శివ మంత్రము…

యజుర్వేదము, 4.5.8.1

ఓం నమః శంభవే ఛ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ|| ఓం ||

ఇది యజుర్వేదంలో మధ్యభాగమైన శ్రీరుద్రంలో వచ్చే మంత్రం. వేదాలలో ‘జీవరత్నం’గా శ్లాఘింపబడుతున్నా ‘నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం యీ భాగంలోనే పొందుపరచబడి ఉంది. దైనందిన ఆరాధనలో తప్పక చేర్చుకోవలసిన మంత్ర మిది.

ఓం నమః శంభవే ఛ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ|| ఓం ||

శంభవే చ=ప్రపంచ ఆనందంగాను; మయోభవే చ=మోక్ష ఆనందంగాను; శంకరాయ చ=ప్రాపంచిక ఆనందాన్ని ఇచ్చేవాడూ; మయస్కరాయచ=మోక్ష ఆనందాన్ని ఇచ్చేవాడూ; శివాయ చ=మంగళ స్వరూపుడూ; శివతరాయ చ=శివమయం గావించేవాడూ; నమః=నమస్కారము.

ప్రాపంచిక ఆనందంగాను, మోక్షానందంగాను ఉంటున్నవాడూ; ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ఇచ్చేవాడూ, మంగళస్వరూపుడూ, తనను పొందిన వారిని శివమయంగా గావించేవాడూ అయిన పరమ శివునికి నమస్కారం

Advertisements

శివ శబ్దం….

శివ సహస్రనామంలో వేయి నామాలున్నాయి. శివ శబ్దానికి 48 పర్యాయపదలున్నాయి. అవి:

శంభు రీశ: పశుపతి: శివ: శూలీ: మహేశ్వర: భూతేశ: ఖండ పరశు: గిరీశో గిరిశోమృడ: ఈశ్వర: శర్వ ఈశాన: శంకర: చంద్రశేఖర: మృత్యుంజయ: కృత్తివాసా; పినాకీ ప్రమధాదిప: ఉగ్ర: కపర్దీ శ్రీకంఘ: శితి కంఠ: కపాలభృత్
వామదేవో మహాదేవ: విరూపాక్ష: త్రిలోచన:
కృతానురేతా: సర్వజ్ఞో ధూర్జటి: నీలలోహిత
స్మరహరో, భర్గ: త్ర్యబకం త్రిపురాంతక:
గంగాధరోంధకరిపు: క్రతుధ్వంసీవృషధ్వజ:
వ్యోమకేశ: భవోభీమ: స్థాణు: రుద్ర ఉమాపతి:

శివుడు ఎప్పుడు మంగళకారుడుగా ఉంటాడో, అప్పుడు ‘శంకరుడు’ అనబడుతున్నాడు. ప్రాణులకు రక్షణ కలిగించేటపుడు రక్షకుడు అనబడుతున్నాడు. ఎప్పుడు పర్వతేశుడో అప్పుడు గిరీశాఅని, కైలాసంలో ఉన్నప్పుడు గిరీశ: అని పిలుస్తారు. సంహారం కావిస్తున్నప్పుడు రుద్రుడని పిలువబడుతున్నాడు. ఇలా శివ నామానికి పర్యాయపదాలు ఉన్నాయి. ఆ స్వామిని ఏ పేరుతో పిలిచినా తన భక్తులను కాపాడుతుంటాడు.

ద్వాదశజ్యోతిర్లింగదర్శనం!

సౌరాష్ట్రదేశే విశదేరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే
శ్రీశైల శృంగే విబుధాతిసంగే తులాద్రితుంగే పి ముదావసంతమ్
త మర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుమ్
అవంతికాయం విహితావతారం ముక్తిప్రదానాయ ఛ సజ్జనానామ్
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశమ్
కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతామోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా నిదానే సదా వసంతం గిరిజాసమేతం
సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తం మహం నమామి
యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనా త్పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే
సుతామ్రపర్ణీ జలారాశియోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి
సానంద మానంద వనే వసంత మానందకాండం హతపాపబృందం
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం
వందే మహోదారాతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రప్రద్యే
జ్యోతిర్మయ ద్వాదశలింగకానం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫలం తదాలోక్య నిజం భజేచ్ఛ

జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపుఒడ్డున రెండు (బంగాళాఖాతాతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారాము 8. పృథ్వి 9. జలము 10. తేజస్సు 11. వాయువు 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్కలింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.

1. సోమనాథ జ్యొతిర్లింగం

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.

బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగా అం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్ని మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించ సాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని అస్థరాధించిన చంద్రుదు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొకకళ చొప్పున పెరుగుతుందని అను గ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

2. మల్లిఖార్జున జ్యోతిర్లింగం

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలిఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే ‘శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద’ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగపూరమ్లో ఆవిర్భవించాడని మరోకథనం.

కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దారుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంటరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణకథనం. సీతారాములు రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రప్రతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.

3. మహాకాలేశ్వర జ్యోతిర్లింగం

పరమేశ్వరునికి అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం – పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నిటికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఏడారి – పొలం – పీఠం – అరణ్యం అంటూ ఐదు ఉన్న ప్రదేశం ఉజ్జయిని. పూరవం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడ శివభాక్తులే. ఇదిలాఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్న దూషణా సురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఆ రాక్ససుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని, అతని సైన్యాన్ని భస్మం చేసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

4. ఓంకారేశ్వరజ్యోతిర్లింగం

ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గోప్పవారెవరూ లేరని విర్రవీగురుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పమహర్షి దని నారదమహర్షి చెప్పగా, కుపితుడై, ఓంకార క్షేత్రానికివెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాని సాధించుకునే శక్తిని ప్రసాదించ’ మని వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వారంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రాణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు. ఇదిలాఉండగా, శివునినుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడ అడ్డుతగులసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలో తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరలా ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరుగలేదు.

5. వైద్యనాథ జ్యోతిర్లింగం

వైద్యనాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గణా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరాగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలో లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథమ్ లో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరానియమాలతో, ఒక చేట్టుకుండా అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవాన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా, శివుడు రావుణుడు కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే  స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగారానికి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడిపోతుంది. రావణుడు ఎంతగా ఆ ఆత్మలింగాన్ని పెకలించి లంకానగారానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. వైద్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది. కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచాశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూడార్థం. 

6. నాగేశ్వర జ్యోతిర్లింగం

పశ్చిమ సముద్ర తీరాన, దారకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలసి ప్రజలను చిత్రహింసలకు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న విన్చుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పై పనిచేస్తుంది. కనుక, రాక్షసదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరచుకుని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడొకడు. ఇతడు పరమ శివ భక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గోలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగారూపమై జ్యోతిర్లింగమై వెలిసాడు. ఈ స్వామిని దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.

7. కేదారేశ్వర జ్యోతిర్లింగం

Picture

ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అత్యంత నిష్ఠాగరిష్టులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సును మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగరూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రాసాదింపమని ప్రార్థించారు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది. దీపావళి రోజున స్వామికి నేతితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునేలలపాటూ ఆలయంమూసి ఉన్నసమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఇక్కడ ఆమవారైన కేదార గౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాడవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హింసకుండం, ఉదక కుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చెసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చొట్ల నుండి సీసాలలొ గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చెయిస్తుంటారు.

8. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం

ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడ పిలుస్తారు. త్ర్యంబకేశ్వరుడు స్వయంభువు. అమ్మవారు త్ర్యంబకేశ్వారి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు.

ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు త్రిమూర్త్యత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సమేతంగాగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణఖ శ్రీరాముని కామించాగ్ఆ, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు. శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’ గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగారి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యాసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భువికి రప్పించాలని నిర్ణయించిన  మునులు తగిన పథకాన్ని  గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు. ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి. మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు. వెయ్యేళ్ళు శివునిప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమమహర్షి. గౌతమమునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా ‘గౌతమీనది’ అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా ‘గోదావరి’ అని ప్రఖ్యాతి చెందింది. ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతి, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మనరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువుగా వెలసిన స్వామి, భక్తులను తనన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.

9. రామేశ్వర జ్యోతిర్లింగం

రావణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీత, లక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోద్యానగారానికి తిరిగి వస్తూ, గంధమాదవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు. అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు, శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు. శ్రీరాముడు శివలింగాన్నోకటి తీసుకురమ్మని హనుమను పురమాయిన్చాగా, శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ముహూర్తం సమీపిస్తున్న కొలదీ హనుమ రాక ఆలస్యమైంది. వేరే మార్గం లేక మునివరుల సలహాననుసరించి సీతచే సైకత లింగాన్ని (ఇసుకలింగాన్ని) ప్రతిష్టింపజేస్తాడు శ్రీరాముడు. ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమతుండు, శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకుని పరిపరి విధాలుగా చింతిస్తాడు. ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు ఆ సైకతలింగాన్ని తొలగించి, రజతాచలంనుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టించమని చెబుతాడు. రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహంతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు. చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు, సుముహుర్త బలం, మంత్రబలం సైకత లింగానికి మహాత్మ్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం తీసుకొచ్చిన లింగాన్ని సైకత లింగం ప్రక్కనే ప్రతిష్టించమని చెప్పాడు. అలా శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వరలింగమని పూజలందుకొంటున్నాయి. రామేశ్వరలింగాన్ని పూజించినవారికి బ్రహ్మహాత్యాది దోషాలు తొలగిపోతాయి. కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వరలింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని ఋషివాక్కు, సమస్త ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.

