ఆది శేషుని ఆశ !


శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన ఆదిశేషునికి, తాను ఆ స్వామికి మెత్తటి పరుపులాగా ఉంటూ సేవ చేయడం అమితమైన సంతోషాన్నికలిగిస్తుంటుంది. ఆయన్ని మోయడం ఆదిశేషునికి ఎప్పుడూ కోడా పెద్ద సమస్య అనిపించలేదు. విష్ణువు అసలు బరువు ఉన్నట్లుగానే అనిపించడు. ఇదిలావుండగా, ఒకరోజున ఆదిశేషునికి శ్రీమహావిష్ణువు మోయలేనంత బరువుగా అనిపించాడు. “ఎందుకిలా జరుగుతోంది?” అని ఆశ్చర్యచకితుడైన ఆదిశేషుడు, అదే విషయాన్ని గురించి శ్రీమహావిష్ణువుతో ప్రస్తావించాడు. అది విన్న విష్ణుమూర్తి “ఆదిశేషా! నిన్న భూలోకానికి వెళ్లాను కదా! అక్కడ ఓ పుణ్య ప్రదేశంలో శివుడు తాండవనృత్యాన్ని చేయడము చూసాను. త్రినేత్రుడి తాండవ నృత్యాన్ని చూసిన నా మనసు సంతోషముతో నిండిపోయింది. అందుకే నా శరీరంకూడ బరువెక్కింద” ని నవ్వుతూ చెప్పాడు. విష్ణువు చెప్పిన సంగతిని విన్న ఆదిశేషుడు మనసులో కూడ ఓ చిన్న ఆశ మొదలైంది. ఎలాగైనా తాను కూడా శివతాండవ నృత్యాన్ని చూసి తరించాలి. “నేను కూడా ఆ స్వామి తాండవ నృత్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందా స్వామి?” అని తన స్వామిని అభ్యర్దించాడు ఆదిశేషుడు. అప్పుడు విష్ణువు, “ప్రస్తుతం శివ పరమాత్మ తాండవం చేస్తున్నాడు. నువ్విప్పుడు అక్కడకు వెళితే, ఆయన తాండవ నృత్యాన్ని చూసి ఆనందించవచ్చు” అని చెప్పాడు. చెప్పడమే కాదు, వెంటనే చూసి తరించమని ఆదిశేషునికి తన అనుమతిని కూడా ఇచ్చాడు.

వెంటనే ఆదిశేషుడు మనిషితల, పాము శరీరముతో కూడిన ఓ చంటిబిడ్డడి రూపాన్ని ధరించి అత్రిమహర్షి ధర్మపత్నియైన అనసూయాదేవి చేతులలో పడ్డాడు. మనిషి తల, పాము శరీరంతో కూడిన ఆ బిడ్డని చూడగానే ఒళ్ళు జలదరించుకున్న అనసూయాదేవి, తనచేతులను గట్టిగా విదిలించి, ఆ బిడ్డడిని దూరంగా విసిరేసింది.

కిందపడిన ఆ బిడ్డ, “తల్లీ! భయపడవద్దు, నేను మీ కుమారుడిని. నన్ను మీరే పెంచాలి” అని పలుకుతూ అనసూయాదేవి పాదాలపై పడటంతో, ఆ బిడ్డని దగ్గరకు తీసుకున్న అనసూయ ‘పతంజలి’ అని పేరు పెట్టి పెంచుకోసాగింది.

అలా అత్రి మహాముని ఆశ్రమములో పెరిగిన పజంజలి సకల శాస్త్ర  కోవిదుడైనాడు. శివదేవుడు చిదంబరములో ఆనందతాండవం చేస్తుంటాడని తెలుసుకున్న పతంజలి, ఒకరోజున తన తల్లిదండ్రుల అనుమతితో శివతాండవాన్ని తిలకించడానికి బయలుదేరాడు. ఆదిశేషుడు పతంజలి రూపాన్ని ధరించడం వెనుక గల అసలు కారణం ఇదే!

