వేదభూమిలో ఆధ్యాత్మిక శాంతివనాలు


స్థూలదేహానికి ఆరోగ్యం చేకూర్చుకొనుటకు, పరిశుభ్రమైన గాలి కోసం, పట్టణ ప్రజలు అప్పుడప్పుడూ దగ్గరలోనున్న పార్కులకు (ఉద్యానవనములు) లేదా ఊరి బయట పచ్చని పొలాల వైపుకు వెళ్ళి మంచి గాలి పీల్చుకుంటారు. మనష్యుడంటే ఒట్టి స్థూలదేహమే కాదు సూక్షమదేహమూ ఉంది. దీనిని మనస్సని, అంత:కరణమని అంటారు. స్థూల దేహం కంటే సూక్ష్మదేహం, అనగా మనస్సే ముఖ్యమైనది.

బంధానికిగాని, మోక్షానికిగాని మనస్సే కారణమవుతోంది. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు. మనస్సు చెడితే మనిషి చెడినట్లే. మనస్సు ఆరోగ్యమే ఒక మహాభాగ్యము. ఈనాడు ప్రజలకు అనేక జీవిత సౌకర్యాలు సునాయాసంగా లభిస్తున్నాయి. ఒకనాడు చక్రవర్తులకు కూడా లేని భోగభాగ్యాలు, ఆధునిక సౌకర్యాలు, ఈనాటి మానవులకు అందుబాటులో ఉన్నాయి. అతివైభవంగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నారు. కాని ఎందుకో ఎవ్వరికీ మన:శాంతి లేదు. తృప్తిలేదు, ఆనందం లేదు, హాయిలేదు. ప్రతి వారికి మానసింకంగా లోపలి ఆరోగ్యం చెడిపోయింది. కనుక, మనస్సుకు మందు వేయాలి. ఆ మనసు చక్కబదేందుకు మందెక్కడ లభిస్తుంది.

మందిచ్చే వైద్యులు ఎక్కడ ఉన్నారు?
సువిశాలమైన భారదేశమునందు ప్రజలకు సిరిసంపదలను, సిఖసంతోషాదులను, మనశ్శాంతిని ప్రసాదించే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రములనేకములు గలవు. అందు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు, ప్రత్యేకమైన ఖ్యాతిని గాంచినవి. పాకృతిక వైవిధ్యంలో అలరారే భరతఖండంలో సగుణోపాసన, కళారాధన వడదీయలేనంతగా పరస్పరానుబంధంగా విరాజిల్లుతూ వచ్చాయి. పర్వతశిఖరాలు, నదీతీరాలు, సముద్రతలాలు, అపూర్వ కళానిలయాలయ్యాయి. ప్రకృతి ఆరాధన సగుణోపాసానకు దారితీసే ఆలయాల నిర్మాణం ద్వారా కళలు సముల్లసితములయ్యాయి. మానసికోలాసాన్ని కలిగించి అద్భుతమైన హృదయానుభూతినందించే సుందర మధుర రమణీయ పవిత్ర క్షేత్రాలకు ఎనలేని ప్రాశస్త్యమున్న మాట సర్వజనవిదితం. చికాగోలో విశ్వసంస్కృతిని కదిలించిన వివేకానందోపన్యాసానికి స్ఫూర్తి ప్రేరణ కన్యాకుమరి సాగరదరి అందించగలిగిందన్న విషయం అత్యుక్తి కాదు. భారతీయ సంస్కృతి ప్రతిబింబంలా కనిపించె పవిత్ర దేవాలయాలు సనాతన సాంప్రదాయానికి సారధ్యం వహించే ఈ పవిత్ర క్షేత్రాలు ముమ్మాటికి భారతీయుల సిరి – శిల్ప సంస్కృతి వేనోళ్ళ చాటి చెబుతాయి. మన దేవాలయ శిల్పఖండాల్లో ముఖ్యాంశం సర్వమూ భగవదర్పితమే అనేది పరమసత్యం. అలాంటి దేవాలయములలో కాశీ, గయ, ప్రయాగ, హరిద్వార్, హృషికేష్, జగన్నాథం, కేదారబదరీనాథములు, శ్రీరంగం, కాంచీపురం, అహోబిలక్షేత్రం, చిదంబరం, భద్రాచలం, సోమనాథపురం, తిరుపతి, రామేశ్వరం, అరుణాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి మొదలైన కొన్నింటిని గూర్చి తెలుసుకొని, ఆయా పవిత్ర స్థలములను భక్తి శ్రద్దలతో దర్శించిన వారికి మనసు నిర్మలమవుతుంది.