10. భీమశంకర జ్యోతిర్లింగం

త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షస దంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాదునికి ఇచ్చి పెండ్లి చేశారు. ఆ విరాధుడు, శ్రీరామునితో జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానడిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళించేందుకు ప్రయత్నించి, ఆ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్నాకర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భవతి అయి భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతటికీ కారకుడు రామావతారం ధరించిన విశ్నువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన  భీమాసురుడు కామరూప దేశాదిపతి సుదక్షిణుని ఓడించి కారాగ్రుహంలో బంధించాడు.  అతని భార్య సుదక్షిణాదేవిని కూడా బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేసూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాధించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతోస్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షససంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోక కళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనా వళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.

11. విశ్వేశ్వర జ్యోతిర్లింగం

ఈ సృష్టికి ముందునుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం నుండి ప్రకృతి, పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్నిప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి  నిర్మించారు. అదే కాశీ పట్టణం. పరమాత్మ ఆదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు అతని వేడికి శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జలప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణిక’గా ప్రసిద్ధమైంది. అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్న నారాయణుని నాభికమలంనుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞణు అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పధ్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది. ఐరావతాదులతో బ్రహ్మాండంలో సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దెవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలకించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అష్టభైరవులు, డుంఢితో సహా 56 గనపతులు, నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు. కాశీలో గంగాస్నానం చేసి, విశ్వేశ్వరుని, భిందు మాధవుని, డుండిగణపతిని, దండపాణిని, కాలభైరవుని, కుమారస్వామిని, అన్నపూర్ణను సేవించుకోవాలి. కాశీయాత్ర చెయలేనివారు, కాశీ పేరును తలచుకుంటే చాలు, యాత్రాపుణ్యఫలం దక్కుతుంది. కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామతారక మంత్రోపదేశం లభించి మోక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తే, ఎంతోకాలం పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించినవారికి భుక్తికి లోటుండదు.

12. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం

పూర్వం దేవగిరి సమీపంలో సుధర్ముడు – సుదేహ అనే దంపతులుండేవారు. వీరికి ఎంతకాలమైనప్పటికీ సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఒక యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు.అతనిని సాదరంగా ఆహ్వానించిన  దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సంగంలోనే భోజనాన్ని వదిలేసి వెళ్ళసాగాడు. సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది ఆ యతీశ్వరుని నియమం. ఆ దంపతులు యతీశ్వరుని కాళ్ళపైబడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరిశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తెలుగున చెల్లెలు ఘుశ్మను పెళ్లి చేసుకోమని భర్తకు చెబుతుంది. సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికీ, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్లి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతియైన ఘుశ్మ, అక్క సుదేహను తల్లిలా, భారతాన్నిఉ దైవసమానునిగా భావించి సేవిస్తుండేది. అచిరకాలంలోనే ఘుశ్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో ఘుశ్మ  మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానంగా పెరగసాగాడు. అయితే సుదేహ మనసులో అసూయాజ్వాలలు రెడ్డిగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్వాద్వేషాలను పెంచుకొసాగింది. ఒకరోజు రాత్రి సుదేహ, పసివాని గొంతు కోసి, తనను మొండేన్ని వేరువేరుగా చెరువులో విసిరేసింది. ఇదంతా తెలియని ఘుశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికివెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటూవచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది.’ అని చెప్పాడు. కొడుకు చెప్పిన సంగతిని విన్న ఘుశ్మ దిగ్ర్భమ చెంది, ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలోచించసాగింది. అలా ఆమె దీర్ఘాలోచనాలోనుండగా, శివుడు ప్రత్యక్షమై సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి, ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. ఆప్పడు శివుని కాళ్ళపై బడిన ఘుశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది ఘృష్ణేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళెవై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోక్ర్థన్ని చేరుకుంటా’ వని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.

ఘృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం కలుగదని ప్రతీతి.

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలాలు

ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.

