శ్రావణం సర్వశుభప్రదం!


అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసం కాబట్టి దీనిని శ్రావణమనే పేరు వచ్చింది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నక్షత్రం శ్రవణం. అలాగే ఇది లక్ష్మీతత్త్వ ప్రకాశక మాసం కావడం వల్ల శ్రీ లక్ష్మీ నారాయణ మాసంగా ప్రసిద్ధికెక్కింది. శ్రావణమాసం వచ్చిందంటే శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాల పూజలతో, నోములతో, వ్రతాలతో ఆధ్యాత్మిక అనుభూతితో సమాజం ఆనందమయంగా దర్శనమిస్తుంది. పరమేశ్వరునికి సోమవార పూజలు, నోములు, మహాలక్ష్మీ దేవికి శుక్రవార పూజలు, వరలక్ష్మీ వ్రత విశేషాలు ఇలా పవిత్రతకు, వైదిక విశ్వాసాలకు, ఆనందోత్సహాలకు మారుపేరై నిలుస్తుంది శ్రావణ మాసం. చారుమతీదేవి కథ ద్వారా వరలక్ష్మీ వైభవమంతా లోకానికి అంది, అలా మనం కూడా లక్ష్మీమాటని సేవించాలని, లోకకళ్యాణం కోసం మనం పాటుపడాలనే చక్కని సందేశం లభిస్తుంది.

మాసమంతా పండుగలతో నిండి ఉండడం ఈ నేల ప్రత్యేకత. నాగ (గరుడ) పంచమి, పుత్రదా ఏకాదశి, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం. రాఖీ పండుగ, ఋషి పంచమి, శీతలా సప్తమి, శ్రీకృష్ణ జయంతి, పొలాల అమావాస్య, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, జంధ్యాల పూర్ణిమ, హయగ్రీవ జయంతి ఇలా ఈ మసంలో ప్రతిరోజూ పండుగే. ప్రతిరోజూ ఆనందమే. ప్రతిరోజూ ఉత్సవమే.

ఈ మాసంలో వచ్చే పండుగలలో దేనికదే విశిష్టతని సంతరించుకొన్నవే అయినా శ్రీ వరలక్ష్మీ వ్రత, శ్రీ మంగళగౌరి నోములు ఎంతో ప్రాధ్యాన్యాన్ని కలిగి వున్నాయి. జీవితంలో ఆనందాలకి మూలం సంపద. ఆ ఐశ్వర్యాన్ని ప్రాసాదించే శుక్రవార వ్రతం వరలక్ష్మీ వ్రతం. అన్ని శుక్రవారాలు సమానఫలాన్ని అందించినా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం ఇచ్చే ఆనందం, తృప్తి ఎంతో విశేషాన్ని కలిగి ఉండటం ప్రత్యేకత. ఈ పండుగ కేవలం ఆధ్యాత్మిక విలువలు నిండి ఉండడమే కాక, సామాజిక కళ్యాణం, మానవతా దృక్పథం సౌభ్రాతృత్వం వంటి మానవీయ గుణసంపదకి మారు పేరై నిలిచింది. సమాజంలో అందరితో కలిసిమెలసి ప్రవర్తించడం, తాంబూలాలు, వాయినాలు ఇచ్చి పుచ్చుకోవడం, దానాలు చేయడం ఇలా కళకళలాడిపోతాయి తెలుగునాట ఇల్లు వాకిళ్ళు.

శ్రావణ శోభను మరింత పెంచే శ్రీ కృష్ణ జయంతి పర్వదినం పసివారి నుండి పండితుల దాకా, వీరు వారు అని తేడా లేక అందరిని ఆనందాన్నిచ్చే పదనుగ. శ్రీకృష్ణ వేషాలు, ఉట్టి కొట్టడాలు సమాజాన్ని ఏకీకృతం చేయడంలో ఎంతో తోడ్పడతాయి. శ్రీకృష్ణజయంతి అంటారు కృష్ణాష్టమిని.

శ్రావణే మాసి కృష్ణేచ పక్షీ అష్టమ్యాం తిథౌ హరేః
రోహిణ్యాం జన్మ కృష్ణస్య లోకానారి మంగళవాహమ్
జయనంతీ నామ సా ప్రొక్తా జయత్యశుభ మిత్యసీ
(పద్మపురాణం)

శ్రావణ మాసంలోనే గోదాదేవి తిరునక్షత్రం వస్తుంది. తమిళులు పెద్దల, గురువుల పుట్టినరోజును తిరునక్షత్రం అంటారు. భగవంతునికే అర్థాంగినిగా మారిన పుణ్యవతి ఆండాళ్. ఈమెనే గోదాదేవి అని కూడా వ్యవహరిస్తుంటారు.

