ఉపనిషత్తులు…

ఉపనిషత్తులంటే తెలియకపోయినా వేదాంతం అనే మాట ఉపయోగించని తెలుగువారంటూ ఎవరూ ఉండరు. వేదాలను మధించాగ్గా వాటి సారాంశంగా చివరగా పుట్టినవి కాబట్టి ఉపనిషత్తులు వేదాంతాలుగా పేరుపడ్డాయి. ఇవి వైదిక సాహిత్యంలోని చివరి భాగాలు. అన్ని ధర్మాలకూ వేదమే మూలం. వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు.  సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్ నే పదానికి సమీపంలో ఉండడం అని అర్థం. సత్యాలను తెలుసుకునేందుకు గురువు దగ్గర ఉండడం లేదా ఆత్మ (పరమాత్మ) కు సమీపంలో ఉండడం అనేవి ఈ శబ్దార్ధం వెనుక ఉన్న ఆంతరిక అర్థాలు. ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను సునిశితంగా చర్చిచడం జరిగింది. ఈ చర్చ ఫలితంగా జీవాత్మ-పరమాత్మలు అభిన్నులు అనే అద్వైతం, జీవుడు-బ్రహ్మము వేరువేరు అనే ద్వైత భావాలకు ఆస్కారం కలిగింది. ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగానే ప్రస్తుతం హైందవం అని పిలువబడే ధార్మికభావనలోని అనేక దార్శనిక సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. అనేకమంది ఆచార్యులు ఉపనిషత్తుల ఆధారంగానే తమ సిద్ధాంతాలను రూపొందించి, ప్రచారంలోకి తీసుకువచ్చారు. శంకరాచార్యుల అద్వైతవాదం, రామానుజుల విశిష్టాద్వైతం, నింబార్కాచార్యుల ద్వైతాద్వైతవాదం, వల్లభును శుద్ధాద్వైతవాదం ఇలా అన్నీ ఉపనిషత్ మూలాలున్నవే.

ఉపనిషత్తుల సంఖ్య

వేదాలలాగే ఉపనిషత్తుల సంఖ్య కూడా అసంఖ్యాకం అని కొందరి వాదన. మొదట 1008 ఉపనిషత్తులు ఉన్నట్లూ భావించగా వాటిలో 108 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలోనూ కలిపి పది ఉపనిషత్తులు ముఖమైనవిగా అధ్యయనం చేస్తారు. ఆదిశంకరాచార్యులు ప్రస్థానత్రయ భాష్యంలో పది ఉపనిషత్తులనే చెప్పారు.

ఈశ కేన కఠ ప్రశ్న ముండా మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగయం బృహదారణ్యకం తథా

అనే నామసూచికా శ్లోకాధారంగా దశోపనిషత్తుల పేర్లు ఇవి.
1. ఈశోపనిషత్తు
2. కేనోపనిషత్తు
3. కఠొపనిషత్తు
4. ప్రశ్నోపనిషత్తు
5. ముండకోపనిషత్తు
6. మాండూక్యోపనిషత్తు
7. తైత్తిరీయోపనిషత్తు
8. ఐతరీయోపనిషత్తు
9. ఛాందోగ్యోపనిషత్తు
10. బృహదారణ్యకోపనిషత్తు

ఉపనిషత్తుల కర్తలు

ఉపనిషత్తులు ఏ ఒక్కరి రచనలో కాదు. ఎందరో ఋషులు వీటి రచనాకార్యాన్ని నిర్వహించారు. యాజ్ఞవల్క్యుడు, ఉద్దాలకుడు, అరుణి, శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాడ, సనత్కుమార, గార్గి, మైత్రేయ లాంటి ఎందరెందరో ఉపనిషత్తుల ఆవిర్భావానికి కారణమయ్యారు. 

శైవవైష్ణవ ఉపనిషత్తులు

ఈ ఉపనిషత్తులలో కొన్నింటిని శైవులు సొంతం చేసుకోగా, మరికొన్ని ఉపనిషత్తులు వైష్ణవ ఉపనిశాట్టులుగా ప్రసిద్ధికెక్కాయి. అక్షమాలికోపనిషత్తు, అథర్వశిరోపనిషత్తు, అథర్వశిఖోపనిషత్తు, కాలాగ్ని రుద్రోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, గణపతి ఉపనిషత్తు, జాబాలోపనిషత్తు, దక్షిణామూర్తి ఉపనిషత్తు, పంచబ్రహ్మోపనిషత్తు, బృహజ్జాబాలోపనిషత్తు, భస్మజాబాలోపనిషత్తు, రుద్రహృదాయోపనిషత్తు, రుద్రాక్షజాబాలోపనిషత్తు, శరభోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు అనే పదిహేను ఉపనిషత్తులు శైవ ఉపనిషత్తులు.

వైష్ణవులకు సంబంధించిన ఉపనిషత్తులుగా చెప్పుకునే పద్నాలుగు ఉపనిషత్తులు ఉన్నాయి. అవ్యక్తోపనిషత్తు, కలిసంతరణోపనిషత్తు, కృష్ణోపనిషత్తు, గరుడోపనిషత్తు, గోపాలతాపసోపనిషత్తు, తారసోపనిషత్తు, త్రిపాద్విభూతి ఉపనిషత్తు, దత్తత్రేయాపనిషత్తు, రామతాపన ఉపనిషత్తు, రామరహస్యొపనిషత్తు, వాసుదెవ ఉపనిషత్తు, హయగ్రీవ ఉపనిషత్తు. శైవ వైష్ణవ విభాగాలే కాకుండా ఉపనిషత్తులలో మరెన్నో విభాగాలు కనిపిస్తాయి.

ఏ వేదానికి ఎన్ని?

ఉపనిషత్తుల వేదాల సారమైన వేదాంతాలు అనుకున్నప్పుడు ఏ వేదానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అనే సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి 108 ఉపనిషత్తుల వర్గీకరణ కొంతవరకూ సమాధానంగా కనిపిస్తుంది. ఈ నూటఎనిమిది ఉపనిషత్తులలో వేదాల వారీ విభజన ఇలా ఉంది. ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదానికి 32, శుక్ల యజుర్వేదానికి 19 ఉపనిషత్తులు లభిస్తున్నాయి. సామవేదానికి 16, అథర్వణ వేదానికి 31 గా ఉపనిషత్తులు ఉన్నట్లూ కనిపిస్తుంది. ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల నుంచి ముఖ్యమైన పది ఉపనిషత్తులను ప్రధానంగా ఎంచుకున్నారు. వాటికే దశోపనిషత్తులు అని పేరు. 

చతుర్వేదాలు…

విశ్వ సంస్కృతి భవనానికి నాలుగు వేదాలు నాలుగు స్తంభాల వంటివి. వేదాలు అపౌరుషేయాలు. మానవ నిర్మితమైనవి కావు.  వేదాలకంటే ప్రాచీనమైన సాహిత్యం లేదు. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు నలుగురు ఋషులకు నాలుగు వేదాలు ఆవేశింపచేశాడు. తత్ఫలితంగా ‘అగ్ని’ అనే పేరుగల ఋషి హృదయంలో ఋగ్వేదం ప్రకాశించింది. వాయువు హృదయంలో యజుర్వేదం. ఆదిత్యునిలో సామవేదం ప్రకాశించాయి. అథర్వవేద శాఖకు ‘అంగీరసుడు’ ఆద్యుడయ్యాడు. ఈ నలుగురు ఋషులే తరువాతి కాలంలో వేదాలను వ్యాప్తి చేశారు.