 1. సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.
 2. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి  జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.
 3. ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.
 4. అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.
 5. శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.
 6. ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.
 7. సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన
  మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.
 8. మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.
 9. చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.
 10. నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.
 11. శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం
  చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.
 12. ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

చతుర్ముఖ బ్రహ్మకు వందనం…

సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆర్తత్రాణపరాయణుడు. అందుకే దేవతలు, ఋషులు తదితరులు తమకేమయినా ఆపదలు ఎదురైనపుడు ముందుగా బ్రహ్మదేవుని దగ్గరకు పరుగెడు తుంటారు. అందుకు తగిన సూచనలను కూడ పొందు తుంటారన్నది నిజం.

ఓం వేదాత్మకాయ విద్మహే
హరణ్యగర్భాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం హంసరూఢాయ విద్మహే
కూర్చ హస్తాయ ధీమహి
తన్నో బ్రహః ప్రచోదయాత్

ఓం తత్పురుషాయ విద్మహే
చతుర్ముఖాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం సురారాధ్యాయ విధ్మహే
వేదాత్మనాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం వేదాత్మనే చ విద్మహే
హిరణ్యగర్భాయ ధీమహీ
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం పరమేశ్వరాయ విద్మహే
పరతత్వాయ ధీమహి
తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఇక రకరకాల గాయత్రీ మంత్రాలలో బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంటారు ఆయన భక్తజనకోటి.

బ్రహ్మపుట్టుక గురించి పురాణాలలో మనకు రకరకాల కథనాలు కనబడుతుంటాయి. కూర్మపురాణం బ్రహ్మ దేవుడు విష్ణుపుత్రుడంటే, శివ పురాణం బ్రహ్మ శివపుత్రుడని అంటోంది.

ఒకసారి నారాయణుడు పాలకడలిపై శయనించి ఉండగా, ఆయన మహిమ వలన, ఆయన నాభి నుంచి ఒక కమలం పుట్టింది. అటుగా వచ్చిన బ్రహ్మ, విష్ణుమూర్తిలో సమస్తలోకాలన్నీ ఉంటాయి. కనుక, ఆయాలోకాలన్నింటినీ చూడాలన్న ఉత్సుకతతో విష్ణుమూర్తి లోనికి ప్రవేశించాడు. ఇంతలో విష్ణుమూర్తి తన నవరంధ్రాలను మూయడంతో, వేరే గత్యంతరం లేని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభికమలం ద్వారా బయటకు వచ్చాడని కూర్మపురాణ కథనం.

ఇక శివపురాణం ప్రకారం శివుని దక్షిణాంగం నుండి బ్రహ్మ జన్మించాడు. అప్పటికే విష్ణువు నాభియందు ఒక కమలం పుట్టింది. బ్రహ్మలీలతో ఆ కమలంలో ప్రవేశించాడు. ఆ కమలం యొక్క ఆదిని చూడాలను కున్న బ్రహ్మ దానిని చూడలేక విస్మయంతో బయటపడి తన తండ్రి ఎవరన్న విషయంపై విష్ణుమూర్తిని ప్రార్థించి గ్రహిస్తాడు. ఒకసారి బ్రహ్మ సృష్టి చేయడానికి సంకల్పించి సనత్కుమారులను పుట్టించాడు. వారిని సృష్టిని చేయమని పురమాయించగా, అందుకు వారు విముఖత చూపిస్తారు. అందుకు కోపగించుకున్న బ్రహ్మ విష్ణువు సలహాతో తన కనబోమల నుండి రుద్రుని సృష్టిస్తాడు. అతని నుంచి ఏకాదశ రుద్రులు ఉదయిస్తారు. వారి ద్వారా ఈ సృష్టి జరుగుతుంది. ఇలా బ్రహ్మ సృష్టిని నిర్వహిస్తూ మనలను కాపాడుతున్నాడు.

ఆది శేషుని ఆశ !

శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన ఆదిశేషునికి, తాను ఆ స్వామికి మెత్తటి పరుపులాగా ఉంటూ సేవ చేయడం అమితమైన సంతోషాన్నికలిగిస్తుంటుంది. ఆయన్ని మోయడం ఆదిశేషునికి ఎప్పుడూ కోడా పెద్ద సమస్య అనిపించలేదు. విష్ణువు అసలు బరువు ఉన్నట్లుగానే అనిపించడు. ఇదిలావుండగా, ఒకరోజున ఆదిశేషునికి శ్రీమహావిష్ణువు మోయలేనంత బరువుగా అనిపించాడు. “ఎందుకిలా జరుగుతోంది?” అని ఆశ్చర్యచకితుడైన ఆదిశేషుడు, అదే విషయాన్ని గురించి శ్రీమహావిష్ణువుతో ప్రస్తావించాడు. అది విన్న విష్ణుమూర్తి “ఆదిశేషా! నిన్న భూలోకానికి వెళ్లాను కదా! అక్కడ ఓ పుణ్య ప్రదేశంలో శివుడు తాండవనృత్యాన్ని చేయడము చూసాను. త్రినేత్రుడి తాండవ నృత్యాన్ని చూసిన నా మనసు సంతోషముతో నిండిపోయింది. అందుకే నా శరీరంకూడ బరువెక్కింద” ని నవ్వుతూ చెప్పాడు. విష్ణువు చెప్పిన సంగతిని విన్న ఆదిశేషుడు మనసులో కూడ ఓ చిన్న ఆశ మొదలైంది. ఎలాగైనా తాను కూడా శివతాండవ నృత్యాన్ని చూసి తరించాలి. “నేను కూడా ఆ స్వామి తాండవ నృత్యాన్ని చూసే భాగ్యం కలుగుతుందా స్వామి?” అని తన స్వామిని అభ్యర్దించాడు ఆదిశేషుడు. అప్పుడు విష్ణువు, “ప్రస్తుతం శివ పరమాత్మ తాండవం చేస్తున్నాడు. నువ్విప్పుడు అక్కడకు వెళితే, ఆయన తాండవ నృత్యాన్ని చూసి ఆనందించవచ్చు” అని చెప్పాడు. చెప్పడమే కాదు, వెంటనే చూసి తరించమని ఆదిశేషునికి తన అనుమతిని కూడా ఇచ్చాడు.

వెంటనే ఆదిశేషుడు మనిషితల, పాము శరీరముతో కూడిన ఓ చంటిబిడ్డడి రూపాన్ని ధరించి అత్రిమహర్షి ధర్మపత్నియైన అనసూయాదేవి చేతులలో పడ్డాడు. మనిషి తల, పాము శరీరంతో కూడిన ఆ బిడ్డని చూడగానే ఒళ్ళు జలదరించుకున్న అనసూయాదేవి, తనచేతులను గట్టిగా విదిలించి, ఆ బిడ్డడిని దూరంగా విసిరేసింది.

కిందపడిన ఆ బిడ్డ, “తల్లీ! భయపడవద్దు, నేను మీ కుమారుడిని. నన్ను మీరే పెంచాలి” అని పలుకుతూ అనసూయాదేవి పాదాలపై పడటంతో, ఆ బిడ్డని దగ్గరకు తీసుకున్న అనసూయ ‘పతంజలి’ అని పేరు పెట్టి పెంచుకోసాగింది.

అలా అత్రి మహాముని ఆశ్రమములో పెరిగిన పజంజలి సకల శాస్త్ర  కోవిదుడైనాడు. శివదేవుడు చిదంబరములో ఆనందతాండవం చేస్తుంటాడని తెలుసుకున్న పతంజలి, ఒకరోజున తన తల్లిదండ్రుల అనుమతితో శివతాండవాన్ని తిలకించడానికి బయలుదేరాడు. ఆదిశేషుడు పతంజలి రూపాన్ని ధరించడం వెనుక గల అసలు కారణం ఇదే!

ఆదిశేషుడు వ్యాకరణానికి అధిదేవత. ఆయన ఈ భూలోకానికి పతంజలి రూపంలో వచ్చాడని తెలుసుకున్న విద్యార్థులు, భూలోకం నలుమూలల నుండి, ఆయన దగ్గర వ్యాకరణం నేర్చుకోడానికి తరలి వచ్చారు. పతంజలికి ధర్మసంకటం! తాను పరమశివుని తాండవనృత్యాన్ని చూసేందుకు వచ్చాడా? లేక ఈ విద్యార్థిలోకానికి వ్యాకరణ పాఠములు నేర్పేందుకు వచ్చాడా? అయితే, తనను వెదుక్కుంటూ వచ్చిన విద్యార్థులకు తగిన విద్యను బోధించడం గురువు యొక్క విద్యుక్తధర్మం. కానీ, విద్యార్థులకు పాఠాలు చెబుతూ, తన అమూల్యమైన కాలాన్ని ఖర్చు చేయలేడు. ఆ మరుక్షణమే పతంజలి మనసులోని ఓ ఆలోచన. ఆదిశేషుని అంశమైన తనకు వేయితలలు కదా! కాబట్టి తన వేయి తలలతో ఒకేసారి వెయ్యిమంది విద్యార్థులకు పాఠాలను చెప్పొచ్చు. అయితే తను వేయితలలతో కొలువు దీరి ఊపిరి పీలుస్తూ వదిలితే, అప్పుడు విడుదలయ్యే విషవాయువు వలన విద్యార్థులు దగ్ధమైపోయే అవకాశం ఉంది.

