితిపడక, పరమున మోక్షము నిమ్మని పేచీ పెట్టుచున్నానుగదా! తండ్రివి నీవు వాత్సల్యముతో నా ముద్దు చెల్లించి మొక్షపదమును నాకిచ్చివేయరాదా యని భావము.

మ|| కలలంచున్ శకుమబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బు లటంచున్ దెవులం చరిష్టమనుచున్ భూతంబులంచు న్విషా
దు లటంచున్ నిమిషార్థ జీవనములందున్ బ్రీతిపుట్టించి యీ
సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా? శ్రీకాళహస్తీశ్వరా!    53
తా|| శంకరా! ఈ ప్రాణులవి అసలే అర్థనిమేషముండు బ్రతుకులు. వానిలో కలనియు, శకునాలనుచు, దుష్టగ్రహకూటములనియు, అరచేతిలో జోస్యము లనియు, రోగాలనుచు, కీడులనుచు భూతప్రేతాలనుచు ఎన్ని కష్టాలు కలిగించినావయ్యా!
అల్పజీవనములు మావి. అందులో ఇన్ని కష్టములెందుకు చొప్పించితివి? మాకు కుఖపడు యోగ మీ బ్రతుకులో లేదుగనుక మోక్షమిచ్చిదానిలోనైన మాకు సౌఖ్యమిమ్మని భావము.

మ|| తలమీదం గుసుమ ప్రసాద, మలిక స్థానంబుపై భూతియున్
గళసీమంబున దండ, నాసిక తుదన్ గంధప్రసారంబు లో
పల నైవేద్యము జేర్చు నేమనుజు, డా భక్తుండు నీ కెప్పుడున్
జెలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!    54
తా|| శంకరా! ఏ మనుష్యుడు తన శిరస్సుమీద నీ నిర్మాల్యమైన పూలను, నుదిటిమీద విభూతిని, మెడలో రుద్రాక్ష మాలికయు, ముక్కుచివర నీ యభిషేక జలము సుగంధమును, కడుపులో నీకు నివేదించిన అన్నమును బెట్టుకొని యుండునో, అతడు నీకు ప్రాణస్నేహితుడై వెండికొండపై ఎల్లప్పుడును నీతో విహరించుచుండును గదా! ఇవన్నియు ధరించుచున్న నాకుగూడ ఆ భాగ్యమును ప్రసాదింపుమని తాత్పర్యము.

శా|| ఆలుం బిడ్దలు మిత్రులుణ్ హితులు నిష్టార్థంబు లీ నేర్తు రే
వేళన్ వారి భజింప, జాలి బడ కావిర్భూత మోదంబునన్
గాలం బెల్ల సుఖంబు నీకు, ని క భక్త్రశ్రేణి రక్షింప కీ
శ్రీలెవ్వారికి గూడ బెట్టెదవయా? శ్రీకాళహస్తీశ్వరా!    55
తా|| ఈశ్వరా! నీవు సర్వజ్ఞుడవు కావున ఎవరికెప్పుడెట్టి మర్యాదలియ్యవలెనో గ్రహించి, వారికట్లు ఇచ్చెదవు. అట్లు చేయుటచే నీ భాయయైన ఆది పరాంబికయు, నీ కొడుకులైన గణపతికుమారస్వాములను, నీ మిత్రులైన కుబేరాదులును, నీ యాప్తులైన కేశవాదులును నీకన్ని సౌకర్యములును ఐశ్వర్యములును సమకూర్చు చుందురు. వానినన్నిటిని నీవు సుఖముగా ననుభవించు కూర్చుందువు. మరి నీ భక్తులమాట యేమి? వారు నీవేదో యొరగబెట్టుదువని యెదురు చూచుచుండురు. ఆట్లు వారికిగూడ నియ్యక నీ సంపదలను (మాహాత్య్మములను) ఎవ్వరికోసమని దాచబెట్టదలచినావో చెప్పుము.

మ|| సులభుల్ మూర్ఖులు నుత్తమోత్తములు రాజుల్ కల్గి యేవేళ న
న్నలతం బెట్టిన నీ పదాబ్జముల బాయంజాల, నేమిచ్చినం
గలధౌతాచల మేలు, టుంబునిథిలో గాపుండు, తబ్జంబుపై
జెలువొప్పన్ సుఖియింప గాంచుట సుమీ శ్రీకాళహస్తీశ్వరా!    56
తా!! శంకరా! రాజులలో భిన్నస్వభావములు గలవారుందురు. కొందరు మంచి మనసుతో ఆదరించువారు, కొందరు మూర్ఖులు, కొందరు చాలా ఉత్తములు. వారి యాశ్రయము నాకు లభించినపుడు ఏకారణము చేతనైన వారు నన్ను చిన్నచూపు చూచినచో వచ్చి నీ పాదములాశ్రయించెదను. అప్పుడు నీవు దయతో నాకేమిచ్చినను దానిని ఈశ్వరపదిగాను, విష్ణుపదవిగాను, బ్రహ్మపదవిగాను భావించి సంతుష్టిని బొందెదను.

మ|| కలధౌతాత్రియు, నస్థిమాలికయు, గోగంధర్వముల్ బున్కయున్
బులి తోలున్ భాసితంబు బాపతోడవుల్ పోకుండ దొబుట్లకై
తోలి నేవారాల తోడబుట్టవు కళాదుల్ గల్గె మేలయ్యే నా
సిలువున్ దూరముచేసి కొం టెఱిగియే శ్రీకాళహస్తీశ్వరా!        57
తా|| ఈశ్వరా! ఆదియందు నీవు తోబుట్టువు లేవ్వరును లేకుండ ఒంటరిగానే పుట్టినావు. (ఏకామేవాద్వితీయం బ్రహ్మ) అన్నదమ్ములతో దాయభాగాముల కోసము పోరాటములేదు. చాల ప్రశాంతజీవనము నీది. అందుకే వెండికొండయు, ఎముకల దండయు, ఎద్దును, చేతిలోని లేదియు, పుర్రేయు, పులితోలును, భస్మమును, సర్పాభరణములును, తలపై చంద్రకళయు వచ్చి నిన్నాశ్రయించినవి. అనగా నీ సంపదలలో వాటాలు పెట్టనక్కరలేకుండ నీవి నీకేయున్నవి. కావు నిన్నాశ్రయించిన వారిని పోషించుటకు లోటుండదు. ఇన్నింటిని పోషించినవాడవు, నీ పాదముల నాశ్రయించిన నన్ను కూడపోషించలేవా? అంతమాత్రమున నీకు లోటు గాలుగునా? యని తాత్పర్యము.

మ|| శ్రుతులభ్యాసము చేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్
మతినూహించి, శరీరమస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు కాం
చితిమంచున్ సభలన్ వృథావచనముల్ చెప్పంగనే కాని ని
ర్జితచిత్త స్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!    58
తా|| ఈశ్వరా! లోకములోనివారు, మేము వేదాలు చదివినాము, శాస్త్రాలుశోధించినాము, వేదాంత  రహస్యములన్నియు పరిశీలించినాము. చివరికి బ్రహ్మమే సత్యము – శరీరము అనిత్యము అని గ్రహించినాము అని సభలలో చెప్పుచుందురు. పరిత్యజించుటవలన సన్యాసియై, యోగియై పొందు శాశ్వత సౌఖ్యములను గూర్చి యాలోచించుటలేదు. మాటలు చెప్పుటయే కాని ఎవ్వరును క్రియలో చూపలేకున్నారని భావము.

మ|| గతి నీవంచు భజించు వార లపవర్గంబొందగా, నేల సం
తతముం గూటికినై చరింప? వినలేదా? యాయురన్నం ప్రయ
ఛ్ఛతి యంచున్ మొఱవెట్టగా శ్రుతులు? సంసారాంధ కారాభిదూ
షిత దుర్మార్గులుగాన గానబడవో శ్రీకాళహస్తీశ్వరా!    59
తా|| ఈశ్వరా! నీవే గతి యనుచు నిన్ను సేవించువారు మోక్షమునొందుచుండగా అజ్ఞానులైన కొందరు కూటికోసమని పాట్లుపడు చుందురేమి? “ఆయుర్దాయమే అన్నము పెట్టు” నను వేదవాక్యమును వారు వినలేదా? ఒకవేళ విన్నను పెద్దలు మెచ్చని సంసారమను చీకటిలోబడి చెడి పోవుటచేత ఆ వాక్యముల పరమార్థము బోధపదలేదా?