పెద్ద పెద్ద నగరాలలో పరిశుభ్రమైన గాలి దొరకనట్లు ఈ ప్రపంచములో శాంతి బయట వెదకితే లభించదు. డబ్బు ఇచ్చి కొంటే దొరికేదికాదు. మనశ్శాంతికి మించిన ధనద్రవ్యాలు ఈ ప్రపంచంలో లేవు.

పార్కులకు వెళ్ళి ఉద్యానవనాలకు వెళ్ళి మంచిగాలి పీల్చి, స్థూల శరీర ఆరోగ్యం సంపాదించుకున్నట్లు ప్రతివారు అప్పుడప్పుడూ ఆశ్రమాలకు వెళ్ళి ఆధ్యాత్మిక విషయాలను శ్రవణం చేసి సూక్ష్మ శరీరారోగ్యాన్ని పొంది, హృదయ శాంతిని పొందాలి. ఆధ్యాత్మిక శాంతివనాలైన ఆశ్రమాలలో ప్రవేశించి ఉపనిషత్తుల గాలి, భగవద్గీత గాలి, భాగవతం గాలి పీల్చుకొని చిత్తస్వాస్థాన్ని, హృదయ శాంతిని సంపాదించుకోవాలి. ఆశ్రమ వాతావరణంలో సద్భావనలూ, సత్ప్రేరణలూ లభిస్తాయి.

పవిత్ర గంగాతీరంలో, ఏకాంత ప్రదేశాలలో, వన ప్రదేశాలలో, పవిత్రవాతావరణంతో ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని, ఎందరో మహనీయులు కందమూలాలను, ఫలాదులను సేవిస్తూ, నిర్మల వాతావరణంలో దృశ్య వ్యామోహముల నుండి దృష్టిని మరల్చి ఆధ్యాత్మ విచారణయందు నిమగ్నులై ధ్యానాదులను సలుపుచున్నారు.

వేదకాలంలో భారతభూమి అంతా మహర్షులమయం. విశ్వామిత్రుని సిద్దాశ్రమం, భరద్వాజుని ఆశ్రమం, శరభంగుని ఆశ్రమం, అగస్త్యాశ్రమం, శబరి ఆశ్రమం, వాల్మీకి ఆశ్రమం మొదలైన ఆశ్రమములు అనేకములు. శ్రీరాముడంతటివాడు భరద్వాజాశ్రమానికి సీతాసమేతుడై వెళ్ళి, ఆమ్మునీంద్రులకు ప్రణమిల్లి, అచట ఆరాత్రంతా గడిపాడు. మరియు శబరి యొక్క గురువులు మతంగమహర్షి ఆశ్రమాన్ని చూసిన శ్రీరాముడు మహదాశ్చర్యమునుపొంది లక్ష్మణునితో “నేను పుణ్యాత్ములైన మహర్షుల యొక్క ఆశ్రమము చూచితిని. ఇచట చాలా ఆశ్చర్యమైన విషయములుకలవు. ఇచట లేళ్ళు, పెద్దపులులు పరస్పరము విశ్వాసము కలిగి యుండును. అనేక రకములైన పక్షులు ఈ ఆశ్రమమున విహరించుచుండును” అని చెప్పాడు.

సీతాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు గల అభిలాష ఏదియో తెలుపవలసినదిగా శ్రీరాముడు కోరగా, అందుకు సీతాదేవి పవిత్ర తపోవనము చూడవలెనన్న అభిలాష తనకు కలదని, గంగాతీరానా నివసిస్తూ, ఫలమూలములను భుజిస్తూ, ఉగ్రతేజస్సులు, మహాత్ములైన మహర్షుల సమీపమున, ఆ తపోవనమున ఒకపూట నివసింపదలంచితినని చెప్పింది. శ్రీరాముడు అందుకు అంగీకరించాడు.

పూర్వం ఉపాసనాయోగ మార్గాలు ప్రబలంగా ఉన్న కాలము నాటి రామాయణంలో శబరిని చూదండి. అంతంగా విద్యకు నోచుకోని శబరి కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళగలిగిందంటే విషయాన్ని మనం గ్రహించవచ్చు, ఆనాటి ఆశ్రమ వాతావరణంలో మునీంద్రుల అనుగ్రహంతో మనస్సును ఏకాగ్రం చేసి యోగసాధనలో సిద్ధి పొందిన కాంత శబరి.

