చదువులలో మర్మం…


సరస్వతి! నమః తుభ్యమ్
వరదే! కామరూపిణి!
విద్యారంభం కరిష్యామి,
సిద్ధిః – భవతు మే సదా!!

(సరస్వతి మాటా, నీకు నమస్కారం, ఓ వర ప్రదాయినీ, కామరూపిణీ, నేను విద్యారంభం చేయబోతున్నాను. నాకు ఎల్లప్పుడూ విద్యాల సిద్ధి కలుగుగాక!) అని సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రసిద్ధమయిన ప్రార్థన.

చాడువులతల్లిగా మనం పూజించుకొనే శక్తి స్వరూపిణి సరస్వతిమాత. సరస్వతీ పూజ సందర్భంగా విద్య గురించి నాలుగు మాటలు.

భారతీయ సంప్రదాయలో విద్యకు ఎంతో విలువ ఇచ్చారు. దానికిచ్చిన విలువ ధర్మవర్తనకూ, సచ్చీలానికీ తప్ప మరి దేనికీ ఇవ్వలేదు. ‘విద్య లేనివాడు వింత పశువు’ అంటుంది మన సంప్రదాయం.

విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే!

(విద్య సురక్షితంగా దాచబడ్డ ధనంలాంటిది. మనుషులకు విద్యే ఇతరులను ఆకర్షించగల సౌందర్యం విద్యే కీర్తి. అది సకలభోగాలనూ కలిగించగలదు. అది మార్గాదర్శనం చేసే గురువు. దేశాంతరంలో కూడా మన యోగక్షేమాలు కనిపెట్టి ఉండే బంధువు. విద్య విశిష్టమైన దేవతాస్వరూపం. దానికి సాటివచ్చే సంపద మరొకటిలేదు. దాని వల్ల రాజసత్కారం పొందవచ్చు. విద్య లేనివాడు అసలు మనిషేనా!) అని భర్తృహరి సుభాశితాన్ని కమ్మగా తెలుగులో చెప్పాడు ఏనుగు లక్ష్మణ కవి.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న. విద్య అంటే ఏది? నేటి విధానంలో చదువుకొని బియ్యేలూ, ఏమ్మేలూ చేయడం విద్యా? ఉన్నత ఉద్యోగాలూ, ప్రభుత్యాధికారాలు సంపాదించుకొనేందుకు పనికివచ్చే ‘చదువు’ ను విద్య అనాలా? అసలది విద్య అనవచ్చా? విద్యవల్ల పరమ ప్రయోజనం ఉదరపోషణేనా? లేక మరేదయినా ఉందా? ఇవన్నీ లోతుగా ఆలోచించాల్సిన ఆసక్తికరమైన ప్రశ్నలు.

విద్యలో వివిధాలైన స్థాయిలను గుర్తించ వచ్చు.

చరిత్రో, భూగోళ శాస్త్రమో, రసాయనిక శాస్త్రాయో ఎల్ల తరబడి ఆధ్యయనం చేసి వాటిలో పాండిత్యం సంపాదిస్తే, అవి విద్యలా? అంటే, ఒక స్థాయిలో అవి విద్యలే. వాటిని అభ్యసించినవాళ్ళు ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకొని సంఘానికి ఆయారంగాల్లో సేవలు చేయవచ్చు, చేస్తున్నారు. మరోనలుగురికి శాస్త్రభోధ చేసి పుణ్యం కట్టుకొంటున్నారు. ఆ సేవ విశిష్టమైనదే, ఒక స్థాయిలో.

కానీ, విద్యకు అంతకంటే మౌలికమైన గొప్ప ప్రయోజనం కూడా ఉన్నది. విద్య ధర్మాధర్మ విచక్షణ కలిగించాలి. నైతికవర్తననూ, ధర్మబద్ధతనూ, సద్గుణాలనూ సచ్ఛీలాన్నీ పెంపొందించాలి. పైన చెప్పుకొన్న శాస్త్రజ్ఞానంవల్ల ఈ ప్రయోజనం కలగనూ వచ్చు, కలగకపొవచ్చు కూడా.

ఈ ప్రసిద్ధ శ్లోకం విద్యవల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలను మరొక విధంగా వర్ణిస్తున్నది.

విద్యా దదాతి వినయం,
వినయాత్ – యాతి – పాత్రితామ్|
పాత్రత్వాత్ – ధన మాప్నోతి,
ధనాత్ – ధర్మం, తతః సుఖమ్||

(విద్యవల్ల వినయం అబ్బాలి. దానివల్ల పాత్రత, అధికారర్హత లభిస్తుంది. దాని వల్ల ధనం పొందవచ్చు. ధనం వల్ల ధర్మాచరణ సాధ్యమవుతుంది. దాని వలన సుఖం లభిస్తుంది.) ఈ ప్రాధాన్యతలవరుస సమంజసంగా ఉంది.