మ|| రతిరా జుద్ధతి మీఱ నొక్కమణి గోరాజాశ్యు ని న్నొత్తబో
నత డా దర్పకు వేగనొత్త గవయం బాబోతునం దాకి యు
గ్రత బోరాడగ నున్న యన్నడిమి లేగ ల్వోలె శో కానల
స్థితి పాలై మొఱ వెట్టినన్ మనుపవే? శ్రీకాళహస్తీశ్వరా!    60
తా|| ఈశ్వరా! మన్మథుడొకసారి నీమీద దాడి చేయుటకు సిద్ధపడగా నీవును వాని నెదురుకొంటివి. మీ రిద్దరును గయవృషభములవలె పోరాటమునకు సిద్ధపడుచుండగా దేవతలు తెలుగు తాము లేగలవలె నలిగి పోవుదుమని భయపడి నిన్ను ప్రార్థింపగా వారిని రక్షించినావు గదా!

శా|| అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
అంతా నాంత శరీర శోషణమె దుర్వ్యాపారమే డేహికిన్
చింత న్నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా!    61
తా|| ఈశ్వరా! ఈ ప్రపంచములో పుట్టిన మానవునికి అంతా సందేహమే. శరీరము ఎంతకాలముండునో సంశయమే! మనసులో దారపుత్రాది బంధనముల నేర్పరచుకొన్నందువలన అంతా దుఃఖమే!  శరీరమునమే రోగమెప్పుడు వచ్చునోయను భయమే. ఏ పని చేసినను అంతా శరీరమునకే కృశింపజేయునదియే! మనుజుడు చేయుచున్న పనులన్నియు దుర్వ్యాపారములే! (అనగా భగవంతుని చేరుటకై చేయు పనులు సద్య్వాపారములు. అట్లుకాక బ్రతుకు దెరువునకై యితరులను బాధించు పనులన్నియు దుర్య్వాపారములే.) అంతేకాక ఇవి యన్నియును కర్మబంధములు గలిగించి పునర్జన్మములు గలిగించును గనుక కూడ దుర్య్వాపారములే. వీనినన్నిటిని విడిచి నరులు నిన్నుచేరు ఉపాయము నాలోచింపరేమి?

శా|| సంతోషించితి జాలు జాలు రతిరాజ ద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందితి జాలు జాలు బహురాజ ద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందెద జూపు బ్రహ్మపద రాజ ద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!    62
తా||ఈశ్వరా! ఇంతకాలమును స్త్రీలతో రతిసౌఖ్యములనుభవించినాను. వానిపై విరక్తి గల్గినది. అవి ఇంక చాలు. రాజులమందిరాలలో వారిచ్చు గౌరవమర్యాదలు పొంది సంతోషించినాను. వానిమీద గూడ విసుగు పుట్టినది. అవికూడ ఇంక చాలు. ఈ పైన నీవు మోక్షపదమునకు దారిచూపుము. నీదయవలన మోక్షమునొంది ఈ ఆధ్యాత్మిక అధిభౌతిక, అధిదైవికములనెడు తాపత్రయముల నుండి విముక్తుడైన ప్రశాంత స్థితిలో నుండి పోయెదను.

శా|| స్తోత్రం బన్యుల జేయనోల్లని ల్వోలె వేసంబుతో
బుత్రీ పుత్ర కళత్ర రక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్
బాత్రం బంచు భజింప బోదు రిదియున్ భావ్యంబె యవ్వారి చా
రిత్రం బంతయు మెచ్చనెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా!    63
తా|| ఈశ్వారా! కొందరు, ఎప్పుడును ఎవ్వరిని పొగడనివారివలె మాటాడుచు, భార్యాపుత్రాదులను బోషించుకొనుటకై ఆడంబరముగా వేషము వేసికొని అథములైన రాజులను యోగ్యులనుచు స్తుతించుటకు సిద్ధపడుదురు. అటువంటివారిని నేను మెచ్చాను.

మ|| అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటారావమున్ బిందు దీ
ప కళాశ్రేణి వివేక సాధనము లొప్పం బూని యానంద తా
రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా
రికిగా వీడు భవోగ్ర బంధ లతికల్ శ్రీకాళహస్తీశ్వరా!    64
తా|| ఈశ్వరా! నాదబిందు కళారూపిణియై, శ్రీచక్రాంతర వర్తినియైన భువనేశ్వరీ దేవియందు మనస్సును సుస్థిరముగా నిలిపి, ఆ దుర్గాదేవి మనసు యొక్క వేగచాలన గర్వమును బోగొట్టినట్టి యోగులకు (శ్రీవిద్యోపాసకులకు) సంసారబంధములు తొలగిపోవునుగదా!

మ|| ఒకయర్థంబును నిన్ను నే నడుగగా నూహింప, నెట్లైన బొ
మ్ము, కవిత్వంబు నాకుజెందవని యేమోయంటివా? నాదు జి
హ్వకు నైసర్గిక కృత్యమంతియ సుమీ! ప్రార్థించుటే కాదు కో
రికలన్ నిన్నునుగాన నాకు వశమా? శ్రీకాళహస్తీశ్వరా!    65
తా|| ఈశ్వరా! ఏదియైమైన గానిమ్ము, నిన్నోక్క కోరిక కూడ కోరవలేనని లేదు. మరి, ఈ కవిత్వము లేమియు నాకు జెందవని యందువా? ఇది నా నాలుకకు స్వభావము. ఇది కవిత్వము చెప్పకుండ ఉండలేదు. ఇదంతయు నా కోరికలను దెలుపుట కనుగొంటివా? కాదు కాదు; కోరికలున్నచో నిన్ను జూడ గలుగుట నాకు శక్యమగునా? అందుచేత ఈ పద్యములన్నియు కేవలము స్తోత్రములుగా భావింపుము.

మ|| శుకముల్ కింశుక పుష్పముల్ గని ఫలస్తోమంబటంచున్ సము
త్సుకతన్ జేరగ బోవ నచ్చట మహాదుఃఖంబుసిద్ధించు గ
ర్మకళాభాషకెల్ల బ్రాపులగు శాస్త్రంబుల్ విలోకించు వా
రికి నిత్యత్వమనిష దూరమగునో శ్రీకాళహస్తీశ్వరా!    66
తా|| ఈశ్వరా! శుకములు మోదుగ పూలు జూచి పండ్లని భ్రాంతిపడి వెళ్లగా వానికి నిరాశయే మిగులును. అట్లే శాస్త్రములు ప్రశీలించి దైవతత్వమును గ్రహింపవలెనన్నచో  వారికి దెలియునవి కర్మకాండలును, కవిత్వాది కళా విషయములును. అంతేకాని వారికి శాశ్వతుడవైన నీ స్వరూపమెట్లు బోధపడును?

మ|| ఒకరిం జంపి పదస్థులై బ్రదుక దా మొక్కొక్క రూహింతురే
లొకొ? తామెన్నడు జావరో? తమకు బోవో సంపదల్? పుత్రమి
త్రకళత్రాదులతోడ నిత్యసుఖమందం గందురో? యున్న వా
రికి లేదో మృతి యెన్నడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!    67
తా|| ఈశ్వరా! కొందఱు ఒకరిని జంపి పదవిలోనికి వచ్చి బ్రతుకవలయు ననుకొందరు. తామెన్నుడును చావకుండనుందురా? తమకు సంపదలు పోకుండ శాశ్వతముగా నిలుచునా? రవిచంద్రాదులున్నంతకాలము తాము పుత్రులతో మిత్రులతో భార్యలతో శాశ్వతముగా సుఖములనుభవించుచు భూమిపైనుండి పోవుదురా? అట్లు సంపదలు గలిగియున్నచో వారికి చావుండాదా? ఇవన్నియు ఆలోచింపరేమి?

శా|| నీకారుణ్యము గల్గినట్టినరుడే నిచాలయమ్ముం జోరం
డే కార్పణపు మాటలాడనరుగం డెవ్వారితో వేషముల్
గైకో డేమతముల్ భజింప డిల నే కష్టప్రకారంబులన్
జీకాకై చెడిపోడు జీవనదశన్ శ్రీకాళహస్తీశ్వరా!    68
తా|| నీ దయను సంపాదించిన మానవుడు ఏ రాజాస్థానములకును పోడు. ఎవరితోను ఏ దుష్ట సంభాషణమును జేయుడు, ఆడంబరము కోసమై వేషములు వేయడు. ఏ మతమును సేవింపడు, బ్రతుకుదెరువులో ఎన్ని కష్టములు వచ్చినను విచారముతో క్రుంగిపోడు.

శా|| జ్ఞాతుల్ ద్రోహులు వారు సేయు కపటేర్ష్యాదిక్రియాదోషముల్
మాతండ్రాన సహింపరాదు, ప్రతికర్మం బించుకే జేయాగా
బోతే దోషము గాన మాని యతినైపో గోరినన్ సర్వదా
చేతః క్రోధము మాన దెట్లు నడుతున్? శ్రీకాళహస్తీశ్వరా!    69
తా!!దాయాదులు ద్రోహులు, వారు అసూయతోను, మోసముతోను చేయుపనుల వల్ల చాల కష్టములు గలుగుచున్నవి. అవి భరింపలేకున్నాను. ఇది నిజము. మా తండ్రిపై ఒట్టు. పోనీ వారిపై పగ  తీర్చుకొనుట కేమైన జేయుదమన్నచో పాపముగలుగును. ఇవన్నియువదలి సన్యాసినైపొదమన్నను మనసులో దాయడులపై నాకున్న క్రోధము శాంతించుట లేదు. నన్ను ఏమిచేయుమండువో చెప్పుము.

