గుణత్రయం


“ఆయుష్యాన్ని, బుద్దిబలాన్ని, దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖసంతోషాలను పెంపొందించే సాత్త్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ, రాగద్వేషాలకు అతీతంగా, ఫలాసక్తి లేకుండా విధ్యుక్తమర్గమైన సాత్త్విక కర్మలను చేస్తూ,  కర్మసంగం లేకుండా, నేనే చేస్తున్నాననే కర్తృత్వ అభిమాని కాకుండా, స్థిరనిశ్చయంతో, మహోత్సాహంతో, కార్యం సిద్ధించినా, విఫలమైనా ఏమాత్రం వికారానికి లోనుకాకుండా జయాపజయాలను సమంగా స్వీకరిస్తూ, అపజయాలను ఎదురైన కొద్దీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకొని కర్తవ్య భావనతో పనులు చేస్తూ, సాత్త్విక కర్తగా క్రమంగా పరిణామదశలో రూపాంతరం చెందితే మానవుడే మహనీయుడౌతాడు. అటువంటి మానవులున్న సమాజమే నందనవనమౌతుంది. స్వర్గధామమౌతుంది.”

కుటుంబంలో, సమాజంలో ఒక వ్యక్తి ప్రవర్తించే విధానం అతని గుణగణాలపై ఆధారపడి ఉంటుంది. మంచి ప్రవర్తన ‘సగుణం’ అని పిలువబడితే, అసభ్యమైన ప్రవర్తనను దుర్గుణం అని పిలుస్తారు. ఓ మానసికమైన భావన, అతని దేహం మీద, అతని ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది. ఒకవిధంగా ఆ గుణ సహితమైన ప్రవర్తన అతని శీల సంపదను చాటి చెబుతుంది. సౌశీల్యానికి పునాది గుణమనే విశేషణంపై ఆధారపడి ఉంటుందని నిష్కర్షగా చెప్పవచ్చు.

గుణాన్ని నిర్వచించిన లాక్షిణికులు ద్విగుణములు, త్రిగుణములు, పంచాగుణములు, షడ్గుణములు, దశవిధ గుణములు, త్రయోదశ గుణములు, చతుర్వింశతి గుణములుగా విభజించి నామకరణం చేసారు.

స్వతంత్ర అస్వతంత్ర భావనలను ద్విగుణములని పేర్కొన్నారు. సత్త్వరజస్తమో గుణాలు త్రిగుణాలు, వీటిని గుణత్రయం అన్న పేరుతో పిలుస్తున్నారు. గుణత్రయానికి శుద్ధసత్త్వము, అతీతములను కలిపి గుణ పంచకమన్నారు. షడ్గుణాలుగా  సంధి, విగ్రహము, యానము, ఆసనము, దైధీభావము, సమాశ్రములు, పేర్కొనబడినప్పటికీ విష్ణుదేవునకు సంబంధించిన వాత్సల్యం, భవశోషణం, ఉదారత్వం, అభయప్రధానం, ఆపత్కాల సంరక్షణం, అక్షయపధం  అనబడు ఆరు గుణాలు కూడా షడ్గుణములని పిలువబడుతున్నాయి. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను కలిపి దంభ, దర్ప, ఈర్ష్య, అసూయలతో దశ గుణాలుగా పరిగణింపబడుతున్నాయి. ఈ దశ గుణాలతో రాగం, ద్వేషము అహంకారాలు జత చేసి త్రయోదశ గుణాలుగా చెప్పబడుతున్నాయి.

చతుర్వింశతి గుణాలు తార్కిక మతానుసారముగా, కావ్య మతానుసారముగా నిర్వచించాబడ్డాయి. రూప, రస, గంధ, స్పర్శ, సంఖ్యా, పరిమాణ, పృధక్వ్తి, సంఖ్యా విభాగ, పరత్వ, అపరత్వ, గురుత్వ, ద్రవ్యత్వ, స్నేహ, శబ్ద, బుద్ధి, సుఖ, దుఃఖ, ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, ధర్మ, అధర్మసంస్కారములు చతుర్వింశతి గుణములుగా గణుతుకెక్కాయి.

