ధర్మసూత్రాలు…

తల్లి, తండ్రి, గురువు, ప్రత్యక్ష దేవతలు

భారతీయ సంస్కృతికి వేదాలు ఆధారాలు. వేదాలలో తల్లి, తండ్రి, గురువును దేవతల సమానులుగా, పూజనీయులుగా చెప్పబడింది. “మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవేభవ” అను భావన భారతీయ సంస్కృతి మరియు సమాజానికి ప్రాణం. వాల్మికి రామాయణంలో, మర్యాద పురుషోత్తముడైన రాముడు సీతా దేవితో “తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు ప్రత్యక్ష దేవతలు. వీరిని అవహేళనముతో ఉపేక్షించి, ఆ ప్రత్యక్ష దేవతలను ఆరాధించటం ఉచితం కాదు. ఈ ముగ్గురినీ సేవించగలటం వలన ధర్మ అర్థకామములు ప్రాప్తి చెందుటయేకాకా, వీరిని ఆరాధించుటచే మూడు మూర్తులను ఆరాధించడం అవుతుంది. తల్లితండ్రులకు సమానం ఇతరులెవ్వరూ పవిత్రులు, పూజనీయులు లేరు. ఈ ముగ్గురిని గౌరవించి సేవించటం పరమ కర్తవ్యం అని చెప్పడం జరిగింది.

శ్రీరాముడు ఇట్టి మర్యాదను తన జీవితంలో శ్రద్ధాపూర్వకంగా పాటించాడు. తల్లితండ్రుల ఆజ్ఞను ప్రసన్నతతో శిరోధార్యం చేసుకొని, అతడు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. తల్లితండ్రుల ఆజ్ఞను శిరసావహించినందువల్లనే శ్రీరామునికి ప్రతి ఇంట పూజలు జరుగుతున్నాయి. అందువల్లనే, అతనిని మర్యాద పురుషోత్తమ భగవాన్ రాముడన్నారు. అతడు తల్లి, తండ్రి గురువులను ప్రత్యక్ష దేవతలుగా ఎంచి భక్తిశ్రద్ధలతో గౌరవించాడు.

శ్రీరామ చరిత మానస్ లో తెలిపినట్లు ఆయనకు ప్రతిదినము వేకువజాముననే  లేచి, వారి తల్లిదండ్రుల గురువుల పాదపద్మములపై తన శిరస్సునుంచి ప్రణామం చేయడం అలవాటు.

పద్మపురాణంలో, “తండ్రిని ధర్మ మూర్తియని, స్వర్గమని, అతనే సర్వోత్కృష్టమైన తపస్సు అని, తండ్రి ప్రసంనుడైతే దేవతలందరు ప్రసన్నులవుతారని, ఏపుత్రుని సేవతో తల్లిదండ్రులు సంతుష్టులవుతారో, ఆపుత్రునికి ప్రతిరోజూ గంగాస్నాన ఫలం దక్కుతుంది. తల్లియందు సర్వ తీర్థాలుంటాయి. తండ్రి దేవత లందరి స్వరూపుడు. అందువల్లనే అన్ని విధాల ప్రయత్నపూర్వకంగా తల్లిదండ్రులను పూజించాలి. తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణ చేయువానికి, ఒక్క సారిగా పృథ్వినంతటిని ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది.

వినాయకుడి, కార్తికేయుడి, వివాద ప్రసంగంలో సకల పృథ్వి ప్రదక్షిణ చేయడంలో ముందు తిరిగిరావటం గురించిన కథ అందరికి తెలిసిందే, కార్తికేయుడు తన వాహనంపై పృథ్వి ప్రదక్షిణ చేస్తుండగా, అప్పుడు వినాయకుడు తన తల్లితండ్రులైన శివ పార్వతులను పూజించి, వారలకు ప్రదక్షిణ చేసి, తాను పృథ్వి ప్రదక్షిణ పూర్తి చేశానని పలికాడు. తల్లిదండ్రులకు ప్రదిక్షిణ చేసి నంతా మాత్రానే పృథ్వినంతటిని ప్రదిక్షిణ చేసినట్లువుతుందని వినాయకుని సమాధానం. తల్లిదండ్రులకు స్వచ్చమైన స్థానం ఇచ్చినందువల్లనే వినాయకుడు నేటికీ అగ్ర పూజలనందుకొంటూ భక్తవరదుడయ్యడన్నది నిజం.

