ద -ద–ద ——- మేఘసందేశం


 

ఇది చాలా చాలా పురాతన కాలం నాటి సంఘటన. ఆ కాలంలో దేవ, దానవ, మానవుల మధ్య తరచూ సంఘర్షణలు జరుగుతుండేవి. ఆ సంఘర్షణలలో అనేక మంది చనిపోయేవారు. అనేకులు అంగవికలులై  దుర్భరజీవితాలను గడుపుతుండేవారు. ఈ పరిస్థితిని  గుర్తించి ఆ సంఘర్షణల నుండి ఎలాగైనా బయిటపడి సుఖ శాంతులతో జీవించాలనే ఉద్దేశం వారిలో జ్ఞానవయోవృద్ధులకు కలిగింది. వారు బాగా అలోచించి ఈ ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మదేవుడు. అతడు అందరికీ పితామహుడు. మన అందరిపై పుత్రవాత్సల్యం గలవాడు. కనుక, బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, తరుణోపాయాన్ని అడగాలని నిశ్చయించుకున్నారు.

అందరూ కలసి బ్రహ్మదేవుని దెగ్గరకు వెళ్ళారు. వారందరూ పితామహుని వద్దకు ఉపదేశం కోసం బయిలుదేరారు. కనుక, వినీతవేషంతో విధేయులుగా వెళ్ళారు. ఆవిధంగా దేవదానవ మానవులందరూ కలసి తన వద్దకు రావడాన్ని చూసిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. 

వారినుద్దేశించి బ్రహ్మదేవుడు, “వత్సలారా! మీరందరూ కలసి ఇలా వినీత వేషంతో, అత్యంత విధేయులుగా రావడం నాకు ఆనందంగా ఉంది. మీలో ఇట్టి సద్భుద్ది, సమైక్యత కలగడానికి గల కారణమేమి? మీకు ఏమి కావాలి?” అని అడిగాడు. దానికి వారందరూ కలసి రావడానికిగల కారణాన్ని, వారి మధ్య సంఘర్షణలను తొలగించుకొని, సుఖశాంతులతో జీవించాలనే సదుద్దేశాన్ని తెలిపారు. దానికి తగిన ఉపాయాన్ని బోధించమని ప్రార్ధించారు. వారి మాటలు విన్న బ్రహ్మదేవుడు సంతోషించి, “కొంతకాలం నా ఆశ్రమంలో ఉండి మీరు సంయమము, బ్రహ్మచర్యాల ద్వార ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోడానికి తపస్సు చేయండి. మీ ఆచరణ దీక్షా నిష్ఠలను చూచి, తగిన సమయంలో మీరు పరస్పరం  సంఘర్షణల నుండి బయిటపడి సుఖశాంతులతో అన్నదమ్ములవలె కలసి మెలసి జీవించడానికి తగిన ఉపాయాన్ని ఉపదేశిస్తాను. మీ అందరి మనఃస్థితి సమానమైనది కాదు. భిన్న మానసిక స్థితులవారికి ఒకే సమయంలో బోధించరాదు. కనుక, ఉచిత సమయంలో ఒక్కొక్కరికి ఉపదేశించి పంపుతాను" అన్నాడు. వారందరూ పితామహుని ఆదేశాన్ని పాటించి, బ్రహ్మదేవుని ఆశ్రమంలో బ్రహ్మచర్య దీక్ష పూని, ఇంద్రియాలను జయించటానికై కృషిచేస్తూ, తపస్సు చేయసాగారు. కొంతకాలం గడిచింది. వారిలో పరస్పర వైర భావాలు నశించాయి. సోదరభావంతో మెలుగుతున్నారు. ఆశ్రమవాతవరణం వారిలో సత్వగుణాన్ని పెంపొందించింది. నియమనిష్ఠలు శాంతిని, దాంతిని, దయను కలిగించాయి. దేవతల విషయభోగవాంచలు, దానవుల హింసాప్రవృత్తి మానవుల స్వార్థపర్వతం అంతరించాయి.

