భగవంతుడు భక్తపరాధీనుడు


వైకుంఠాన్ని వదలి వెళ్ళిన శ్రీమహా విష్ణువు ఎక్కడున్నాడు?

అది అమరావతి. దేవేంద్రుని నగరి. దేవేంద్రుని భవంతి. అష్టదిక్పాలకులు ఆశీనులై ఉనారు. బృహస్పతి వారు ఉచితాసనం అలంకరించి ఉన్నారు. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మామూలు దుస్తులు ధరించి అందచందాలకు, భక్తి శ్రద్ధలను జోడించి కూర్చున్నారు. నారా తుంబురులకు గౌరవస్థానం, సత్కారం లభించింది.

దేవతారాధన జరుగుతోంది. నాదగానాబజానాలతో విలాజ జీవితాని గడుపుతున్న దేవేంద్రుడు, ఆరోజు సతీ సమేతంగా కంకణబద్ధుడై పూజకు కూర్చున్నాడు.

శాపవిమోచనం కొరకే ఆ పూజ. సుదర్శన ఆరాధనం. ఆరాధన అధిపతి శ్రీమహావిష్ణువు.

ఇంద్రునికి కలిగిన శాపవిమోచనానికి ఈ ఆరాధన అతి ముఖ్యం. దేవగురువైన బృహస్పతులవారు సూచించిన ఆరాధన. నారాయణుని పారాయణం జరుగుతోంది. మంత్రాలు శ్రావ్యంగా వినబడుతున్నాయి.

ఇంద్రునికి ఇప్పుడు శాపకారణమైన సంగతి స్ఫురణకు వస్తోంది. మరువరాని ఘటన. బ్రహ్మదేవుని శాపం. చేదు జ్ఞాపకాలు పీడిస్తున్నాయి. మహేంద్ర పదవి అంటే సోమరసపానం, రంభాది అప్సరసలతో సుఖంచడం మాత్రమె అని దేవేంద్రుని భావన. అహంకారం  తలకెక్కింది. ఇంద్రపదవి అంటే త్రిమూర్తులతో సమానమైన అధికారం అనే భావన ఏర్పదిందో లేక అంతులేని విలాస జీవితం ఆ భావన కలిగించిందో అగోచరం.

బ్రహ్మదేవుని ఉపేక్షించటం నిత్య నిత్య పూజలో లోపం. ఇది అహంకార ఫలితం -  అ ఫలితమే బ్రహ్మశాపం. “ఏ ఇంద్రపదవి ని శిరస్సును ఇంతగా అవతరించి మైమరపించిందో, ఆ పదవి నీకు శాపం కావాలి. మూడు నాల ముచ్చట. ఆరు దినాల ఆరాటం"

ఇది బ్రహ్మ ఇంద్రునకు ఇచ్చిన శాపం!

సృస్తికర్త శాపం ఏ కారణం చేత తప్పదు. ఏ రాక్షసుడు తప్పసు చేసి వరం పొంది వచ్చినా, మొదటి దండయాత్ర అమరావతి మీదే. మహేంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసి రాక్షసుడు రాజ్యం ఏలుతాడు. ఇంద్రుడు నిలకడ లేక లోకాల వెంట తిరగాలి. అదీ శాప ఫలితం. బ్రహ్మశాపాన్ని హరిహరులు కూడా తప్పించలేరు. కానీ వైకుంఠవాసుని ప్రార్థిస్తే శాపవిమోచనానికి పరిహారం చూపించగలరు.

అందుకే, బృహస్పతులవారు సూచించిన ఈ సుదర్శన ఆరాధనం. ఆరాధన సవ్యంగా ముగిసింది. పూజా ఫలాన్ని స్వీకరించడానికి స్వీకర్త నారాయణుడు ఇంద్రలోకానికి విచ్చేయలేదు. ఫలితం దక్కలేదు. దేవపతికి దిక్కుతోచలేదు. బృహస్పతి వంక తిరిగి “గురుదేవా! ఈ నా ఆరాధనలో ఏదైనా లోపం జరిగిందా?"

“దేవేంద్రా! నాకు తెలిసినంతవరకు ఎట్టి లోపం జరగలేదు. నాకొక సందేహం కలుగుతోంది".

“సందేహమా! ఏమది గురుదేవా!”

“దేవేంద్రా! సుదర్శన ఆరాధన సమయంలో నీ మనస్సు సుఖాలవైపుకు వెళ్ళి, నీవు చపలచిత్తుడవు కాలేదు కదా!” “గురుదేవా! శాపవిమోచనకై ఆరాధిస్తున్న వేళలో నేను ఏకాగ్రతను పోగొట్టుకోవడం సాధ్యమా?” అందరూ విచారంలో మునిగి ఉన్నారు. శ్రీహరి పూజను స్వీకరించడానికి రాలేదంటే ఆరాధన అసంపూర్ణతే అవుతుంది. ఎదురు చూచినా ఫలితం ఎంతమాత్రం దక్కదు. “గురుదేవా! నా కర్తవ్యము తమరే సెలవివ్వాలి”. “ఇంద్రా! ప్రస్తుత కర్తవ్యమ్ ఒక్కటే! మనమందరం కలసి వైకుంఠానికి వెళ్ళి నారాయణుని ప్రార్తించడమే", అప్పటికి అందరికి అదే సరైన మార్గ మనిపించింది. బృహస్పతులవారి ఆధ్వర్యంలో అందరూ హరినామస్మరణ చేస్తూ వైకుంఠం వైపు సాగారు.