మనుస్మృతిలో “పది గురువులకు మించినవాడు ఒక ఆచార్యుడని, నూరుగురు ఆచార్యులను మించినవాడు తండ్రియని, తండ్రికన్నా వేయి రెంట్లు అధికముగా తల్లిగౌరవనీయురాలని” చెప్పబడింది.

పుత్రుల యొక్క ఇహలోక, పరలోక, లోకకళ్యాణ ప్రాప్తికై తల్లిదండ్రుల సమానమైన తీర్థం వేరేలేదు. తల్లి దండ్రులను సేవించని వారికి, వేదాధ్యయనం వ్యర్థం. పుత్రునికి తల్లి దండ్రులను సేవించడం ధర్మం. ఇదేతీర్థం, మోక్షం మరియు ఇదే జన్మకు శుభఫలం.

“నాస్తి మాతృసమః గురుః అని వేద వ్యాసుడు పలికాడు. అనగా తల్లిని మించిన గురువెవరూ లేరు. ధర్మ గ్రంథాలలో చెప్పినట్లు, తల్లిదండ్రులంతటి శ్రేష్టులు ఏ దేవతలు లేరు. కనుక ప్రత్యక్షదేవతలైన తల్లిదండ్రులను శ్రద్ధాపూర్వకంగా సేవించుటయే మన ధర్మం.

యుధిష్టరుడు, భీష్మ పితామహుని ధర్మమార్గమును తెలుపవలసిందంటూ అడిగాడు. భీష్ముడు “తల్లి, తండ్రి, గురువులయందు భక్తి, సమస్త ధర్మములకన్నా ఉత్తమ ఫలములనిస్తుంది. అన్ని విధాలైన పూజలకన్నా ఈ ముగ్గురిని సేవించుటయే శ్రేష్టమైనది. అధిక మహత్వపూర్ణమైనది. తండ్రి సేవలచే ఈ లోకంలో, తల్లి సేవలచే పరలోకంలో, మరియు గురువును సేవించుటయే బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది” అని తెలిపాడు. మహాకవి గోస్వామి తులసీదాస్, “శ్రీరామ చరిత మానస్” లో”వందే బోధమయం నిత్యం గురుంశంకర రూపిణం” అని గురువును కృపా సింధునరరూపహరి అని చెప్పాడు. కనుక, తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురి ఉపేక్ష, అవహేళన, నిరాదరణ, అవమానుపరచు భావన లేదా అలా వ్యవహరించే ఆచరణ ధర్మ విరుద్ధంగా గుర్తింపబడింది. ప్రత్యక్ష దేవుళ్లైన ముగ్గురి యందు అశ్రద్ధ లేదా అగౌరవమైన పద్ధతిని అనుసరించువాడు పాపి అవుతాడు మరియు అతనిచే చేయుబడిన పుణ్య కార్యములు నశిస్తాయి.

ఈ విషయంలో వాల్మీకి రామాయణంలో “ఏ వ్యక్తి తన తల్లిదండ్రులను, బ్రాహ్మణులను, ఆచార్యుని అవమానపరచునో, వాడు యమునిచే దండింపబడి, పాప ఫలితములను అనుభవిస్తాడ” ని తెలిపాడు.

తండ్రి పతితుడైనప్పటికీ, ఆకలి బాధచే వ్యకులితుడైనప్పటికీ, అన్ని పనులలో అసమర్థుడైనప్పటికీ, వృద్ధుడై ఉన్నప్పటికీ, మరియు అదే పరిస్థితిలో తల్లి ఉన్నా, ఏ పుత్రుడు వారిని సేవించిననూ, అట్టి పుత్రునిచే విష్ణువు నిస్సందేహంగా ప్రసన్నుడవుతాడు. తల్లిదండ్రులు ఈ లోకమందైననూ, పరలోకమునందైననూ, శ్రీనారాయణుని సమానులే. మరియు తల్లిదండ్రులు ఏ కుమారుని ఎల్లప్పుడూ కోపిస్తుంటారో, వాడు నరకంలో పడకుండా త్రిమూర్తులు కూడా కాపాడలేరు. తల్లి, తండ్రి, గురువులను సగౌరవంగా సేవించని పుత్రుని కర్మములు నిష్పలమవుతాయి. “తల్లి తండ్రి గురువు యొక్క ఆజ్ఞలను పాటించని వాణి జన్మ వ్యర్థం” అని శ్రీరాముడు లక్ష్మణునికి చెప్పాడు.