మ|| చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్చాభాషణ క్రీడలన్
వదరన్ సంశయ భీకరాటవుల ద్రోవల్ దప్పి వర్తింపగా
మదన క్రోధ కిరాతు లందు గని భీమప్రౌఢి వే దాకినం
జెదరం జిత్తము చిత్తగింప గదవే శ్రీకాళహస్తీశ్వరా!    70
తా||ధూర్తులైన పండితులు తమ మాటల గారడీలతో మోసపుచ్చుచుండగా, అవేమో మా కర్థము కాక సంశాయారణ్యములలో తప్పుదారులలో బడి పోవుచున్నాము. అక్కడ కామక్రోధములనెడి కిరాతులు మమ్ము జూచి మామీద దాడిచేయగా మనసు చెదిరి మరింత మతిచెడి ప్రవర్తించుచున్నాము. మా యవస్థను గమనించి మమ్ము రక్షింపవవా?

శా!! రోసిందేటిది? రోతలేవిటి? మనోరోగస్థుడై దేహి తా
బూసిందేటిది? పూతలేటివి? మదాపూతంబులీ దేహముల్
మూసిందేటిది? మూతలేటివి? సదా మూఢత్వమేకాని తా
జేసిందేటిది? చేతలేటివి? వృథా శ్రీకాళహస్తీశ్వరా!    71
తా!! మానవుడు తాను సర్వమును విరక్తితో విడిచినానని చెప్పును. కాని మనసులో వాంఛలుచావవు; జ్ఞానము కలుగదు; అపుడా వైరాగ్యమెందుకు? విభూతి దేహమునిడ బూసినానని చెప్పును. వాని ఒడలంతయు గర్వపు పూతతో నిండిపోయి యుండగా, ఆ విభూతి పూతలవలన లాభమేమి? కన్నులు మూసికొని నేను ధ్యానములో మునిగియున్నానని పలుకును. ఆ ధ్యానములో ఆత్మజ్యోతి దర్శనము కలుగదు. మరి ఆ ధ్యానము వలన ప్రయోజనమేమి? తానేన్నో మంచి పనులు చేసినానని గొప్పలు చెప్పును. ఎవరికిని పనికిరాని పనులవలన కలిగెడి ఉపయోగమేమి?

శా!! శ్రీశైలేశు భజింతునో? అభవు గాంచీనాథు సేవింతునో?
కాశీవల్లభు గొల్వ బోదునో ? మహాకాళేశు బూజింతునో?
నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వరా!    72
తా!! ఈశ్వరా! నీ కరుణగలుగుటకై అనేక క్షేత్రములలో అనేక రూపములతో నున్న నిన్ను సేవింపవలెనేమో! అయితే, శ్రీశైలములో మల్లికార్జునుని సేవింతునా? కాంచీపురములో ఏకాంబరేశ్వరుని పూజింతునా? కాశీలో విశ్వేశ్వరుని భజింతునా? ఉజ్జయినిలో మహాకాళుని పూజింతునా? ఏమీ చేయుమన్నను చేసెదను. నన్ను నీ దయాపూర్ణములైన చిరునవ్వులతో కాపాడుచుండుము.

మ|| ఆయవారై చరియింపవచ్చు దమ పాదాంభోజ తీర్థమ్ములన్
దయతో గోమ్మనవచ్చు, సేవకుని యర్థప్రాణ దేహాదు ల
న్నియు మా సొమ్మునవచ్చు, గాని సిరుల న్నిందించి, ని న్నాత్మ ని
ష్క్రియతం గానగ రాదు పండితులకున్ శ్రీకాళహాస్తీశ్వరా!    73
తా|| ఈశ్వరా! ఎంత పండితులైనను, తాము గురువులుగా సంచరింపవచ్చును, తమ పాదతీర్థమును స్వీకరింపుడని భక్తులకు చెప్పవచ్చును, వారి ధనము, ప్రాణము, శరీరము అన్నియు తమ సేవకే వినియోగపడవలెనని శాసింపవచ్చును. కాని ధనములు మంచివి కావని తిట్టుచు, వానికై ప్రాకులాడుచు, నీకే విధమైన సేవలును చేయకపోయినచో ఆత్మలో నిన్ను చూడలేరు.

శా|| మాయజాండ కరండ కోటి బొడిగా మర్దించిరో, విక్రమా
జేయుం గాయజు జంపిరో, కపట లక్ష్మీ మోహముం బాసిరో
యాయుర్దాయ భుజంగ మృత్యువు ననాయాసంబునన్ గెల్చిరో
శ్రేయోదాయకు లెట్టు లౌదు రితురుల్ శ్రీకాళహస్తీశ్వరా!    74
తా|| శ్రీకాళహస్తీశ్వరా! నీవు ప్రళయకాలమున మాయా కల్పితములైన యీ బ్రహ్మాండములన్నింటిని చిదిమి వేయుదువు. భుజబలముచే గెలువ శక్యముగాని మన్మథుని నీ కంటి మంటచే భస్మము చేసితివి. సర్పరూపములో ఆయుర్దాయమును హరించెడి మృత్యువును గెలిచితివి. కావున నీవు మహానుభావుడవు. మాకు మోక్షమియ్యగలవు. ఇతరుల కీ శక్తియెక్కడ నున్నది? వారు మాకు మోక్షము నెట్లీయగలరు?

మ|| చవిగా జూడ, వినంగ, మూర్కొన, దనూ సంఘర్షణాస్వాద మొం
ద, వినిర్మించెద వేల జంతువుల? ఏ తత్క్రీడలే పాతక
వ్యవహారంబులు సేయు దేమిటికి? మాయా విద్యచే బ్రొద్దు వు
చ్చి వినోదింపగ దీననేమి ఫలమో శ్రీకాళహస్తీశ్వరా!    75
తా|| ఈశ్వరా! ఈ ప్రాణులకు, రుచులెరుగుటకు నాలుకను, చూచుటకు కన్నులను, వినుటకు చెవులను, వాసన చూచుటకు ముక్కును, స్పర్శ తెలియుటకు చర్మమును (అనగా పంచ జ్ఞానేంద్రియములను) ఇచ్చి, వారు వానితో సుఖపడునట్లు సృష్టించినావు. వారట్లు సుఖపడుచుండగా, ఆయా సుఖములన్నియు పాపములు కలిగించునవి మరల శాస్త్రములు చూపి భయపెట్టుచున్నావు. నీ మాయలోబడి దిక్కుతెలియకున్నాము. నీకు  మాత్రమే తెలిసిన ఆ మాయను మా మీద ప్రయోగించి నీవు వినోదించుట యేమి బాగున్నది?

మ|| వెనుకం జేసిన ఘోరదుర్దశల భావింపంగ రోతయ్యెదున్
వెనుక న్ముందట వచ్చు దుర్మరణముల్ వీక్షింప భీతయ్యెడున్
నను నే జూచియు నా విధుల్ దలచియున్ నాకే భయంబయ్యెడున్
జెనకుం జీకటి మాయె గాలమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!    76
తా|| ఈశ్వరా! పూర్వము నేను చేసిన దుష్కార్యములు తలచుకొన్నచో నాకే అసహ్యమగుచున్నది. జనులకు కొంచెము  ముందు వెనుకలుగా కలుగుచున్న మరణములు చూచినా భయము కలుగుచున్నది. నన్ను నేను పరిశోధించుకొనుచు, నా కృత్యములను సమీక్షించుకొన్నచో ఇంకను భయము కలుగుచున్నది. ఈ భయము తీరు మార్గము గోచరించుటలేదు. చివరిదశలో అంతయు అజ్ఞానాంధకారమే అన్నట్లున్నది. దీనినుండి నన్ను రక్షింపుము.

మ|| పరశీలించితి మంత్రతంత్రములు, చెప్పన్వింటి సాంఖ్యాది యో
గరహస్యంబులు, వేదశాస్త్రములు వక్కాణించితిన్, శంక వో
దరయన్ గుమ్మడి కాయలోని యవగింజంతైన నమ్మించి సు
స్థిర విజ్ఞానము త్రోవ జూప గదవే శ్రీకాళహస్తీశ్వరా!    77
తా|| ఈశ్వరా! ఎన్నో మంత్రాలు, తంత్రాలు చూచినాను. సాంఖ్యము మున్నగు యోగశాస్త్రములలోని రహస్యములను పెద్దలు చెప్పగా విన్నాను. నేను స్వయముగా ఇతరులకు వేదశాస్త్ర విషయములను బోధించినాను. ఐనను, గుమ్మడికాయలో తప్పడ గింజంతైన నా సందేహము తీరలేదు. నీవే నాయందు దయచూసి నిశ్చయమైన జ్ఞానమార్గమును జూపి న న్నుద్ధరింపుము.