వేద విభాగం

‘వేదం’ అంటే ఈశ్వరీయమైన జ్ఞానం. ఈశ్వరునికి అంతం లేనట్లే వేదానికి కూడా అంతులేదు. నాల్గువేదాలనూ కలిపి వేదం అని ఏకవచనంలో వ్యవహరిస్తారు. అయితే విషయభేదాన్ని బట్టి వేదాన్ని నాలుగు పేర్లతో పిలుస్తారు. ఛందోబద్ధమైన వేదాన్ని ‘ఋక్కులు’ అంటారు. అదే ఋగ్వేదం అయ్యింది. గద్యాత్మకమైన వేదాన్ని యజస్సు అంటారు. ఇది యజుర్వేద పాఠం. గీతాత్మకమైన వేదం సామం గనుక సామవేదం. ఇక అథర్వం పద్యగాద్యాత్మకమైన వేదంగా కనిపిస్తుంది. నాల్గు వేదాలు ఏకకాలంలో ప్రకాశింపబడినాయి. ఒకటి ప్రాచీనం, మరోటి ఆర్వాచీనం అనేమాటలు పాశ్చాత్యుల నుంచి వచ్చినవే కానీ వాటిలో సత్యం లేదు. అన్ని వేదాలలోనూ మిగిలిన వేదాల ప్రస్తావన కనిపిస్తుంది. రుగ్వేదంలో యజుస్సామాథరవ వేదనామాలు కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన వేదాలలో కూడా. నాలుగు వేదాలు ఏకకాలంలో వచ్చాయి కనుకనే ‘చరుర్వేదమ్’ అనేపేరు వినిపిస్తుంది. వేదాన్ని ‘త్రయీ’ అనే పేరుతో పిలుస్తారు. దాని అర్థం వేదాలు మూడు అని కాదు. అన్నివేదాల్లోనూ మూడు అంశాలు ప్రధానంగా కనిపించడం వల్ల ఆ పేరు వచ్చింది. జ్ఞాన, కర్మ, ఉపాసనలకు పుట్టినిల్లు వేదం కనుక ఆ మూడింటినీ దృష్టిలో పెట్టుకుని మన పూర్వీకులు వేదాన్ని ‘త్రయీ’ అని పిలిచారు.

వేద ప్రమాణం

వేదం సార్వజనీనమైనది. అది ఒక మతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో చెందింది కాదు. అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో అందరికీ సమానంగా ఉపయోగపడే విషయాలు వేదంలో ఉన్నాయి. లోకాలన్నీ కలిపి విశ్వం అని పిలిచినట్లుగానే మనం అందరం అలవర్చుకోవలసిన విజ్ఞానాన్ని వేదం అనేపేరుతోనే పిలవడం సముచితమనాలి. వేదం విశ్వవిజ్ఞానకోశమే కాదు, మానవ ధర్మాన్ని ప్రతిపాదించే ఉత్తమోత్తమ వాజ్మయం.

“ఓం యథేమాం వాచం కల్యాణీమావదాని జనేభ్యః!
బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచార్యాయచస్వాయ చారణాయ!!”
(యజుః 26.2)

వేదమే విశ్వానికి అక్షరబిక్ష పెట్టింది. వేదమే లేకుంటే మానవునికి జ్ఞానం లేదు, ధర్మంలేదు, కర్తవ్య కర్మ లేదు. వేదం సర్వమానవాళికి కళ్యాణకారమైంది. ఈ విషయం యజుర్వేడంలోని ఇరవై ఆరో అద్యాయంలోని రెండోమంత్రం ద్వారా నిరూపితమైంది. ఈశ్వరీయ జ్ఞానమైన వేదానికి శృతి అనిపేరు. ఒకరి నుంచి వేరొకరికి వినడం ద్వారా అందుతుంది. వేదం సనాతన ధర్మానికి పట్టుగొమ్మ. దానికదే ప్రమాణం.

వేదమే సకలం

ప్రాచీన కాలం నుంచి వేదమంత్రాల ద్వారా యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. యజ్ఞ నిర్వహణలో నల్గురు రుత్విక్కులు భాగస్వాములవుతారు.

  1. హోత
  2. అధ్వరుడు
  3. ఉద్గాత
  4. బ్రహ్మ

ఇందులో హోత అంటే ఆహ్వానకర్త. యజ్ఞంలో ఆయన మంత్రపూర్వకంగా దేవతలను ఆహ్వానిస్తాడు. ఈ మంత్రాలే ఋక్కులు. ఋగ్వేద పండితుడు. విధి ప్రకారం యజ్ఞం నడిపించేవాడు అధ్వరుడు. అతడు యజుర్వేద మంత్రాలు పఠిస్తాడు. వేదమంత్రాలను ఉచ్చస్వరంతో గానం చేసేవాడు ఉద్గాత. స్వరబద్దమైన సామవేదాన్ని ఇతడు గానం చేస్తాడు. ఇక నాలుగో ఋత్విక్కు పేరు బ్రహ్మ. సర్వవిధ మంత్రవేత్త. యజ్ఞాన్ని సంపూర్ణం చేసేవాడే బ్రహ్మ. ఆయన చదివే మంత్రాలతో కూడినదే అథర్వవేదం. దానికే బ్రహ్మవేదం అని పేరు. ఈవిధంగా నాలుగు వేదాలకూ యజ్ఞంలో ప్రాముఖ్యం ఉంది.

ప్రతి వేదమంత్రానికి నాలుగు అంగాలు ఉంటాయి. ఋషి, దేవత, ఛందస్సు, స్వరం అనేవే ఈ అంగాలు. మననం చేయదగింది మంత్రం. ఋషి మంత్రద్రష్ట అవుతాడే కానీ మంత్రకర్త కాదు. ఋషయో మంత్రద్రష్టారః – వేదమంత్రార్ధాన్ని దర్శించినవారే ఋషులు. కనుక వేదమంత్రాలకు ఋషుల పేర్లు ఉన్నాయి. ఆ ఋషులు ఆయా మంత్రాల అర్థాన్ని శిష్యులకు ఉపదేశించినవారు. లోకంలో ప్రచారం చేసినవారు కూడా.

మంత్రార్థమే దేవత. సర్వజ్ఞదేవత పరమేశ్వరుడు. ముప్పది మూడు దేవతలలో అగ్ని ముఖ్యదేవత. అంతరిక్షంలో వాయువు లేదా విద్యుత్తు ముఖ్యదేవత. ఆకాశదేవతలలో సూర్యుడు ముఖ్యుడు. ప్రతి మంత్రానికి ఋషి, దేవతలతో పాటుగా ఛందస్సు కూడా ఉంటుంది. ఛందోపరిజ్ఞానం వల్ల మంత్రపఠనం తేలికవుతుంది. వేదమంత్రాలలో అచ్చులకు ఉచ్చారణకు బట్టి ఉదాత్త, అనుదాత్త, స్వరితాలనే మూడు విధాలైన స్వరాలున్నాయి. వీటిని ఋత్విక్కులు గుర్తిస్తారు. వేదాలను చదువుట, చదివించుట, వినుట, వినిపించుట మానవులకు పరమధర్మం.