ప్రాచీనకాలం నుండి, తల్లి, తండ్రి, గురువులు సమాజంలో మహోన్నత స్థానంలో ఉన్నారు. అందుకే వీరిని ప్రత్యక్షదేవతలన్నారు. ఈ ముగ్గురి నుండి పొందిన సేవలను, త్యాగాలను, ఋణమును మరచి, వారికి తగిన గౌరవ ములనివ్వనివాడు పాపి అగుటయే గాక క్షమార్హుడు కాడు.

నేటి పరిస్థితుల గురించి ఆలోచించటం ఎంతో అవసరం. నేటి సమాజంలో ఈ ముగ్గురి పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. అంతటా పరివారాలు విచ్చిన్నమవుతున్నాయి. సమిష్ఠి కుంటుంబాల పరిస్థితి లుప్తమవుతున్నాయి. కుటుంబాలు సన్నగిల్లుతున్నాయి. దీనిని పాశ్చాత్యసంస్కృతి ప్రభావమనాలా లేక నేటి శిక్షనాపద్దటి దోషమనవలెనా? నేడు వృద్ధ తల్లిదండ్రులను పరివారంలో భారముగా అనుకొంటున్నారు. క్రొత్తతరం ప్రాచీనసంస్కృతి మరియు సంస్కారాల నుండి దూరమవుతోంది. వృద్ధ తల్లి దండ్రులు, సేవాశుశ్రూష, గౌరవ మర్యాదలు, ప్రేమకు దూరంగా జరుగుతున్నారు. ఏ తల్లి దండ్రులు, తమ సంతానం యొక్క పాలనపోషణ, శిక్షణ, పెండ్లిండ్లు మొదలగువాటికి, వారి జీవిత ఆదాయాన్ని వ్యవపరచినారో, ఆ తల్లిదండ్రుల పాలనపోషణ, సేవ, చికిత్స వంటివి పుత్రులందరు కలిసి కూడా చేయడంలేదు. ఈ కారణం చేతనే అసహాయులైన వృద్ధ తల్లి దండ్రులు వృద్ధాశ్రమాలలో శరణు పొందవలసి వస్తోంది. నేడు పరివార ములలో అశక్తులైన తల్లి దండ్రులకు స్థానము లోపొంచుటచే నగరములలో వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతోంది. అందువలననే, జీవిత అంతిమ ఘడియలలో, సేవ సాను భూతి, ప్రేమ చికిత్సలులేక వంచితులగుచున్నారు. తనవారి ఉపేక్ష నిరాదరణకు గురియై బాధలను అనుభవించుటకు వివశులైరి.

నేడు కూడా, కొన్ని పరివారములలో పుత్రులు వారి తల్లిదండ్రులను సగౌరముగా చూసే వారున్నారు. వారి సేవలందు, చికిత్సలందు, విశేష శ్రద్ధ చూపించు చున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు, వారి పుత్ర పౌత్రుల వెంట ఆనందంగా ఉన్నారు. కాని, ఇలాంటి ఆదర్శ పరివారముల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది. ఏవిధంగా పరివారంలో తల్లిదండ్రుల స్థితి దయనీయం మరియు ఉపేక్షించబడుచున్నదో, అదేవిధంగా గురువులు, ఆచార్యులు, అధ్యాపకులు మొదలగువారి స్థితులు కూడా పతనమవుతున్నాయి. “గురుబ్రహ్మ, గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః” అను భావన కేవలం చదువుకోవడానికి మాత్రమే పరిమితమైంది. వ్యవహార మందు ఇప్పుడు గురువు కేవలం వేతనము పొందు శిక్షకుడిగా చూడబడుచున్నాడు. గురు జనుల ప్రస్తుత దశ నేడు చింతించదగు విషయంగా మారింది.

“మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ” అను శృతి వచనములకు సమాజంలో పునః స్థాపితం చేయుట గురించి ఆలోచించి, తగు ప్రయత్నం చేయాలి. బాల్యదశ నుండే పిల్లలలో ఈ ప్రత్యక్ష దేవతల ఆదరణ సేవాభావ యుక్త సంస్కారమును బోధించడం చాలా అవసరము. “బాల్యమెట్లుండునొ, జీవితమూ అట్లుండును” అనినట్లు జీవిత పర్యంతం సంస్కారములుంటాయి. మహాపురుషుల జీవిచచరిత్రలు, వారి బాల్యం నుండే తల్లి, తండ్రి, గురువులు, వారికి సంస్కారవంతమైన శిక్షణనిచ్చి ఉన్నారని తెలుపుచున్నాయి.

తల్లి, తండ్రి, గురువు మరియు ఇతర సదస్యులు, స్వయంగా వారి ఆచరణ లేదా వ్యవహారరీతులలో బాలురకు మంచి సంస్కార పాలనా విధానములు ఉదాహరణలతో చెప్పాలి. పిల్లలలో మనం కోరుకునే సద్గుణాలను, ముందుగానే వారిలో సద్గుణాలను అలవరచుకునేట్లు చేయాలి. పిల్లలు పెద్దలను చూసి అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. మంచి లేదా చెడు అలవాట్లను లేదా సంస్కారాన్ని పిల్లలు, ముందు పరివారం నుండి, తదుపరి ఇరుగు పొరుగున ఉండే వాతావరణం నుంచి గ్రహిస్తారు. పరివారంలో పిల్లలకు బాల్యం నుండే, తల్లి, తండ్రి, తాత, నాయనమ్మ, మరియు గురువు పట్ల శ్రద్ధ, సేవ, మరియు గౌరవభావనతో శిక్షణ ఇవ్వడం మన కర్తవ్యం.

పరివారంలోని మంగళప్రదమైన కార్యక్రమాలలో పెద్దలకు విశేషస్థానం ఇచ్చి, వారిని సగౌరవంగా చర స్పర్శ చేసి ఆశీర్వాదం పొందాలి.

విద్యాలయాల్లో, వారమునకోకసారైననూ, నైతిక సంబంధమైన శిక్షణనివ్వవలెను. గతంలో ఇటువంటి శిక్షణా తరగతులుండేవి. గురువులు నైతిక సంబంధ విషయాలపై బోధించవలెను. పిల్లల జన్మదిన సందర్భాలలో మంచి బోధనాయుక్తమైన పుస్తకాలను బహుకరించాలి.

వయోవృద్ధులైన తల్లిదండ్రులకు ప్రణమిల్లి సేవించినవానికి, ఆయువు, విద్య, యశస్సు, మరియు బలము ప్రాప్తిస్తుంది.

తల్లి, దండ్రి, గురువు మొదలైన వారి మాటలను పెడచెవినబెట్టక ఆచరించవలెనని శివుడు శ్రీరామునికి ఉపదేశించాడు.

తల్లిదండ్రులవల్ల ఏ కారణం చేతనైనా ఏ అపరాధం జరిగాననూ, పుత్రులు వాటిని పట్టించు కొనక, యథావిధిగా, శ్రద్ధా భక్తులతో వినయంతో, సుశీలులై వారిని సేవించాలి. ఇదే భారతీయ సంతాన సంస్కృతి యొక్క ఉన్నత ఆదర్శం.

మానవ సేవయే మాధవ సేవ

మానవజన్మ కేవలం భగవంతుని కృప వలననే ప్రాప్తిస్తుంది. భగవదిచ్చ వలననే మానవునిగా ఉండగలుగుతున్నాం. భగవంతుడు ప్రసాదించిన మానవజన్మ మనకు భగవత్కార్యములను చేయు సదవకాశామును కల్గించుట మహాద్భాగ్యము.

భగవత్కార్యములు చేయటం అంటే భగవంతునికి సహాయబడుట కాదు. భగవంతునికి సహాయపడు శక్తి మనకు లేదు. భగవంతుని సేవించుటయే మన ప్రథమ కర్తవ్యం.

