శ్రీవశిష్ఠ గీత ప్రాశస్త్యం


హిందూ శాస్త్రాలు, శృతి, స్మృతి ఇతిహాస, పురాణ, ఆగమ దర్శనాలను ఆరు వైదిక శాఖలుగా, సుభాషిత కావ్య, నాటకాలంకారాలు నాలుగు లౌకిక శాఖలుగా విభజింపబడ్డాయి. వీతికన్నింటికిని వేదాలే మూలం. ఈ వేదాలు సామాన్య మానవుని అర్థంకాకుండా ఉండటం వల్ల వాటిని సులభార్థంతో వ్యాఖానించి తెలిపేవి ఇతిహాసాలు. ఇతిహాసాలంటే జ్ఞానబోధక మిత్ర సముదాయం అని అనవచ్చు.

ఇట్టి ఇతిహాసాలలో నాలుగు మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.

  1. మహాభారతము
  2. వాల్మీకి రామాయణము
  3. హరివంశము
  4. యోగ వాసిష్టము

యోగవాసిష్టం భగవద్గీత కన్నా పూర్వమైనది. అది త్రేతాయుగం నాటిది. మరి ఇది ద్వాపర, కలియుగారంభము నాటిది. ఈ రెండు గీతాలు నరనారాయణ సంభూత సంవాట గీతలు. ఇక యోగవాసిష్టం భారతీయ తత్త్వ శాస్త్రాలలోకెల్ల శిరోమణివంటిది. శ్రీవాల్మీకి మునిపుంగవుల చేత శ్రీరామచంద్రునికి ఉపదేశింపబడిన సంవాద రూపక గీత. ఇది ముప్పది రెండు శ్లోకాలలో మృదు మధురంగా బోధింపబడింది. ఇందులో రెండు విభాగాల్ ద్యోతకమవుతున్నాయి. మొదటి భాగంలో సంసార సాగరంలో మునకలు వేస్తున్న ప్రాపచిక వాసనగల పురుషుల దంభలు, వాసనలు, రాగములు, అభిలాషలు, అభిరుచులు వేటిని సాధకులకు బోధపడునట్లు పొందుపరచడం జరిగింది.

ఇక రెండవ భాగం జీవేశ్వరులకు స్వరూపంలో ఏకత్వం కలదనికాని, మానవుడు మాయమోహితుడై ఉన్నంతవరకు ఈ ఐక్యం అతనికి సాక్షాత్కరించదని తెలుపుతోంది. కానీ, వివేకము, వైరాగ్యము, శమాదిషట్క సంపత్తి, మముక్షత్వం అను సాధన చతుష్టయం ద్వారా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలడని నిరూపిస్తోంది.

వసిష్ఠ మహాముని గీతాచార్యుడు కావు ఇది వసిష్ఠ గీత అని ప్రసిద్ధిగాంచింది. ఈ గేతకు వాసిష్ఠ రామాయణ మని కూడా నామధేయం ఉంది.

ఇక వాసిష్ఠగీతకు మరి శ్రీకృష్ణుడు ఉపదేశించిణ భగవద్గీతకు సారూప్యము ఉంది. అవి ఏమిటని అడిగితే :-

  1. శ్రీరామచంద్రుల వారికి శ్రీ వసిష్ఠమహామునులు సంవాద రూపంలో ఉపదేశించారు. అదేవిధంగా అర్జునునుకి శ్రీకృష్ణ భగవానులు సంవాద రూపంలో భగవద్గీతను ఉపదేశించారు.
  2. శ్రీరామచంద్రుడు బాల్యావస్థలో దృశ్య ప్రపంచం యొక్క అనిత్యతను ఎరిగి భోగావిలాసముల ఎడ పూర్ణ విరక్తి కలిగి కర్తవ్యం తెలియక విషాద గ్రస్తుడై తూష్ణేం స్థితిలో ఉన్నప్పుడు కులగురువైన శ్రీవసిష్ఠ మహాముని అతనికి ధైర్యోత్సాహాలు పురిగోలుపుతూ ఈ వసిష్ఠగీతను అఖండపారమార్ధిక బోధనుగావించాడు. అర్జునుడు ప్రాపంచిక ఐశ్వర్యమూలా ఎడల విరక్తి, త్రైలోక్య సామ్రాజ్యమును వలదని విసర్జించుటకు సిద్ధపడి, కర్తవ్య విమూడుడై విషణ్ణ హృదయుడై మాయామోహితుడై, నిరాశనిస్పృహలతో కృంగిపోతున్న తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించి రణోన్ముఖుని గావించాడు.

శ్రీరామచంద్రుడు వసిష్ఠగీత వలన స్వకార్య దీక్షితుడైనాడు. అదేవిధంగా శ్రీకుష్ణుని బోధనా వల్ల అర్జునుడు కార్యాచరణ ప్రవర్దుడై యుద్ధరంగానికి బయలు దేరాడు.