వేద విశేషం

నాలుగు వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో సృష్టి ఆవిర్భావం, జీవుల సముత్పత్తి, బంధమోక్షాలు, ప్రకృతి రహస్యాలు, ఆశ్రమ వ్యవస్థ, ఆయుర్వేదం, ఆకాశయానం మొదలైన వైజ్ఞానికాంశాలు ఉన్నాయి. ఇది జ్ఞానకాండగా చెప్పబడింది.

యజుర్వేదంలో మానవ ధర్మాలు, రాజ్యాంగవిధానం, గణిత విద్య, శారీరక విద్య కనిపిస్తాయి. వీటితోపాటు వివిధ యజ్నకర్మలకు సంబంధిచిన అంశాలు ఇందిలో ఉన్నాయి. దీనికి కర్మకాండ అని పేరు.

సామవేదం పరమేశ్వరుని స్తుతి. ప్రార్ధనా విశేషాల సంకలనం. దీనిలో ప్రత్యేకంగా గానవిద్య ప్రస్తావించబడింది. దీనికి ఉపాసనాకాండ అని పేరు.

అధర్వవేదంలో బ్రహ్మవిద్య పేర్కొనబడింది. భగవద్భక్తి, రాజ్యపరిపాలనా విధానం, పంచమహాయజ్ఞాల స్వరూపం వివరింపబడింది. ఇదే మోక్షకాండ.

రాశికొక జ్యోతిర్లింగం…

మేషరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం రామేశ్వరం. మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర, సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సెతుం విశిఖైర సంఖ్యె శ్రీరామ చంద్రేన సమర్పితం త, రామేశ్వరాఖ్యం నియతం నమామి అనె శ్లోకం రోజూ చదువుకొవాలి. శ్రీరామచంద్రుడు శని బాధానివారణార్థం రామేశ్వర లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.

వృషభరాశి వారి పూజాలింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగం శ్రీకృష్ణుడు స్థాపించిన మహాలింగం. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయ దర్శనం, సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకధ్యానం చేయడం శుభప్రదం. ఈ రాశివారు జన్మ నక్షత్రంలో సోమనాథంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందగలరు. 

మిధునరాశి వారి జ్యోతిర్లింగం నాగేశ్వర లింగం. ఈ రాశి బుధునికి స్వగృహం. గ్రహదోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, రోజూ యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పఠించడం, ఈ రాశిలో శని సంచారకాలంలో కైలాసయంత్రప్రస్తార మహాలింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.

కర్కాటక రాశి వారికి ఓంకారేశ్వరలింగం పూజనీయ జ్యోతిర్లింగం. ఈ రాశి చంద్రునికి స్వగృహం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, రోజూ కావేరికా నర్మదాయో పవిత్రే, సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే అనే శ్లోకం పఠించడం, జన్మనక్షత్రం ఉన్న రోజు ఓంకార బీజాక్షరం జపించడం శుభకరం.

సింహరాశి వారికి పూజనీయమైన జ్యోతిర్లింగం శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘృష్ణేశ్వర  జ్యోతిర్లిగం దర్శనం, ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.

కన్యారాశి వారికి శ్రీశైల జ్యోతిర్లింగం పూజాలింగం. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరు అన్నిరకాల బాధల నుండి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జున దర్శనం, భ్రమరాంబకు కుంకుమ జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

తులారాశి వారికి పూజాలింగం మహాకాళేశ్వర లింగం. ఈ రాశికి శుక్రుడు అధిపతి. మహాకాళేశ్వర దర్శనం, శుక్రవారపు సూర్యోదయ సమయంలో ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.

వృశ్చికరాశి వారికి వైద్యనాథేశ్వర లింగం పూజాలింగం. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్రచికిత్సలకి కారణభూతమైన రాశి. వైద్యనాథేశ్వరుని దర్శించడం, పూజించడం, మంగళవారం పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాదం తమహం నమామి అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

విశ్వేశ్వరలింగం ధనూరాశివారి పూజాలింగం. ఈ రాశి వారికి గురుడు అధిపతి, సానందవనే వసంతం. ఆనందకందం హతపాపబృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, కాశీ క్షేత్ర దర్శనం, గురువారం రోజున, శనగల దానం ద్వారా శని, గురూ గ్రహదోషాల నుండి విముక్తి పొందవచ్చు.

భీమశంకర లింగం మకరం వారి పూజాలింగం. ఈ రాశి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ, తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తికిగాను భీమశంకర దర్శనం, యం ఢాకినీ శాకినికాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం ఈవాడం, అవిటివారికి ముసలివారికి వస్త్ర దానం చేయడం మంచిది.

కుంభరాశి వారికి కేదారేశ్వర లింగం శేయోలింగం. ఈ రాశికి శని అధిపతి. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తికిగాను ఈ రాశివారు కేదారేశ్వర దర్శనం. నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి.శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.

త్ర్యంబకేశ్వర లింగం మీనరాశి వారి జ్యోతిర్లింగం. ఈ రాశి అధిపతి గురుడు. త్ర్యంబకేశరుడు ఎప్పుడూ నీటి మద్యలో ఉంటాడు. త్ర్యంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం, నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే అనే శ్లోకాన్ని పారాయణం చేయటం సకల శుభాలను కలిగిస్తుంది.

కర్మసిద్ధాంతం అంటే ఏమిటి?

శ్లో|| కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన!
     మాకర్మ ఫలహేతుర్భూ, మాతే సంగోస్త్య కర్మాణి||

“నీకు కర్మాధికారమేగాని ఫలితాదికారం లేదు. కర్మఫలానికి నీవే కారణమని భావించరాదు. కర్మను విడచిపెట్టె మనస్సు నీకు రాకూడదు అని ఆనాడు గీతాచార్యుడు. కర్మ అంటే కర్తవ్యం. కర్తవ్యపరునునికి జయాపజయాల విశ్లేషణ హితాహితాల వివరణ ఉండకూడదు. కర్తవ్య నిర్వాహణ ఒక్కటే అతని గురిగా ఉండాలి.

కర్మసిద్ధాంతం అంటే కర్తవ్య సిద్ధాంతం.

కర్మసిద్ధాంతంతోనే వర్ణాశ్రమ ధర్మం వచ్చింది.

సామాన్యులకు గాని, గృహస్థులకు గాని ప్రతిఫలాపేక్ష విడచి కర్మాచరణ చేయటం కుదరదు. ఎలాగంటే, పాలకోసం పశువుల్ని, పండ్లకోసం చెట్లను పెంచుతాం. ప్రతిఫల మాశించకుండా కర్మాచరణ చేయటం మహాత్ములకే సాధ్యం కాని మామూలు మనుషులకు అసాధ్యం.

కురుపితామహుడైన భీష్ముడు కర్మ సిద్ధాంత పరాయణుడై కురుక్షేత్రానికి వచ్చాడు. తప్పని తెలిసీ దుర్యోధనుని పక్షాన నిలబడ్డాడు. అవక్రవిక్రమంతో పదిరోజులు యుద్ధం చేశాడు. మహాపందితుడైన భీష్ముడు కౌరవ పక్షాన నిలబడటానికి కారణం కర్మసిద్ధాంతం. 

కర్మసిద్ధాంతం అనుభవంలోకి రావాలంటే వయోపరిణితి ఉండాలి. ఒడిదుడుకుల్ని చూడాలి. కష్టనష్టాలలో మ్రగ్గాలి. ఎత్తుపల్లాలు నడవాలి. 