మ|| మొదలం జేసిన వారి ధర్మములు నిర్మూలంబుగా జేసి దు
ర్మదులై యిప్పటి వార ధర్మము లొనర్పం దమ్ము దైవంబు న
వ్వదె? రానున్న దురాత్ములెల్ల దమత్రోవం బోవరే?  యేల చే
సెదరో మీదు దలంచి చూడ కధముల్ శ్రీకాళహస్తీశ్వరా!    78
తా||ఈశ్వరా! పూర్వమువా రాచరించిన ధర్మములను నాశనము చేసి, యిప్పటి వారు తామాచారించునదే ధర్మమని చెప్పి, అధర్మము లాచరించుచుండగా వారిని జూచి దైవము నవ్విపోదా? ముందు తరాలవారు గూడ దురాత్ములై అధర్మ  మార్గములో బడిపోవరా? ఆ మాత్రము ముందుచూపు లేకుండ నీచమానవు లెందుకు ఇట్లు ప్రవర్తింతురోగదా!

శా|| కాసంతైన సుఖంబొనర్చునొ? మనఃకామంబు లీడేర్చునో
వీసంబైనను వెంటవచ్చునొ? జగద్విఖ్యాతి గావించునో?
దోషంబుల్ వెడ బాపునో? వలసినం దోడ్తో మిముం జూపునో?
ఛీ! సంసార దురాశ యే లుడుపవో? శ్రీకాళహస్తీశ్వరా!    79
తా|| ఈశ్వరా! జీవులకు ఈ సంసారమందున్న పేరాస చాల యెక్కువ. ఇందులోనేమున్నది? ఈ సంసారము రవ్వంతైన సుఖమునిచ్చునా? మనసులోని కోరికలను పూర్తిగా తీర్చునా? పోనీ, ఇందులో ఏ కొంచెమైనను చనిపోవునపుడు వెంటవచ్చునా? లోకములో కీర్తిప్రతిష్ఠలు గలిగించునా? పాపాలు పరిహరించునా? కావలెనన్నచో మీ దర్శనము చేయించునా? ఏమీ లాభమున్నదని జీవులీ సంసారము నందు మోహమును విడువలేకున్నారు? దీనిని నశింపజేయలేవా?

మ|| ఒక పూటించుక కూడు తక్కువగునే నోర్వంగలే, దెండ కో
పక నీడన్ వెదకున్, జలిం జడిసి కుంపట్లెత్తుకో జూచు, వా
నకు నిల్లిల్లును దూఱు నీ తనువు; దీనన్వచ్చు సౌఖ్యంబు రో
సి, క డాసింపరు గాక మర్త్యులకటా! శ్రీకాళహస్తీశ్వరా!    80
తా|| ఈశ్వరా! ఈ శరీరము ఒకపూట కొంచెము తిండి తక్కువైనచో ఆగలేదు; ఎండ ఎక్కువగానున్నచో నీడకై వెదకును; చలి వేసినచో కుంపట్లెత్తు కొనుటకు చూచును; వాన వచ్చినచో ఏ యింటిలో దూరుదునోయని చూచును. దీనివలన వచ్చు సౌఖ్యము తాత్కాలికమని గ్రహించి శాశ్వత సౌఖ్యమునిచ్చు మోక్షము కొరకై యీ మానవులేల ప్రయత్నింపరు?

శా|| కేదారాది సమస్త తీర్థములు కోర్కిం జూడ బోనేటికిన్?
కాడా ముంగిలి వారణాసి? కడుపే కైలాస శైలంబు? నీ
పాద ధ్యానము సంభవించు నపుడే భావింపగా, జ్ఞాన ల
క్ష్మీ దారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీకాళహస్తీశ్వరా!    81
తా|| ఈశ్వరా! నిశ్చలమైనభక్తి నీ యందు కుదిరినచో పుణ్యతీర్థములు సేవించుటకు పోనేల? మన యింటి ముందు వాకిలియే కాశీయైపోదా? మన కడుపే కైలాసమైపోదా? ఈ లోకులు అజ్ఞానవశము చేత గ్రహింపలేకున్నారు.

మ|| తమకంబోప్ప బరాంగనాజన పరద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగముసేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్య పా
శములం జుట్టిబిగించి నీదు చరణస్తంభంబునం గట్టి వై
చి ముదం బెప్పుడుగల్గ జేయగదవే! శ్రీకాళహస్తీశ్వరా!    82
తా|| ఈశ్వరా! నా మనస్సు ఒక పెద్ద దొంగ. ఇది యెప్పుడును పరస్త్రీలను, పరధనములను అపహరించుటకు ప్రయత్నించుచునే యుండును. శంకరా! కట్టు తప్పుచున్న యీ దొంగను వైరాగ్యమనెడి త్రాళ్ళతో గట్టిగా బంధించి నీపాదములనెడి స్తంభములకు కట్టి పడవేసి వ్యామోహములు పోగొట్టి, ఆనందమును గలిగింపుము.

శా|| వేధం దిట్టగరాదుగాని, భువిలో విద్వాంసులం జేయనే
లా? ధీచాతురి జేసిన గులా మాపాటనే పోక క్షు
ద్భాధాదుల్ గలిగింపనేల? యది కృత్యంబైన దుర్మార్గులన్
ఛీ! ధాత్రీశుల జేసె, జేయనేటి కకటా! శ్రీకాళహస్తీశ్వరా!    83
తా|| ఈశ్వరా! బ్రహ్మను దిట్టకూడదు. కాని అతడు, లోకములో పండితులను సృష్టించుటెందుకు? పోనీ సృష్టించినాడు, వారికి ఆకలి మున్నగు బాధలు కలిగించుటెందుకు? పోనీ, అది సృష్టిధర్మము; తప్పదనుకొందము. ఈ పండితుల నాదరింప గల శక్తిసామర్ధ్యములున్న రాజులను సద్బుద్ధి లేకుండ దుర్మార్గులను జేసినాడేమి?

మ|| పుడమి న్నిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యంబునుం
బడయ న్నేరక పెక్కుదైవంబులకుం బప్పుల్ ప్రసాదంబులుం
గుడుముల్ దోసెలు సారెసత్తు లడుకుల్ గుగ్గిళ్ళునుం బెట్టుచుం
జెడి, యెందుం గోఱగాక పోదు రకటా శ్రీకాళహస్తీశ్వరా!    84
తా|| ఈశ్వరా! నిన్నొక్క మారేడుదళముతో పూజించి మోక్షము సంపాదించు బుద్ధిలేక యీ మానవులు ఇతర దైవతములను పూజించి, వారికి వడపప్పులు, ప్రసాదములు, ఉండ్రాళ్ళు, దోసెలు, జంతికలు, అటుకులు మున్నగువానిని నైవేద్యముగా బెట్టుచు తప్పుదారిని బడి ఇహపరములను పాడుచేసికొనుచుందురు.

శా|| విత్తజ్ఞానము పాదు చిత్తము, భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్వంబు తదంకురం, బనృతముల్ మారాకు లత్యంతదు
ర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులున్
జిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!    85
తా|| ఈశ్వరా! ఈ దేహము, ఇందున్న మనస్సు మున్నగు పదార్థములును సృష్టింపబడినవే. బీజము ఒకటైనప్పుడు మొక్క మరొక విధముగానుండుట విచిత్రముగదా! నీనుండి సృష్టింపబడిన యీ మనోదేహములకు నీ లక్షణములే రావలెను. కాని నీ వమృత స్వరూపుడవు. నా మనస్సేమో చేదైన వేపచెట్టైనది. దీనికి ధనాశ బోదె, అహంకారము నీళ్ళు, మదము మొదటి మొలక, అసత్యములు మారాకులు, దుష్ట స్వభావములు పువ్వులు, మన్మథుని వలన గలుగు వికారములే ఫలములు అయి వికృతముగానున్నది. ఇదేమి విచిత్రము?

శా|| నీపై గావ్యము జెప్పుచున్న యతడున్ నీ పద్యముల్ వ్రాసియి
మ్మా పాఠంబొనరింతునన్న యతడున్ మంజుప్రబంధంబు ని
ష్ఠాపూర్తిం బఠియించుచున్న యతడున్ సద్బాంధవుల్ గాక ఛీ
ఛీ! పృష్ఠాగత బాంధవంబు నిజమా? శ్రీకాళహస్తీశ్వరా!    86
తా|| ఈశ్వరా! నీమీద కావ్యము చెప్పువాడును, నీమీద పద్యములు వ్రాసియిచ్చినచో చదువుకొందునను వాడును, నిన్ను గురించి చెప్పు పురాణాది దివ్య ప్రబంధములను నిష్ఠతో చదువుకొనువారును చుట్టాలుగాని జన్మమాత్రము చేత చుట్టరికము గలవారు నిజమైన బంధువులా?