జానకిని అన్వేషిస్తూ భార్యావియోగంతో శ్రీరాముడు, లక్ష్మణునితో పంపానది ఒడ్డున అందమైన ప్రశాంత వాతావరణంలో ఉన్న, మతంగమహర్షి ఆశ్రమం చేరారు. అక్కడున్న శతవృద్ధురాలైన శబరి రామలక్ష్మణులను చూస్తూనే స్వాగతమర్యాదలు జరిపి, కుశల ప్రశ్నలు ముగించి, ‘రామభద్రా! మాగురువులు మతంగమహర్షి ఆజ్ఞప్రకారం, ఇక్కడ మీ రాకకోసం ఎదురు చూస్తున్నాను.

మీరు దండకారణ్యానికి వచ్చిన రోజులలోనే మా గురువులు ఉత్తమలోకాలకు వెళుతూ, మీరాక గురించి చెప్పారు. మీకు ఆతిధ్యం ఇచ్చి నా జన్మ సఫలం చేసుకోమన్నారు. అది మొదలు మీ కోసం ఎదురు చూస్తున్నను. ఏ రోజుకారోజు ఈ ఆశ్రం సమీపంలోని వృక్షాలపై పండిన ఫలాలు తెచ్చి ఉంచుతున్నాను. ఇంత రుచికరమైన ఫలాలు మరెక్కడ దొరకవు. ఆరగించండని ఫలహారం అయిన అనంతరం, ‘రామభద్రా! దీనిని మేఘవనం అనేవారు. మా గురువులు ఆశ్రమం నిర్మించాక, ఇది మతంగా వనంగా ప్రఖ్యాతమయింది. ఏకాగ్రచిత్తంతో ఈ వేదిక దగ్గర మా గురువులు అగ్నిదేవుని సంతృప్తిని చేసేవారు. వారి ప్రభావం ఎంతటిదో చూడండి. మీరు చిత్రకూటానికి వచ్చిన రోజుల్లో వారు జీవయాత్ర చాలించారు. ఎన్నేళ్ళయిందో అప్పుడే హోమం చేసి వెళ్ళారు. ఈనాటికి జీవయాత్ర చాలించారు.

ఇప్పుడే హోమజ్వాలలు లేస్తున్నట్లుంది, చూశారా! అగ్నిహోత్రశాలకు సమీపంలోనే సరోవరం. నిరంతరం ఉపవాసాలతో ఉండేవారు. కనుక స్నానపానాదులకు దూరం వెళ్లనవసరం లేకుండా ఇక్కడే పవిత్ర తీర్థాలతో నిండిన సప్తసాగర జలాలను రప్పించి, ఈ కొలను ఏర్పాటు చేసుకున్నరు. ఈ పవిత్ర జలాలను స్నానం చేసి ఇటు చూడంది, జీవయాత్ర చాలించడానికి ముందు, వారు స్నానం చేసి ఆరగట్టిన వల్కలాలు, ఆ చెట్తుకొమ్మల మీద కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడక్కడా అవి తడిగానే ఉన్నాయి. ఇన్నేళ్ళయినా! ఇటురండి, ఈ అగ్నిహోత్ర వేదికదగ్గర కలువపూలు కనిపిస్తున్నాయా! వారు వెళ్ళ్బోయేముందు పూజకోసం కోసుకొచ్చాను. ఇప్పుడే కోసినట్లు ఏంత నిగనిగలాడుతున్నాయో!

ఈ ఆశ్రమంలో వారి సేవలో నా జీవితం పండిపోయింది. వారి అనుగ్రహంవల్ల నీ దర్శనం అయింది. గురువుల అదేశానుసారం మీకు అతిథి మర్యాదలు నడిపించాను. నేనింక మా గురువులున్న దివ్యలోకాలకువెళ్ళి  వారి పాదసేవ చేసుకోవాలి. నా కింక సెలవూ అంటూ సమాధిలో కూర్చుంది. క్షణాలలో ఆ శరీరం నుండి యోగాగ్ని పుట్టి ఆమె దేహాన్ని అగ్ని భస్మం చేసింది. ప్రాణవాయువును ఎప్పుడు కావాలంటె అప్పుడు మండించి దేహాన్ని విడవగలిగిన యోగాన్ని సాధించి శబరి కూడా రామభక్తుల శ్రేణీల చేరిపోయింది. ఆనాటి శబరి ఆశ్రమవాతావరణంలో కొన్ని విషయాలు ఇవి.