కావ్యమతానుసారముగా శ్లేష, ప్రసాదము, సమత్వము, మాధుర్యము, సుకుమారత, అర్ధవ్యక్తి, ఉదారత, క్రాంతి, ఉదాత్తత, ఓజస్సు, సుశబ్దత, ప్రేయస్సు, జౌర్జిత్యము, విస్తారము, సమాధి, సూక్ష్మత, గాంభీర్యము, సంక్షేపము, భావికము, సమ్మితత్వము, ప్రౌఢి, రీతి, ఉక్తి, గతి కావ్య గుణాలుగా గుర్తించబడ్డాయి. గుణత్రయమైన సత్త్వరజస్తమోగుణాల ఆవిర్భావాన్ని, ఆ గుణలక్ష్య లక్షణాలను భగవద్గీతలో గుణత్రయ విభాగాయోగంలో అర్జునునకు శ్రీకృష్ణపరమాత్మ వివరిస్తాడు. ప్రకృతి నుండి ఉత్పన్నాలైన ఈ మూడు గుణాలు నాశంలేని జీవాత్మను శరీరమున బంధిస్తూన్నాయని అంటాడు.

ఓ పాపరహితుడైన అర్జునా! ఈ మూడు గుణములలో సత్త్వగుణం నిర్మలమైనది. కనుక ప్రకాశవంతమైనది. వికార రహితమైనది. అయినప్పటికీ అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మానవుని బంధిస్తుంది.

రజోగుణము రాగాత్మకమైనది. అది కామము, కోరికలు, ఆసక్తుల నుండి మాత్రమే ఉత్పత్తి చెందుతుందని తెలుసుకో. అది జీవాత్మను కర్మల యొక్క, కర్మ ఫలముల యొక్క సాంగత్యముతో బంధించుచున్నది. అదే ఈ భవ బంధాలన్నింటికీ మూల కారణము. తమోగుణము సకల దేహాభిమానులను మొహితులుగా, సమ్మోహితులుగా చేస్తుంది. అది అజ్ఞానము వలన జన్మిస్తుంది. అది జీవాత్మను ప్రమాద, ఆలస్య నిద్రాదులతో బంధిస్తుంది. అనర్ధకమైన ప్రాంచిక జీవనానికి అది పునాది వేస్తుంది. సత్త్వ గుణము జీవుని సుఖములందు నిమగ్నము చేస్తుంటే…రజోగుణము కర్మలయందు, రాగద్వేషాది భావనల యందు నిమగ్నము చేస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని కప్పివేసి, ప్రమాద భరితమైన జీవన వాహినిలో మునకలెత్తిస్తుంది.

సత్త్వరజస్తమోగుణాల ప్రావిర్బావాన్ని, అంత:కరణములో అవి చెలరేగించే అలజడుల్ని సైతం భగవద్గీత స్పష్టంగా చెబుతుంది. రజస్తమోగుణాలను అణచి  వేసి సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. సత్త్వతమోగుణాలను సైతం అణచి వేసి రజోగుణం వృద్ధి చెందగలదు. అలాగే సత్త్వరజోగుణాలను సైతం అణచివేసి సులభంగా తమోగుణము వృద్ధి చెందగలదని కృష్ణ భగవానుడు అంటాడు.

సత్త్వగుణం ఎలా దినదిన ప్రవర్ధమానమౌతుందో వివరించబడుతుంది. మొదట అంతఃకరణంలో చైతన్యోదయం జరుగుతుంది. ఫలితంగా శరీర, ఇంద్రియాలలో చైతన్య వాహిని వ్యాపించి వివేకశక్తి, యుక్తాయుక్త విచక్షణా శక్తి ఉత్పత్తి చెందుతుంది. అప్పుడు ఖచ్చితంగా సత్త్వగుణము వృద్ధి చెందినదని చెప్పుకోవచ్చు.

ప్రాపంచిక విషయాలలో ఆసక్తి, అనురక్తి, లోభము, మోహము, ప్రవృత్తి మొదలౌతాయి. స్వార్థబుద్ధితో, సకామ భావంతో, కర్మాచారణాలు చేయబడతాయి. విషయభోగాల పట్ల లాలస ఉత్పన్నమైనప్పుడు రజోగుణం రాగారంజితం చేస్తుందని గమనించవచ్చు. తమోగుణం అధికమైనప్పుడు అంతఃకరణం యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కోల్పోతుంది. ఇంద్రియాలలో వివేకశక్తి నశిస్తుంది. కర్తవ్యముల పట్ల, కర్మలపట్ల విముఖత్వం కలుగుతుంది. అంతఃకరణాన్ని మోహింపచేయు వ్యర్తచేష్టలు, నిద్రాది వృత్తులు ఉత్పన్నమవుతాయని గ్రహించవచ్చు.