శా|| సంపద్గర్వము బాఱ ద్రోలి, రిపులం జంకించి, యాకాంక్షలన్
దప్పం బెట్టి, కళంకముల నఱికి, బంధక్లేశ దోషంబులన్
జింపుల్ చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులన్
జెంపల్వేయక నిన్ను గాన నగునా? శ్రీకాళహస్తీశ్వరా!    87
తా|| ఈశ్వరా! సంపదలున్నవనెడి గర్వమును విడిచి, లోని శత్రువులైన కామక్రోధాదులను గెలిచి, కోరికలు ప్రక్కకుద్రోసి, పాపములు ప్రక్షాళనము చేసికొని, భార్య, కొడుకులు, కూతుండ్రు మున్నగు వారితోడి బంధములను తెగతెంపు చేసికొని, వయసులో కలుగు మోహాది వికారములను అణచివేసికొని, మన శరీర నిర్మాణమునకు హేతుభూతములైన పంచభూతములను గెలిచి, (అనగా చలి, ఎండ, వాన మున్నగు బాధలు సహించి తపముచేసి) నిగ్రహముతో నుండలేకపోయినచో నీ దర్శనము కలుగునా?

శా|| రాజశ్రేణికి దాసులై సిరుల గోరం జేరగా సౌఖ్యమో
యీజన్మంబు తరింప జేయగల ని న్నేప్రోద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరా మానవు ల్పాపరా
జీ జాతాతి మదాంధ బుద్ధులగుచున్ శ్రీకాళహస్తీశ్వరా!    88
తా|| ఈశ్వరా రాజులకు దాసులై సంపదలు కోరుచు వారిని సేవించుట సౌఖ్యమా? లేక ఈ జన్మమునుండి మోక్షమునియ్యగల నిన్ను సేవించెడి సదాచారము సౌఖ్యమా? పాపముల వలన అంధములైన బుద్ధులు గల మనుష్యులు గ్రహింప లేకున్నారుగదా!

శా|| నిన్నం జూడరొ మొన్న జూడరొ జనుల్ నిత్యంబు జావంగ నా
పన్నుల్గన్న నిధాన మయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింప లే
కున్నా, రెన్నడు నిన్ను గందురిక మర్త్యుల్ గొల్వరేమో నినున్
జిన్నం బుచ్చక ప్రోవకుండు నెడలన్ శ్రీకాళహస్తీశ్వరా!    89
తా|| ఈశ్వరా! రోగాదులతో బాధలు పడుచు నిత్యము ప్రజలు మరణించుట చూచుట లేదా? అయినను మానవులు ధనములపై ఆశలను చంపుకొన లేక నిన్ను మఱిచిపోవుచున్నారు. వారి యీ అవివేకమును మన్నించి నీవు కాపాడనిచో వారి గతియేమి? ఇట్లు జన్మజన్మములలో నిన్ను మఱిచి యింకను అధోగతి పాలగుదురు గదా!

శా|| వన్నే యేనుగుతోలు దుప్పటము, బువ్వా కాలకూటంబు చే
గిన్నే బ్రహ్మకపాల, ముగ్రమగు భోగే కంఠాహారంబు మే
ల్నిన్నీ లాగున నుంటయుం దెలిసియు న్నీ పాదపద్మంబు చే
ర్చె న్నారాయణ డెట్లు మానసము నన్ శ్రీకాళహస్తీశ్వరా!    90
తా|| ఈశ్వరా! నీ కట్టుబట్ట యేనుగు తోలు, నీ ఆహారము కాలకూట విషము, చేతిపాత్ర బ్రహ్మ శిరస్సు, అలంకారము భీకరమైన పాము; నీ వీ రూపముతో నుందువని తెలిసికూడ శ్రీహరికోట నీ పాదములను తన మనసులో నిలిపి ధ్యానించును. ఆయన సంపన్నుడైయుండియు ఆదిభిక్షువవైన నిన్ను ధ్యానించుట చిత్రమని భావము.

శా|| ద్వారద్వారములందు గంచుకి జనవ్రాతంబు దండంబులన్
దొరంతఃస్థలి బగ్గనం బొడుచుచున్ దుర్భాషలాడన్ మఱిన్
వారిం బ్రార్థన చేసి రాజులకు సేవల్ సేయగా బోరు ల
క్ష్మీరాజ్యంబును గోరి నీ పరిజనుల్ శ్రీకాళహస్తీశ్వరా!    91
తా|| ఈశ్వరా! రాజద్వారములందు కావలివారు తమ చేతికర్రలతో కొట్టి, తిట్టి, లోనికి పంపుటకు నిరాకరించుచుండగా వారిని తిరిగి బ్రతిమాలి రాజుల సేవ చేయవలె ననియు, సంపదలు సంపాదింపవలె ననియు లోకములో చాలమంది కోరుచుందురు. కాని నీ పాద భక్తులు మాత్రము అంట హీనస్థితికి దిగజారి రాజుల సేవయే పరమార్థమని భావింపరు.

శా|| ఊరూరం జనులెల్ల భిక్ష మిడరో? యుండన్ గుహల్ గల్గవో?
చీరానీకము వీథులం దొరకదో? శీతామృత స్వచ్ఛవాః
పూరం బేఱుల బాఱదో? తపసులం బ్రోవంగ నీ వోపవో?
చేరం బోవుదు రేల రాజుల జనుల్? శ్రీకాళహస్తీశ్వరా!    92
తా|| ఈశ్వరా! తిండి కావలెనన్నచో ఊరూరా భిక్షము పెట్టువారులేరూ? ఉండుటకు కావలసినచో పర్వత గుహలులేవా? కట్టుకొనుటకు కావలసినచో వీథి అంగళ్ళలో బట్టలు దొరుకవా? త్రాగుటకు కావలెనన్నచో సెలయేళ్ళలో చల్లని అమృతమువంటి నీళ్ళు లేవా? జనులెందుకు ఈ రాజుల ఆశ్రయమునకై ప్రాకులాడెదరు?

మ|| దయసేయండని కొందఱాడుదురు నిత్యంబు న్నినుం గొల్చుచున్
నియమంబెంతొ ఫలంబునంతియ కదా! నీవీయ? పిండెంతొ యం
తియకా రొట్టె? మదిం దళంబశన బుద్ధింజూడ నేలబ్బు? స
త్క్రియాల న్నిన్ను భజింప కిష్టసుఖముల్ శ్రీకాళహస్తీశ్వరా!    93
తా|| ఈశ్వరా! కొందరు నిత్యము నిన్ను పూజించుచు, “శివునకు మాపై దయ రాలేదు” అనుచుందురు. వారి భక్తిశ్రద్ధలు, నియమనిష్ఠలు ఎంతగానుండునో నీవిచ్చు ఫలములు గూడ అంతేయుండును. పిండి కొలది రొట్టె గదా! ఎక్కువ ఫలము గావలెన్నచో నెట్లు కలుగును? పూజాది సత్కార్యములు చేయకుండ కోరిన కోరిక లెట్లు తీరును?

శా|| ఆరావంబుదయించె దారకముగా నాత్మాభ్రవీథిన్ మహా
కారోకార మకార యుక్తమగు నోంకా రాభిధానంబు, చె
న్నారున్ విశ్వమనంగ దాన్మహిమచే, నా నాదబిందుల్ సుఖ
శ్రీరంజిల్ల గడంగు నీవదె సుమీ! శ్రీకాళహస్తీశ్వరా!    94
తా|| ఈశ్వరా! అకార ఉకార మకారములతో ఏర్పడిన ప్రణవనాదము దహరాకాశములో బుట్టినది. అది జీవులను తరింపజేయును. దాని ప్రభావము వలననే విశ్వమంతయు నడచుచున్నది. ఆ ప్రణవ నాదమే బ్రహ్మానంద స్వరూపము. ఆ బ్రహ్మానంద స్వరూపుడవు నీవేకదా! “ఓమితిబ్రహ్మ” అని వేదవాక్కు.

శా|| నీ భక్తుల్ పదివేలభంగుల నినున్ సేవింపుచున్ వేడగా
లోభం బేటికి? వారి కోర్కులు కృపాళుత్వంబునం దీర్ప రా
దా? భవ్యంబు దలంచి చూడు పరమార్థం బిచ్చి పొమ్మన్న నీ
శ్రీభండారములో గోఱంత వడునా? శ్రీకాళహస్తీశ్వరా!    95
తా|| ఈశ్వరా! నీ భక్తులు పదివేల విధములుగా నిన్ను సేవించుచు మోక్షమిమ్మని ప్రార్థించుచుండగా ఇయ్యవేమి? నీకంత పిసినిగొట్టుతన మెందుకు? అది యోగ్యమైన పనియేమో ఆలోచించి చూడుము. వారికి మోక్షమిచ్చి పోమ్మన్నచో నీ యైశ్వర్య భండారములో నేమైన వెలితివచ్చునా?

