ఆది వైద్యులు


మన భారత సంస్కృతి ప్రకృతిలో మమేకమైన, ప్రకృతిలోని ప్రతి జీవిని, వస్తువును, దైవంగా భావించి జీవనగమనంలో ముందుకు సాగమని చెబుతుంటుంది. అందుకే నాడు రోగాలు, రుగ్మతలు కూడా తక్కువే ఉండేవి. ఏమైనా రోగాలు దాపురిస్తే, అందుకు తగిన, ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది.

ఘనమైన మన చరిత్రలో ఎంతో మంది వైద్య ఘనాపాఠీలు ఉన్నపటికీ, ధన్వంతరీ, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటి వారు ప్రముఖంగా కనిపిస్తుంటారు.

ధన్వంతరీ

‘ వైద్యో నారాయణో హరిః ’ అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుని ‘ అపర ధన్వంతరి ’ అని మన వాళ్ళు పోగడుతుంటారు.

శ్రీమద్భాగవతం ధన్వంతరిని “దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారు” అని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.

రాక్షసులు  పెట్టే  బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.

ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది.

ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.

ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.

దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.

ఇలా ధన్వంతరి గురించి అనెక్ పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.

శ్రీధన్వంతరి మూలమంత్రం

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ

ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ

సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే

శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప

శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా

సుశ్రుతుడు

శస్త్రచికిత్స అనేతప్పటికీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది సుశ్రుతుడే. సుశ్రుతుడు ఓ గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు. గొప్ప గురువు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడనిపేర్కొనబడుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సుశ్రుతుడు హిపోక్రెట్స్కు ఓ వంద సంవత్సరాలు ముందుగా, సెల్సియన్ మరియాగాలన్ ల కంటే రెండు సంవత్సరాల ముందుగా ఈ భూమిపై ఆపరేషన్లు చేశాడనేది యదార్థం. సుశ్రుతుడు ఓ గొప్ప వైద్యపరంపర నుంచి వైద్యాన్ని నేర్చుకుంటే, దివోదాసుడు నుంచి సుశ్రుతుడు వైద్యవిద్యను నేర్చుకున్నాడు. సుశ్రుతుని కీర్తి దేశదేశాలకు పాకింది. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ముందుగా అరబిక్ భాషలోకి అనువదించబడి, అరబిక్ భాష నుండి పర్షియన్ భాషలోకి, ఆ తదనంతరం మిగతా భాషలకు విస్తరించాయి. సుశ్రుతసంహిత రెండు భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం పూర్వసంహితగా, రెండవభాగం ఉత్తర సంహితగా విభజింపబడ్డాయి. 184 అధ్యాయాలుగా విభజింపబడిన ఈ గ్రంథంలో 1,120 రుగ్మతలను గురించి ప్రస్తావించబడటమే కాక, వాటికి సంబంధించిన చికిత్సాపద్ధతులు కూడ వివరించబడ్డాయి.

అయితే, ఆయన ఇన్ని విధాలైన వైద్యవిధానాలను సూచించినప్పటికీ, ఆయన మధుమేహ, ఊబకాయాలను తగ్గించే వైద్యునిగానే చాలా మంది గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన కాశీలో నివసించినందువల్ల ప్రస్తుతం బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుని విగ్రహం ప్రతిష్టించబడింది.

చరకుడు

సుశ్రుతుడు శస్త్రచికిత్స  నిపుణుడైతే చరకుడు  ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు. ఆయన శాస్త్ర చికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలు చేశాడు.

ఈయన గర్బస్థశిశువు పెరుగుదల గురించి, మానవ శరీర నిర్మాణము గురించి స్పష్టమైన వివరాలు అందించాడు. వాత, పిత్త, కఫములను అనుసరించి చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను నిర్థారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్ధతులను సూచించడంలో కూడా ఘటికుడు చరకుడు. ఈయన వృద్ధాప్యాన్ని వెన్నక్కి మళ్లించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

ఆయనచే విరచితమైన ‘చరక సంహితి’లో పలు విధాలైన మూలికల వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట. మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయా మందులను 50 రకాలుగా విభజించాడు. మందులను పొడిరూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తాయారు చేసిన చరకుడు ఆ మందులను ఉపయోగించాల్సిన విధానాన్ని గురించి చాల వివరంగా పేర్కొన్నాడు.

వాగ్భటుడు

పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే విరచించబడిన ప్రఖ్యాత వైద్యగ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతములో జన్మించాడు. అవలోకితుడు అనే బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవన ప్రస్థానంలో హిందూ ధర్మాన్నే అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలకు ముడు మాటగా చెబుతున్నప్పుడు బుద్ధుని స్మరించుకుంటాడు.

