పదకవితా పితామహుడు!


భారతదేశం ప్రాచీన కాలం నుండి భగవంతుడు, ఆత్మ, పారలౌకికత మొదలైన ఆధ్యాత్మిక విషయాలనే పరమ సత్యాలుగా భావించి, వాటి ప్రత్యక్షానుభూతికై సకల ప్రయత్నాలు చేసింది. భారతదేశం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి గలదిగా ఉండడానికి కారణం ఏమిటన్న విషయాన్ని పరిశీలిస్తే, దివ్య గుణాతీతులై భాగవత్సాక్షాత్కారం పొందిన మహాపురుషులు భారతావనిలో అవతరించడమేనని నిశ్చయంగా బోధపడుతుంది. భారతదేశం భాగవత్సాక్షాత్కార ప్రాతిపదికపై ప్రతిష్టతమైంది. అవతార పురుషులైన ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, అరవిందులు, రమణమహర్షి మున్నగు వారు అవతరించి తమ ఆధ్యాత్మిక ఉపదేశాలతో, జగత్కారణుడైన ఈశ్వరుని సాక్షాత్కరించు కోవడానికి ఉపకరించే మార్గాలను ఏర్పరిచారు. అలాగే సంకీర్తనాచార్యులైన అన్నమయ్య, పురందరదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య మున్నగు భక్తశిఖామణులు భక్తి ఉద్యమానికి తమ కీర్తనలతో బాటలు వేసి, ఎందరో భక్తులకు మార్గనిర్దేశం చేశారు.

కృతయుగం ధ్యానానికి, త్రేతాయుగం క్రతువులకు, ద్వాపరయుగం అర్చనకు, కలియుగం సంకీర్తనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలలో దైవచింతన, భగవదనురాగం ఏర్పడడానికి సంకీర్తనాచార్యులే కారణమనవచ్చు. భౌతికమైన భోగభాగ్యాలను వదలి, తన జీవితాన్ని శ్రీవేంకటేశ్వరనాథునికి అంకితం చేసిన కారణజన్ముడు, పదకవితాపితామహుడు, సంకీర్తనాచార్యుడైన అన్నమాచార్యులు. భక్తి సుమాలతో తెలుగుదేశాన్ని పరిమళభరితం చేసాడు. మహానుభావుడైన అన్నమయ్య సంకీర్తనలు తెలుగుజాతిని తరింపజేసే మహోజ్వల సంపద. వారి కీర్తనలుమధురభక్తికి గర్భస్థలి. రచనాకౌశలంతో అనన్య సామాన్య ప్రతిభ చూపుతూ, 32 వేల సంకీర్తనా కావ్యాన్ని సృష్టించాడు.

“వేదాదుల నుండి ఆగమాల వరకు విస్తరించిన భక్తి సామ్రాజ్యానికి పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారి కీర్తనలే నిలయాలు. శ్రీవేంకటాచలపతి కీర్తనలతో జీవితాన్ని ధన్యం చేసుకున్న పుణ్యచరితుడాయన!”

మన తెలుగులో తోలి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇది 600 సం||ల నాటి చరిత్ర. వాగ్గేయకారుడంటే స్వయంగా పాటలు పాడేవాడని అర్థం. అన్నమయ్య వేంకటనాథునికి సుప్రభాత కీర్తన పాడితే, నిద్ర లేచేవాడు. జోలపాడితే నిడురపోయేవాడు. శ్రీవారి సతీమణి అలిమేలుమంగమ్మ అన్నమయ్య పాటకు నాట్యం చేసేది. అన్నమయ్య సంకీర్తనలు భక్తిప్రయోగశాల. పామరుల కోసం వారిలో దైవభక్తిని పాడుకోల్పాలనే సంకల్పంతో అచ్చతెలుగుభాషలో సామాన్య జనరంజక శైలిలో పాటలు వ్రాసి, ప్రచారం చేసినవాడు.