మ|| మొదలన్ భక్తుల కిచ్చినాడవుగదా మోక్షంబు? నే డేమయా
మదియంగా మదియంగ బుట్టె ఘనమౌ మోహంబులోభంబు న
న్నది సత్యంబు, కృపందలంప వొక పున్యాత్ముండు నిన్నాత్మ గొ
ల్చి దినంబున్ మొఱవెట్టగా గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!    96
తా|| ఈశ్వరా! పూర్వకాలములో నిన్ను సేవించిన భక్తులందరికిని మోక్షము సంతర్పణచేసినట్లు ఇచ్చినావుగదా! ఇప్పుడు నీకేమైనది? ముదుసలితనము ముదిరిన కొలది పిసినారితనమును, వస్తువులపై వ్యామోహమును పెరుగునందురు. ఆ మాట నిజమైనది. ఒక భక్తుడు (తాను) నిన్ను ధ్యానించుచు దయ జూడుమని మొఱపెట్టుచుండగా పట్టించుకొనవేమి?

శా|| కాలద్వార కవాటబంధనము, దుష్కాల ప్రమాణ క్రియా
లీలాజాలకచిత్రగుప్త ముఖవల్మీక్రోగజిహ్వాద్భుత
వ్యాళ వ్యాళవిరోధి, మృత్యుముఖ దంష్ట్రా హార్యవజ్రంబు, ది
క్చేలాలంకృత! నీదు నామ మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!    97
తా|| ఈశ్వరా! పవిత్రమైన నీ నామము, యముని యింటి ద్వారములను మూసివేయును; జీవుల మరణకాలములను నిర్దేశించు చిత్రగుప్తుని నో రనెడి పుట్టలోని పాములకు గరుడుని వంటిదై అతని యాలోచనల నుపసంహరించును. మృత్యువు కోరలనెడి పర్వతములను గూడ ఛేదించును. (అనగా పుట్టిన తరువాత జనులకు చావురాదని కాదు. నీ నామస్మరణము చేయువారికి ఈ జన్మము తరువాత మరల పుట్టుట, చచ్చుట అనునవి ఉండవని యర్థము.)

మ|| పదివేలైనను లోకకంటకులచే బ్రాపించు సౌఖ్యంబు నా
మదికిం బథ్యము కాదు; సర్వమునకున్ మధ్యస్థుడై సత్యదా
నడయాదుల్ గలరాజు నాకొసగు; మెన్నన్ వాణి నీయట్ల చూ
చి దినంబున్ ముదమొందుదుం గడపటన్ శ్రీకాళహస్తీశ్వరా!    98
తా|| ఈశ్వరా! ఎవ్వరెన్ని చెప్పినను లోకమును వీడించు దుష్టరాజులవలన
సంప్రాప్తించెడి సంపదలను, సౌఖ్యములను అనుభవించుట నామనస్సునకు ఇష్టము కాదు. సుఖదుఃఖాదులను సమముగా భావించుచు, సత్యము, దానదయాది గుణములతో గూడి సత్త్వగుణసంపన్నుడైన రాజును నాకు పోషకునిగా చూపుము. అటువంటి రాజు దైవసమానుడు కావున అతనిని, నిన్నారాధించినట్లు ఆరాధించి యానందితును.

శా|| తాతల్ తల్లియు దండ్రియున్ మఱియు బెద్దల్ చావగా జూడరో?
భీతింబొందగనేల చావునకుగా? బెండ్లాము బిడ్డల్ హిత
వ్రాతంబున్ బలవింప, జంతువులకున్ వాలాయమైయుండగా
జేతో వీథి నరుండు నిన్ గొలువడో శ్రీకాళహస్తీశ్వరా!    99
తా|| భార్యాపుత్రులు, మిత్రులు ఎంతమంది యేడ్చుచున్నను తాతలు, తల్లి, తండ్రి, పెద్దవారు చావక కూర్చుండిరా? వారు చనిపోవుట వీరు చూడలేదా? చావునకు భయపడుట ఎందుకు? జంతువులకీ చావు తప్పదని తెలిసి కూడ మనుష్యుడు తాను బ్రతికియున్న స్వల్పకాలములోను నిన్ను సేవింపకుండ వ్యర్థముగా కాలక్షేపము చేయును. ఎంత అవివేకము?
పాప కృత్యములు చేసినవాడు చావునకు భయపడవలెను. అజ్ఞాని భయపడును. శివుని సేవించి జ్ఞానియైనవాడు భయపడవలసిన పనియేమున్నది?

శా|| జాతూల్ సెప్పుట, సేవసేయుట, మృషల్సంధించు, టన్యాయ వి
ఖ్యాతింబొందుట, కొండెకా డవుట, హిమసారంభకుం డౌట, మి
థ్యాతాత్పర్యము లాడు, టన్నియు బరద్రవ్యంబు నాశించి, యీ
శ్రీ తానెన్ని యుగంబు లుండ గలదో శ్రీకాళహస్తీశ్వరా!    100
తా|| ఈశ్వరా! లోకములోని మనుజులు జాతకాలు చెప్పుట, ఇతరులకు సేవలు చేయుట, అసత్యములాడుట, ఎదుటివారి నన్యాయము చేయుటలో పేరొందుట, ఇతరులపై నేరములు చెప్పుట, హింసచేయుట, కూటసాక్ష్యములు (దొంగసాక్ష్యములు) చెప్పుట ఇవన్నియు ఇతరుల ద్రవ్యము నాశించి చేయుచుందురు గదా! ఈ ధనములు ఎన్నియుగములు శాశ్వతముగా నుండునో యెవరు చెప్పగలరు?
అశాశ్వతమైన ధనములకై కాని పనులు చేసి జీవన పరమార్థమును బోగొట్టుకొనుచున్నారుగాని యీ నరులు నిన్ను స్మరించుటలేదని భావము.

మ|| చెడుగుల్ కొందఱ గూడి చేయగబనుల్ చీకట్లు దూరంగ బా
ల్పడితింగాని, గ్రహింపరాని నిను నొల్లంజాల; బొమ్మంచు ని
ల్వెడలం ద్రోచిన జూరు వట్టుకొని నేవ్రేలాడుదుం గోర్కె, గో
రెడి యర్థంబులు నాకు నేల యిడవో శ్రీకాళహస్తీశ్వరా!    101
తా|| ఈశ్వరా! అజ్ఞానినై దుష్టులతో గూడి పూర్వము కొన్ని అకృత్యములు చేసితివి. ఇప్పడు కొంత తెలివి దెచ్చుకొని నిన్నాశ్రయించితిని. నీవు, నన్ను చేరదీయకూడనివాడని నీ యింటినుండి గెంటివేసినను, నాకోరిక తీర్చెదవను ఆశతో నీ చూరుపట్టుకొని వ్రేలాడెదను. నా కోరిక తీర్చకుండ ఎట్లుండగలవో చూచెదను. (నీవు బోళాశంకరుడవు గనుక నిన్నే నమ్ముకొన్న నన్ను విడిచి పెట్టవని నా విశ్వాసము అని భావము).

మ|| భసితోద్ధూళన ధూసరాంగులు, జటాభారోత్తమాంగుల్, తపో
వ్యసనుల్, సాధిత పంచవర్ణ రససుల్, వైరాగ్యవంతుల్, నితాం
తసుఖస్వాంతులు, సత్యభాషణ సముద్యద్రత్న రుద్రాక్ష రా
జిసమేతుల్ తుదనెవ్వరైన గొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా!    102
తా|| దేహమంతట భస్మము పూసికొన్నవారును, తలపై జడలు గలవారును, నిత్యమూ తపముచేయువారును, పంచాక్షరీమంత్రమును జపించువారును, అన్నిటిని త్యజించిన వారును, బ్రహ్మనందానుభూతి నొందినవారును, సత్యమనెడి రత్న మాలను, రుద్రాక్షమాలను ధరించిన వారును కనబడినచో, వారే వర్ణమువారైనను పరమ మహేశ్వరులు గనుక వారిని ఆరాధించెదను. జంగమ రూపులైన నీమూర్తులుగా భావించి సేవింతునని భావము.