కర్కటే పూర్వ ఫల్గుణ్యం తులసీ కాననోద్భవం
పాండ్యే విశ్వంభరాం గోదాం శ్రీరంగనాయికీం

భగవంతుని పెరంతో బంధించవచ్చును అనే దివ్య సంకేతానికి ఉదాహరణంగా నిలుస్తుంది ఆండాళ్ కథ. హరి సంకీర్తనం, శరణాగతీ, పుష్పమాలా సమర్పణం అనే మూడు సేవల గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా భూదేవితో చెప్పినట్లు పురాణోక్తి. ఈమె చెప్పిన తిరుప్పావై వ్రతం జాతి, కుల, మతాలకు అతీతంగా అందరూ చేయడానికి వీలైన చక్కని వ్రతం. ఇది సామాజిక కళ్యాణానికి ఎంతో దోహదం చేస్తుంది.

ఋక్, యజుస్, సామ శాఖల వారికి ఉపాకర్మ అనే పవిత్ర కార్యక్రమం ఈ శ్రావణ మాసంలోనే జరుగుతుంది. కొత్తగా ఉపనయనం అయిన వటువులు శ్రావణ ఉపాకర్మ చేసుకుని యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. జంద్యము ధరించేవారందరూ కూడా పౌర్ణమి నాడు జంధ్యాలు మార్చుకోవడం వల్ల దీనికి జంధ్యాల పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది. గాయత్రీ మంత్రోపాసన అతి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పవిత్రమైన రోజుది.

శ్రావణమాసం వర్షఋతువులోనిది కావడంతో నేలతల్లి ఆర్ద్రహృదయంతో నిండి ఉంటుంది. చక్కని పంటలు మొలకెత్తే కాలం కాబట్టి సస్స్యశ్యామలత్వానికి అనుకూలమైన వాతావరణం ఈ శ్రావణ మాసం. కొత్తగా వివాహమైన జంటలు అమ్మాయి పుట్టింట్లో ఆనందంగా గడపడం, బావామరదళ్ళ హాస్యాలు, దంపతులిద్దరూ పూజాదికాలు నిర్వర్తించుకొనడం, కుటుంబమంతా ఆనందోత్సాహాలతో గడపడం ఇలా శ్రావణ మాసమంటే ఆనందమే. మామిడి తోరణాలు గుమ్మాలకు కనువిందు చేస్తుంటే, పసుపు కుంకుమలతో గడపలు శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా వెలిగిపోతుంటే, చామంతుల అందాలు సిరుల పంటలకు తోడైతే శ్రావణ మాస సౌందర్యాన్ని ఏమని వర్ణించగాలం? శ్రీమహాలక్ష్మీ కాలి అందేలా సవ్వడిలో జాతి ఆనందతరంగితమైన మాసమే శ్రావణమాసం.

ఇక రాఖీ పండుగ వైశిష్ట్యం ఎంత చెప్పినా చాలదు. నీకు రక్షణగా నేనున్నాను అంటూ సోదరుడు సోదరి వద్దకు రావడం, ప్రేమతో ఆమె రాఖీ కట్టడం అనే ఆచారం దేశాలమధ్య కూడా శాంతిభద్రతలను స్థాపించిందనే సత్యం అందరికీ తెలిసిందే. పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి మానవుని నియమబద్దమైన జీవన సరళికి, భారతీయ వైదిక సత్సంప్రదాయానికి ఎత్తిన పతాకాలే. వరాహ జయంతి భూదేవి బాధలను పోగొట్టిన పరమాత్మ ఆఘటనఘటనా సామర్థ్యానికి ఉదాహరణ. హయగ్రీవ జయంతి, విద్యామూర్తి శ్రీ లక్ష్మీ హయవదనుని అవతార వైశిష్ట్యాన్ని చాటే అద్భుతమైన పండుగ. స్వామి ఉపాసనతో అద్వితీయ శేముషీ వైభవాన్ని పొంది లోకాన్ని జయించిన పండితులు సదాచార సంపన్నులు సమాజానికి మార్గదర్శకులు ఎందరో మహనీయులు. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక ఋషి పంచమి, ఒక భాను సప్తమి, ఒక పొలాల అమావాస్య ఎన్నని వివరించగలం.

శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఆలయాలన్నీ భక్తజన సందోహంతో కళకళలాడుతుంటాయి. సమాజ ఐక్యతకు పట్టుకొమ్మ శ్రావణ మాసం. బంధుమిత్రుల రాకలు, ఆడరపూర్వక ఆహ్వానాలు, పసుపు కుంకుమల హరివిల్లులు, పారాణి పాదాల హంసనడకలు, చామంతుల అందాలు, శనగల వాయినాలు ఒకటేమిటి ప్రేమకు, ఆదరానికి పూజలకు, ఆలయదర్శనాలకు, వేడుకలకు, బంగారు ఆభరణ అలంకారాలకు శోభాయమానమైన ముత్తైదువల సౌభాగ్యాలకు ఆలవాలమై నిలిచేదే శ్రావణమాసం. 

Leave a comment