“ధారణాత్ ధర్మః ఇత్యాహుః ధర్మోధారయతి ప్రజాః”

సంస్కృతంలో “ధృ” ధాతువుకి ధరించుట/ పోషించుట అనే రెండు అర్థాలున్నాయి. మనిషియొక్క సర్వతోముఖాభివృద్ధికీ, మరియు అత్యోన్నతికి ఏది సాధనమో అదియే “ధర్మం”.

“ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టా” – త్తెత్తరీయోపనిషత్తు

ధర్మే సర్వం ప్రతిష్ఠితమ్ – నారాయణోపనిషత్తు

కర్మాచార పారాయణునికి జయాపజయాల భయం ఉండదు

అద్భుత పూజాద్రవ్యం ఏకాక్షి నారికేళం!

కొబ్బరికాయ అంటే అందరికీ పరిచితమే. నారికేళం, కొబ్బరి, కుడుక, శీఫలం మొదలైనవి దీని నామాతరాలు (శీఫలం అని మారేడు కాయకు, సముద్రతీరంలో లభించే మరో ఫలానికి కూడా వాడతారు). పూజా కార్యక్రమాల్లో విశేష ప్రాధాన్యత ఉన్న ఈ ఫలానికి ఆధ్యాత్మిక రంగంలో శుభాస్థానం ఉంది. దీని నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ఫలాల్లో మారేడు, బాదం చాలా కఠినమైన ఆవరణ ఉన్నవిగా ప్రసిద్ధి. కాని, కొబ్బరికాయ వాటికన్నా దృఢంగా ఉంటుంది.

పౌరాణిక విశ్వాసాల ప్రకారం కొబ్బరికాయ బ్రహ్మదేవుని సృష్టి కాదు. విశ్వామిత్ర సృష్టి. ఒకానొక కథ ప్రకారం ఒకసారి బ్రహ్మదేవునికి, విశ్వామిత్ర మహర్షికి వివాదం జరిగింది. బ్రహ్మ సమస్త సృష్టి రచనకు నిర్మాత. సృష్టిలో కనిపించే చరాచర ప్రాణులు వస్తువులు, జంతువులు, పశుపక్షులు, కీటకాలు, వానరులు, మానవులు బ్రహ్మ సృష్టించినవే.

ఉగ్రమైన, అసాధారణమైన తపస్సు చేసిన విశ్వామిత్రుడు అలౌకిక శక్తులు సంపాదించి, ఒకసారి బ్రహ్మదేవునికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశాడు. ‘నీవు పంచతత్వాలతో సృష్టి చేస్తున్నావు. నేను వృక్షాల నుండి మానవుని సృష్టిస్తాను’ అన్నాడు. తన కమండలం నుండి కోంత జాలం తీసి భూమిపై చల్లాడు. వెంటనే భూమినుండి అంకురాలు మొలకెత్తాయి. స్వల్పకాలంలోనే అవి పెరిగి, ఆకాశాన్ని అందుకోనేంత ఎత్తుకు సాగి మాహావృక్షాలు అయ్యాయి. ఆ చెట్ల నుండి మానవ శిరస్సు ఏర్పడింది. ముఖం, రెండు కళ్ళు, నోరు మాత్రమే కాక రోమరాశిగా పీచు ఏర్పడింది. ఇక మిగిలింది శరీర నిర్మాణం (చేతులు, కాళ్ళు మొదలైనవి). ఇంతలో దేవతలు బ్రహ్మదేవుని గౌరవం కాపాడటానికై విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి క్షమాప్రార్థన చేసి, అతని కోపాన్ని శాంతింపజేశారు. శాంతుడైన మహర్షి సృష్టి కార్యక్రమం విరమించాడు.

ఈ కథనాన్ని మనం మిథ్యగా భావించినా నారికేళ ఉపయోగం విషయంలో మాత్రం సందేహం లేదు. భారతీయ సంస్కృతిలో కొబ్బరి కాయకు చాలా శుభకరం, పవిత్రమైన స్థానం ఉంది. పూజాదుల్లో దేవతలకు నైవేద్యంగా, హోమాదుల్లో ఆహుతులకు కొబ్బరి కాయను ఉపయోగిస్తారు. కానుకలు, కలశస్థాపన, ఫలహారాల్లో, ఔషధంగా కూడా ఈ ఫలాన్ని ఉపయోగిస్తారు. కొబ్బరి ఔషధంగా, పౌష్టిక ఖ్యాద్య పదార్థంగానూ ఉపయోగపడుతుంది. ఇవన్నీకాక ఒక ముఖ్య ప్రయోజనం – ఆధ్యాత్మిక సాధనలో కొబ్బరి వాడకం. భారతదేశంలో ధార్మికవిధుల్లో అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగించబడుతుంది.

ఏకాక్షి నారికేళం

సాధారణంగా కొబ్బరికాయలకు పీచుతీశాక పిలక దగ్గర నల్లని బిందువులు కనబడతాయి. వీటిలో రెండు బిందువులు కళ్ళకు చిహ్నమని, మరొకటి నోటికి చిహ్నమని ధార్మిక విశ్వాసం. జాగ్రత్తగా పరిశీలిస్తే కొబ్బరికాయ గుండ్రని ఆకారం మానవాకారంతో సామ్యం కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇది కొబ్బరికాయ సహజ నిర్మాణం. విచిత్రమేమిటంటే – కొన్ని కొబ్బరి కాయలపై మూడు బిందువులు కాక రెండు నల్లని బిందువులు మాత్రమే కనపడతాయి. అంటే – అక్కడ ఒక కన్ను, నోరు మాత్రమే ఉన్నాయని తెలుసు కోవాలి. దీనిని తాంత్రికభాషలో ‘ఏకాక్షి నారికేళం’ అంటారు. ఒకే కన్ను కలది అని అర్థం. సాధారణంగా ఇది లభించడం దుర్లభం. అరుదైనది.

అలభ్యమైన నారికేళం ఎక్కడైనా లభిస్తే, దాని వెలచాలా అధికంగా ఉంటుంది. కొబ్బరికాయ ఎప్పుడూ శుభప్రదమే. కాకపొతే అది పగులు బాసినదై ఉండకూడదు. కాయ పూర్తిగా ఉండాలి. పూజ తరువాత దానిని పగల కొట్టి, ప్రసాదంగా కొబ్బరి స్వీకరించాలి. కాని, ఏకాక్షి నారికేళం ప్రసాదంగా నివేదన చేయబడేది కాదు. దానిని పూజలోనే ఉంచాలి. పగలకోట్టకూడదు.

ఇది సాధారణంగా దొరికేది కాదు కనుక ఎక్కడైనా లభిస్తే వెంటనే తీసుకోవాలి. శుభముహూర్తం కోసం చూస్తుంటే చేజారిపోవచ్చు. అలా కాకుండా శుభముహూర్తం వరకు జాగ్రత్తగా ఉంచి మీకు అప్పజెప్పే వారుంటే మీరు ముహూర్తం కోసం ఎదురుచూడవచ్చు.