అందుకనే తను పాఠాలు చెబుతున్నపుడు, తనకు ఆ విద్యార్థులకు మధ్య ఓ తెరను కట్టమన్నాడు. అలా తాను తెరవెనుక ఉంది వేయి మంది విద్యార్థులకు పాఠాలను చెప్పసాగాడు పతంజలి. పాఠాలు చెప్పేముందు తన విద్యార్థులకు రెండు నిబంధనలు విధించాడు పతంజలి. పాఠం చెబుతున్నప్పుడు ఎవ్వరూ కదలకూడదనేది మొదటి నిబంధన. అలా కదలి బయటకు వెళ్ళే విద్యార్థి బ్రహ్మ రాక్షసునిగా మారిపోయి, నాలుగు రహదారుల కూడలిలో నున్న చెట్లకు దెయ్యాల్లా తల్లక్రిందులుగా వ్రేలాడతారన్నది రెండవ నిబంధన. పతంజలి అలా నిబంధనలను విధించడం వెనుక ఓ అంతరార్థం ఉంది. అధ్యాపకులు పాఠం చెబుతున్నపుడు, విద్యార్థులు మధ్యలో లేచి బయటకు వెళితే, పాఠాలు సరిగా వారి బుర్రలకెక్కవు. ఫలితంగా ఆ విద్యార్థుల భవిష్యత్తు, చెట్లకు తలక్రిందులుగా వ్రేలాడు తున్న దెయ్యాలవలె మారుతుందన్నది పతంజలి చెబుతున్న నిత్యసత్యం. ఇక రెండవ నిబంధన ప్రకారం, పతంజలి, పాఠాన్ని చెబుతున్నపుడు ఏ ఒక్క విద్యార్థి పతంజలితో మాట్లాడాలన్న కోరికతో తెరను తొలగించి లోపలకు తొంగి చూడకూడదు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి అలా చేస్తే ఆ విద్యార్థితోపాటు మిగతా విద్యార్థులు కూడా భస్మమైపోతారు.

అలా తన విద్యార్థులకు నిబంధనలను విధించిన ఆదిశేషుని అంశమైన పతంజలి, వేయితలలతో వ్యాకరణ పాఠాలను చెప్పసాగాడు. ఎంతో కష్టతరమైన వ్యాకరణాన్ని ఇంత సులభశైలిలో అర్థమయ్యేటట్లు చెబుతోన్న తమ గురువు చెబుతోన్న గురువు, వేయి శిరస్సులతో కూడిన పతంజలిని చూడాలన్న కోరిక కొంతమంది విద్యార్థుల మనసులలో మొలకెత్తి, మెల్లమెల్లగా బలపడసాగింది. కొంతసేపటికి తనలోని ఉద్వేగానికి అడ్డుకట్ట వేయలేకపోయిన ఓ విద్యార్థి తెరను తొలగించి చూసాడు. అంతే! ఆ మరుక్షణంలోతెర తొలగించిన విద్యార్థితో పాటూ, అక్కడున్న విధ్యార్థులంతా కాలి బూదిడైపోయారు. ఒక విద్యార్థి చేసిన దుందుడుకు చర్య వల్ల మిగితా విద్యార్థులంతా మాది మసైపోవడం పతంజలిని ఎంతగానో బాధించింది. ఒక్కడు మిగలకుండా అందరూ చనిపోయారే అని పతంజలి దుఃఖితుడౌతున్న సందర్భంలో అక్కడొక విద్యార్థి ప్రత్యక్షమయ్యాడు. పతంజలి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదెలా సాధ్యం?!

అందరూ మాది మసైపోయిన తరువాత ఈ విద్యార్థి ఎలా బ్రతికి బట్టకట్టాడు? పతంజలి పాదాలపై పడిన ఆ విద్యార్థి, “గురువర్యా! మీ దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చిన వెయ్యిమంది విద్యార్థులలో నేనూ ఒకడిని. నేను గౌడదేశం (వంగదేశం – బెంగాల్) నుంచి వచ్చాను. మీరు చెప్పిన వ్యాకరణపాఠాలు ఏమాత్రం నా బుర్రకెక్కక పోవడంతో, మధ్యలో లేచి బయటకివెళ్లాను. నన్ను మన్నించండి” అని చెప్పాడు. ఆ విద్యార్థి మాటలను విని సంతోషించిన పతంజలి, “శిష్యా! బాధపడవద్దు. నీకు అర్థమయ్యే విధంగానే వ్యాకరణ పాఠాలను బోధిస్తాను” అని చెప్పి, అలాగే ఆ విద్యార్థిని వ్యాకరణంలో నిష్ణాతునిగా చేసాడు.

