యథావాక్కుల అన్నమయ్య – సర్వేశ్వరశతకం


తెలుగులో శతక సాహిత్యం 13వ శతాబ్దంలో బద్దెన రచించిన సుమతి శతకంతో మొదలయిందని ప్రతీతి. అయితే ఈ శతకం బద్దెన రచించినదేనా, ఆయన 13వ శతాబ్దం వాడేనా అనే విషయాలలో అభిప్రాయ భేదాలున్నాయి. 13వ శతాబ్దంలో పాల్కురికి సోమనాథుడు రచించిన వృషాధిప శతకం కూడా తోలి తెలుగు శతకాలలో ఒకటనీ, భక్తి శతకాలలో మొట్టమొదటిదని పండితులు చెబుతుంటారు. యథావాక్కుల అన్నమయ్య అనే మహాకవి కూడా పాల్కురికి సోమనాథుడికి దాదాపు సమాకాలికుడే. ఈయన క్రీ.శ.1242లో సర్వేశ్వరశతకం రచించాడు. దీని రచనాకాలం విషయంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఇది క్రీ.శ.1242లో రచించినాని కవి స్వయంగా శతకం లోనే సూచించాడు.

శతకానికి ఒక మకుటం ఉండాలని లక్షణం. సర్వేశరశతకంలో పద్యాలన్నీ ‘సర్వేశ్వరా!’ అన్న మకుటం కలిగి ఉన్నాయి. శతకంలో విషయం ఒకటే ఉంటుంది, కానీ ఒకపద్యానికీ మరోపద్యానికి వస్తుపరమైన మరే సంబంధం ఉండదు. సర్వేశ్వర శతకంలో విషయం శివభక్తి ప్రకటన, మహేశ్వరస్తుతి. ఒక పద్యానికీ మరోపద్యానికీ కథాపరమైన లంకె ఉండదు. ఇది కావ్యం కాదు కాబట్టి. శతకంలో నూరుకు తక్కువ కాకుండా, మరీ ఎక్కువా కాకుండా పద్యాలుంటాయి. శతకం అంటేనే నూరు కదా. సర్వేశర శతకంలో నూటనలభై రెండు పద్యాలు కనిపిస్తాయి.

సుప్రసిద్ధుడైన తాళ్ళపాక అన్నమయ్యకూ, సర్వేశరశతకర్త యథావాక్కుల అన్నమయ్యకూ వైష్ణవులు. విష్ణు భక్తిపరమైన పదాలు రాశారు. ఆయన 15వ శతాబ్దం వారు. యథావాక్కుల అన్నమయ్య అంతకు కనీసం రెండు శతాబ్దాల ముందువారు, శివభక్తుడు, శివకవి. సర్వేశ్వర శతకంలో 142 పద్యాలు తప్ప ఆయన వ్రాసిన మరే గ్రంథము ఉన్నట్టుగా లేదు. అన్నమాచార్యులు 30,000 పై చిలుకు పదాలు వ్రాశారు. తాళ్ళపాకవారు విశిష్టాద్వైత సంప్రదాయం వారైతే, యథావాక్కుల అన్నమయ్య గారిది విశిష్ట శివాద్వైత మార్గమని చెప్పచ్చు.

యథావాక్కుల అన్నమయ్య శతక కవులలోనే కాదు, తోలి తెలుగు కవులలోనే ఒకడు. తిక్కన సోమయాజిగారి కాలానికి కొంచెంముందో, వెనకో జీవించినవారు. ఈయన పద్యరచనలో చూపించిన నైపుణ్యం, ధారా, సమాసాల కూర్పూ ఈయన్ని తెలుగులో అగ్రశ్రేణి కవుల స్థాయిలో నిలిపేవే. తరువాతి శతాబ్దాలలో, ధూర్జటి వంటి మహా కవులు అన్నమయ్య కవిత్వస్ఫూర్తితోనే ‘కాళహస్తీశ్వర శతకం’ లాంటి అద్భుతమైన శతకాలు రచించారనడం అతిశయోక్తి కాదు.

ఈ అన్నమయ్య తూర్పుగోదావరిజిల్లా పట్టిసం ప్రాత్రంవారని కొందరన్నారు. కర్నూలుజిల్లాలో దూది కొండ (ప్రత్తికొండ?) ప్రాంతంవాడని మరికొందరన్నారు. భారతీయ కవి జీవితాల విషయంలో ఇలాంటి వివాదాలు ఇదమిత్థం అని తేల్చే అవకాశమే కనిపించదు.

ఒక పద్యంలో శ్రీశైలక్షేత్రం ప్రస్తావన ఉంది తప్ప. ఈ సర్వేశ్వరుడు ఏ ఒక్క ప్రాంతానికో, పుణ్యక్షేత్రానికో చెందిన దేవుడు అని కవి చెప్పలేదు.

ధరణిన్ – ప్రాక్తన భక్తనిర్మిత మహాస్థానంబులై యెప్పు శ్రీ
గిరిముఖ్యంబగు దివ్యతీర్థములు భక్తిన్ – చూచిరే, వారి దు
స్తర దోషంబులు – పాయునన్న, మరి సాక్షాత్ భక్తులన్ – చూచినన్ –
పరమార్థంబుగ – పాయదే నరుల పాపంబెల్ల! సర్వేశ్వరా!

ఈ భూమి మీద ప్రాచీనమైన భక్తులు నిర్మించిన ఆలయాలుగా ఒప్పే శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలను భక్తితో దర్శించితే, దర్శించిన వాళ్ళ ఘోర పాతకాలన్నీ నాశనమావుతాయంటారు గదా, మరి అలాంటి భక్తులనే పరమార్థంగా సేవిస్తే, మనుషుల పాపాలు పోకుండా ఉంటాయా? శైవ మతస్థులకు శివార్చన ఎంతముఖ్యమో శివ భక్తులసేవ అంతకంటే ముఖ్యమని భావిస్తారు కదా? 

సర్వేశ్వర శతకంలో శివుడి వర్ణనగానీ, శివపురాణ కథలుగానీ వివరంగా చెప్పటం కవి ఉద్దేశ్యం కాదు. శివభక్తి ప్రభావాన్నీ శివభక్తుల సేవ వల్ల కలిగే సత్ఫలితాలనూ వర్ణించాడు. ఈ శివాద్వైతమార్గం, శంకరుల అద్వైత సంప్రదాయానికంటే భిన్నం. ఇది రామానుజుల విశిష్టాద్వైతాన్ని పోలి, భక్తికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంది.

ఎటొచ్చి వైష్ణవులు విష్ణుభక్తినీ, విష్ణువు పారమ్యాన్నీ బోధిస్తే, శివాద్వైతం, శివభక్తికీ శివపారమ్యానికీ ప్రాధాన్యతనిస్తుంది. శ్రీకంఠాచార్యులూ, నీలకంఠాఅచార్యుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని అనుసరిస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s