పూజా విధానం

దీపావళి పర్వదినం లేదా రవిపుష్య, గురుపుష్య యోగం వంటి శుభముహూర్తంలో ఉదయమే స్నానాదులు పూర్తీ చేసుకోవాలి. పూజాస్థలంలో ఒక బల్ల లేదా పీటను ఆసనంగా అమర్చాలి. దానిపై ఎర్రని వస్త్రం పరవాలి. నిత్యపూజ పూర్తీ చేశాక ఒక పళ్ళెంలో ఏకాక్షి  నారి కేలం ఉంచి, గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని దానిపై చిలకరించాలి. అలా స్నానం చేయించాక శుభ్రంగా వస్త్రంతో తుడిచి, దానిని పీటపై ఆసనంగా అమర్చాలి. దానిపై ఎర్రని వస్త్రం పరవాలి. నిత్యపూజ పూర్తి చేశాక ఒక పళ్ళెంలో ఏకాక్షి నారికేళం ఉంచి, గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని దానిపై చిలకరించాలి. అలా స్నానం చేయించాక శుభ్రంగా వస్త్రంతో తుడిచి, దానిని పీటపై ఉన్న ఎర్రనివస్త్రంపై పెట్టాలి. తరవాత అది కేవలం నారికేళం కాదని, లక్ష్మీ స్వరూపమని చిత్తశుద్ధితో భావించి ధ్యానించాలి. ఆ నారికేళానికి ఎర్రచందనం, పూలు, అక్షతలు సమర్పించాలి. తరవాత లక్ష్మీదేవి స్తోత్రం, ధ్యానం, పూజ చేస్తూ మంత్రజపం ప్రారంభించాలి. జపం ప్రారంభించదానికి ముందే ‘నేను నారికేళ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ప్రతిమను పూజలో ఆ దేవి సంతృప్తి కోసం ఇన్ని (సంఖ్య) మాలాజపాలు జపం చేస్తాను’ అని సంకల్పం చేయాలి. అనుకున్న సంఖ్య ప్రకారం మాలా జపం చేయాలి. మాలలో 108 పూసలుఉంటాయి. 10 మాలాజపాలు చేస్తే జపసంఖ్య 1080 అవుతుంది. ఈవిధంగా సంకల్పించిన సంఖ్య (కనీసం 11 మాలాజపాలు) ప్రకారం మాలాజపం తప్పక చేయాలి.

తరవాత నారికేళాన్ని ఆ వస్త్రంతో సహా ఒక పళ్ళెంలో లేదా చిన్ని పాత్రలో జాగ్రత్తగా భద్రపరచాలి. వెండిపళ్ళెం (పాత్ర) అయితే ఉత్తమం. మొదటి దినం మంత్రజపం పూర్తయ్యాక అదే మంత్రంతో 21 ఆహుతులు ఇవ్వాలి. హోమం పూర్తి చేశాక కనీసం ఒక బ్రాహ్మణునికి భోజనం, దక్షిణ సమర్పించాలి.

అనంతరం ఏకాక్షి నారికేళాన్ని ఒక పరిత్రమైన సురక్షిత స్థానంలో ఉంచి, ప్రతిరోజూ సింధూరం, ధూపదీపాలు సమర్పించాలి. అప్పుడప్పుడు శక్తికొద్ది నాణెం సమర్పించాలి. ఏకాక్షి నారికేళంతో చేసె ఈ ప్రయోగం చాల లాభకరం. ఆర్ధిక ఉన్నతి, సమృద్ధిదాయకం తప్పక పొందుతారు.

ప్రభావం

ఏకాక్షి నారికేళాన్ని పూజించే ఇంట్లో నిరంతరం లక్ష్మీనివాసం ఉంటుంది. ధాన్యాగారం, నగదుపెట్టె, బీరువా, పూజాస్థలం…ఎక్కడ ఏకాక్షి నారికేళం ఉంచినా ప్రతి దినం పూజించాలి. అలా చేయడం వల్ల ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. వ్యాపార కేంద్రాల్లో ఉంచినా దీని ప్రభావం లాభకరంగా ఉంటుంది. పూజా సమయంలో జపించాల్సిన మంత్రం –

ఓం శ్రీం శ్రియై నమః!

ఏకాక్షి నారికేళాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తాం. కనుక సాధన చేశాక కింది శ్లోకంతో లక్ష్మీదేవికి ప్రియతముడైన విష్ణుమూర్తిని స్తోత్రం చేయడం వల్ల సాధన ప్రభావం ఇనుమడిస్తుంది.

శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్,
పరాశరాత్మజం వందే శుక్రతాతం తపోనిధిమ్!
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే,
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః!
చతుర్వదనో బ్రహ్మో ద్విబాహురపరో హరిః,
అభాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః!

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం…

తిరుమల బ్రహ్మోత్సవాలు మానవాళికి మహోత్సవాలు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో వీటిని నిర్వహించడం ఆనవాయితి. అధికమాసం వచ్చినప్పుడు మాత్రం ఒకే ఏడాదిలో రెండుసార్లు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవ సంప్రదాయాలు, విశేషాలు, వాహన సేవల వెనుక పరమార్థాన్ని గురించి తెలుసుకుందాం.

వేదములే శిలలైన కొండపై శ్రీ వేంకటనాథునికి ఎన్నో ఉత్సవాలు రంగరంగ వైభవంగా, నిత్యకళ్యాణం పచ్చతోరణంగా జరుతుతూ ఉంటాయి. కలియుగ వైకుంఠంలో భక్తజన హృదయకుసుమాలతో స్వామి అహర్నిశలూ పూజలందుకుంటూనే ఉంటాడు. ఏటా ఆశ్వయుజంలో తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ దినోత్సవాలు శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో ముగుస్తాయి. ఇదొక మహాపర్వం, మిరుమిట్లు గొలిపే దీపతోరణాలతో, అఖండజ్యోతులతో, ధగద్ధగాయమానంగా ప్రకాశించే నవరత్నహార సంచయంతో, వేదఘోషలతో, పాటలతో, గోవిందనామాలతో సప్తగిరులు శోభిల్లుతాయి. స్వామి బ్రహ్మోత్సవ వేళ వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తకోటిని తరింపచేస్తాడు. దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు స్వామిని తనివితీరా దర్శించుకుని, కోరికలను నివేదించుకోవడానికి తిరుమలకు తరలి వస్తారు.

తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామికి ఏటా 450కి పైగా ఉత్సవాలను నిర్వహిస్తారు. వైఖానస ఆగమవిధిగా నిర్వహించే అన్ని ఉత్సవాలలోనూ అత్యంత విశిష్టమైనవి, శోభాయమానమైనవి తొమ్మిది రోజులపాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు.

ఆ పేరెలా వచ్చిందంటే…
శ్రీనివాస పరబ్రహ్మ కోరిక మేరకు బ్రహ్మోత్సవాలు శ్రీకారం చుట్టుకున్నాయి. సాక్షాత్తూ స్వామివారు చతుర్ముఖ బ్రహ్మను పిలిచి “ఉత్సవం కురు మే పుణ్యం బ్రహ్మాన్! లోక పితామహా!” అని అడిగి చేయించుకున్నాడు. నాటి నుంచి బ్రహ్మోత్సవాలు నేటికీ సంప్రదాయంగా కొనసాగుతున్నాయి.