మనుషుల స్వభావమును బట్టి వారికి ఇష్టాలైన ఆహార పదార్థాలను కూడా సాత్త్విక, రాజస, తామస ఆహారాలుగా విభజించ వచ్చు. వారి ప్రవృత్తిని బట్టి, స్వభావాన్ని బట్టి వారు ఆశించే ఆహారాలు వివరించబడతాయి.

సాత్త్వికమైన ఆహారం ఆయువును, ఆరోగ్యాన్ని బలమును, సుఖమును, సంతోషమును అభివృద్ధి పరుస్తుంది. వానిలో పాలు, చక్కర, మొదలగు స్నిగ్ధపదార్థాలు పుష్టిని కలిగిస్తాయి. ఓజస్సును అభివృద్ధి పరిచే స్థిరపదార్థాన్ని, సాత్త్విక స్వభావమును పెంపొందించు హృద్య పదార్థాలను మాత్రమే సాత్త్వికులు ఇష్టపడతారు.

రాజస స్వభావంగాలావారి ఆహార పదార్థాలు ఎక్కువగా పులుపు, కారము, ఉప్పు, చేదు రుచులను కలిగి ఉంటాయి. వానిలో మిక్కిలి వేదివస్తువులు, మాడిన పదార్థాలు, దాహం కలిగించే గుణాలు అధికంగా కనిపిస్తాయి. ఇవి చింతను, రోగాన్ని, దుఃఖాలను కలుగచేస్తాయి. ఇటువంటి ఆహారము రాజస ఆహారమని పిలువబడుతుంది.

తామసభోజనం సరిగా ఉడకని, సరిగా పండని, అర్ధపక్వములైన ఆహార పదార్థాలను కలిగి ఉంటుంది. అవి రసహీనంగా, చెడువాసనగల దుర్గంధయుక్తాలుగా ఉండవచ్చు. పాసిపోయిన పదార్థాలు, ఎంగిలి చేయబడిన ఆహారము తామస ఆహారం అనబడుతుంది. అపవిత్రమైన అపరిశుభ్రమైన పదార్థాలు తామసలక్షనాలను మాత్రమే ప్రకోపింప చేస్తాయి. సాత్త్విక, రాజస, తామస భోజనం ఆరంగించువారి స్వభావములు కూడా భిన్నంగా గోచరిస్తాయి. శాస్త్రోక్తంగా ఉండక కేవలం స్వభావమును, స్వీకరించే ఆహారాన్నిబట్టి మానవుల శ్రద్ధ కూడా సాత్త్విక, రాజస, తామస శ్రద్ధలని పిలువబడతాయి. వారు చేసే పూజలలో కూడా త్రిగుణాత్మకమైన వైవిధ్యం కనిపిస్తుంది.

మానవులందు శ్రద్ధ కూడా వారి అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉండదు. ప్రతి వ్యక్తికీ ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది. అతని జీవన విధానమంతా అతని శ్రద్ధాశక్తులపై ఆధారపడి కొనసాగుతుంది. అతడు శిఖరాలబట్టి, జీవిత సాఫల్యాలను బట్టి అతనిది సాత్త్విక శ్రద్ధో, రాజస శ్రద్ధో, తామస శ్రద్ధో అంచనా కట్టవచ్చు.

పూజావిధానంలో కూడా వారి మధ్యలో భేదం కనిపిస్తుంది. సాత్త్వికులు దైవీభావం గల దేవతలను మాత్రమే పూజిస్తారు. రాజసులు యక్షులను, రాక్షసరాజులను పూజిస్తారు. తామసులు భూత ప్రేత గుణాలకు పూజ చేసింది.