మ|| జలజశ్రీగల మంచినీళ్ళుగలవా చట్రాతిలో? బాపురే!
వెలివాడ న్మఱి బాపనిల్లు గలదా? వేసాలుగా కక్కటా!
నలి నారెండు గుణంబులెంచి మదిలో నన్నేమిరోయంగ నీ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీకాళహస్తశ్వరా!    103
తా|| ఈశ్వరా రాతిలో పద్మములతో గూడిన మంచినీళ్ళు ఉండునా? మాలపల్లెలో వేషాలు మాత్రము వేసికొందురేమోకాని నిజమైన బ్రాహ్మణ గృహముండునా? అట్లే మనుజుడైపుట్టి నిన్ను నూరు శాతము భక్తితో సేవించువాడుండునా? నేనును ఆలోపముల్లన్నవాడనే. పద్మాలు లేకున్నను, నీటివలె కొంచెము భక్తియున్నందుకు, బ్రాహ్మణ లక్షణము లున్నందును నన్ను దయతో జూచి రక్షింపుము. నాలోని తక్కిన లోపములను బెద్దవిగా జూచి నన్ను నీనుండి దూరము చేయకుము.

మ|| గడియల్ రెంటికొ మూతికో గడియకో కాదేని నేడెల్లియో
కడ నేడాదికా యెన్నడో యేఱుగమీ కాయంబు లీ భూమిపై
బడగా నున్నవి; ధర్మమార్గమొకటిం బాటింప రీ మానవుల్
చెడుగుల్ నీ పదభక్తినిం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా!    104
తా|| ఈశ్వరా! ఈ భౌతిక శరీరములు గడియకో, రెండుమూడు గడియలకో, లేదా నేడో రేపో, చివరికి ఏడాదికో నశించక తప్పదు కదా! మానవులీ సత్యమును గుర్తించి నీ పదభక్తులై తరించుటకు మార్గమాలోచింపరు; ఏ ధర్మకార్యమును ఆచరించి నీకు ప్రీతిపాత్రులగుటకు ప్రయత్నించరు. ఇది యెంత అజ్ఞానము!

మ|| క్షితిలో దొడ్డ తురంగ సామజములే చిత్రమ్ము? లాందోళికా
తతులేలెక్క? విలాసినీ జన సువస్త్రవ్రాత భూషాకలా
పతనూజాదిక మేమి దుర్లభము? నీ పాదమ్ములర్చించుచో
జితపంకేరుహ పాదపద్మయుగళా! శ్రీకాళహస్తీశ్వరా!    105
తా|| ఈశ్వరా! లోకములో నీపాదర్చన చేయువారికి గుఱ్ఱములు, ఏనుగులు, పల్లకీలు, పరిచారికలు, వస్త్రములు, భూషణములు, పుత్రపౌత్రాది సంతతులు ఏవి లభింపకుండును? అతనికి సమస్తమును సంపన్నమే అయి యుండును.
“రుద్రాధ్యాయ వసే ద్యత్ర గ్రామే వా నగరేపి వా
న తత్ర క్షుత్పిపాసాద్య దుర్భిక్షవ్యాధయో పి చ” అని సూక్తి. రుద్రాధ్యాయమును (నమకమును) పారాయణ చేయుపుణ్యాత్ముడు ఒక నగరములోగాని, గ్రామములో గాని యున్నచో అక్కడ ఆకలి, దప్పికలతో బాధపడువారుండరు, కరవుండదు, ఏవ్యాదులును ఆచుట్టుప్రక్కలకు రావు అని దీని యర్థము. మరి, ఇంక ఆ భక్తున కేమిలోటు వచ్చును?

మ|| సలిలమ్ముల్ జుళుక ప్రమాణ, మొకపుష్పమ్మున్, భవన్మాళి ని
శ్చల భక్తిప్రతిపత్తిచే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ
నిల గంగానది జంద్రఖండమును దా నిందుం దుదిం గాంచు నీ
చెలువం బంతయు నీమహాత్త్వముదిగా! శ్రీకాళహస్తీశ్వరా!    106
తా|| ఈశ్వరా! ఒక భక్తుడు నీయందిలి పరమభక్తితో నీ లింగముపై అరచేతి గుంటెడు నీళ్ళుపోసి, దానినే గంగానదిగాను, ఒక పుష్పమునుంచి దానినే చంద్రరేఖ గాను భావించి అమందానందము నందును. అది నీ మహాత్మ్యము వలననే కదా! అనగా ఈశ్వరుని దయ సంపాదించినవారు ఏ స్వల్పము చేసినను దాని నాయన ఘనముగానే స్వీకరించి యనుగ్రహించునని భావము. ‘కొండంత దేవునకు మరి కొండంతయు ప్రతియిడెడి కుశలులు గలరే?’
మరియొక అర్థము: శంకరా! కొంచెము నీళ్ళును, ఒక పుష్పమును పరమభక్తితో నీ శిరస్సున నుంచినవాడు ధన్యుడై, జీవన్ముక్తుడై నీ దర్శన భాగ్యమును బొంది, నీతలపై గంగను, చంద్రరేఖను గూడ చూడగల్గును.

మ|| తమనేత్రద్యుతి దామె చూడ సుఖమై తాదాత్మ్యముంగూర్పగా
విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతా లాస్యముల్
సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూని హా
రిమృగాక్షీ నివహమ్ముకన్ను గలవన్ శ్రీకాళహస్తీశ్వరా!    107
తా||ధ్యానసమాధిలో నిశ్చల చిత్తులైనవారికి ఆత్మస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారము గలుగును. నేను శివుడను అద్వైతస్థితి (అహం బ్రహ్మాస్మి) కలుగును. అపుడు తన కన్నులలోని దివ్యతేజమును తానే చూచుకొనగలుగును. అట్టి మహోన్నత స్థితి కలుగుటకై ప్రయత్నింపక, ఈ మూఢజనులు స్త్రీలకన్నులు లేడికన్నులవలె అందముగా నున్నవనియు, పద్మములనియు, మెరుపుతీగెల కాంతులు కలవనియు, మన్మథునికి జయమును గూర్చునవి అనియు అంట గొప్పగా వర్ణింతురు. మోహమును లోనగుచుందురుని తాత్పర్యము.

మ|| పటవద్రజ్జు భుజంగవద్రజత విభ్రాంతిస్ఫురచ్ఛుక్తి వ
ద్ఘటవ చ్చంద్రశిలాజపాకుసుమరుక్సాంగత్య వత్తంచు వా
క్పటిమల్ నేర్తురు చిత్సుఖం బనుభవింపన్ లేక దుర్మేదసుల్
చిటుకన్నం దలపోయ జూతు రధముల్ శ్రీకాళహస్తీశ్వరా!    108
తా|| ఈశ్వరా! వంకరబుద్ధిగల పండితులు కొందరు ఆత్మజ్ఞానమునొంది ఆనందపారవశ్యము ననుభవింపలేక యీ జగత్తంతయు వట్టి భ్రాంతియనియు, ఆశాశ్వతమనియు చెప్పుచు, వస్త్రము వంటిది, రజ్జుసర్పభ్రాంతి వంటిది, ముత్యపు చిప్పను వెండిగా ఘటము వంటిది (ఇప్పుడుండి కొంత కాలమునకు నశించునది) మంకెన పువ్వు ప్రక్కనున్న చంద్రకాంతమణి వలె నెఱ్ఱనైనది (నల్లుకలువ ప్రక్కన నల్లగా మారునదికూడ, క్షణక్షణమునకు మార్పులకు లోనగునదికూడ) అనుచు, ఉదాహరణలతో వాగ్ధాటి చూపింతురు. మరికొందరు నీచులు చీమ చిటుకుమన్నను దానికేదో కారణముండునని యూహించుచు వ్యర్థముగా కాలేక్షేపము చేయుచు నీ యనుగ్రహమునకు దూరమగుచున్నారు.

మ|| నిను నిందించిన దక్షుపై దెగవొ? వాణీనాథు శాసింపవో?
చనువా నీ పదపద్మ సేవకుల దుచ్ఛంబాడు దుర్మార్గులన్
బెనుపన్? నీకును నీదు భక్త తతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనొ? లేకుండిన నూరకుండగలవా? శ్రీకాళహస్తీశ్వరా!    109
తా|| (దక్షుడు ఒకసారి శివుని నిందింపగా, శివుడాతని యజ్ఞమును బాడుచేసి, దక్షుని తలనరికి మేక తల యతికించెను. బ్రహ్మదేవునికి అయిదు శిరసులుండెడివి. పైనున్న శిరస్సు శివుని నిందించెను. శివునికి కోపము వచ్చి దానిని త్రుంచివేసెను. ఇవి పూర్వకథలు) శంకరా! నిన్ను నిందించినందుకు దక్షుని శిక్షింపలేదా? అదే పనిచేసిన బ్రహ్మకును శిక్ష విధించలేదా? ఇప్పుడు నీ భక్తులను నిందించు వారిని శిక్షింపక వృద్ధిలోనికి దెచ్చుచున్నావేమి? నీకును నీ భక్తులకును మధ్య భేదము నీకు కనిపించినదా? అందుకే ఊరకుంటివా?

