పుష్పదంతుడి ‘శివ మహిమ్నస్తోత్రమ్’


విశేష ప్రాచుర్యం పొందిన శివస్త్రోత్రాల్లో శివ మహిమ్నస్తోత్రమ్ ఒకటి. ఇది దక్షిణభారతంలో కంటే, ఉత్తర భాతరదేశంలో మరింత ప్రచారంలో ఉంది. అక్కడ ఏ ప్రముఖమైన శివాలయానికి వెళ్ళినా, ఈ స్తోత్ర ప్రారాయణలు వినవచ్చు. కాశ్మీర్ శైవులు ఈ స్తోత్రాన్ని ఎంతో మహత్తర మైనదిగా భావిస్తారు.

దీక్షా, దానం, తపః, తీర్థం, జ్ఞానం, యాగాదికాః క్రియాః
మహమ్నః స్తవ పాఠస్య కలాం నార్హంతి షొడశమ్

వ్రతాలు, దానాలూ, తపస్సులూ, తీర్థయాత్రలూ, శాస్త్రజ్ఞానం యాగాది కర్మాలూ – వీటన్నిటివల్ల కలిగే ఫలం, శివమహిమ్నస్తోత్ర పఠనంవల్ల కలిగే ఫలంలో పదహారో వంతు కూడా ఉండదట.

మహేశాత్ నాపరో దేవః మహిమ్నః నా పరో స్తుతిః
అఘోరాత్ నా పరో మంత్రః తత్త్వం గురో పరమ్

మహేశ్వరుడుని మించిన దేవుడు లేదు. మహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి లేదు. అఘోర మంత్రాన్నిమించిన మంత్రం లేదు. గురువును మించిన పరతత్త్వం లేదు అనే శ్లోకం ద్వారా శివమహిమ చెప్పబడుతోంది.

పాశ్చాత్య చరిత్రకారులు, ఈ స్తోత్రాన్ని గ్రహిలుడు అనే కవి రచించినట్లు చెబుతారు. ఈ కవి క్రీ.శ.9 వ శతాబ్దం కంటే ఖచ్చితంగా ముందరివాడే. ఎందుకంటే, 9-10 శతాబ్దాల నాటికి ఈ స్తోత్రం బాగా ప్రసిద్ధమైపోయింది. ఈ స్తోత్రం చెక్కి ఉన్న క్రీ.శ.1063 నాటి శిలా ఫలకం ఒకటి దొరికింది.

అయితే ఈ స్తోత్రాన్ని మొదట చెప్పింది పుష్పదంతుడు అనే గంధర్వుడని స్తోత్రం చివరి శ్లోకాలలో ఉంది. ఈ పుష్పదంతుడిది ఓ విచిత్రమైన కథ.

ఒకానొక కాలంలో కాశీలో గోవిందభట్టు అనే బ్రాహ్మనుడుండేవాడు. ఒకరోజు ఆయన ఇంటికి అతిథిగా వచ్చిన ఒక సాధువును ఆ బ్రాహ్మణుని కుమారులు గేలి చేసి అవమానించారట. సాధువుకు కోపం వచ్చి ఇలాంటి ఇంటి అతిథ్యం నాకు వద్దని వెళ్ళిపోయాట్ట. ఈ బ్రాహ్మణుడు తన కుమారులను ఇంటి నుంచి బహిష్కరించి, సాధువుకు క్షమాపనలు చెప్పి వెనక్కి పిలుచుకొచ్చి ఆతిథ్యమిచ్చాడట. అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన భ్రాహ్మణ కుమారులలో ఓకడు, తన తప్పుకు పశ్చాతాపపడి హిమాలయాలలో తపస్సు చేసి, శివుని మెప్పించాడు. మనణానంతరం కైలాశ ప్రాప్తిని పొందాడు. గురువుల దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తుండగా, ఒకరోజు యాదృఛ్ఛికంగా ఆ దేశపు రాకుమారి అతడిని ఒక ఉద్యాన వనంలో చూసి మోహిస్తుంది. చేతిలో ఉన్న పుష్పాన్ని తన దంతానికి తాకించి, ఆ సైగ ద్వారా పుష్పదంతమనే చోటగల ఆలయానికి రమ్మని రహస్య సందేశం పంపుతుంది. బ్రహ్మణ కుమారుడు ఆమెను కలసి, ఆమె కోరిక మేర ఆమెను పెళ్ళాడి, ఆ దేశానికి రాజవుతాడు. మరణానంతరం కైలాసం చేరుకుంటాడు.

అక్కడ ఓసారి పార్వతీపరమేశ్వరుల రహస్య సంభాషణలు వినే ప్రయత్నం చేసి, పార్వతీదేవి ఆగ్రహానికి గురై మరలా మానవజన్మను ఎత్తాల్సి వచ్చింది. వరరుచి అనే వ్యాకరణవేత్తగా పుట్టి, ఆ తరువాత జన్మలో గంధర్వుడయ్యాడట. ఏ జన్మను ఎత్తినప్పటికీ శివభక్తిని వదల్లేదు. గంధర్వునిగా అదృశ్యరూపంలో వెళ్ళి, ఒక రాజుగారి తోటళొ పూలన్నీ తన శివపూజకు కోసి తెచ్చుకునేవాడు. ఒకనాడు ఆ తోటలో శివపూజ నిర్మాల్యాన్ని తొక్కాడట. దాంతో గంధర్వశక్తులూ, అదృశ్యరూపం కోల్పోయాడట. రాజభటులు శిక్షిస్తారని అనుమానం కలిగి, ఈ శివమహిమ్నస్తోత్రం గానం చేసి శివుని మెప్పించి, తిరిగి కైలాసంలో శివపార్వతులను సేవించే భాగ్యాన్ని పొందాడట.

