పంచ సరోవరాలు…


మన సంస్కృతీ సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాల ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం తీర్థమంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటూన్నాం. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడా ఉండేది. అలా తీర్ధాలకు చేసే యాత్రాలనే తీర్థయాత్రాలని పిలుచుకుంటున్నాం. ఈ పుణ్య భారాతవనిలో ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలుగా ఎన్నో క్షేత్రాలు, పర్వతాలు, గుహలు, లోయలు, నదీసంగమస్థానాలున్నాయి. వీటితోపాటు సరోవరాలుకూడ ఆధ్యాత్మికానుభూతిని కలిగిస్తున్నాయి. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు ‘పంచ సరోవరాలు’గా ప్రసిద్ధికెక్కాయి. అవి:

1. మానస సరోవరం, 2. పంపా సరోవరం, 3. పుష్కర్ సరోవరం, 4. నారాయణ సరోవరం, 5. బిందు సరోవరం

మానస సరోవరం

సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్బవించింది. అందుకే దీనిని గతంలో ‘బ్రహ్మసరం’ అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు  త్రీవమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తుంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతులకోసం సృష్టించాడని పురాణ కథనం.

ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాలపాటు సాగింది. అదే సమయంలో ఆ పన్నెండేళ్ళపాటు ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గ్రదాపుల్లోని జలవనరులన్నే ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీనది దాకా వెళ్ళాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో నుంచి ఓ బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజులు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, ‘జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే’ అని సంకల్పం చెబుతుంటాం. ఈ జంబూ ద్వీపం అఖండభారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.

ఈ పేరు రావడానికి వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు ‘జం’ అనే శబ్దం వస్తుందేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జమ్బూద్వీపమనే పేరు రావడానికి కూడ కారణం మానస సరోవరమనేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మారం ఓ కథను చెబుతుండటం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనులు ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధగ్రంథాలు మానస సరోవరాన్ని అనోతత్త అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులు, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వులు ఆ పువ్వులపై కూర్చోనేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.

మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ పేడు వరుసల్లో చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షంఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను  తింటూండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకొని బంగారంగా మారాయిని  చెబుతుంటారు.

ఈ మానస సరోవరం శక్తి పీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51 శక్తిపీఠాలలో మానస సరోవరం కూడ ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉందంతాన్ని విన్న పరమశివుడు ఆగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞవాతికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, ఆ తల్లి కళేబరాన్ని భుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరుగసాగాడు. ఫలితంగా లోకాన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్నిముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు కుక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మానస సరోవరాన్ని తాకినా, స్నానామాచారించినా బ్రహ్మలోకం చేరుకున్తారానీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడంవల్ల పితృ దేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు, ‘ఓం’ ఆకారంలో ఉంటుండటం విశేషం.

ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.

చాలామంది మానస సరోవర పరిక్రమం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవరతీరం వెంబడి నడిస్తే 90 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం  పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజుల సమయం కూడ తీసుకుంటుంది. ప్రదక్షిణా మాగ్రం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్సి ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడటంతో వాహనాల ద్వారానే పరిక్రమ చేస్తున్నారు.

ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరతప్పదుగా, మానస మశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓవిధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడ అధికంగానే ఉంటోంది. శ్రమ కూడ అధికం.

ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధనాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యతా అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచు కున్నవారు ‘అండర్ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందు ముందుగా వచ్చినవాళ్ళకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్ రాజధాని ఖాట్మండుమార్గంద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రికులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులకు ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.

పంపా సరోవరం

పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపీలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక  అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తుండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.

సీతాన్వేషణలో కబంధుని సూచననుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు.

రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితు రాలిన శబరీ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది.

“శ్రీరామచంద్రమూర్తి మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికీ తపసిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్ధరాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తుండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచి మాకోసం ఎదురుచూస్తూ పండ్లు, ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి, నువ్వు, నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి” అని అభ్యర్థించగా, శ్రీరాముడు, “శబరీ! కబంధుడు నేఏ గురించి, నీ గురువుల గురించి చెప్పాడు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది” అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.

“ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఆ మతంగా వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను తమ శక్తి వలన చేసేవారు. వారి తపఃప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపాసరస్సులోకి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు” అని చెప్పి. తాను సేకరించిన ఫలాలను అందించింది. రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆ స్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.

హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు – హుబ్లీ రులు మార్గంలోనున్న హోస్పేటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

పుష్కర సరోవరం

పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మ దేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.

ఈ సరస్సు రాజస్థాన్ లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసె శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణముగా 9వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతుంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పణాలను చేస్తుంటారు.

నారాయణ వన సరోవరం

ఈ సరోవరం గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలో ఉంది. గుజరాత్ లోని భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణవన సరోవరం ఉంది. ఈ నారాయణవన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాదస్పర్శతో పునీతంయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలువబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమ శివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్ళిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణవన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణపరమాత్మ మదుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుక్కున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.

భుజ్ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

బిందు సరోవరం

గుజరాత్ లోని సిద్ధపూర్ లో ఉన్న బందుసరోవరం కపిలమునితపస్సు చేసి  తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

ఓ పురాణ కథనం ప్రకారం, స్వాయంభువు మనువు – శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహూతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అకంటపడ్డాడు. తని అతడే తన కూతురుకి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందని, అదే బిందు సరోవరమని కథనం.

కర్దమ – దేవహుతిల  వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు.అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా, వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిరర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందని పించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజ చేయమన్నాడు. అలా దేవహూతి ప్రార్థనతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు.

ఆ పుత్రుడే కపిలుడు.

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందుసరోవరం ప్రక్కనున్న రావిచెట్టు కింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

బిన్డుసరోవరం గుజరాత్ లోని పఠాన్జిల్లా, సిద్ధపూర్ లో అహ్మదాబాద్ – ఢిల్లీ జాతీయ రహస్యదారిలో ఉంది. సిద్ధపూర్ అహ్మదాబాద్ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్ లోని అన్ని ముఖ్యపట్టణాల నుంచి సిద్ధపూర్ కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేదిక ధర్మశాలలు ఉన్నాయి అహ్మదాబాద్ నుంచి సుమారు రెండుడు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మాదాబాద్ యాత్రార్థం వెళ్ళిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలోలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒక ప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకు తర్పణాలను విడిచి, వారికి ఉత్తమ లోక గతులను ఏర్పరచి, పితృదేవతలను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి. అవిః సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు.

Advertisements

One comment on “పంచ సరోవరాలు…

  1. PVSNMurty says:

    Ravi , very well written article . God bless you or such a sharing

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s