‘బృహి – వృద్ధౌ’ అనే ప్రయోగాన్ని అనుసరించి తొమ్మిది రోజులపాటు నిర్విరామంగా స్వామి ప్రతి ఉదయం, సాయంత్రం వాహనసేవలు అందుకుంటాడు. సూర్యుడు కన్యారాశిలో సంచరించేటప్పుడు చిట్టా నక్షత్రం నాడు ధ్వజారోహణం, ఉత్తరా నక్షత్రం నాడు రథోత్సవం, శ్రవణానక్షత్రం నాడు తీర్థవారి (చక్రస్నానం)తో బ్రహ్మదేవుడు వీటిని ప్రారంభించాడు కనుక ఇవి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మ పర్యవేక్షణకు సంకేతంగా నేటికీ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మకు శూన్యరథం సిద్ధం చేస్తారు. ఉత్సవ వాహనసేవల్లో బ్రహ్మరథం ముందుగా వెళుతూ ఉంటుంది.

చారిత్రకంగా బ్రహ్మోత్సవాలు
పల్లవరాణి పెరిందేవి (సామవై) క్రీ.శ. 614లో మనవాళ పెరుమాళ్ళు అనే వెండి (భోగ) శ్రీనివాసుని విగ్రహాన్ని తిరుమల ఆనందనిలయానికి సమర్పించింది. క్రీ.శ.1254 చైత్రమాసంలో తెలుగు పల్లవ ప్రభువైన విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ.1328 ఆషాఢమాసంలో త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవ రాయలు. క్రీ.శ.1429 ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప దేవరాయలు, క్రీ.శ.1446లో మాసి తిరునాళ్ళు పేరుతో హరిహర రాయలు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. క్రీ.శ.1530లో అచ్యుతరాయులు నిర్వహించిన ఉత్సవం అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా చరిత్ర ప్రసిద్ధికెక్కింది. క్రీ.శ.1583 నాటికే బ్రహ్మోత్సవాలు ఇంచుమించుగా నెలకొకసారి జరిగేవి. రాజులు రాజ్యాలు అంతరించినా బ్రహ్మోత్సవ సంప్రదాయం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయశుద్ధి)
బ్రహ్మోత్సవాలకు ముందువచ్చే మంగళవారం నాడు తిరుమల ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. ఇలా ఉగాది, ఆణివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందుకూడా చేస్తారు. పరిమళ ద్రవ్యాలతో శ్రీవారి ఆనంద నిలయాన్ని శుద్ధిచేసి, అలంకరించే ఈ ప్రక్రియను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని వ్యవహరిస్తారు.

అంకురారోపణ
బ్రహ్మోత్సవ సంరంభం ధ్వజారోహణం తో  ప్రారంభమవుతుంది. ధ్వజారోహణ చేయడానికి ముందురోజు సాయంత్రం భార్యలైన సూత్రవతి, జయాదేవిలతో కూడి విష్వక్సేనుడు భూమిపూజను నిర్వహిస్తాడు. ఛత్రచామర మంగళవాద్య పురస్సరంగా ఆలయంలోకి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశిస్తాడు. నైరుతి దిశలో భూమిపూజ చేసిన తరువాత మృత్ సంగ్రహణం (మట్టిని తీసుకురావడం) చేస్తాడు. ఆనాటి రాత్రివేళ నవధాన్యాలతో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ (బీజావాపం) జరుగుతుంది.

ధ్వజారోహణ

బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభసూచికగా గరుడధ్వజాన్ని ప్రతిష్ఠ చేస్తారు. కంకణధారణ చేసి ఆలయం లోపల, బయట అష్టదిక్కుల్లో బలిని వేస్తారు. మలయప్పస్వామి ధ్వజస్తంభం వద్దకు విచ్చేసిన తరువాత పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులు విమాన ప్రదిక్షిణంలో ఉన్న అంకురార్పణ మంటపానికి విజయం చేస్తారు. అత్యంత శోభాయమానంగా ఉభయ దేవేరీ సమేతుడైన ఉత్సవరాయుని సమక్షంలో ధ్వజారోహణం జరుగుతుంది. ధ్వజాన్ని అధిరోహించే ముందుగా గరుడాళ్వార్ ముద్గలాన్నం అని పిలిచే పెసరపప్పు పులగం నివేదనగా అందుకుంటాడు. ధ్వజంపై నిలిచి సకల లోకాలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం పలుకుతాడు. ఈ ధ్వజారోహణ వేళకే శ్రీవారి భక్తుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామికి పట్టుపీతాంబరాలను అందచేయడం ఆచారంగా ఉంది. ఆ తరువాత వాహనసేవలు ప్రారంభమవుతాయి.

పెద్దశేషవాహనం

శ్రీవారికి తోలి బ్రహ్మోత్సవ వాహనసేవను వరంగా పొందాడు ఆదిశేషుడు. శ్రీవైకుంఠంలో నిత్యశయ్యగా, శ్రీవారికి నివాసభూమిగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా, అనుకునే మెత్తగా, ఛత్రంగా వివిధ రూపాలలో సేవలందించిన దాసుడు ఆదిశేషుడు. పెద్దశేష వాహనసేవ వల్ల మనిషిలో పశుత్వం తొలగిపోయి, మానవత్వం, దానిలోనుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. మానవుల మనసుల్లోని విషతుల్యమైన పాపాలను ప్రక్షాళన చేసె విశిష్ట సేవ ఇది.

చిన్నశేషవాహనం

ఆదిషేశుడే శ్రీవారికి రెండోరోజు చిన్నషేశుడుగా మళ్ళీ సేవలను అందిస్తాడు. ఈ వాహనసేవ శేషశేషి భావాన్ని పెంపొందిస్తుంది. కుండలినీ శక్తి మానవునిలో వెన్నెముక ఉండేచోట సర్పాకారంలో ఉద్భవిస్తుంది. ఆ వాహనసేవ భక్తులకు ఆ యోగమార్గాన్ని చేరుకునేందుకు ప్రేరణ ఇస్తుంది. 

హంసవాహనం

రెండో రోజు రాత్రి శ్రీవారు హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీ రూపంలో విజయం చేస్తారు. ‘హంసస్తు పరమేశ్వరః’ అని ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయి. హంసలు నీళ్ళను, పాలను వేరుచేసి, పాలను మాత్రమే స్వీకరిస్తాయి. భగవానుడు ఆత్మానాత్మ వివేకాన్ని అనుగ్రహిస్తూ, ఆశ్రయించిన వారిలోని అహంభావాన్ని హంసవాహనం ద్వారా తొలగిస్తాడు. సోహం భావన కలిగిన భక్తులను ఉద్దరిస్తూ, అహంకారం తొలగించి, దాసోహం అన్న శరణాగతిని ప్రబోధిస్తాడు.

సింహవాహానం

బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు ఉదయాన శ్రీవారు సింహవాహనంపై విహరిస్తారు. సింహం పరాక్రమానికి శీఘ్రగమన శక్తికి ఆదర్శం. దుష్టశిక్షకుడైన శ్రీనివాసుని వైభవానికి సింహవాహనం చక్కని అమరిక. తన భక్తులకు ధర్మదీక్ష పట్ల అనురక్తిని, ప్రతాపస్ఫూర్తిని శ్రీహరి ఈ వాహన సేవాఫలంగా కటాక్షిస్తాడు.

ముత్యపు పందిరి వాహనం

బ్రహ్మోత్సవాల్లో మరులు గొలిపే ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు కనువిందు చేస్తారు. ముత్యాలు చంద్రునికి ప్రతీకలు. ముత్యాల హారాల మధ్య నిలిచినా శ్రీవారు తనను దర్శించే భక్తుల తాపత్రయాలు తొలగిస్తాడు.

