హనుమదుపాసన


భక్తునిగా పరిచమై, భగవంతునితో సమానంగా పూజలందుకున్న వాడు – హనుమంతుడు! లక్ష్మణుడికీ, భరతుడికీ విడివిడిగా ఎక్కడా గుడులున్న దాఖలాలు లేవు. సరికదా,  తన దైవమైన శ్రీరాముడి కన్నా తన పేరిట ఎక్కువ దేవలాయాలు వెలసిన చరిత్ర – హనుమంతుడిది. హనుమంతుడి కథ పావనం, సుందరం. రామయాణంలో సుందరకాండ నిజానికి హనుమత్కాండ!
…తతో  రావణ సీతయా: ….  అంటూ ‘ త ‘ కారంతో మొదలైన సుందరకాండ – తవాపి శోకేన తదాభి పీడితా .. అనే శ్లోకంతో ‘ త ‘ కారంతోనే ముగిసింది. ‘ తత్ ‘ అంటే బ్రహ్మం. దానికి సంబంధిచిన జ్ఞానమే తత్వం. హనుమంతుడు పరబ్రహ్మ స్వరూపుడని ప్రశంస. ఆంజనేయుడు, నారసింహుడు, గరుత్మంతుడు, హయగ్రీవుడు, వరాహస్వామి…. ఈ అయిదుగురూ ఒకే తత్వానికి చెందిన వేరువేరు అభివ్యక్తులని పరాశర సంహిత వర్ణించింది. ఆ అయిదు సక్తుల సమైక్యరూపంగా, మహా దివ్యప్రభావంతో విరాజిల్లే స్వరూపం – పంచముఖ ఆంజనేయస్వామిదని వివరించింది.

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్య వక్త్రాంచితం
నానాలంకరణం త్రిపంచ నయనం దేదీప్యమానం హరం!

అంటూ పంచముఖ ఆంజనేయుణ్ణి – పరమేశ్వర తత్వానికి చెందిన రుద్రమూర్తిగా ఆరాధించడం మనదేశలో ఒక ఆచారం. ఆ కోణంలోనే ఆంజనేయోపాసన చాలా ప్రాధాన్యాన్ని పొందింది. రామాయణాన్ని ఒక కావ్యంగా పరశీలిస్తే – హనుమ ఒక ఆదర్శవంతుడైన భక్తుడు! ఆద్యాత్మిక అభినివేశంతో మంత్రగర్భిత మాహాశాస్త్రంగా రామాయణాన్ని దర్శించేవారికి – ఆయన ఉపాస్య దైవం! అంటే – ఆయన భక్తుడూ, భగవంతుడూ కూడా! రామాయణ మహ కావ్యాన్ని ఒక పవిత్ర దేవాలయ మహాప్రాంగణంగా  భావన చేస్తే – సుందరకాండ అందులో గర్భగుడి అవుతుంది. ఆ గర్బగుడిలో దేవుళ్ళు రాముడూ, హనుమంతుడూనూ! చేర దీసిన సుగ్రీవుడికి, చెలిమి చేసిన వానర సహచరులకు, ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడికి సైతం ఆయా సందర్భాల్లో  ‘ అభయం ‘ ఒసగిన ఘనుడు కనుక ‘ అభయాంజనేయస్వామి ‘  గా భక్తుల ఆరాధనలకు ఆయన నోచుకున్నాడు.

శివుడి అష్టమూర్తుల్లో వాయుదేవుడొకరు. ఆయన అంశ హనుమంతుడు. కనుక హనుమలో రుద్రతేజం ప్రకాశించిందంటారు. రాక్షస సంహారకాండ విషయమై అయన నుంచి వ్యక్తమైనది లయకారుడైనరుద్రాంశగా వివరించారు. పంచముఖ ఆంజనేయ తత్వాల్లో ఒకటిగా చెప్పుకొన్న నారసింహ తత్వమూ అదే సందర్భంలో వ్యక్తమైందని మరో వివరణ. జ్ఞానమూర్తిగా ఆయనది హయగ్రీవుడి అంశ కాగా, సముద్రాన్ని లంఘించే సందర్భంలోను, ఓషదులతో కూడిన పర్వతాన్ని పెళ్ళగించి తెచ్చి, లక్ష్మణుని కాపడిన ఘట్టంలోను హనుమ వేగంలోంచి గరుత్మంతుడి అంశ ద్యోతకమైంది. క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వతాన్ని ఎత్తి సముద్రం దగ్గరికి చేర్చినవాడు గరుత్మంతుడేనన్న విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

సముద్రాన్ని లంఘించే ఘట్టంలో వాల్మీకి హనుమను నందీశ్వరుడితో పోలుస్తాడు. (గవాంపతి రివాబభౌ – ) పరాశక్తి స్వరూపాన్ని తొలుతగా ఉపాసించినవాడూ, ఆ దర్శనాన్ని శ్రీవిద్యగా లోకానికి అనుగ్రహించిన వాడూ – నందీశ్వరుడు. అందుకే లలితాపరాభట్టరికను వివరించే విద్యకు ‘ నందివిద్య ‘ అని పేరు వచ్చింది (నందివిద్యా నటేశ్వరీ…) ఇలాంటి రహస్యాలను గ్రహించి, భావన చేస్తే – లంకకు వెళ్ళేముందు హనుమ ఎలా ఎదిగిపోయాడో అలా మన గుండెల్లోనూ ఎదిగిపోతాదు. హనుమదుపాసన అంటే అదే!  హనుమజ్జయంతి సందర్భంగా సాధించ వలసిన దర్శనం అది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s