ఆదిశేషుడు వ్యాకరణానికి అధిదేవత. ఆయన ఈ భూలోకానికి పతంజలి రూపంలో వచ్చాడని తెలుసుకున్న విద్యార్థులు, భూలోకం నలుమూలల నుండి, ఆయన దగ్గర వ్యాకరణం నేర్చుకోడానికి తరలి వచ్చారు. పతంజలికి ధర్మసంకటం! తాను పరమశివుని తాండవనృత్యాన్ని చూసేందుకు వచ్చాడా? లేక ఈ విద్యార్థిలోకానికి వ్యాకరణ పాఠములు నేర్పేందుకు వచ్చాడా? అయితే, తనను వెదుక్కుంటూ వచ్చిన విద్యార్థులకు తగిన విద్యను బోధించడం గురువు యొక్క విద్యుక్తధర్మం. కానీ, విద్యార్థులకు పాఠాలు చెబుతూ, తన అమూల్యమైన కాలాన్ని ఖర్చు చేయలేడు. ఆ మరుక్షణమే పతంజలి మనసులోని ఓ ఆలోచన. ఆదిశేషుని అంశమైన తనకు వేయితలలు కదా! కాబట్టి తన వేయి తలలతో ఒకేసారి వెయ్యిమంది విద్యార్థులకు పాఠాలను చెప్పొచ్చు. అయితే తను వేయితలలతో కొలువు దీరి ఊపిరి పీలుస్తూ వదిలితే, అప్పుడు విడుదలయ్యే విషవాయువు వలన విద్యార్థులు దగ్ధమైపోయే అవకాశం ఉంది.

అందుకనే తను పాఠాలు చెబుతున్నపుడు, తనకు ఆ విద్యార్థులకు మధ్య ఓ తెరను కట్టమన్నాడు. అలా తాను తెరవెనుక ఉంది వేయి మంది విద్యార్థులకు పాఠాలను చెప్పసాగాడు పతంజలి. పాఠాలు చెప్పేముందు తన విద్యార్థులకు రెండు నిబంధనలు విధించాడు పతంజలి. పాఠం చెబుతున్నప్పుడు ఎవ్వరూ కదలకూడదనేది మొదటి నిబంధన. అలా కదలి బయటకు వెళ్ళే విద్యార్థి బ్రహ్మ రాక్షసునిగా మారిపోయి, నాలుగు రహదారుల కూడలిలో నున్న చెట్లకు దెయ్యాల్లా తల్లక్రిందులుగా వ్రేలాడతారన్నది రెండవ నిబంధన. పతంజలి అలా నిబంధనలను విధించడం వెనుక ఓ అంతరార్థం ఉంది. అధ్యాపకులు పాఠం చెబుతున్నపుడు, విద్యార్థులు మధ్యలో లేచి బయటకు వెళితే, పాఠాలు సరిగా వారి బుర్రలకెక్కవు. ఫలితంగా ఆ విద్యార్థుల భవిష్యత్తు, చెట్లకు తలక్రిందులుగా వ్రేలాడు తున్న దెయ్యాలవలె మారుతుందన్నది పతంజలి చెబుతున్న నిత్యసత్యం. ఇక రెండవ నిబంధన ప్రకారం, పతంజలి, పాఠాన్ని చెబుతున్నపుడు ఏ ఒక్క విద్యార్థి పతంజలితో మాట్లాడాలన్న కోరికతో తెరను తొలగించి లోపలకు తొంగి చూడకూడదు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి అలా చేస్తే ఆ విద్యార్థితోపాటు మిగతా విద్యార్థులు కూడా భస్మమైపోతారు.