అయితే 19 శతాబ్దంలో మొకాలే సంస్కరణల వల్ల ఈ పరంపర మారిపోయినట్లయి విద్యవల్ల ప్రభుత్వోద్యోగం, తద్వారా విదేశీపాలనకు సహకరించటం, దాని వల్ల ధనం, దాని వల్ల విదేశీయ ప్రభువుల పాదపూజా భాగ్యం, దానివల్ల సాటివారిని నిర్దాక్షిణ్యంగా పీడీంచేందుకు సర్వహక్కులూ, ఇలా కొత్తప్రయోజనాలు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ పరిస్థితి మెరుగయింది. కానీ విద్యవల్ల ధర్మాధర్మవిచక్షణ, నీటి బద్ధమైన నడవడికా అలవాడాలనే ధారణ పునరుద్ధరించ బడ్డట్టు కనిపించదు.

అసలు, విద్యకు ఉన్న ముఖమైన ప్రయోజనం ప్రహ్లాదుడి వంటి జ్ఞానులు ఇంకో విధంగా ప్రకటించారు.

హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడిని గురుకులవాసం నుంచీ వెనక్కు పిలిపించి, ‘నాయనా! నీకు గురువులేమి నేర్పించారు? నిన్ను గురుకులానికి పంపినప్పటి నుంచి ఎప్పుడు నువ్వు నీతివిదుడివవుతావా అని గాఢమైన ఉత్కఠంతో ఎదురుచూస్తున్నాను. నువ్వు నేర్చుకొన్న విద్య సారమేమిటో నాలుగు ముక్కలలో చెప్పు. విని సంతోషిస్తాను.

విద్యాసార మెరుంగ గోరెద, భవత్ –
విజ్ఞాత శాస్త్రంబులో
పద్యం బొక్కటి – చెప్పి,
సార్థముగా – తాత్పర్యంబు – భాషింపుమా’

అంటే ప్రహ్లాదుడు :

చదివించిరి నను గురువులు;
చదివితి ధర్మాది ముఖ్య శాస్త్రంబులు; నే
చదివినవి – కలవు పెక్కులు;
చదువులలో మర్మమెల్ల – చదివితి తండ్రీ
! అని అన్నాడు. ఇంతకీ ప్రహ్లాదుడు నేర్చుకొన్న చదువులలో మర్మమెల్ల ఏమిటీ? తనే చెప్పాడు.

తను హృత్ – భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా –
ర్చనముల్ – సేవయు, ఆత్మలో – ఎరుకయున్, సంకీర్తనల్ , చింతనం –
-బను – ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స –
-జ్జనుడై యుండుట భద్రమంచు తలతున్, సత్యంబు! దైత్యోత్తమా!

ఆ మహాభక్తుడి దృష్టిలో చదువులలో సారం, మర్మం ఏమిటంటే మనిషికి హరి భక్తికంటె ఉత్తమమార్గం మరొకటి లేదని చదువుల ద్వారా నేర్వవలసినది ఇంతకూ మించి మరొకటిలేదు. ప్రహ్లాదుడి దృష్టిలో జీవితానికే ఏకైక ప్రయోజనం హరిసేవ. విద్యకూ అంతే, భక్తి మార్గాన్ని చూపేదే చదువు. ‘చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు!’

పొతే వేదాంతశాస్త్రంలో చూస్తే ముండకోపానిశాత్తు రెండు రకాల చదువులను గుర్తిస్తుంది – పరావిద్యా, అపరావిద్యా. ‘ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మ యత్ బ్రహ్మవిదో వదంతి: పారాచ ఏవ, అపరా చ’. నేర్వవలసిన విద్యలు పరావిద్య, అపరావిద్య అనే రెండు అని బ్రహ్మజ్ఞానులు చెప్తారు – ముండకోపనిషత్ (1-1-4).

వీటిలో అపరావిద్య అంటే చతుర్వేదాలూ, ఆరు వేదాంగాలూ మొదలైనవి. ఇవి జ్ఞానానికి సాధనాలు. అక్షర పరబ్రహ్మజ్ఞానాన్ని సాక్షాత్కరింపజేసేది పరావద్య – వేదాంత విద్య. ఈ విద్యనెలా అభ్యసించాలో ఉపనిషత్తు కోంత వివరంగా బోధిస్తుంది.

మరయితే పర – అపర విద్యలు రెంటికీ భిన్నమైన లౌకిక విద్యాల మాటేమిటి? వీటిని ఉపనిషత్తు ‘అవిద్య’ అంటుంది. అవిద్య అంటే విద్యాహీనతా, నిరక్షరాస్యతా కాదు. సంసార సాగరమే పరమార్థమనీ, దానికీ నా ఆత్మకూ ఉన్న సంబంధం శాశ్వతమనీ భ్రాంతి అవిద్య. ఇది నిజమైన విద్యవల్ల తొలగించబడుతుంది.

సంసారః పరమార్థోయం, సంలగ్నః స్వాత్మవస్తుని!