సమసమాజ నిర్మాణం కోసం సంఘ సంస్కరణ భావాలతో సాంఘిక ప్రయోజనాన్ని ఆశించిన అన్నమయ్య, తన ఆస్తినంతా వెంకన్నకు దానం చేశాడు. “బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే" అన్న సత్యాన్ని అందరికీ తెలియజేసి, “మెండయిన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే” అన్న సమతావాదాన్ని శాశ్వతంగా చరిత్రపుటల్లో లిఖించిన ఈ దివ్యసామ్యవాద సిద్ధాంతకర్త మనందరికీ ముక్తిమార్గం చూపాడు.

అట్టి మహనీయుడు కడపజిల్లా రాజంపేట తాలూక తాళ్ళపాక గ్రామంలో క్రీ.శ.1408లో లక్కమాంబ, నారాయణసూరులకు పుణ్య ఫలంగా, ఏడుకొండలవాని వరప్రసాదంగా జన్మించాడు. అయితే, అన్నమయ్య తాట నారాయనయ్యకు గ్రామదేవత చింతలమ్మ ప్రత్యక్షమై, నీ మూడోతరంలో ఒక గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడని తెలిపింది. అది వాస్తవరూపం దాల్చింది. అన్నమయ్యకు శైశవదశలోనే తిరుమలేశుని భక్తి చిగురించింది. వెంకన్నపేరు చెబితేకాని, పాలు త్రాగే వాడు కాదు. వేంకటపతి మీద జోలపాట పాడుతుంటే తల వూపేవాడు. అన్నమయ్య ఐదేండ్ల వయసులోనే గురువులకు ఏకసంథాగ్రాహిగా పాఠాలు అప్పజెప్పేవాడు. ఆట పాటల్లో  తెలూతూ, పిల్లల పాటలకు రాగం పాడి, తాళం వేసేవాడు. బాల్యంలో కవుల పాటల్లో జానపదుల పాటలలో శృతి కలిపేవాడు. ఇలా పాటలు పాడే అన్నమయ్యకు ఇంటిపని మీద శ్రద్ధ లేకపోయింది. ఇంటివారు పశువులకు గడ్డి తెమ్మని అడవికి పంపారు. కొడవలి తీసుకొని, తంబురతో వెళ్ళాడు. గడ్డి కోస్తూ చిటికెన వ్రేలు తెగింది. ‘అమ్మా’ అని అరిచాడు. తనకెవరూ లేరని, తిరుపతికి వెళ్ళే యాత్రీకుల గుంపుతో ఆడుతూ, పాడుతూ తిరుపతి చేరాడు. గ్రామదేవత గంగమ్మగుడిని దర్శించాడు. తరువాత తిరుమలకు ప్రయాణమై, ఆంజనేయుని, నరసింహస్వామిని దర్శించుకొని, ఎత్తుగా వ్యాపించియున్న ఆదిశేషుని రూపంలోని పర్వత శిఖరాలు చూశాడు. “అదివో అల్లదివో హరివాసము, పదివేల శేషుల పడగలమయమ”ని చిందులు తోక్కూతూ పాడాడు.

తరువాత అలిపిరిగోపురం దాటి కొండలెక్కి మోకాళ్ళ పర్వతం చేరాడు. 8 సంవత్సరాల వయసుగల అన్నమయ్య అలసిపోయి సమీపంలో వెదురు పొదలలో చెప్పులతో వాలిపోయాడు. అన్నమయ్య దుస్థితిని  అలిమేలు మంగ చూసి, కరుణించి, తన ఒడిలో కూర్చోబెట్టుకొని, “లేచి ఇలా చూడు!” అన్నది. “కళ్ళు కనపడడం లేదా" న్నాడు అన్నమయ్య. “చెప్పులు వీడితే, కనబడుతుంది అన్నది” అని చెప్పింది అలిమేలు మంగమ్మ.