శ్రీ రామచంద్రుడు శ్రీ వసిష్ఠుల ఉపదేశం విన్న పిదప ఈ ప్రకారం చెప్ప గలిగాడు.

  1. నష్టో, మోహః పదం ప్రాప్తం త్వత్ర్పసాదాన్మునీశ్వర సంపన్నో హమహం సత్యమత్యన్తమవదాధీః
  2. స్థితో స్మి గత సందేహః స్వభావే బ్రహ్మారూపిణి నిరావరణ విజ్ఞానః కరిష్యే వచనం తన.

– (శ్రీ వ.గీ.నిర్వాణ ప్రకరణము)

ఓ మునీంద్రా! మే అనుగ్రహం వాలా అజ్ఞానమిప్పుడు నశించింది. ఆత్మ స్వరూపము తెలుసుకున్నానని రాముడు పలికాడు.

శ్రీకృష్ణ పరమాత్మ బోధన విన్న తరువాత అర్జునుడు,

“నష్టో మోహః స్మృతిస్మృతిర్లభ్దా త్వత్ప్రసాదాన్మయాచ్యుత

స్తితోస్మి గత సందేహః కరిష్యే వచనం తన”. – (శ్రీ భగవద్గీత : 18-73)

హే కృష్ణ పరమాత్మా! మీ అనుగ్రహంచే ణా అజ్ఞానాంధకారం తొలగింది. జ్ఞానోదయం కలిగింది. సందేహాలు తొలిగాయని పలికాడు.

దీనిని బట్టి శ్రీరామచంద్రులు అర్జును లిరువురు ఒకే మానసిక పరిస్థితిలో ఉంది వారి వారి గురుదేవుల ఉపదేశం వల్ల మనః క్లేశముల నుండి బయటపడి బ్రహ్మ జ్ఞానం పొంది ఆత్మపడం తెలుసుకోన్నవారై ధర్మాచరణ ప్రభ్రుతులై కార్యరంగమున దూకారు. ఇది శ్రీవసిష్ఠ – భగవద్గీతల సారూప్యాలు.

ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మ విద్యా, వేదాంతవిద్య జనులను సోమరిపోతులుగా తయారు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అది సరికాదు. సోమరులను “సోహం” పరులుగా తయారు చేసేదే ఆత్మవిద్య. అకర్మణ్యులై, తమోగుణాభి భూతులై మందంగా పది ఉన్న జనులను “ఉత్తిష్టత, జాగ్రత, ప్రాస్యవారాన్, నిబోధత” మున్నగు ధీరవాక్యాలతో జాగృతి కావించి కార్యరంగంలో దుమికించి నిష్కామా చరణం గావించినదే వేదాంత విద్య.

శ్రీవసిష్ఠగీతలో నిర్వాణ ప్రకరణంలో అర్జునోపాఖ్యానమనే ఘట్టమొకటి ఉంది. అందులో వసిష్ఠులు శ్రీరామచంద్రునకు ద్వాపరయుగాంతంలో శ్రీకృష్ణార్జునుల ఇరువురి మధ్య జరుగబోవు శ్రీభాగావద్గీతా రూప సంవాదాన్ని చక్కగా వివరించారు.

ఈ వసిష్ఠబోధ దాదాపు ఇరువది దినములు దశరథుల ఆస్థానంలో జరిగింది. పెక్కు ఋషులు, మునీశ్వరులు, జిజ్ఞాసువులు ఇంకా జ్ఞానోత్కంటంచే ప్రేరితులై ఏతెంచారు. గొప్ప ఆధ్యాత్మిక సభ సమకూడింది. ఆ మహాసభలో శ్రీరామచంద్రుడు, వసిష్టుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, భృగువు, అంగీరసుడు, పులస్త్యుడు, చ్యవనుడు, ఉద్దాలకుడు ఇంకా పెక్కు ముని ఋషి పుంగవులచే శోభించింది.

ఆ అద్భుతమైన బోధ శ్రోతలపై ఎలా ప్రతిఫలించిందో ఈ క్రింది సంఘటనలవల్ల తేటతెల్లమవుతోంది. బోధ పూర్తి అయిన తరువాత పిదప, విశ్వామిత్రుడు లేచి ఆ నిండు సభలో నిట్లు పలికాడు.

ఆహా! ఎంత సొంతోషం, మహాపుణ్య స్వరూపమై అత్యంత పవిత్రమైనట్టి జ్ఞానం వసిష్ఠ మునీంద్రుని ముఖతః ఇప్పుడు వినగాలిగాను. దానికి వేల గంగానదులలో స్నానంచేసిన చందాన మనం పవిత్రులమయ్యం.