వారి యొక్క బుద్ధులను బట్టి కూడా సాత్త్విక, రాజస, తామస బుద్ధులుగా విభజించుకుంటే, వారు త్రిగుణాత్మకమైన కర్మలను ఆచరించి త్రిగుణాత్మక కర్తలుగా గుర్తించ బడతారు. తానూ చేసే కార్యానికి కర్తృత్వం కూడా వహిస్తూ కూడా కర్తను కాననే భావన గలిగిన లేనిది సాత్త్విక కర్మ! ఫలాపేక్ష ఆశించని పురుషుని చేత చేయబడిన శాస్త్ర విహితమైన కర్మ సాత్త్వికకర్మ అవుతుంది. ఇది రాగద్వేష రహితంగా నుండి ఆవేశకావేశాలకు దూరంగా ఉంచుతుంది. విధ్యుక్ష మార్గమున చేయబడుతుంది.

భోగాలాలసుని చేత చేయబడు కర్మ రాజసకర్మ అని పిలువబడుతుంది. ఇది అహంకారం చేత చేయబడుతుంది. అత్యధిక శ్రమతో కూడినది. ఫలాపెక్షను ఆశించే కర్మ రాజసకర్మ అని నిర్వచించబడుతుంది. మంచీ చెడు, హాని, సఫలత్వం, కార్యసిద్ధి, చేయగల సామార్ధ్యమును అంచనా కట్టకుండా చేసే కార్యము తామసకర్మ అవుతుంది. ఇది హంసతో కూడిన కర్మ. అజ్నానమునే ఆరంభించండి, కార్య సిద్ధి కలగకుండా మధ్యలో వదలి వేయబడే కర్మ తామస కర్మ అని పిలువబడుతుంది. త్రిగుణ కర్మలను ఆచి తూచి ఆచరిన్చేవాళ్ళు కూడా సాత్త్విక, రాజస, తామస కర్తలుగా విభేదిస్తారు.

ఆసక్తిని త్యజించిన వాడు, అహంకార రహితంగా భాశించువాడు సాత్త్వికకర్త అవుతాడు. ధైర్యము, ఉత్సాహములతో కార్యము సాధించేవరకు విశ్రమించడు. సిద్ధించి నప్పటికీ, సిద్ధించపోయినప్పటికీ హర్షము, శోకము మొదలగు వికారములకు లోనుకాడు. అటువంటి పురుషుడే సాత్త్విక కర్త అని కీర్తించబడతాడు.

మన ఉపనిషత్తులు నిరంతరం పాలిచ్చే గోవుల వంటివి. అందులోనుండి పాలు పితికినవాడు గోపాలుడు. అర్జునుడు లేగదూడ వంటివాడు. శ్రీకృష్ణపరమాత్మ సర్వకాల, సర్వావస్థలలో, సర్వజనులకు వర్తించే అంశాలన్నింటినీ బోధించాడు.

కార్యములు నిర్వహించుట యందు అమితాసక్తిని ప్రదర్శించువాడు, కర్మఫలాలకై ఆరాటపడేవాడు రాజస కర్త అవుతాడు. అతడు తన పిసినారి గుణముతో లోభిగా మారి ఇతరులను కష్టపెట్టగల స్వభావం కలిగి ఉంటాడు. ఇతని ప్రవర్తన పవిత్రంగా ఉండదు. కార్యసిద్ధి, ఆసిద్ధులయెడ, వెంటనే హర్షశోకములను ప్రదర్శించేవాడినే రాజస కర్త అని పిలుస్తారు. జితేంద్రియుడు కానివాడు, సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు, ధూర్తుడు తామసకర్త అని పిలువబడతాడు. ఇతడు సోమరితనంతో జీవనాన్ని సాగిస్తూ అకారణంగా ఇతరుల వృత్తులకు భంగం కలిగిస్తుంటాడు. సదా చింతాగ్రస్తుడై ఉపేక్షతో కాలం గడుపుట చేత దీర్ఘసూత్రి అని పిలువబడతాడు. ఇటువంటి ఆవలక్షణాలు తామసకర్తలో కనిపిస్తాయి. లోకపు ప్రవృత్తి నివృత్తి మార్గాలు, చేయదగిన పనులు, చేయకూడని పనులు భయపడవలసిన పదార్థములు, నిర్భయంగా ఉండవలసిన వస్తువులు, సంసారబంధ విముక్తిని బోధపరచే సాత్త్వికబుద్ధిని ప్రసాదించమని కోరుకుందాం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s