పాలకడలిలో శేషశాయి అయిన శ్రీహరి వాళ్ళ శాప విమోచన మార్గం తప్పక లభిస్తుందని దేవేంద్రుని మనసు ఆరాటపడుతోంది. కానీ జరిగిందేమిటి? వైకుంఠ ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఆదిశేషుడు అక్కడే ఉన్నాడు. పాలసముద్రం తళతళలాడుతోంది. కాని దేవదేవుడు అక్కడ లేదు. నిరాశ. ఆందోళన – నిస్పృహ – ఆటంకము. బృహస్పతి చేతులు జోడించి “ఆదిశేషా! భగవంతుని దర్శనార్థం వచ్చాము. కానీ, స్వామివారు లేరే. ఆ అవతారపురుషుని దర్శనం మాకు ఎక్కడ లభిస్తుంది, స్వామివారు ఎక్కడ?”

“వాచస్పతీ! జ్ఞానులైన తమరే ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు? ఆ మాయమయుడు, సకల కార్య కార్యాల సూత్రధారి, ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఎవరిని కరుణిస్తాడో ఎవరు చెప్పగలరు?” బృహస్పతి తల ఊపుతూ “నిజం, నీ మాట అక్షరాలా నిజం. ఒకవేళ ఉమాకాన్తుని దర్శనార్థం కైలాసానికి వెళ్ళి ఉంటాడేమో?” ప్రయత్నించి చూడండి? అన్న మరుక్షణం అందరూ కైలాసం వైపు వెళ్లారు.

కైలాసంలో కపర్ది కాత్యాయనీ సమేతుడై యోగనిద్రలో ఉన్నాడు. అందరూ శిరస్సులు వంచి ఓం నమశ్శివాయ, శంభో శంకరా! అంటూ నమస్కరించారు.

“ఆదిదేవా! శ్రీహరిని అన్వేషిస్తూ వచ్చాము. స్వామివారు ఎక్కడున్నారో తెలియబరచండి. సకల లోకేశ్వరులైన తమకు తెలియని దేమున్నది?” అని అడిగారు.

ముక్కంటి ముఖం మందహాసంతో విప్పారింది. శ్రీహరి ఉన్నచోటు దివ్యదృష్టితో గోచరించింది.

“శ్రీహరిని ప్రసన్నుని గావించుకోవడం అంట సులభాసాధ్యమా? మీ మీ అన్వేషణ కొనసాగించండి" అన్నాడు శంకరుడు. అంటే తనకు తెలిసినా చెప్పకూడదనే దాని భావం. అందరూ శివుని అనుమతితో సత్యలోకానికి బయలుదేరారు. వైకుంఠ కైలాసల్లో లేని శ్రీహరి సత్యలోకంలో మాతరం ఉంటాడా! అనే సందేహంతోనే బ్రహ్మలోకం చేరుకొన్నారు. వారిని చూసిన విరించి విషయం గ్రహించి, “మీ సందేహం వాస్తవమే. సత్యమే. నారాయణుడై ఉండగా సత్యలోకంలో సత్యనారాయణుడు ఉండటమేమిటి?” అన్నాడు.

“చతుర్ముఖా! సకల చరాచరసృష్టికారకా! నారాయాణాన్వేషణలో తిరుగుతున్నా మాకు మీరే మార్గం చూపించాలి?” అన్నాడు వాచస్పతి. “భగవంతుడు భక్తి పరాధీనుడు. భ్హోలోకంలో ఒక పరమ భక్తాగ్రేసరుని ఆధీనంలో ఉన్నాడు" అని బ్రహ్మ సెలవిచ్చిన వెంటనే దేవేంద్రుడు “విధాతా! శ్రీహరిని తన ఆధీనంలో ఉంచుకొన్న పరమభక్తుడెవరు? స్వామీ!”

“సహస్రాక్షా! భ్హోలోకానికి వెళ్ళి చిత్తశుద్ధితో శ్రీహర్ని భక్తుల్ని అన్వేషించి సందర్శించండి. ఎక్కడో ఒకచోట కమలాక్షుడు కనిపిస్తాడు". ఇప్పుడందరూ బ్రహ్మ వాక్కును స్వీకరించి వాయువేగ మనో వేగాలతో భూలోకం చేరి భాక్తాన్వేషణలో అనేక అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ వెళ్తున్నారు.

భూలోకంలో నారాయణుని శిలావిగ్రహాలు, కంచుప్రతిమలే కనిపిస్తున్నాయి. కాని, అత్యుతుడు అగుపించలేదు. ఆ విధంగా అవనీలోకంలో అన్వేషిస్తుండగా అడుగడుగునా పొంతనలేని అనేకానేక దృశ్యములు కనపడుతున్నాయి.

ఆశ్చర్యం. ఒకచోట అందరూ, హఠత్తుగా ఆగారు. శ్రీహరి నామస్మరణ కర్ణానందంగా వినవచ్చింది. అందరూ ఆవైపు తిలకించారు. అదొక అపురూప దృశ్యం.

నారాయణ నామస్మరణ చేస్తున్నది ఒక సామాన్య మానవుడు. బీదవృద్ధుడు. చెప్పులు కుట్టుకుని జీవించే చర్మకారుడు. పాడుతూనే తన కర్తవ్యం నిర్వహిస్తున్నాడు. పెరుమాడయ్య. వైకుంఠం, కైలాసం, సత్యలోకాలనే వదలి భూలోకంలో ఒక పేదభక్తుని ఆధీనంలో ఉన్నాడు వైకుంఠ వాసుడు. భగవంతునికి భక్తునికి అనుసంధానము అచంచల భక్తియే కదా!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s