మాధవుడు అనగా భగవంతుడు. మాధవునిచే సృష్టించబడిన అనేకానేక ప్రాణులలో ఒక ప్రాణి మానవుడు. అట్టి మానవుని సేవించినట్లే పరిగణింపబడుతుంది. మానవుని సేవించటం అంటే ఏమిటి? ఇతర మానవునికి ఉపయోగబడు, ఉపకరించు పనిని చేయుటయే ఇతరుని సేవించుట అవుతుంది. ఇతరునికి ఉపాకరమోనర్చుట మన కర్తవ్యమే గాక మన ధర్మం.

ఇతరులకు ఉపకారము చేయటం రెండు విధాలుగా ఉంటుంది. తనకు ఉపకార చేసిన వానికి ప్రత్యుపకారము చేయటం ఒక విధము. తనకపకారము చేసినవానికైనను ఉపకారము చేయుట రెండవ విధము. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే శ్రేష్ఠుడు. ఇతరులను, విశాల రూపమున ప్రపంచముగా, సూక్ష్మ రూపమున మనదేషంగా తెలుసుకోవలయును. దేశమునకు చేయు ఉపకార విషయాన్ని ఆలోచించవలసి వచ్చినచో, మనము “దేశము నాకేమి ఉపకారం చేసింది?” అని ప్రశ్నించుకొనకూడదు. “మనం దేశం కోసం ఏమీ చేసాం, ఏమైనా ఉపకారం చేయాలి?” అనే ప్రశ్నించుకోనవలెను.

ప్రతిఫలమును లేదా ప్రత్యుపకారమునాశించక, ఇతరులకు చేయు ఉపకారము అత్యుత్తమమైనది.

అందులో “త్యాగము” అను విశేష గుణము దాగియున్నది.

దారిద్ర్యమును అనుభావిన్చుచున్న వాడు, వేరే గత్యంతరం లేక భిక్షాటన చేస్తాడు. అట్టి బిచ్చగానికి నీవు దానమిచ్చుట చేత నీకు నీవే ఉపకారము చేసుకొనినవాడవు అగుదువు. దానమిచ్చు వాడు ధన్యుడు కాని పుచ్చుకున్నవాడు ధన్యుడు కాదు. అట్టి బిచ్చగాడికి దానము నిచ్చు అవకాశం నీకు లభింప చేసిన పరమాత్మునికి కృతజ్ఞుడవై ఉండుము. బిచ్చగానికైనాను దానమిచ్చిన పిదప “పరమేశ్వరార్పణమస్తు” అని అనుకొని, అట్టి దానమిచ్చిన సంగతి మరచిపోవుట ఉత్తమగుణము. అట్టి బీదవానికి చేసిన ఉపకారము (సేవ) మాధవ సేవగా పరిగణించాలి.

ఇతరులకు హాని తలపెట్టుట లేదా చెడు చేయుట మనకు మనమే హాని చేసుకోనునట్లుగా తెలుసుకొనవలెను. ఇతరులకు మంచి చేయుటవలన వారికే కాక మనకు కూడా మంచియే చేకూరుతుంది. కర్మయోగముననుసరించి, చేయబడిన ప్రతి పని ఫలితం దానిని అనుసరించి ఉంటుంది. మనం చెడుకార్యము చేసినయెడల, మనం బాధను అనుభవించక తప్పదు. మనం మంచి పని చేసినయెడల, తృప్తి చెందుటయేకాక మన మనస్సు ఆనందించును. స్వర్గ నరకములందేమున్నది మనకు తెలియదు. ప్రపంచమును మనం చూస్తున్నాము. ప్రపంచమంతయు దుఃఖమయము. బుద్ధ భగవానుడు దుఃఖములు నివారించుటకై తపన చెందియుండెను. దుఃఖములను అంతమొందించుటకు మనకు ప్రయత్నించవలెను. మనం మంచినే చేసూ, మంచిగా నున్నచో, ఆ మంచియే మనకు మోక్షము నొసంగును. నిష్కామముగా, ధనమును లేదా కీర్తిని ఇతరులకు ఉపకారము చేయునతనికి, ప్రపంచస్థితికి మార్చగల శక్తి చేకూరును.