ఇంకా త్రిలోకసంచారియైన నారదుడు ఏవిధంగా సెలవిచ్చాడో చూడండి.

దేనిని బ్రహ్మలోకంలోగాని, స్వర్గంలోగాని, భూతలమున గాని ఇంట వరకు నేను వినియుండలేదో అట్టి మహాబోధను ఇప్పుడు నేను విని నాచెవులు రెండును పవిత్రములైనవి.

ఇంకను సిద్ధులు, ఈ విధంగా వచించారు.

కత్రారంభము నుండి సిద్ధ సంఘములం మేము మోక్షోపాయల గూర్చి వేల కొలది గ్రంథాలను పఠించాము. వ్యాఖ్యాన మోనర్చితిని. కానివసిష్ఠుల బోధనవంటిది మేమెక్కడ విని ఉండలేదు.

ఇక వసిష్టుడేమీ బోధించాడో, దాని సారాంశం మేమిటంటే….

ప్రారంభంలోనే శ్రీవసిష్టులు శాస్త్రానుకూలమగు పురుష ప్రయత్నం యొక్క ఆవశ్యకతను గూర్చి పలు తెరుగుల బోధించారు. ఈ జన్మలోని శుభ పురుష ప్రయత్నాలతో పూర్వజన్మపుఅశుభపురుష ప్రయత్నం నిస్సందేహంగా శమించిపోతాయని చెప్పాడు.

సంసార కుహరా దస్మాన్నిర్గన్తవ్యం స్వయం బలాత్

పౌరుషం యత్నమా శ్రిత్య హారిణేవారి పంజరాత్

(శ్రీ వ.గీ. మముక్షు ప్రకరణం)

ఉత్తమ పురుష ప్రయత్నాన్ని ఆశ్రయింది ఈ సంసారమను గోతినుండి, శత్రుపంజరం నుండి సింహంలా స్వయ బలప్రతాపంతో బయల్వేడవలెనని శ్రీవసిష్ఠులమముక్షు ప్రకరణంలో శ్రీ రామచంద్రునికి బోధించాడు.

ఇక నరకమను వ్యాధికి ఈ లోకంలో ఎవడు చికిత్స గావించుకోనడో, అట్టి భవరోగగ్రస్తుడు ఔషధంలేని ఇతర లోకాలకు చని ఏమి చేయగలడని శ్రీవసిష్ఠ మహర్షి నిర్వాణ ప్రకరణంలో ప్రశ్నించారు. సంసార సముద్రాన్ని దాటడానికి తపస్సుగాని, తీర్థాలుగాని, శాస్త్రాలుగాని, సజ్జనులు, మహాత్ముల సేవనము లేనిచో విజయవంతం కానేరవు. నావికుని యొక్క నౌక లభించునట్లు మహానుభావుడగు జ్ఞాని యొక్క సాంగత్యంవల్ల సంసార సముద్రాన్ని దాటడానికి యుక్తి లభిస్తుంది. దారిద్యము, మరణం. దుఃఖం ఇత్యాది విషయాలచే కూడిన ఈ సంసార భ్రమయను రోగం సాధుజన సాంగత్యమును ఔషధంచే సంపూర్ణంగా నశిస్తుంది. కావున వసిష్ఠుల శ్రీరామచంద్రుల వారికి సతీసాంగత్యం మోక్షద్వార పాలకునిగ ఇలా వర్ణించారు.

మోక్షద్వారంలో శమం, విచారణం, సంతోషం, సాదుజనసాంగత్యం అను నలువురు ద్వారపాలకులు గలరని, ఈ నాల్గింటిని తన శక్తి ప్రయత్నంగా సంపాదించాలి. ఇవి మోక్షమునకు మూల ద్వారం. ఏదైనా ఒకదానిని సాధించితే మిగతాది సాధింపవచ్చు. కావున సంసార సముద్రాన్ని దాటడానికి మానవుడు ఈ నాలుగు ఉపాయాలు సంపాదించాలి. కాబట్టి మహా కష్ట పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆదు జన సాంగత్యం వీడరాదని, వారి ద్వారం ముక్షువు పదమునకై సాధన చేయవలెనని వసిష్ఠులవారు వక్కాణించారు. ఇంకను గురూపదేశము ద్వారా మలినమైన మనస్సును ఆత్మ జ్ఞానముతో ఉత్తమ వైరాగ్యాన్ని సంపాదించాలి. మనోనిగ్రహం ద్వారా సమస్త ఉపద్రవములు తొలగించుకోవచ్చు. సమస్త దృశ్య ప్రప్రంచము మనస్సు యొక్క స్వరూపమే కావున, అట్టి మనసుకు చికిత్స చేస్తే, సంసార రోగామంతా చికిత్స కావింపబడుతుంది. ఈ సంసార చక్రం యొక్క మాయా చక్రం నాభి (బొడ్డు) మనస్సే అయి ఉన్నది. ఆ మనసును ఎవరు జయిస్తారో, వారిని మాయ, సంసార ఒక్కింతకూడా బాధించడు. ఇంద్రియాలు, సుఖాలు మోక్ష మార్గానికి పెద్ద అవరోధాలై ఉన్నాయి. అట్టి ఆవరోధములను దాటినవానిచే పరమపదము సులభంగా పొందబడుతుంది.

ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాలను చేధించినట్లు ఇంద్రియ సర్వములు ప్రేరేపిత మయినపుడు వివేకమను కర్రచే వానిని మరల మరల చితకగోట్టాలి. భగవద్గీతలో కూడా శ్రీ కృష్ణుడు అర్జునునికి,

తస్మాత్య మిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభః

కావున ఓ భరతశ్రేష్టా! నీవు మొట్ట మొదట ఇంద్రియాలను నిగ్రహింపుము అని భోదించెను. వసిష్ఠ గీత కూడా వసిష్ఠ మునీంద్రుడు శ్రీరామచంద్రుని ‘పూర్వం హృదయ శత్రుత్వా జ్జేతవ్యాని న్ద్రియాణ్యలం’ అని వక్కాణించారు. ఇంద్రియములు హృదయమునందలి శత్రురూపములో ఉంటాయి. కావున వారిని జయిమ్పవలెనని బోధించారు.

నమోక్ష నభసః పృష్టే

న పాతాలే న భూతలే

మోక్షో హి చేతో విమలం

సమ్యజ్ఞాన విబోధకం –

(శ్రీ వ.గీ. ఉపశమ ప్రకరణం) అని చెప్పాడు.

అనగా మోక్షం ఆకాశంలోగాని, పాతాళంలో గాని, భూతలమందుగాని లేదు. ఉత్తమజ్ఞానంచే లెస్సగా బోధితమైనట్టి నిర్మల చిత్తమే మోక్షం.

“ఆధ్యాత్మ విద్యా సంపాదనం సాధు జన సాంగత్య, వాసనాక్షయము, ప్రాణామయము అనునవి మనో నిగ్రహానికి ఉపాయాలై ఉన్నాయి.”

ఓ రామచంద్రా! నీవు సమస్తం పరిత్యజించి వాసనా రహితుడవై యున్నచో, ఈ క్షణమే ముక్తుడవు అయినట్లు ఇందు సంశయమేమిలేదు. ఇక శరీరము ఎప్పటికైనా నశింపబడునదే అను జ్ఞానంతో వాసన పుట్టకుండును. దృశ్యాలను త్యజించువాడు మోక్షాన్ని పొందగలడు.

ఓ జనులారా! ఆత్మ తెలియబడకయున్నచో దుఃఖమునే కలుగజేస్తుంది. తెలియబడినచో అనంత సుఖాన్నే కలుగజేస్తుంది. కావున నిర్మలమై, శుద్ధమై, సర్వా త్మకమై, సర్వకర్తయైనట్టి బ్రహ్మమే మీ యొక్క నిజస్వరూపమని ఈ ప్రపంచము శాంతమై జన్మ రాహిత్య మైనట్టి పరబ్రహ్మమే మనియు భావించాలి. అప్పుడు మీకు పరమసుఖం లభిస్తుంది.

ఈ విధంగా పలు ఉపమానాలతో వసిష్ఠ మహాముని తుట్టతుదకు శ్రీరామచంద్రునితో నేను ఇంతవరకు వర్ణించి చెప్పింది నేను స్వయంగా మరల మరల విచారించి నిత్యం ప్రత్యక్షంగా గాంచుచున్నదే యగును. కాబట్టి మహామతివయిన నీవు అట్టి నిర్మల దృష్టినే అవలభించి ఉత్తమంగా జ్ఞానాన్ని పొందగలవు. ఎందుకంటే జ్ఞానం చేత మోక్షం లభిస్తుంది.

చివరిగా ఈ ప్రాపంచిక విషయవాసన గల సగటు మనిషి తన జీవితంలో అపజయాలకు, ఆశాభంగాలకు గురౌతూ మధ్యమధ్యలో అల్పసుఖసంతోషములు పొందినప్పటికీ శాంతి సౌఖ్యాలను, తృప్తిని పొందజాలకున్నాడు. తనకు కావలసినదేమితో తెలుసుకోలేక శాంతి సౌఖ్యములకై ఏదో సాధించాలనున్నట్లు తోచినా సాధించలేకపోతున్న తరుణంలో ప్రాచీన, శృతి శాస్త్రాలను వేదవేదాంగాలను ఆస్రయిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో భగవద్గీత వలె వసిష్ఠగీత మన జీవితాలకు అవసరమయిన ఎన్నో విషయాలను సులభగ్రాహ్యంగా చెబుతోంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s