కల్పవృక్ష వాహనం

కల్పవృక్షం కోరిన కోరికలు మాత్రమే తీరుస్తుంది. కానీ శ్రీహరి మోక్షాన్ని కూడా అనుగ్రహించగలడు. మానవ జీవన ప్రస్థానానికి పరమావధి అయిన మోక్ష ఫలాన్ని ఇవ్వగల జనార్దనుడు కనుక కల్పవృక్షం ఆయనకు దాస్యం చేస్తోంది.

సర్వభూపాల వాహనం

రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అంటూ వేదం శ్రీహరిని సకలభువన చక్రవర్తిగా ప్రస్తుతిస్తోంది. న రాజన్యులందరు వాహనస్తానీయులై శ్రీహరిని సేవిస్తారు.

మోహినీ అవతారం

బ్రహ్మోత్సవాల్లో అయిదోనాటి ఉదయం మోహినీరూపంలోని శ్రీవారికి ప్రక్కనే దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుని రూపం కూడా కనిపిస్తుంది. అన్ని సేవలు వాహన మండపం నుంచే మొదలవుతాయి. కానీ ఈ ఒక్క సేవలో మాత్రం సీవారు దేవాలయం నుంచే నేరుగా విచ్చేస్తారు. మొహం, మాయలను దాటాలంటే స్వామికి శరణాగతి చేయాలన్న దివ్యసందేశం ఇది.

గరుడ వాహనం

వాహనసేవల్లో గరుడ సేవ విశిష్టమైనది. దాసుడిగా, సఖుడిగా, విసనకర్రగా, అన్నింటికీ మించి నిత్యవాహనంగా గరుడుడు స్వామికి సేవలను అందిస్తాడు. గోదాదేవి సమర్పించిన మాలను, సహసనామాలను, లక్షీహారం వంటి మూలవరుల ఆభరణాలతో స్వామి ఊరేగే ఈ గరుడవాహన సేవ మానవులకు జ్ఞాన వైరాగ్యాలను, అభీష్ట సిద్ధిని కటాక్షిస్తుంది.

హనుమద్వాహనం

ఆరో రోజు ఉదయం బ్రహ్మోత్సవ రాయడు వేంకటాద్రి రాముడై హనుమద్వాహన సేవలో శోభిల్లుతాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, ఆజాడ్యం, వాక్పటుత్వం కటాక్షించే హనుమంతుని సేవలు అందుకుంటూ శ్రీహరి భక్తులకు సద్భుద్ధిని ప్రసాదిస్తాడు.

స్వర్ణరథోత్సవం

సాయంత్రవేళ బంగారుతెరుతో బ్రహ్మాండనాయకుడు ఉభయదేవేరులతో ప్రసన్నంగా గోచరిస్తాడు. నాడు శ్రీకృష్ణుని రథగమనం శ్లెబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, మాహాకాలనే గుర్రాలతో దారకుని సారథ్యంలో ముందుకు సాగింది. ఆనంద నిలయవాసుడైన శ్రీనివాసుని స్వర్ణరథోత్సవంలో నాలుగు గురాలను పూన్చిన రథంపై స్వామి దర్శనం కన్నుల పండుగ.

గజవాహనం

శ్రీనివాసుడు పార్వేటలో గజరాజును తరిమినప్పుడు పద్మావతీదేవిని చూసినట్లు శ్రీనివాసకళ్యాణం చెబుతోంది. గజవాహనం అంటేనే సకల శ్రేయోదాయకం. బ్రహ్మ ఈ వాహనాన్ని శ్రీవారికి చక్కగా సిద్ధపరుస్తాడు.

సూర్యప్రభ వాహనం

సూర్యతేజం జీవులకు అభ్యుదయ కారకం. సూర్యుడు తన సప్తకిరాణాలతో కూడిన ప్రభను ఏడుకొండలవానికి వాహనంగా అందిస్తాడు. సూర్యప్రభలు విద్య, ఐశ్వర్యం, సంతానం, కవిత్వం, కాంతిని ప్రసాదిస్తాయి. సూర్యప్రభా వాహనంపై శ్రీవారి సేవలో పాల్గొంటే జీవుల శోకాలు తొలగి, జ్ఞానబీజాలు వెలుగురేఖల్లా అంకురిస్తాయి.

చంద్రప్రభ వాహనం

ఏడవరోజు రాత్రి తెల్లని చంద్రప్రభా వాహనంపై విహరిస్తూ శ్రీవారు చల్లని చూపుల వెన్నెలతో లోకాన్ని అనుగ్రహిస్తారు. ఈ శ్రీహరిని సేవించిన భక్తకోటికి ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమనే త్రివిధ తాపాలు తొలగుతాయి.

రథోత్సవం

జన్మరాహిత్యాన్ని కటాక్షించి, ఆత్మానాత్మ వివేకాన్ని ప్రసాదించేది రథోత్సవం. రథికుడు ఆత్మ, శరీరమే రథం. బుద్ధి సారథి. మనస్సు పగ్గం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీథులు. ఉపనిషత్తులు చేసె ఈ భోధ స్థూలశరీరం వేరని, సూక్ష్మశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే జ్ఞానం కలిగిస్తుంది. ఎనిమిదో రోజు ఉదయం ఎందరో భక్తులు తమ చేతులతో శ్రీహరి రథవాహాన్నాని ముందుకు నడిపించే భాగ్యం పొందుతున్నారు.

అశ్వవాహనం

ఈ వాహనసేవ కలిదోషాలను పరిహరిస్తుంది. పటుత్వాన్ని కలిగించి, నామ సంకీర్తనాదుల ద్వారా మానవులు తరిస్తారని ప్రభోదిస్తుంది.

చక్రస్నానం

యజ్ఞాంతంలో జరిగే అవబృధం చక్రస్నానం. బ్రహ్మోత్సవాలు మహోన్నత యజ్ఞఫలాన్నిస్తున్నాయి. శ్రీవారు ఉభయదేవేరులతో, చక్రత్తాళ్వారుతో కలిసి వరాహస్వామి ఆలయంలో నిలిచి స్నపన తిరుమంజనాన్ని అందుకుంటారు. తొమ్మిది రోజులపాటు శ్రీవారు అలసట పొందుతారు. ఆ అలసట తీరేలా ఈవారికి ఆత్మస్థానీయుడైన చక్రత్తాళ్వార్ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. పదోరోజు రాత్రి గరుడధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి. బ్రహ్మోత్సవాలను సేవించిన వారికి సమస్త పాప విముక్తి లభిస్తుంది. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అపమృత్యువు నివారణమవుతుంది. సకల లౌకిక శ్రేయస్సులు కలిగి తదనంతరం శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

**** శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రప్రద్యే ****

ప్రకృతి ప్రియుడు – పార్వతీనందనుడు…

పార్వతీ నందనుడైన గణేశుడు ప్రకృతి ప్రియుడు అని ప్రతీతి. వ్యవసాయపు పనులు ముమ్మరంగా ఉండే వర్షాకాలంలో వినాయక చవితి పండుగ వస్తుంది. వినాయకుని ఏకదంతం నాగలికి సంకేతంగా భావిస్తారు. ఆయన లంబోదరం ధాన్యపు గాడెను సూచిస్తుంది. కడుపు చుట్టూ ఉన్న నాగాబంధం పంటల్ని పాడుచేసే ఎలుకల్ని నాశనం చేస్తుందంటారు. ఇలా వినాయక రూపానికి, వ్యవసాయానికి ఉన్న అనుబంధం గురించిన భావనలు అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా వినాయక చవితిలో 21 రకాల ప్రత్రులను సేకరించడం కోసం చిన్నా పెద్దా తోటలవెంట వెళ్ళేవారు. ఆ ఔషద గుణాలు కలిగిన చెట్లపై ఎక్కి ఆకులు తెంచుకురావడం కూడా ఆరోగ్యాన్ని వృద్ధిచేసే అభ్యాసమే. తరువాత చేరువులలోని బంకబత్తిని వినాయకుడి బొమ్మకోసం సేకరిస్తారు.  ఊరంతా ఒక్కసారిగా చెరువులోని మట్టిని తీయడం వల్ల పూడిక తొలిగిపోతుంది. అటుపైన మట్టిగణపతిని తయారుచేసుకుని, పాలవెల్లిని కత్తి, 21 రకాల పత్రులతో అర్చిస్తాం. తొమ్మిదిరోజులపాటు అక్షతలు, పసుపు, కుంకుమ వగైరాలతో పాటు మాగిన ఆకులు ఆనాడు చెరువుల్లో నీతిని శుద్ధిచేసేవి. ఆకుల్లోని ఔషధ గుణాలు నీళ్ళలోని కాలుష్యాన్ని, వ్యాధికారక క్రిములనూ తొలగించేవి.

మృత్తికారూపంలో అర్చన సర్వశ్రేష్టమైనది. వాతావరణ కాలుష్యాన్ని, నీటికాలుష్యాన్ని నివారించేందుకు గాను వినాయక పూజలో పూర్తిగా మట్టివినాయక ప్రతిమాలనే వినియోగిద్దాం.మృత్తిక అంటే మట్టి రూపంలోనే వినాయకుణ్ణి పూజిద్దాం. ఏ దేవతా ప్రతిమనైనా తయారుచేసిన తరువాత శీఘ్రంగా పూజించాలి. వినాయకచవితి నాటి ఉదయాన్నే మట్టివినాయకుణ్ణి తయారు చేసుకోవడం మన ఆచారం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీలో విధ్యుత్, ఇంధనం విరివిగా ఉపయోగిస్తారు. దీనివల్ల భూతాపం పెరిగిపోతుంది. మట్టితో కాకుండా ఇతర పదార్ధాలతో చేసిన విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవు. దీనివల్ల నిమజ్జనంలోని ముఖ్య ఉద్దేశ్యం నెరవేరదు. అందువల్ల మనం చేసిన పూజంతా కూడా వృథాయే.

21 రకాల పత్రులతో అంతే ఆకుతో విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. ఈ ఆకుపూజ అందులోనూ ఇన్ని రకాల పత్రులతో వినాయకుడికి పూజ చేయటమేమిటి అనే సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి సమాధానంగా మన పురాణాల్లో అనేక చోట్ల వివరణలు ఉన్నాయి. వినాయకుడికి సమర్పించే 21 రకాల ఆకులలోనూ అద్భుత ఔషధ గుణాలున్నాయి. ఇలాంటి మందు లక్షణాలున్న ఆకును చిన్ననాటి నుంచే పిల్లలకు పూజ పేరుతో పరిచయంచేస్తే వారి జీవితాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ 21 రకాల ఆకుల ఔషధ గుణాలను తెలుసుకుందాం.

పత్రంపేరు

తెలుగుపేరు

ఏ వ్యాధి నివారణ

ఉపయోగం

మాచీ మాచిపత్రి నేత్రవ్యాదులు, చర్మవ్యాధులు ఆకుని తడిపి కాళ్ళమీద ఉంచుకోవాలి. పసుపు, నూనెతో నూరి ఒంటికి పూయాలి.
బృహతీపత్రం నేలమునగ(వాకుడు) మూలశంక, దగ్గు, మలబద్ధకం, చక్కరవ్యాధి రోజూ రెండు లేదా మూడు ఆకులను నమిలి రసాన్ని నిదానంగా మింగాలి.
దూర్వాయుగ్మం జంటగరిక మూత్రసంబంధ వ్యాధులు పచ్చడి చేసుకుని తినాలి.
దత్తూర ఉమ్మెత్త మానసికరోగాలు ఆకుల రసంతో రెండునెలలపాటు రోజూ మర్దన చేయాలి. జుట్టు తీసేయాలి.
బదరీ రేగు బాల్య వ్యాధులు మితంగా తింటే మంచిది. లేదంటే శ్లేష్మం కలగజేస్తుంది.
అపామార్గ ఉత్తరేణి దంతవ్యాధులు, చర్మరోగాలు పుల్లతో పళ్ళు తోముకోవాలి.
తులసి తులసి దగ్గు, వాంతులు, నులిపురుగు రోజూ 5,6 ఆకులను మిరియం, ధనియంతో నూరి తినాలి.
చూత మామిడి చర్మరోగాలు, కాళ్ళపగుళ్ళు, అతిసారం మామిడి చిగురుతో ఉప్పు కలిపి వేడిచేసి పగుళ్ళకు రాయాలి.
కరవీర గన్నేరు జ్వరతీవ్రత ఏ జాతి గన్నేరు ఆకులనైనా కొమ్మ నుంచి తుంచి పాలు లేకుండా ఒక తడిగుడ్డలో పెట్టుకుని శరీరానికి కట్టుకోవాలి.
విష్ణుక్రాంత అవిసె తామర, రక్తదోషం ఆకుల్ని నిమ్మరసంతో నూరి తామర ఉన్నచోట పూయాలి. ఆకుకూరగా వాడుకోవాలి.
దాడిమీ దానిమ్మ దగ్గు, ఉబ్బసం, అజీర్తి, కళ్ళవాపు పోడిచేసుకుని కషాయం తీయాలి. ఆకుల్ని వేడిచేసి నూనెరాసి వాపు ఉన్నచోట కట్టాలి.
దేవదారు దేవదారు శ్వాసకోశవ్యాధులు మాను నుంచి తీసిన నూనెను వేడినీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఘాటుగా ఉండే ఈ నూనెని వాసన చూడాలి.
మరువక మరువం శరీర దుర్వాసన వేడినీటిలో వేసుకుని స్నానం చేయాలి.
సింధువార వావిలి బాలింతల వాతరోగం, ఒంటినొప్పులు తెల్ల, నల్ల జాతుల్లో ఏదైనా సరే నీటిలో మరగబెట్టి ఆ నీతితో స్నానం చేయించాలి.
జాజి జాజి నోటి దుర్వాసన ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి.
శమీ జమ్మి కుష్ఠు, అవాంచిత రోమాలు ఈ ఆకుల పసరును ఆయా శరీర భాగాల్లో రాసుకోవాలి.
అశ్వత్ధ రావి శ్వాసకోశ వ్యాధులు ఎండిన రావి కర్రాలని నేతితో కాల్చి ఆ భస్మాన్ని రోజూ తేనెతో సేవించాలి.
అర్జున మద్ది వ్రణాలు తెలుపు, ఎరుపు జాతిలో వేటినైనా సరే నూరి వ్రణాలున్న భాగానికి కట్టాలి.
అర్క జిల్లేడు ముఖం రంగు మార్పు ఏ జాతికి చెందిన జిల్లేడు అయినా పాలుతీసి పసుపులో కలిపి ముఖానికి రాసుకోవాలి.
గండకి అడవి మొల్ల అతిమూత్రం కషాయం తీసుకుని తాగాలి.