మనము మనలనే పోగాడుకోనుట పాపమూ. అట్టి మానవుడు స్వార్థపరుడు. ఇతరులకు సాయపడు ఉద్దేశ్యము కలవాడు నిస్వార్థపరుడేకాక ఆధ్యాత్మిక చింతన కలిగిన జీవుడు.

మానవులందరు దేవుని బిడ్డలు. మానవులకు సేవచేయు అవకాశము నీకు కలిగినచో, ఆ అవకాశమును భగవంతుని ప్రసాదమని గ్రహించవలెను. తోటివారికి సేవ చేయు అవకాశం నీకు ప్రాప్తిన్చినచో నీవు ధన్యజీవుడవు. తోటి మానవులను సేవించు అవకాశము లభించుట మన భాగ్యము. ఇతరులకు చేయు సేవను సహాయముగా భావింపరాదు. ఇతరులకు చేయు సేవను, సహాయపడినట్లు భావించుట పాపమే గాక దేవుని దూషించినటులవుతుంది. నీ నుంచి సేవలనందుకొను మానవునిలో భగవంతుడిని కనుగొనుము. భగవంతుడు సర్వాంతర్యామి, అనగా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. జీవిని ఆరాధించువాడే దేవుని ఆరాధకుడు. ఏ ఒక్కనికైనను నీవు ఏ కొంచెమైననూ సేవను అందించినచో, నీవోనర్చిన సేవ సత్కర్మ అవుతుంది. 

అజ్ఞానమే మానవునికి దుస్థితిని కలిగించును. అజ్ఞానాంధకార కూపములో పడియున్న వారిని వెలుగులోకి రప్పించుటకు వారిలో జ్ఞానోదయము కల్గించు ఉపకారమును చేయుము. ప్రకృతిలో అసమానత యున్ననూ, అందరికి జ్ఞానప్రాప్తికై సమాన అవకాశములు కలిన్చావలెను. బలహీనులక్కు, రోగులకు సేవలనందించుట పరమేశ్వరుని పూజించుతయే అవుతుంది. ఇతరులకోరకే జీవించుచూ, ఇతరులకు ఉపకారము చేస్తూ, అందులోనే తృప్తి పొందువాడు జ్ఞాని. నీ ముక్తి కొరకే నీవు త్యాగము చేయుట నిష్ప్రయోజనము.

ప్రతివ్యక్తి పవిత్ర భావంతో పొందు ఉత్సాహము నుండి ప్రేరితుడు కావలెను. అట్టి ఉత్సాహముతో సహాయసిద్ధాంతం పాటిస్తూ సంఘమును ఉద్ధరించుటకు పోరాడవలయును. ప్రతి వ్యక్తి, దీనస్థితిలో యున్న బీదప్రజలను సేవించుటయే భగవంతుని సేవయగును. రోగపీడితులకు మందులు సమకూర్చి, విధ్యాహీనులకు విద్యనోసగి, ఆకలితోనున్న వానికి కడుపారా అన్నము పెట్టి సేవలు అందించినచో అట్టి సత్పురుషుని శాంతి కలుగుతుంది.

నిస్సహాయులకు, బలహీనులకు, బీదజనులకు, నిస్వార్థ సేవలనందించువాడు భగవంతునికి మహా ఇష్టుడు. అట్టి వ్యక్తి సేవలు పరమాత్ముని కందించిన సేవలుగా గుర్తించబడి, మోక్ష సాధనకు దారి కలుగజేయును. మానవ సేవయే మాధవసేవ ముమ్మాటికి నిజమని గ్రహించాలి. సేవా సిద్ధాంతమును ఆచరణలో ఉంచువాడు ధన్యుడు. ఇతరులకు ఉపయోగపడని వానితో స్నేహము చేయగూడదు.

Advertisements

గురుబ్రహ్మ!

గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురురువేనమః

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి.వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం.

‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశ మివ్వడానికి అర్హుడనీ,  అతడే సద్గురువు అని భావించాలి. శిష్యుడు గురువును గురువుగా ఎన్నుకున్నంత మాత్రానికే, ఆయన వెంటనే గురువు కాజాలడు. ఆయన కూడా అతడిని శిష్యునిగా ఎన్నుకోవాలి. తన గురువును ఎన్నుకునే అధికారం శిష్యునికి ఉన్నట్లే, శిష్యుని ఎంపిక చేసుకునే అధికారం గురువుకు ఉంది. నిదానించి, పరిశీలించి శిష్యార్హతను నిర్ణయిస్తాడు గురువు.