చెప్పులు వీడి చూస్తే, తేజోవంతమైన పర్వతాలు, దశావతారాలు మున్నగునవి కనిపించాయి. మంగమ్మ ప్రసాదం తినిపించింది. పలుకులమ్మ అనుగ్రహంతో ఆశువుగా అలిమేలు మంగపై ఒక శతకం వ్రాసాడు. “అమ్మకు తాళ్ళపాక ఘనుడన్నడు పద్య శతంబు సెప్పె, కోకొమ్మని వాగ్ప్రసూనముల కూరిమితో అలిమేలు మంగకున్” అని ఆమెకు ఆ శతకాన్ని అంకితం చేశాడు. తరువాత పుష్కరిణిలో స్నానం చేసి,వరాహస్వామిని దర్శించాడు. తిరుమలేశుని దర్శనానికి ముందుగా వరాహస్వామిని దర్శించడం ఆనవాయితీ. అసలు వరహాస్వామియే తిరుమలేశుని కొండపై ఉండడానికి అనుమతించాడు. వరాహస్వామి దర్శనానంతరం, తిరుమలేశుని దర్శించి, గరుడ కంభానికి, విమాన వేంకటేశ్వరునికి, యోగ నరసింహస్వామికి నమస్కరించి దర్శనం చేసుకున్నాడు. తిరుమలేశుని సన్నిధిలో బంగారువాకిళ్ళ వద్ద నిలిచి, అనిర్వచనీయమైన అనుభూతితో శంఖ చక్ర పీతాంబరాదులు ధరించిన ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసి ఆధ్యాత్మికానందానికి లోనయ్యాడు.

అతని హృదయకుహారం నుండి భావ గీతికలు వెలువడ్డాయి. “పొడగంటిమయ్య మిమ్ము పురుషుత్తోమా, మమ్ము నెడయకవయ్య కోనేతిరాయడా!” అని పాడి, అర్చకులను ఆశ్చర్యపరిచాడు. తర్వాత తిరుమలలోని పవిత్రతీర్థాలలో స్నానం చేసి, గుడ్డలు ఆరేలోపుగా స్వామిపై ఆశువుగా ఒక శతకం వ్రాశాడు.

ఒకరోజు అన్నమయ్య స్వామిదర్శనానికి వెళ్ళినపుడు దేవాలయం తలుపులు మూసి వున్నాయి. నిరుత్సాహపడ్డ అన్నమయ్య ఆవేదనారూపమైన   ఒక గీతం పాడగా, వెంటనే తలుపులు తెరచుకున్నాయి. అర్చకులు అన్నమయ్యను లోనికి తీసుకుని వెళ్ళి ప్రసాదాలందించారు. స్వామి ఎదుట నిలుచుకొని, ఒక శతకాన్ని స్వామికి అర్పించాడు. తిరుమలలో ఘన విష్ణువనే వైష్ణవయతికి స్వామి కలలో దర్సనమిచ్చి, అన్నమయ్యకు ముద్రధారణ చేయవలసినదిగా తన ముద్రికను అందజేశాడు. హరినామ సంకీర్తన చేస్తూ, తన వద్దకు వచ్చిన అన్నమయ్యకు ముద్రదారణ చేశాడు. దాంతో అన్నమయ్య వైష్ణవుడై, అన్నమాచార్యుడయ్యాడు.

తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుమల చేరిన అన్నమయ్యను తల్లిదండ్రులు వెదకి, వెదకి ఘనవిష్ణువు వద్ద విష్ణుతత్వాన్ని తెలుసుకుంటున్న అన్నమయ్యను చూశారు. అన్నమయ్య వారిని చూసి, తల్లి ఒడిలో వాలిపోయాడు. తల్లి లక్కమాంబ అన్నమయ్యను తాళ్ళపాక రమ్మన్నది. కాని పెరుమాళ్ళును వదలి రాలేనన్నాడు అన్నమయ్య. ఇంతలో గాఢనిద్ర పొందిన అన్నమయ్యకు స్వామి స్వప్నంలో దర్సనమిచ్చి, తాళ్ళపాక వెళ్ళమన్నాడు. ఆయన ఆదేశం ప్రకారం తాళ్ళపాక వెళ్లాడు. తాళ్ళపాకలో భగవత్సంకల్పం వల్ల తిమ్మక్క, అక్కమల్లను వివాహమాడాడు.

గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ, దైవచిన్తనలో కాలం గడిపాడు. మరల తాళ్ళపాక నుండి తిరుమల వచ్చి, స్వామి దర్శనం చేసుకున్నాడు. హఠాత్తుగా ఆయన కంఠం నుండి ఒక కొత్త పాత అవతరించింది. “బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము…పరమ యోగులకు పరిపరి విధముల వరమోసగెడి నీ పాదము” అని తిరుమలేశుని పాదాలు అన్నమయ్య హృదయపీఠంలో తిష్ఠ వేశాయి. దాని ఫలితంగా వేంకటేశ్వరుడు దర్శనమిచ్చి, “రోజుకొక సంకీర్తన నీ నోట వినవలె, నీ సంకీర్తనలు తప్ప మరెవ్వరివీ నే ఆలకించను. ఇది నా ప్రతిజ్ఞ” అని అదృశ్యుడయ్యాడు.

స్వామి ఆదేశం ప్రకారం సంకీర్తనా యజ్ఞం ప్రారంభించాడు. ఊరూరాతిరుగుతూ, తేనెలొలికే తెలుగు తీయదనం ఉట్టిపడేవిధంగా కీర్తనలు పాడుతూ, భక్తులను మైమరపించేవాడు. ఇలా దేశసంచారం చేస్తూ, అన్నమయ్య శఠకోపయతిని దర్శించడానికి అహోబిలం వెళ్ళాడు. అది వైష్ణవక్షేత్రం. అక్కద యోగనరసింహస్వామిని దర్శించాడు. శఠకోపయతి వద్ద పుష్కరకాలం ఆయన సేవలు చేస్తూ, వైష్ణవ ఆగమాలు అభ్యసించి, విష్ణుతత్వాన్ని, శరణాగతి తత్వాన్ని జీర్ణించుకొన్నాడు.దానిని అందరికీ ఉపదేశించడానికి సిద్ధమయ్యాడు. “బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే, కందువగు హీనాదికము లిందులేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ” అని వాడవాడలా వైష్ణవ తత్వాన్ని ప్రచారము చేశాడు. అన్నమయ్య పాండిత్యాన్నిమెచ్చుకున్న సాళువ నరసింహరాయులు, తాళ్ళపాక వెళ్ళి, ఆయనకు ఘనసన్మానం చేసి, తనకు తోడుగా ఉండమని ప్రార్థించాడు. వైష్ణవ ధర్మవ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందని భావించి, అంగీకరించాడు. తన సంకీర్తనలతో విశిష్టాద్వైతాన్ని వ్యాప్తి చేయసాగాడు.