మ|| కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబు కాదో? రతీ
శ్వరునిం గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లారెనో?
పరనిందాపరులన్ వధింప విదియున్ భావ్యంబె? వారేమి చే
సిరి నీకుం బరమోపకార మరియన్ శ్రీకాళహస్తీశ్వరా!    110
తా|| శంకరా! పూర్వము గజాసురుని సంహారించిన శూలము నీచేతి నుండి జారిపోయినదా? మన్మథుని కాల్చిన నీ మూడవ కంటి మంటలు చల్లారిపోయినవా? నిన్నును, నీ భక్తులను నిందించుచున్నవారిని శిక్షింపక ఊరకుంటివేమి? వారేమైనను నీకు మహోపకారము చేసిరా? (లంచము లిచ్చినారా అని ధ్వని.)

మ|| దురమున్, దుర్గము, రాయబారము, మఱిన్ దొంగర్కము న్వైద్యమున్
నరనాథాశ్రయ, మోడబేరమును, బెన్మంత్రంబు సిద్ధించినన్
అరయన్ దొడ్డఫలంబు గల్గు, నదిగా కా కార్యమే తప్పినన్
సిరియుంబోవును ప్రాణహానియునగున్ శ్రీకాళహస్తీశ్వరా!    111
తా|| శంకరా! యుద్ధము, కోటను జయింపవలెనని ముట్టడించుట, రాయబారము నడుపుట, దొంగతనము చేయుట, వైద్యము చేయుట, రాజాశ్రయము నొందుట, ఓడ వ్యాపారము, గొప్ప మంత్రము ఇవి సరిగా సాగినచో మంచి లాభము గలుగును. అట్లుకాక అవి అనుకొన్నట్లు సిద్ధింపనిచో ధనము, ప్రాణమును గూడ పోవును.
గెలుపోటములు, లాభనష్టములు కలుగుటకు నీ సేవ రాజకీయము కాదు, వ్యాపారమును కాదు. అలౌకికానందము నిచ్చు దివ్యమైన కార్యము అని భావము.

మ|| తనయంగాంచి, ధనంబులిచ్చి, దివిజస్థానంబు గట్టించి వి
ప్రున కుద్వాహముచేసి, సత్కృతికి బాత్రుండై తటాకంబు నే
ర్పునద్రవ్వించి, వనంబు వెట్టి, మననీ, పోలేడు నీ సేవ చే
సిన పుణ్యాత్ముడు పోవు లోకమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!    112
తా|| ఈశ్వరా! సత్సంతనము గనుట, దానము లిచ్చుచేయుట, ట, దేవాలయము కట్టించుట, విప్రునకు పెండ్లి ధర్మకార్యములు చేయుట, చెరువు త్రవ్వించుట, తోటలు నాటించుట అను ఏడింటిని సప్తసంతానము లందురు. వీనిని భక్తిశ్రద్ధలతో ఆచరించినవాడైనను, నీ పాద సేవకుడు చేరెడి శివలోకమునకు బోలేడు.

మ|| క్షితినాథోత్తమ! సత్కవీశ్వరుడు వచ్చెన్ మిమ్ములం జూడగా
నతడో మేటి కవిత్వ వైఖరిని సద్యఃకావ్య నిర్మాత, త
త్ప్రతిభల్మంచివి; తిట్టుపద్యములు చెప్పం డాత డన్నన్ మముం
గ్రితమే చూచెను బొమ్మటందు రధముల్ శ్రీకాళహస్తీశ్వరా!    113
తా|| ఈశ్వరా! రాజునాశ్రయించిన సజ్జనుడొకడు రాజుతో, “ఓరాజా! ఒక కవీశ్వరుడు మిమ్ము జూచుటకై వచ్చినాడు; అతడు మహాకవి; మంచి కవిత్వము చెప్పు నైపుణ్యము గలవాడు; అప్పటికప్పుడు గ్రంథము వ్రాయుటకు సమర్థుడు; తిట్టు కవిత్వములు చెప్పడు” అని విన్నవించగా ఆ రాజాధముడు “ఆ కవి మమ్ము ఇదివరకే చూచినాడు; ఇప్పుడు వేరే చూడవలసిన పని లేదు లె”మ్మని తిరస్కారముగా మాటలాడును. అటువంటి రాజులను సేవించి యవమానపడుట కంటే నీ పాదసేవ చేసికొనుచు దొరికినది తినుచు బ్రతుకుట మంచిది గదా!

శా|| నీకుంగాని కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీదెత్తితిన్,
జేకొంటిం బిరుదంబు, కంకణము ముంజేగట్టితిన్, బట్టితిన్
లోకుల్ మేచ్చ  నా తనువు కీలున్ నేర్పులుంగావు చీ
ఛీ కాలంబుల రీతి దప్పెడు జుమీ శ్రీకాళహస్తీశ్వరా!    114
తా|| ఈశ్వరా! నా కవిత్వము నీకే కాని యితరుల కంకితమియ్యనని మీదు గట్టియుంచితివి. శైవుడనని పేరొందితిని, నీమీదనే కవిత్వము చెప్పవలెనని కంకణము గట్టుకొంటిని, లోకులు మెచ్చునట్లుగా నియమము (పాశుపతదీక్ష) పెట్టుకొంటిని, ఇవన్నియూ నా తృప్తికోసమని గాని నా నైపుణ్యముచే గొప్ప కోసమని తెచ్చుకొన్నవని గానీ భావించవద్దు. కేవలము నీమీది భక్తి విశేషముచేతనే ఆచరించు చున్నాను. కాలము మారిపోయినది. భక్తితో చేసేడు పనులన్నియు లోకమునకు ఆడంబరముగా కనబడుచున్నవి.

శా|| నిచ్చల్ నిన్ను భజించి చిన్మయ మహా నిర్వాణ పీఠంబుపై
రచ్చల్సేయక, ఆర్జవంబు కుజనవ్రాతంబుచే గ్రాగి భూ
భృచ్చండాలుర గొల్చి వారు దను గోపింపన్ బుధుం డారుడై
చిచ్చారం జమురెల్ల జల్లు కొనుచో శ్రీకాళహస్తీశ్వరా!    115
తా|| ఈశ్వరా! పండితుడైనవాడు, నిత్యమూ నిన్ను సేవించి మోక్షమహా సామ్రాజ్య సింహాసనముపై గూర్చుండి భగవంతుని గుణగణములను గురించి చర్చచేయక, తన నిర్మలప్రవర్తనము దుర్జనుల నోళ్ళలోబడి కృశించిపోగా, పరమ దుర్మార్గులైన రాజులను సేవించి, వారు కోపించి పలికెడి మాటలకు బాధపడుచు, మంటలు చల్లారుటకై నూనె గుమ్మరించు కొన్నట్లు ఆ రాజుల నింకను ప్రార్థించి ప్రసన్నులను జేసికొనుటకే ప్రయత్నించెదరు. వారెంత యజ్ఞానులు! చదువుకొన్నంత మాత్రమున జ్ఞానము రాదని భావము. “బోధవిర్భావ నిదానముల్ చదువులయ్యా?” అని ఈ కవి, మొదట అన్నమాటను మరల చెప్పి స్థిరపరచుచున్నాడు. “ద్విర్బర్ధం సుబద్ధం భవతి” అని సామెత. రెండు చుట్లు చుట్టి కట్టినది గట్టిగా నుండునని యర్థము. అట్లే రెండుసార్లు చెప్పినది రూఢియగును.

శా|| దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే
వింతల్ మేన జరిం(నిం)ప నప్పుడే కురుల్ వెల్వెల్ల గానప్పుడే
చింతింపన్ వలె నీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!    116
తా|| ఈశ్వరా! పండ్లు ఊడిపోకముందే, శరీరములో జవసత్వములు నశింపకముందే, స్త్రీలు అసహ్యించుకొనక ముందే (అనగా అన్నిపనులు చేయుటకు శక్తి నశింపకముందే) ముదుసలితనము రాకముందే, శరీరములో రోగాదులచేత చాల మార్పులు రాకముందే, వెండ్రుకాలు నెరసిపోకముందే నీ పాదపద్మములను ధ్యానించి తరించు మార్గము నన్వేషింపవలెను. ముదుసలితనము వచ్చిన తరువాత ఏ పని చేయుదమన్నను శరీరము సహకరించదు గావున ముందే జాగ్రత్తగలవాడై మానవుడు ప్రవర్తింపవలెను.

5 comments on “శ్రీ కాళహస్తీశ్వర శతకము

 1. Ram Kumar says:

  just read . feel happiness and love life

 2. మరికొన్ని శతకముల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
  http://www.samputi.com/launch.php?m=home&l=te

 3. లింకుని పంపినందుకు ధన్యవాదములు.

 4. nvedamurthy says:

  Very useful. I browsed kalahasteeswara satakam

 5. CHAGANTI SUBRAHMANYAM says:

  Excellent service rendered so as to nurish philosophical attitude in the mankind. Very grateful.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s