అలనాటి ఆశ్రమాలు పరిశుభ్రమైన ముంగిళ్ళతో, ముగ్గులు, యజ్ఞ పరికరాలు, హోమగుండాలతో శోభిల్లుతూండేవి. ఒకనాడు సీతారామలక్ష్మణులు అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. మహర్షికి పాదాభివందనం చేశారు. ఆయన ఆశీర్వదించి తన భార్య అయిన అనసూయ దేవికి పరిచయం చేశాడు. సీతతో ‘అమ్మా! సీతా! ఈమె అనసూయ. అనావృష్టితో ప్రజలు భాదపడుతున్న సమయంలో ఈమె తన శక్తితో జాహ్నవి నదిని ప్రవహింప చేసి, క్షామ నివారన చేసింది. అంతటి గొప్ప తపశ్శక్తి గల పతివ్రత. ఆమెను సేవించి అనుగ్రహం పొందు” అన్నాడు అత్రిమహర్షి. పండిన జుట్తుతో, ముదుసలి అయిన అనసూయాదేవిని తన పేరు చెప్పుకుని పాదాభివందనం చేసి కుశలం అడిగింది సీతాదేవి. వాత్సల్యంతో సీతాదేవిని దగ్గరకు తీసుకుని ఆశీర్వదించి. దివ్యమాలలు, వస్త్రాభరణాలు ఇచ్చింది అనసూయ. అవి ఎప్పటికీ మాయని బట్తలు, వాడని పువ్వులు. శరభంగ మహర్షి ఆశ్రమం. రామలక్ష్మణులు సీతాదేవితో శరభంగమహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వీరు ఆశ్రమం చేరుసరికి దేవేంద్రుడు దివ్యరథంలో వచ్చి మహర్షితో మాట్లడుతున్నాడు. అది చూచి సీతా లక్ష్మణులను వదలి రాముడు వారిని సమీపించబోయాడు. ఆశ్రమం చేరి శరభంగమునికి పాదాభివందనం చేశారు. ఆయన చిరునవ్వుతో “రామా! నా తపోదీక్ష వలన బ్రహ్మ లోకం నాకు ప్రాప్తించింది. దేవేంద్రుడు స్వయంగా నన్ను తీసుకుని పోవడానికి వచ్చాడు.

నీరాక తెలిసి నిన్ను చూసి వెళదామని ఆగాను, నా తపశ్సక్తిననంతా నీకు ధారపోస్తాను” అన్నాడు. కానీ దానికి రాముడు అంగీకరించలేదు. రాముడుండగనే ఆ మహర్షి అగ్ని ప్రజ్వలింపజేసి, దానిలో ప్రవేశించి దేహత్యాగం చేసి బ్రహ్మలోకం చేరాడు. ఆధ్యాత్మిక శక్తి సంపన్నమగు దేశము భారతదేశము, యుగ యుగముల నుండి సద్గురువులకు, సాధుపురుషులకు స్థానమగుటచే ప్రపంచలోనే ధన్యమైనదేశం. ప్రపంచలో మరే ఇతర దేశానికి లేని ప్రత్యేకత భారతదేశానికి ఉంది. “భా” శబ్థానికి జ్ఞానము, కాంతి, దాంతి, శాంతి అని అర్థాలున్నాయి. అంటే, సతతం జ్ఞానపిపాసలో లీనమయ్యే దేశం మన భారతదేశం.

మనది “అనోభద్రా: క్రతోవోయంతు విశ్వత:” అనే వేదసూక్తి ననుసరించి జ్ఞాన సముపార్జన భారతీయుల పరమౌషధంగా భావించబడింది. కనుకనే, ధారిమిక రంగంలో ప్రపంచదేశాలకే మకుటాయమనంగా నిలిచింది భారతదేశం. అట్లే ఆధ్యాత్మిక పరమైన సాహిత్యంలో కూడా భారతదేశానికే అగ్ర తాంబూలం.

స్వశక్తిలేని, భగవత్కృప పొందజాలని, సచ్చీలములేని మానవుని ఆడంబరవర్తన హిందువులకు నిషిద్దము. హిం – పాపమునకు, దు – దూరముగా నుండువాదు, లేదా హింసకు దూరముగానుండువాడు హిందువు అనబడుచున్నాడు. హిందువనగా పాపరహితుడు మన పూర్వీకులు అట్టి ఆదర్శాన్ని ప్రపంచలోనే ప్రప్రథమంగా అవలబించి, తరించి మనకు ఆదర్శ ప్రాయులైనారు.