అలా తన విద్యార్థులకు నిబంధనలను విధించిన ఆదిశేషుని అంశమైన పతంజలి, వేయితలలతో వ్యాకరణ పాఠాలను చెప్పసాగాడు. ఎంతో కష్టతరమైన వ్యాకరణాన్ని ఇంత సులభశైలిలో అర్థమయ్యేటట్లు చెబుతోన్న తమ గురువు చెబుతోన్న గురువు, వేయి శిరస్సులతో కూడిన పతంజలిని చూడాలన్న కోరిక కొంతమంది విద్యార్థుల మనసులలో మొలకెత్తి, మెల్లమెల్లగా బలపడసాగింది. కొంతసేపటికి తనలోని ఉద్వేగానికి అడ్డుకట్ట వేయలేకపోయిన ఓ విద్యార్థి తెరను తొలగించి చూసాడు. అంతే! ఆ మరుక్షణంలోతెర తొలగించిన విద్యార్థితో పాటూ, అక్కడున్న విధ్యార్థులంతా కాలి బూదిడైపోయారు. ఒక విద్యార్థి చేసిన దుందుడుకు చర్య వల్ల మిగితా విద్యార్థులంతా మాది మసైపోవడం పతంజలిని ఎంతగానో బాధించింది. ఒక్కడు మిగలకుండా అందరూ చనిపోయారే అని పతంజలి దుఃఖితుడౌతున్న సందర్భంలో అక్కడొక విద్యార్థి ప్రత్యక్షమయ్యాడు. పతంజలి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదెలా సాధ్యం?!

అందరూ మాది మసైపోయిన తరువాత ఈ విద్యార్థి ఎలా బ్రతికి బట్టకట్టాడు? పతంజలి పాదాలపై పడిన ఆ విద్యార్థి, “గురువర్యా! మీ దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చిన వెయ్యిమంది విద్యార్థులలో నేనూ ఒకడిని. నేను గౌడదేశం (వంగదేశం – బెంగాల్) నుంచి వచ్చాను. మీరు చెప్పిన వ్యాకరణపాఠాలు ఏమాత్రం నా బుర్రకెక్కక పోవడంతో, మధ్యలో లేచి బయటకివెళ్లాను. నన్ను మన్నించండి” అని చెప్పాడు. ఆ విద్యార్థి మాటలను విని సంతోషించిన పతంజలి, “శిష్యా! బాధపడవద్దు. నీకు అర్థమయ్యే విధంగానే వ్యాకరణ పాఠాలను బోధిస్తాను” అని చెప్పి, అలాగే ఆ విద్యార్థిని వ్యాకరణంలో నిష్ణాతునిగా చేసాడు.

అలా పతంజలి శిష్యరికం చేసి వ్యాకరణ పండితునిగా ప్రఖ్యాతిగాంచిన విద్యార్ధియే, ఆదిశంకరుని గురువైన గౌడపాదుడు. గౌడదేశానికి చెందిన వాడైనందున అతన్ని గౌడపాదుడు అన్నారు. పతంజలి విధించిన నిబంధనను మీరినందువల్ల గౌడపాదుడు చెట్టుకు తలక్రిందులుగా వ్రేలాడే దెయ్యంగా గౌడపాదుడు మారిపోయాడు. మరలా పతంజలియే గోవిందభగవత్పాదునిగా అవతరించి, గౌడపాదుని శాపవిముక్తునిగా చేసాడని ‘శంకరవిజయం’ కథనం.

అనంతరం పతంజలి, తాను చూడాలనుకున్న శివ తాండవాన్ని తనివితీరా దర్శించుకున్నాడు. వ్యాకరణ శాస్త్రం, యోగశాస్త్రం, వైద్యశాస్త్రాలకు సంబంధించిన పలు గ్రంథాలను రచించిన పతంజలి, మనస్సు, వాక్కు, శరీర ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రాలను మానవాళి అందించి, ఎంతో మహోపకారాన్ని చేసాడు. నాడు తన దేవుడు విష్ణువు చూసి ఆనందించిన శివతాండవమును తాను కూడా చూడాలన్న ఆదిశేషుని ఆశ తీరింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s