గురువు నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి అంటూ ఉంటుంది. కానీ, ఏదో ఒకనాడు ఆ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్టు కనబడితే, శిష్యులు తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో గురువుకై అన్వేషిస్తారు. అటువంటివారు ఉభయభ్రష్టులవుతారు. కావున శిష్యులు తమ హృదయాలను నిష్కల్మషంగా ఉంచుకుని సహజమైన శాంతి, తృప్తి, సహనాన్ని కలిగి ఉండాలి. సత్త్వగుణ సంపన్నుడైన గురుస్థానం శివస్థానంగా ఎంచి తన హృదయాన్ని పరిపూర్ణంగా గురువుకి అంకితమివ్వాలి. అదే శిష్యుని నిజమైన గురుత్వం. అలాగే గురువు కూడ ‘గురుతత్త్వం’ కలిగి ఉండాలి. తనను పరిపూర్ణంగా విశ్వసించిన శిష్యునికి, తాను పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించాలి. అటువంటివారే సద్గురువులుగా భావించబడతారు.

కొంతమంది, గురువులను మూడు విధాలుగా పేర్కొన్నారు.

1. జన్మదాత (తండ్రి), 2. విద్యాగురువు, 3. మోక్షగురువు.
1. ఉపదేశ గురువు, 2. కులగురువు, 3. జగద్గురువు.
1. మాతా, 2. పితా, 3. ఆచార్యుడు.

ఈ ముగ్గురు గురువులలో విద్య నేర్పే గురువు అధికుడు. జీవుని యాత్రలో గురుయాత్ర గొప్పది. విశ్వామిత్రుడు బాలకులైన రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెళ్ళి అనేక అస్త్రవిద్యలను నేర్పి, బల, అతిబల విద్యలలో వారిని ఆరితేరులను గావించి, వారి సాయంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేసి, అడ్డుగా వచ్చిన తాటకి, మారీచ సుబాహులు హతమారునట్లు చేశాడు. అదొక వనయాత్ర, సాహసయాత్ర లేక విజ్ఞానయాత్ర లేక శుభయాత్ర అని అనవచ్చు.

ఇక జ్ఞానాన్ని అందించే గురువులు ఐదుగురు – 1. పంచసంస్కార ప్రదాత, 2. బ్రహ్మప్రదాత, 3. ప్రబంధ ప్రదాత, 4. బ్రహ్మార్థప్రదాత, 5. పంచమోప్రాయప్రదాత.

ఇక ఆరు విధాలైన గురువులు: 1. ప్రేరకుడు, 2. సూచకుడు, 3. వాచకుడు, 4. దర్శకుడు, 5. బోధకుడు, 6. శిక్షకుడు.

అనంతరం అష్ట గురువులు:

1. అక్షరాభ్యాసాన్ని చేయించినవారు,
2. గాయత్రీ మంత్రోపదేశాన్ని చేయించినవారు,
3. వేదాధ్యయనం చేయించినవారు,
4. శాస్త్రాభ్యాసం చేయించినవారు,
5. పురాణేతిహాసాలను చెప్పినవారు,
6. మతాచార సంప్రదాయాలను బోధించినవారు,
7. ఇంద్రజాలాది మంత్రబోధకుడు,
8. బ్రహ్మజ్ఞానోపదేశికుడు.

వీరిలో చివరి గురువే (బ్రహ్మజ్ఞానోపదేశికుడు) మోక్షగురువు. మిగిలినవారు సఛ్చీళ జీవనయాత్ర సాగడానికి ఉపయోగపడేవారు.

ఇంకా . బొధగురువు, 2. వేదగురువు, 3. నిషిద్ధగురువు, 4. కామ్యకగురువు, 5. సూచకగురువు, 6. వాచకగురువు, 7. కారణగురువు, 8. విషిత గురువు అంటూ ఎనిమిది మంది గురువులున్నారు.