అలా పతంజలి శిష్యరికం చేసి వ్యాకరణ పండితునిగా ప్రఖ్యాతిగాంచిన విద్యార్ధియే, ఆదిశంకరుని గురువైన గౌడపాదుడు. గౌడదేశానికి చెందిన వాడైనందున అతన్ని గౌడపాదుడు అన్నారు. పతంజలి విధించిన నిబంధనను మీరినందువల్ల గౌడపాదుడు చెట్టుకు తలక్రిందులుగా వ్రేలాడే దెయ్యంగా గౌడపాదుడు మారిపోయాడు. మరలా పతంజలియే గోవిందభగవత్పాదునిగా అవతరించి, గౌడపాదుని శాపవిముక్తునిగా చేసాడని ‘శంకరవిజయం’ కథనం.

అనంతరం పతంజలి, తాను చూడాలనుకున్న శివ తాండవాన్ని తనివితీరా దర్శించుకున్నాడు. వ్యాకరణ శాస్త్రం, యోగశాస్త్రం, వైద్యశాస్త్రాలకు సంబంధించిన పలు గ్రంథాలను రచించిన పతంజలి, మనస్సు, వాక్కు, శరీర ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రాలను మానవాళి అందించి, ఎంతో మహోపకారాన్ని చేసాడు. నాడు తన దేవుడు విష్ణువు చూసి ఆనందించిన శివతాండవమును తాను కూడా చూడాలన్న ఆదిశేషుని ఆశ తీరింది.

నిర్వాణషట్కమ్

మనోబుద్ధ్యాహంకార చిత్తాని నాహం
నశ్రోత్రం – నజిహ్వ – న చఘ్రాణ నేత్రం
నచ వ్యోమ – భూమిర్నతేజోనవాయు
శ్చిదానంద రూపం శివోహం శివోహం

మనస్సు – బుద్ధి – అహంకారం చిత్తం నేను కాదు. కర్ణములు – రుచి – వాసన – ఇది కూడా నేను కాదు. ఆకాశం – భూమి – తేజస్సు – వాయువు – జడము ఇవియు నేను కాదు. నేను  యొక్క స్వరూపము శివతత్త్వము. ఆ నేను శివుడనే!

అహం ప్రాణసంజ్గో నవైంపం ఇచ్చవాయు
ర్నవాసప్తధాతు ర్నవాప ఇచ్చకోశః
నవాక్ పాణిపాదౌ నచోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం

నేను పంచప్రాణాలు కాను – పంచ వాయువులు కాను – రక్త – మాంస – మేధో – ఆస్థి – మజ్జ – శుక్లం – రసం – నేను కాదు. పంచకోశాలు నేను కాదు – వాక్ – పాణి పాదాలు నేను కాదు – ఉపస్థలం కాను. నేను కేవలము చిదానంద రూపుడను శివుడను నేను!

నపుణ్యం నపాపం – నసౌఖ్యం – నదుఃఖం
నమంత్రాన తీర్థం – నవేదా – నయజ్ఞః
అహం భోజనం నైవ – భోజ్యంభోక్తా
శ్చిదాననంద రూపః శివోహం శివోహం

నాకు పుణ్యం లేదు – పాపం లేదు. సుఖం లేదు. దుఃఖం లేదు. మంత్ర జపం లేదు. తీర్థసేవలేదు. వేదములు లేవు – యజ్ఞములు లేవు. అన్నం నేను కాదు – భోజనం నేను కాదు – భోజ్యం – భోక్తా నేను కాదు. నేను కేవలం చిదానంద రూపుడను ఆ శివుడను నేనే.

నమే ద్వేషరాగా – నమే లోభమోహో
మదోమేనైవ మాత్సర్యభావః
నధర్మో నచార్ధో నకామో నమోక్షః.
శ్చిదానందరూపః శివోహం శివోహం

నాకు రాగద్వేషాలు లేవు. లోభామోహాలు లేవు. మదమాత్సర్యాలు లేవు. ధర్మార్థకామ మోక్షాలు లేవు. నేను కేవలం చిదానంద రూపుడను, శివుడనే శివుడని నేను.