అది ఒక ప్రశాంత సంధ్యాసమయం. దిక్కులన్నీ సంధ్యారాగంతో నిండి కనుల పండువుగా  కన్పించడం కన్పిస్తున్నాయి.

ప్రకృతి అంతా ప్రశాంతంగా, గంభీరంగా మనోహరంగా ఉంది. ఆ శుభసమయంలో బ్రహ్మదేవుడు దేవతలకు ఉపదేశం చేయవచ్చునని తలచాడు. అంతః కరణ ప్రేరణతో, దేవతల ప్రతినిధులు బ్రహ్మ దగ్గరకి వచ్చారు. సాష్టాంగనమస్కారం  చేసారు. బ్రహ్మదేవుడు వారిని చిరునవ్వుతో పలకరించారు, ఒక్కక్షణం గంభిరముద్ర వహించి, మేఘ గంభిరస్వరంతో ‘ద’ అని ఉచ్ఛరించి,మౌనం వహించాడు. అది ఘంటారావంవలె దేవతల కర్ణరంధ్రాలలో ప్రతిధ్వనించింది. ఇంద్రియభోగాలను అనుభవించడమే పరమార్థమని, భోగాలాలసులైన దేవతలు తమకు బ్రహ్మదేవుడు ‘ద’ అనగా ఇంద్రియ దమముగల వారులకండు (దామ్యత) అని బోధించినాడని తెలుసుకున్నారు. ఇంద్రియనిగ్రహం లేకపోవుట చేత మనం భోగాలాలసులమయి ఈర్ష్య, అసూయలకు లోబడిపోతున్నాం. ఇంద్రియనిగ్రహం కలిగియున్నప్పుడు వైర, ద్రోహాది దుర్గుణములు నుండి బయిటపడగలమని అనుకున్నారు. బ్రహ్మవారి ఆలోచనలను గమనించి ‘దేవతలారా! నా ఉపదేశ తాత్పర్యమును సరిగా గ్రహించినారు. కనుక మీరు మీ లోకానికి వెళ్ళి ఇంద్రియ దమము సాధించి, సుఖ శాంతులతో జీవించండి’ అని అనుజ్ఞ ఇచ్చినాడు. దేవతలు తమ లోకానికి చేరుకున్నారు. తమ వారందరికి ఇంద్రియ దమము ప్రాధాన్యాన్ని బోధించి, ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ సుఖశాంతులతో జీవిస్తున్నారు.