ఒకనాడు రాజు తన కొలువుదీరి, మంత్రులు, సామంతులు సభలో వుండగా ఒక కీర్తన ఆలపించామన్నాడు. మధురమైన శృంగారకీర్తన ఆలపించాడు. “ఏమొకో చిగురుటధరమున ఎడయెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా….నిలువునా పెరుకంగా అంటిన నెత్తురు కాదు గదా!” ఆ పాత విన్న రాజు పరవశించి, తన మీద అలాంటి ఒక పాటను వ్రాయమని కోరినపుడు అన్నమయ్య “నరహరి కీర్తననానిన జిహ్వ, నోరులను నుతింప నోపదు”, “హరి ముకుందుని కోరునాడు జిహ్వ, నిను కొనియాడ నేరదెంతైన” అని చెప్పి సభనుండి వెళ్ళిపోయాడు. దానిని అవమానంగా భావించిన నరసింహరాయులు అన్నమయ్యను కారాగారబద్ధుణ్ణి చేశాడు. అప్పుడు అన్నమయ్య స్వామి రక్షణ కోరి ఇలా పాడాడు. “నీ దాసుల భంగములు నీవు చూతురా, యేదని చూచేవు నీకు నేచ్చరించవలెనా… చనువుతో మా గొరికె సారె విన్నవించితిమి, విని శ్రీ వేంకటేశుడ వేగ రక్షించ రాదా!” అని పాత పాడిన వెంటనే, సంకెళ్ళు విడిపోయాయి. భటుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజు, మరల సంకెళ్ళతో బంధించమన్నాడు. అప్పుడు అన్నమయ్య మరో కీర్తన పాడడంతో మరల సంకెళ్ళు తెగి కిందపడ్డాయి. అప్పుడు రాజు అన్నమయ్య గొప్పతనాన్ని గ్రహించి, క్షమించమని కోరితే, అన్నమయ్య క్షమిస్తూ, “భాగవతుల నవమానించుట భగవంతుని అవమానించినట్లే” అని చెప్పి, తిరుమల వెళ్ళిపోయాడు. ఆనాడు అన్యమతస్తుల దండయాత్రలో దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కంట బడిన స్త్రీలను మానభంగం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో యాత్ర సాగిస్తున్న అన్నమయ్య విగ్రహాలను తస్కరించి, అన్నమయ్య ఉన్న గుడిని కూల్చారు. పెల్లుబికిన దుఃఖంతో దీనంగా ఒక పాత పాడగా, అన్యమత సైనుకులు ఏర్పరుచుకున్న గుడారంలో మధ్య ఒక వానరం ప్రవేశించి, గుడారాన్ని నేలమట్టం చేసింది. అన్నమయ్య విగ్రహాలు మరల ఆయనకు దక్కాయి. ఇది స్వామి కరుణా కటాక్షమని భావించి, జీవితాన్ని శాశ్వతంగా స్వామిసన్నిధిలో గడుపుతూ, ఉత్సవాలలో పాల్గొనేవాడు.

ఒక శుభదినాన స్వామి అన్నమయ్య తేనెలూరే శృంగార కీర్తన పదాలను విని తన్మయుడై, ముసి ముసి నవ్వులు నవ్వసాగాడు. స్వామికి నైవేద్యంగా మామిడి పండ్లను సమర్పించాడు. స్వామి ఆరగింపైన దానిని రుచి చూడగాపుల్లగా వున్నాయి. స్వామికి ఎంత అపచారం చేశానని బాధపడి, మామిడిచెట్టును తాకి, ఈ పండ్లు తీయదనాన్ని పొందుగాక అని తిరుమలేశుని ప్రార్థించగా, అవి మధుర ఫలాలుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచాయి.

దానితో అన్నమయ్య కీర్తి విశ్వవ్యాప్తమైంది. అన్నమయ్య మహిమలు విన్న  పురందరదాసు తిరుమల వచ్చి అన్నమయ్యను కలుసుకున్నాడు. ఆయన పాటలు విన్న పురందరుడు తన జన్మ ధన్యమైనదన్నాడు. అప్పుడు అన్నమయ్య “నీవు రంగవిఠలుడి అనుగ్రహానికి పాత్రుడవై, ఆయన చేత నీళ్ళు తెప్పించుకుని సంధ్య వార్చిన పుణ్యాత్ముడవు” అన్నాడు. అట్టి మహనీయుడు కాలధర్మం చెందడానికి కొద్ది ఘడియలముందు కుమారుడైన పెద తిరుమలయ్యను పిలిచి, “నేటితో నా సంకీర్తనాయజ్ఞం పూర్తవుతుంది. ఇక నీవు ఆ శ్రీనివాసునికి దినానికి ఒక సంకీర్తన చొప్పున సమర్పించు, ఇది నీ బాధ్యత” అని చేతిలోని తంబూర, చిడతలను అతనికి అందజేశాడు. దుందుభి సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అంటే క్రీ.శ.1503లో కుమారుని తల నిమురుతూ, గంభీరంగా నడుస్తూ, తిరుమలేశుని తేజోరూపంలో కలసిపోయాడు. అలా అన్నమయ్య జీవితం స్వామిసేవలో ధన్యమయింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s