నమృత్యుర్నశజ్కా నమేజాతిభేధః
పితానైవ మేనైవ మాతానజహ్మ
నబంధుర్నమిత్రం గురుర్నైవ శిష్య
శ్చిదానందరూపః శివోహం శివోహం

నాకు మృత్యువు లేదు. భయం లేదు. జాతి భేదాలు లేవు. తండ్రి, తల్లి భావన లేదు. బంధువులు లేరు. మిత్రులు లేరు. గురువు లేడు – శిష్యులు లేరు. నేను చిదానంద రూపుడను శివుడను. ఆ శివుడను నేను.

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వే నిర్ధియాణాం
నవాబింధనంనైవ ముక్తిర్నబంధః
శ్చిదానందరూపం శివోహం శివోహం

నేను నిర్వికల్పుడను – వికల్పరహితుడను. నేను నిరాకారుడను. సర్వవ్యాపకుడను. అన్ని ఇంద్రియములతో నాకెప్పుడు సంబంధం లేదు.  బంధం లేదు. ముక్తి లేదు – నేను చిదానందరూపుడను శివుడను. ఆ శివుడను నేనే!

శంకరాచార్యుల రచనలలో నిర్వాణషట్కమ్ ఒకటి. దీనికి ఆత్మషట్కమ్ అనే పేరు కూడ ఉంది. నిర్వాణం అంటే ముక్తి అంటే ఆరు. “నేను” నిజస్వరూపాన్ని నిర్వాణషట్కమ్ లో శంకరులు వివరించారు.

పంచాక్షరీ…

ఈశ్వరుని పంచముఖాల నుండి శ్రీశివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు (న – మ – శి – వా – య) అందులో నుండి పంచభూతాలు, వాటి నుండి ఈ సమస్త జగత్తు పుట్టిందని చెబుతారు. అందువల్లనే ఈ లోకాలన్నింటికీ పంచాక్షరీ మహామంత్రం తల్లిగా నిలిచి శుభాలను కలిగిస్తోంది.

దిశ

పేరు

మండలం

బీజాక్షరం

నిర్వహణ

శివుని ఊర్ధ్వముఖం

ఈశానం

ఆకాలమండలం

మోక్షం
శివుని పూర్వముఖం తత్పురుష వాయుమండలం

విరక్తి
శివుని దక్షిణముఖం అఘోర అగ్నిమండలం

సంహారం
శివుని ఉత్తరముఖం వామదేవ ఉదక మండలం

వా

పాలన
శివుని పశ్చిమ ముఖం సద్యోజాత భూమండలం

శి

సృష్టి

ఆసేతు హిమాచలం శివారాధన వ్యాప్తమై ఉన్నది. వేదాలు, పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు కూడ శివతత్త్వాన్ని, శివయోగాన్ని బహువిధాలుగా విశదపరిచాయి.

ఓంకారవదనే దేవి ‘వ’ ‘య’ కార  భుజద్వయీ ‘శి’కార దేహమధ్యాచ ‘న’ ‘మ’ కార పదద్వయీ పంచాక్షరీ మంత్రానికి ఓంకారం ముఖం వంటిది. ‘వ’కార, ‘య’కారాలు బాహువులు. ‘శి’కారం నడుము అయితే, ‘న’, ‘మ’కారాలు పాదయుగ్మములు.

నమశ్శంభవే చ మయోభవేచ నమశ్శంకరాయ చ
మయస్కరాయ చ నమశ్శివాయ చ శివ తరాయచ

అని నమకంలొ శంభు – శంకర – శివ అంటూ మూడు దివ్యనామాలతో, ఆ పరాత్పరుని కీర్తించాయి. ‘శివయోగం’ సర్వోత్కృష్టమని, శాస్త్రాలు చెప్పడమేకాదు, కాశ్మీరశైవం, శుద్ధ శైవసిద్ధాంతం, వీరశైవం, పాశుపతం, మిత్రశైవం వంటి అనేక సంప్రదాయాలు మన భారతదేసమంతా వ్యాప్తి చెంది ఉన్నాయి.

‘శివ’ శబ్దానికి అనేక నిర్వచనాలున్నాయి. ‘శుభం, క్షేమం, శ్రేయం, మంగళం’ అని కొన్ని అర్థాలు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయతత్త్వమే శివుడు. శాంతమే శివుడు. అదే శివతత్త్వం. అన్నింటికీ ప్రకాశవంతం చేసే మూలచైతన్యమే శివుడు. వశి – శివ సమస్తాన్నీ తన వంశంలో ఉంచుకున్న వాడే సర్వేశ్వరుడు. అతడే ఇచ్ఛా – జ్ఞాన – క్రియా శక్తులతో కూడిన పరమేశ్వరుడు, సర్వ జగత్కారణుడు, ఆ తత్త్వమే ఆయన పంచాముఖాలలో గోచరిస్తుంటుంది.