కొంతకాలం గడిచింది. దేవతలు వెళ్ళిన తర్వాత మానవ వృద్ధులు, పితామహుని సేవిస్తూ, బ్రహ్మదేవుని ఆశ్రమంలో తపోనిధులై ఉపదేశ సమయం కోసం నిరీక్షిస్తున్నారు. వారి సాధన పరిపూర్ణ దశకు చేరింది. ఒక శుభ సంధ్యసమయంలో మానవ వృద్ధులు హృదయంలో ప్రేరణ కలిగింది.అంతట వారు బ్రహ్మదేవుని  దగ్గరకు వెళ్ళి, నమస్కరించి ‘దేవా! మాకు ఉపదేశం చేసి, మమ్ము కృతార్థులను చేయండి.’ అని ప్రార్థించారు. పితామహుడు వారి అర్హతను గుర్తించి ఒక్కక్షణం గంభిరముద్ర వహించి మేఘ గంభిరస్వరంతో ‘ద’ అని ఉచ్చరించి, మౌనం పాటించాడు. ఆ ధ్వని నలుదిక్కులా వ్యాపించి భునభోంతరాళాల మధ్య నిండిపోయింది. ఆ అమృతధ్వని విని, తరించిన మానవులు మనం కర్మ అనుభవించడానికి జన్మించుటచే, స్వార్థపరులమై నిత్యం ధనార్జన యందే ఆసక్తి గల్గియున్నాము. స్వార్తపరత్వమే మన మధ్య అసూయా, ద్వేష, కలహాదులకు కారణంగా ఉంది. కనుక స్వార్థపరులం, లోభులమైన మనకు పితామహుడు ‘ద’ అనగా దత్త -దానం చేయండని ఉపదేశమిచ్చినాడు అని తలంచారు. ధర్మసారమంతా దానగుణంలో ఉంది. ఈ విశిష్టగుణం లేకపోవడం వల్లనే మనోవాక్కాయుకర్మలు అధర్మ వికారాన్ని పొందుతున్నాయి. చిత్తదోషాలను తొలగించి, దాన్ని పవిత్రం చేసే సాధనాలలో దానము ప్రముఖమైంది. అంతేకాదు, మనిషిని పట్టి పీడిస్తున్న మమతా జాడ్యాన్నిక్రమంగా తగ్గించే ఔషధంగా దానగుణం పనిచేస్తుంది. మొదట గడ్డిపోచతో అయినా మొదలుపెట్టి దానగుణాన్ని అభ్యాసం చేసుకుంటూ పొతే, చివరకు తన తలనైనా దానం చేయగల్గిన స్థాయికి మనిషి ఎదుగుతాడని మానవ వృద్ధులు తలచారు. వారి ఆలోచనలను గమనించిన బ్రహ్మదేవుడు, నా ఉపదేశసారాన్ని సరిగ్గా గ్రహించారు. మీరు మీ లోకానికి వెళ్ళి, దానగుణం అభ్యసించి, స్వార్థలాభాలను పరిత్యజించి సుఖ శాంతులతో  జీవించండని బోధించి, పంపించినాడు. మానవులు తమ లోకానికి వెళ్ళి దానగుణం పాటిస్తూ సుఖశాంతులతో జీవించసాగారు.

ఆవిధంగా దేవతలు, మానవులు వెళ్ళిపోయిన తర్వాత రాక్షసులు బ్రహ్మ బోధించిన నియమనిష్టలను పాటిస్తూ ఆశ్రమజీవితం గడుపుతూ బ్రహ్మదేవుని ఉపదేశంకోసం ఎదురు చూస్తున్నారు. కొంత కాలానికి వారి సాధన పరిపూర్ణదశకు  చేరింది. వారిలో హింసాప్రవృత్తి నశించి అహింస,క్షమ, ఉపకార స్వభావం మొదలగు సద్గుణాలు ఏర్పడినాయి. ఒక శుభ సంధ్యాసమయంలో పితామహుని తలంపుతో రాక్షసులలో ప్రేరణ గలిగి, బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. పితామహా! మాకు ఉపదేశమిచ్చి  కృతార్థులను చేయండి అని ప్రార్దించారు. మాతో వచ్చిన దేవతలు, మానవులు తమ దివ్య ఉపదేశాన్ని పొంది, తమ లోకాలకు వెళ్ళి తమతమ జాతులను ఉద్ధరించుకుంటున్నారు. సుఖశాంతులతో జీవిస్తున్నారు. మాకు అట్టి అవకాశాన్ని అనుగ్రహించండని ప్రాధేయపడ్డారు.