శివమహిమ్న స్తోత్రమ్ 31 శ్లోకాల చిన్న స్తోత్రమే. కానీ, చాలా ప్రసిద్ధి పొందింది. ‘మహిమ్నః’ అనే శ్లోకంలో మొదలవుతుంది కనుక, దీన్ని శివమహిమ్న స్తోత్రం అని అంటారు.

మహిమ్నః పారంతే పరమ విదుషః యది అసదృశీ
స్తుతిః బ్రహ్మదీవామపి తదవసన్నాః త్వయి గిరః
అథ అవాచ్యః సర్వః స్వమతి పరిమాణావధి గృణన్
మమాప్యేష స్తోత్రే, హర నిరపవాదః పరికరః

‘ఓ శంకరా! నీ మహిమలు సంపూర్ణంగా తెలియని నాలాంటివాడు స్తోత్రం చేస్తున్నాడని, అది తగని పని అనుకోవద్దు. నీ మహిమలు పూర్తిగా తెలిసినవాళ్ళే నిన్నుస్తుతి చేయాలంటే అది అసలు కుదిరే పని కాదు. అందుకు బ్రహ్మాదులకు కూడ మాటలు చాలవు. కనుక, చాలీచాలని మాటలతోనే నా చేతయినట్టు నేను నిన్నిలా స్తోత్రమ్ చేస్తున్నాను’ అని కవి సవినయంగా ఆరంభిస్తాడు.

‘నీ తత్త్వం ఆవాజ్మానసగోచరం. ఉపనిషత్తులు కూడ నిన్ను ‘నేతి-నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని తప్ప, ఇదమిత్థం అని స్పష్టంగా చెప్పలేకపోయాయి. అలాంటి నిరాకారుని గ్రహించడం, స్తుతించడం అసాధ్యం. అదే నామరూపాలు గల శివుడుగా నిన్ను భజించడం అంటే ఎవరి మనసు ఉప్పొంగదు?’

‘ఓ శంకరా! అమృతప్రాయమైన తేనెలొలికే మాటలకు నువ్వు సృష్టికర్తని. కనుక, ఇక ఆ బృహస్పతి మాట్లాడినా నీకు రుచించదు. ఇక నావంటి అల్పుడి స్తోత్రం నీకెలా నచ్చుతుంది? నచ్చదని నాకు తెలుసు. నేను ఈ స్తోత్రం చెప్పుకునేది నీకోసం కాదు. నీ గుణ గాన పుణ్యంవల్ల నన్ను నేను పునీతుడిని చేసుకునేందుకు మాత్రమే!’ అంటాడు పుష్పదంతుడు.

ఈస్తోత్రంలో అన్నింటికంటే ప్రసిద్ధమైన శ్లోకమిది.

త్రయీ! సాంఖ్యం, యోగః పశుపతి మతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే ‘వరమిద మదః’ పథ్యా మితి చ
రుచీనాం వైచిత్ర్యాత్ ఋజు  కుటిల నానా పథ జుషాం
నృణాం ఏకః గమ్యః త్వమసి పయసాం అర్ణవ మివ

మూడు వేదాలలో చెప్పిన కర్మకాండ మార్గం, సాంఖ్యయోగ మార్గం, పతంజలి యోగమార్గం, శైవ మార్గం, వైష్ణవమార్గం – ఇలా రకరకాలుగా సాగించుకునే మోక్షప్రస్థానంలో ‘ఇది శ్రేష్టమూ, అది హితకరం’ అనుకుంటూ తమ తమ అభిరుచుల వైవిధ్యం వల్ల మనుషులు వేరు వేరు మార్గాలను అవలంబిస్తారు. కానీ, వాటన్నింటికి గమ్యస్థానం ఒకటే. ఆ గమ్యం నువ్వే. నదులన్నింటికీ సముద్రంలాగ.

‘నిరీశ్వరవాదులు తర్కానికి అతీతుడివైన నీ మహిమలు తెలుసుకోలేక కుతర్కంలో ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ లోకంలో ఎంతో వైచిత్రీ, భిన్నత్వం కనిపిస్తాయి. అధిష్ఠాతవు నువ్వు లేకపోతే, ఈ భువనాలన్నింటినీ ఎవరు నిర్మిస్తారు? ఏ పరికరంతో నిర్మిస్తారు? మందబుద్ధులకు మాత్రమే ఈశ్వరుడున్నాడా? లేడా? అన్న అనుమానాలు కలుగుతాయీ అంటుంది ఈ స్తోత్రం.

సరళంగా, సుందరంగా రచించబడిన ఈ స్తోత్రంలో దీర్ఘమైన సమాసాలు, కష్టమైన పదాలేమాత్రం కనిపించవు. ఇందులో శివమహిమలు, తత్త్వమూ అనేక విధాలుగా వర్ణించబడింది. ప్రతీశ్లోకంలో శబ్దగాంభీర్యం, అర్థగౌరవం చెట్టాపట్టాలుగా నడుస్తుంటాయి.

మహాచార్యులు శ్రీ మధుసూదన సరస్వతి శివ మహిమ్న స్తోత్రానికి వ్యాఖ్యానం రచించారు.

ఈ శివమహిమ్న స్తోత్రం శివభక్తులందరూ తప్పక చదవ వలసిన స్తోత్రం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s