ఈయన అష్టాంగ సంగ్రహం భారతదేశ పర్యంతం చదువబడింది. ఈయన తన కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటిని పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి, ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడయాన.

ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150 విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో శరీర నిర్మాణము, గర్భము ధరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించవలసిన పద్ధతులు, మూడవ అధ్యాయంలో మధుమేహం, చర్మ వ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయా వ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి వివరించబడింది.

కశ్యపుడు

కశ్యపుడు పిల్లలకు సంబంధించిన విద్యావిధానంలో, ప్రసూతి వైద్య విధానామలో నిష్ణాతుడు. ఈయనచే విరచిత్రమైన గ్రంథం ‘కశ్యప సంహిత’ ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుంది. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది. ఆయుర్వేదానికి సంబందించిన ఎనిమిది విభాగాలలో కశ్యపుని కృషి అనితరసాధ్యం.

 1. కాయ చికిత్స
 2. శల్య చికిత్స
 3. శాలక్య తంత్ర
 4. అగాధ తంత్రం
 5. భూత విద్య 
 6. కౌమార భృత్య
 7. రసాయన తంత్రం
 8. వాజీకరణ తంత్రం అంటూ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాలలో కశ్యపప్రభావం ఉంది.

అదే విధంగా కశ్యపుని వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవారట.

 1. చూర్ణం
 2. శీతకషాయం
 3. స్వరస
 4. అభిసవ
 5. ఫంట
 6. కలక
 7. క్వత

కశ్యపుడు పిల్లల పెరుగుదలకు సంబధించిన ఎన్నో సూచనలను తన గ్రంథంలో అందించాడు.

జీవకుడు

జీవకుడు మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. బౌద్ధ గ్రంథాలలో ఈయన వైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతోట్టిలో కనిపించాడని, రాజుకు ఈ విషయం తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని చారిత్రిక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను అభ్యసించాడు. ఏడేళ్ళ పాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి పనికిరాని మొలకను  తీసుకురమ్మానాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.

అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయితగలగా  గాయమైంది. అప్పుడు జీవకుడు కొన్ని మూలికలను గాయముపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి తర్వాత విప్పి వేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు. అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడనుంచే బుద్ధుని కాలికి కట్టివున్న కట్టును ఎలా విప్పదీయాలో చెప్పి, అలాగే చేయించాడని ప్రతీతి. అప్పట్నుంచి బుద్ధుడు, జీవకుని తన ప్రధాన శిష్యులలో ఒకరినిగా నియమించాడు. జీవకుడు కూడ బుద్ధునికి ఆరోగ్యపరమైన సలహాలను ఇస్తూ ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.

నాగార్జునుడు

నాగార్జునుడు మందుల తయారిలో అగ్రగణ్యునిగా పేరుగాంచాడు. ఏ వస్తువైనా సరే, బంగారంగా మార్చగలిగే ‘పరసవేది’ విద్యలో కూడ నాగార్జునుడు సిద్ధహస్తుడని చెబుతుంటారు. ఈయన ఆధ్వర్యంలో రసశాస్రం (కెమిస్ట్రీ) బాగా అభివృద్ధి చెందింది. ఇక, ఆ రోజుల్లో వైద్యశాలలను (ఆసుపత్రులు) గురించి పాహియాన్, హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రీకులు గ్రంథంస్తం చేసిన విషయాల ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలవుతోంది. తెలుసుకోగలం. చంద్రగుప్తమౌర్యుని కాలంలో పాతలీపుత్రాన్ని దర్శించిన చైనా యాత్రీకుడు పాహియాన్ అప్పటి భారతంలోని ఉచిత వైద్యశాలల గురించిన వివరాలను తన యాత్రా గ్రంథంలో లిఖించాడు. తమ ఇళ్ళనే వైద్యశాలలుగా మార్చిన వైద్యులు పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యసేవలను అందించేవారట. ఇక, హుయాన్ సాంగ్ అయితే భారతదేశంలో ఉచిత వైద్యశాలలకు కోడవేలేదనటమే కాక, వాటిని పవిత్ర దేవాలయాలని పేర్కొన్నాడు. ఇలా మనది ఘనమయిన చరిత్ర

“ప్రకృతిలో పరమాత్మను దర్శించే మన సంస్కృతిలో, వైద్యవిధానాలు కూడ ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఎక్కడా కృతిమ తత్త్వానికి చోటేలేదు. అప్పటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసిందంటే, అందుకు కారణం, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని మనసా వాచా కర్మణా నమ్మి, ఆచరించటమే!”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s