1. గూఢుడు, 2. దృఢుడు, 3. ప్రీతుడు, 4. మౌని, 5. సకృత్ కామగతుడు అనే పంచవిధ గురువులున్నారు.

ఇలా గురువుల గురించి ఎన్నో అపురూపమయిన విషయాలున్నాయి. ఇక, లోకంలో అనేకావతారాలున్నాయి. కాని, శ్రీదత్తావతారంలో గురు ప్రభావములు, గురు విలక్షణలు గ్రహింపదగినవి. జగద్గురువు అయిన తనకు కూడా ప్రవృత్తిమార్గాన్ని చూపిన గురువులున్నారని శ్రీగురుదత్తాత్రేయుడు భాక్తవరడుడైన ప్రహ్లాదునితో వివరించినట్లుగా మనకు తెలుస్తోంది.

“ప్రహ్లాదా! నా స్మృతిపథంలో ఉన్నవి అవి, అవి రెండే రెండు గురువులు. అవియే, ఎలా ఉండకూడదో చెప్పింది జుంటీగ. ఎలా ఉండాలో చెప్పింది కొండచిలువ. అనగా, జుంటీగ వైరాగ్యాన్ని నేర్పింది. కొండచిలువ సంతుష్టిని నేర్పింది” అని గూఢాతిగూడమైన గురుతత్త్వాన్ని బోధించాదు దత్తాత్రేయులు.

అలాగే, శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యడురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.

అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానమిచ్చారు.

“యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు గురువులున్నారు. జాగ్రత్తగా విను. 1. భూమి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని ఇవియే పంచభూతాలు. మరియు – 6.సూర్యుడు, 7. చంద్రుడు, 8. పావురాలు, 9. అజగరము(కొండచిలువ), 10. సముద్రము, 11.మిడత, 12. తుమ్మెద, 13. గజము, 14. మధుహారి (తేనెటీగ), 15. లేడి, 16. చేప, 17. ‘పింగళా’ – అనే వేశ్య, 18. కురరము (లకుముకిపిట్ట), 19. బాలుడు, 20. బాలిక, 21. శరకారుడు, 22. సర్పము, 23. సాలీడు, 24. పురుగు ఇవి నా గురువులు.

వాటి నుండి గ్రహించినది విను.

 1. భూమి నుండి – క్షమా, పరోపకారత్వం
 2. వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము
 3. ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం
 4. జలం నుండి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం
 5. అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వరతత్త్వం
 6. సూర్యుని నుండి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే.
 7. చంద్రుని నుండి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.
 8. పావురాల జంటనుండి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.
 9. అజగరము నుండి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.
 10. సముద్రం నుండి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.
 11. మిడత నుండి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.
 12. తేనెటీగ నుండి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!
 13. గజం నుండి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.
 14. మధుహారి నుండి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.
 15. లేడి నుండి – అమాయకత్వంలో సంగీతంమోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.
 16. చేప నుండి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!
 17. పింగళ నుండి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.
 18. కురరము నుండి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.
 19. బాలుడు నుండి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.
 20. కన్యక నుండి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.
 21. శరకారుడు నుండి – ఏకాగ్రతను సాధిస్తాడు.
 22. సర్పము నుండి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.
 23. సాలెపురుగు నుండి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.
 24. పురుగు నుండి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).

అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు. ఇక, ఆచార్యులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే. ఆ రోజుల్లో గురువులకు ఈ క్రింది లక్షణాలు ఉండేవి.

 1. శిష్యవాత్సల్యం
 2. విషయపరిజ్ఞానం
 3. బోధనా కౌశలం
 4. మనస్తత్త్వాన్ని తెలుసుకుని ఉండటం అనే లక్షణం
 5. అందరిపట్ల సమభావాన్ని కలిగి ఉందటం

అయితే, ప్రస్తుత గురువులలో చాలామంది ‘చెవిలో మంత్రం చేతిలో ధనం’ అన్నట్లుగా ఉంటున్నారు. ఇది భవిష్యతరాలకు మంచిది కాదు. శిష్యులు కూడ గురువుల పట్ల భక్తిప్రపత్తులతో మెలగాలి. అప్పుడే మన జీవితానికైన జ్ఞానార్జన లభిస్తుంది.