సాత్వికబుద్ధితో దానవులు పలికిన మాటలు విని, బ్రహ్మదేవుడు సంతోషించి, ఒక్కక్షణం గంభీరంగా ఉండి, మేఘగర్జన సదృశ గంభీర ధ్వనితో ‘ద’ అని పలికి మౌనం దాల్చాడు. ఆ దివ్యాక్షరం దానవులలో ప్రవేశించి, హృదయంలో స్తిరపడింది. దానిచే వారు  ప్రభావితులై మనం మొదటి నుండి హింసాప్రవృత్తిని కలిగియున్నాము. హింసా క్రోధాలతో మన జీవితాలను అశాంతిమయం, దుఃఖమయం చేసుకున్నాము. కనుక తరుణోపాయంగా పితామహుడు ‘ద’ అనగా దయధ్యం- ప్రాణుల యెడ దయగలిగి  ఉండమని ఉపదేశించాడు. హింసాకృత్యం అధర్మం. దయ ఉత్తమధర్మం. దయాగుణమే  అహింస, ఔదార్యం, క్షమ మొదలగు అనేక రూపాల్లో భాసిస్తుంది. సస్యముల వృద్ధికి వర్ణం కారణమైనట్లు దయ అనేక సుగుణాలకు పోషకంగా ఉంది. దయతో నిండిన మనస్సులో ద్రోహచింతనకు తావులేదు. దయాహృదయుని వాక్కు మధురంగా ఉంటుంది. శరీరం దర్శనీయంగా ఉంటుంది. భగవంతుడు దయాస్వరూపుడు. కనుక, దయను మించిన సుగునం లేదని తలచారు. బ్రహ్మదేవుడు వారి ఆలోచనలను గుర్తించి, వత్సలారా! నా ఉపదేశాన్నిమీరు సరిగ్గా గ్రహించారు. ఇకపై దయాగుణ సంపన్నులై మీ జీవితాలను, తోటివారి జీవితాలను సుఖశాంతులతో వర్థిల్లజేయండి. అని భోదించి అనుగ్రహించాడు. దానవ వృద్ధులు తమ లోకానికి వెళ్ళి దయాగుణ విశిష్టతను తమ వారికి భోదించి, అందరూ దయాగుణమును పాటించి సుఖశాంతులతో జీవిస్తున్నారు. తోటి ప్రాణులకు సుఖశాంతులుల జీవితాన్ని అనుగ్రహించారు.

బ్రహ్మదేవుడు ఉపదేశించిన ‘ద-ద-ద’ కార త్రయం దేవతలకు దామ్యత – ఇంద్రియనిగ్రహంగా, మానవులకు దత్త – దానంగా, దానవులకు దయధ్వం – దయగా అర్థమయింది. దీనికి వారి జీవనవిధానం, మానసిక స్థితి, నైసర్గిక స్వభావాలు కారణాలుగా ఉన్నాయి.

అప్పటినుండి వర్షాకాలపు మేఘం ద-ద-ద అంటూ బ్రహ్మవాక్కునే పలుకుతుంది. ఇది దైవ వాక్కు. ఈ మేఘసందేశం జనులకు ‘దామ్యత-దయ-దయధ్యం’ – అని హితం బోధిస్తుంది. మానవులకంటే వేరుగా దేవదానవులు లేరు. వారు మానవులలోనే ఉన్నారు. కనుక, మనుష్యులలోనే సమస్త గుణాలు గలిగి ఇంద్రియనిగ్రహం లేని దేవతలా వంటివారిని ఇంద్రియనిగ్రహం కలిగి ఉండమని, దానగుణంలేక లోభగుణంగల మానవులకు దానం చేయండని, రాక్షస ప్రవృత్తిగల దానవులకు ప్రాణులయందు దయ గలిగి ఉండమని వర్షాకాలపు మేఘగర్జన ద-ద-ద అని బ్రహ్మదేవుని ఉపదేశాన్ని మరలా మరల వినిపిస్తోంది. ఇదే మేఘసందేశం. మానవులందరూ ఇంద్రియనిగ్రహము, దానగుణాన్ని, భూతదయను కలిగి సుఖశాంతులతో జీవించాలని వర్షాకాలపు మేఘం యొక్క ఆశ! అయినా, నేటి మానవులు వర్షాకాలపు మేఘగర్జన వినిపిస్తున్న దైవ సందేశాన్ని విని అర్ధం చేసుకొని, ఆ గుణ త్రయమును అలవరచుకొని, పెంపొందించుకొని, ఆచరణలో పెట్టి బాగుపడేరా? హింస, దారిద్ర్యం, అసూయాద్వేషాలు లేకుండా సుఖశాంతులతో జీవించేరా??సృష్టికర్తయగు పితామహునికే ఎరుక! ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ బ్రహ్మదేవుని ఉపదేశాన్ని అర్ధం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిద్దాం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s