ప్రపంచములో మరొక దేశంలో లేని విధంగా ఈ పుణ్యభూమిపై ఉన్న భారతీయ మహిళలో కూడా ఆధ్యాత్మికచింతన అడుగడుగునా ప్రతిబింబిస్తుంటుంది. మనదేశంలో ఆధ్యాత్మికం అన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్న ఎక్కువగా దృష్టికి వచ్చేది మహిళలే, నిజానికి మన శాస్త్రాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మహిళల పాత్రను తేల్చి చెప్పాయి. ధర్మపత్ని సమేతంగా లేకుండా ఏ పూజాధికాలు నిర్వహించే అవకాశంలేదు. సంసారభందువు నిత్యజీవితంలో అనేక ఒడుదుడుకులకు ఎదుర్కొంటూ కూదా భగవద్భక్తిని మర్చిపోదు. భారతీయ స్త్రీ సంవత్సరం పొడుగునా వచ్చే అనేక పండుగలను, నోములని, ఉపవాసాలని, వ్రతాలని నిర్వహించడం మన సంస్కృతిలో భాగంగా తరతరాలనుండి వస్తున్న సాంప్రదాయమే. అంటే ప్రరోక్షంగా భర్తకు ఏ విధమైన ఒడిదుడుకులు లేకుందా సుఖమయమయిన జీవితం కొనసాగాలని ఆమె ఆకాంక్ష. వీటన్నిటికి వెనుకనున్న ఒకె భావన ఆమె నూరేళ్ళు కళకళలాడుతూ పసుపు కుంకుమలతో వర్థిల్లాలనేది, ఈ భవాంలోనే భారతీయ స్త్రీ ఉదాత్తత బయట పడుతుంది.

భారతీయులు ఆదినుంచి విశ్వానికి ఆధారభూతమైన ఒక అతీత శక్తి (పరమాత్మ) ను గురించి అన్వేషిస్తూ వచ్చారు. పరమాత్మను అత్యంత అనుభూతిగా భావించే “రసోవైన:” అన్నారు. ఆ అపూర్వ ఆనందం, తన్మయావస్త మహర్షులకే సాధ్యం. వేదకాలంలో భారతభూమి అంతా మహర్షులమయమవడానికి చాలా తార్కాణాలున్నాయి. తన ఉపాధికాలంలో అత్మోజ్జీవనంతో పాటు అన్యజీవోద్దరణచేసి అనేకులకు ముక్తి మార్గము చూపించి బ్రహ్మైక్యం చెందేవారు మహర్షులనబడతారు. తమ జ్ఞాన సంపదను పరోపకారం కొరకు, ప్రజాశ్రేయస్సు కోసం, ప్రపంచం నీతిమార్గంలో పయనించేటట్లు చేయడంకోశం నియోగించిన త్యాగమూర్తులు ఎందరో ఈ పుణ్యభూమిపై జన్మించారు. వారి అకుంటితదీక్ష, మోక్షసాధన జీవితాన్ని దైవ సాన్నిధ్యానికి అంకితం చేయడం చరిత్రలో వారిని చిరస్మరణీయులను చేసాయి.

మన పూర్వీకులు భారతీయులుగా జన్మించడమే ఒక గొప్ప వరంగా భావించేవారు. సర్వదేవతలు కూడా ఈ భారత కర్మభూమిలో జన్మించాలని కోరేవారట. ఎందుకని అంటే “స్వర్గశ్చాపవర్గస్య” భారతభూమిలో జన్మిస్తే జపం, తపం ఇవన్ని నడుస్తాయి. అందువలన స్వర్గాన్ని సాధించుకోవచ్చు. “అపవర్గ” అంటె మోక్షాన్ని సాధించుకోవచ్చు. మానవుడు మోక్షాన్ని సాధించడానికి ఈ ఒక్క కర్మభూమిలోనె సాధ్యమవుతుంది. పుణ్యం సంపాదించుకునాలనుకునేవారికి ఒకే ఒక గమ్యం భారతదేసం ఒక్కటె!

భాత్రభూమిలో ఉండేటటువంటివారు చాలా పుణ్యాత్ములు అనుకుంటారట దేవతలు (విష్ణుపురాణం)

Advertisements

One comment on “వేదభూమిలో ఆధ్యాత్మిక శాంతివనాలు

  1. rathnamsjcc says:

    సూక్షమమనస్సుద్వారానే తాను పరమాత్మ స్వరూపమని తెలుసుకొని, ఇదే విషయాన్ని తన శ్రీ వీర బ్రహ్మంగారి సూక్షభూతి.అదే సందేహం లేకుండా సూక్ష ఇతరులకు కూడా తెలియచేస్తున్నారు. తన్ను తాను తెలుసుకోవటమే పరమ ధర్మం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s