‘అవిద్యా’ స్యాత్; విద్యయా – ఏషా నివర్తతే||

అని విద్యారణ్యుళ ‘వేదాంత పంచదశి’ అవిద్యను నిర్వచించింది.

అవిద్యని తొలగించగల బ్రహ్మవిద్య అంత త్వరగా పట్టుబడేది కాదు. ఇది లౌకిక విద్యాల కంటె కష్టమైంది. ఆ విద్య గురూపదేశం వల్లా, ఆత్మ – అనాత్మల గురించిన నిరంతర వివేచనవల్లా, ఉపనిషత్తులలో చెప్పిన ‘మహావాక్యా’ళ నిరంతర చింతనవల్లా, ఎన్నో జన్మల కృషితో మాత్రమే పట్టుబడుతుంది. ఇది గ్రంధపఠనంవల్లా, శాస్త్ర చర్చలవల్లా, ప్రవచన శ్రవనంవల్లా మేధాశక్తి వల్లా బోధపాడేది కాదు. నిరంతరసాధనతో, అపరోక్షంగా అనుభవపూర్వకంగా అవగతమయ్యది మాత్రమే. పరావిద్య మాత్రమే మానవ జన్మకు పరమావధి అయిన బ్రహ్మజ్ఞానానుభవాన్ని కలిగించగలదు.

ఈ విద్యకూ, లౌకికమైన చదువులకూ సంబంధమే లేదు పొమ్మన్నాడు ధూర్జటి:

ఏ వేదంబు పఠించె లూతా? భుజగంబే శాస్త్రముల్ – చూచె? తా –
-నే విద్యాభ్యసనం బొనర్చె కరి? చెంచే మంత్రమూ హించే. బో –
-ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు! నీ పాద సం-
-సేవసక్తియోగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

సాలెపురుగు ఏ వేదాలు చదివింది? పాము ఏ శాస్త్రాలు చదివింది? ఏనుగు ఏ విద్యలు చదివింది? ఏనుగు ఏ విద్యలు నేర్చింది? చెంచుతిన్నాడు ఏ మంత్రాలు నేర్చుకొన్నాడు? (కానీ శ్రీకాళహస్తీశ్వర కథలో వీలాందరికీ ముక్తి లభించలేదా?). జ్ఞానం – ఆవిర్భావానికి కారణం చదువులా? కానే కావు. నీ పాదసేవలో ఆసక్తి మాత్రమే ప్రాణికోటికి మోక్ష ద్వారాలు తెరిపించగలడు, శ్రీకాళహస్తీశ్వరా!

ఇది ఇలావుంటే సరస్వతీ ఉపాసకుడైన శ్రీనాథుడు ఆ దేవి రూపాన్ని ఈ క్రిందివిధంగా వర్ణించాడు.

సింహాసనము చారుసిత పుండరీకంబు
చెలికత్తె చెలువారు పలుకు జిలక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు
పసిడి కిన్నెరావీణె పలుకుదోడు
నలువ నెమ్మోము దమ్ములు కేళీగృహములు
తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాది విద్యలు విహరణ స్థలములు
చక్కని రాయంచ యెక్కిరింత

యెపుడు నే దేవికాదేవి యిందుకుండ
చంద్రచందన మందార సారవర్ణ
శారదాదేవి మామకస్వంత వీధి
నిండు వేడుక విహరించు చుండుగాత

ఆ తల్లి కూర్చున్న సింహాసనం అందమయిన తెల్లని పద్మం. ఆమెకు చెలికత్తె చక్కైటి పలుకులు పలికే హిలుక. అమ్మ అలంకరించుకున్న పువ్వు బాలచంద్రుడు. అమ్మ పాటలకు తోడుగా బంగారు కిన్నెరా వీణ మ్రోగుతుంటుంది. బ్రహ్మదేవుని ముఖపద్మాలే అమ్మవారు ఆడుకునే కేళీగృహాలు. సత్కవుల మనసే అమ్మవారి ప్రతిబింబం కనబడే తళుకుటద్దం. వేదాది సకల విద్యలు అమ్మవారి నివాసాలు. చక్కని రాజహంస ఆ తల్లి వాహనం. సితపుండరీకం, చిలుక, చుక్కలరాజు చంద్రుడు, పసిడి కిన్నెరా వీణ, బ్రహ్మముఖాలు, సత్కవుల మనస్సు, వేదాది విద్యలు, రాయంచ…ఇవన్నీ అమ్మకు సంహాసనాడులై సేవిస్తున్నాయి. ఆ దేవి తెల్లని రంగు గల వస్తువులతో, దుస్తులతో ధగధగా మెరిసిపోతోంది. అటువంటి దేవి నా హృదయంలో ఆనందస్వరూపిణిగా విహరించుతుండగాక అని కవిసార్వభౌముడు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నట్లే సరస్వతీ మాట మనకు తగిన విద్యలను నేర్పించి, నిత్యం మనలను ఆనందసాగరంలో ఉండేట్లు దీవించుగాక!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s