సరస్వతీ మంత్రము…

ఋగ్వేదం, 6.5.12

ఓం ప్రాణో దేవీ సరస్వతీ వాజేభివాజినీవతీ | ధీనామవిత్ర్యవతు || ఓం ||

“వాక్శక్తిని గురించి యోచించి చూడండి! ఉన్నతతత్త్వాలలోను, అట్లే దైనందిన జీవితంలోనూ అదొక మహాశక్తిగా అలరారుతూ ఉంది. మనం యోచించకుండా, పరిశోధించి చూడకుండా రేయింబవళ్ళు యీ శక్తిని వినియోగిస్తున్నాం. ఈ శక్తి స్వభావాన్ని తెలుసుకోవడమూ, దాన్ని ఆదర్శవంతంగా వినియోగించుకోవడమూ కర్మయోగంలో ఒక భాగమే” అంటారు స్వామి వివేకానంద.

ఈ వాక్ శక్తే వాక్ దేవి, సరస్వతి అంటూ వెదకాల పర్యంతంగా ఆరాధింపబడుతూ వచ్చింది. మనలో వాక్శక్తిని జాగృతం చేయమని దేవిని ప్రార్థిస్తుంది యీ మంత్రం.

ఓం ప్రాణో దేవీ సరస్వతీ వాజేభివాజినీవతీ | ధీనామవిత్ర్యవతు || ఓం ||

వాజేభిః=ప్రణమిల్లే వారిని; వాజినీవతీ=కాపాడేదానవైన; దేవీ సరస్వతీ=సరస్వతీ దేవీ; ప్రనః=మనలను కాపడనీ; ధీనాం=వాక్ శక్తులను; అవిత్ర్యవతు=జాగృతం చేయుగాక!

ప్రణమిల్లే యావన్మందినీ కాపాడే సరస్వతీదేవి మనలను కాపాడు గాక! వాక్ శక్తులను ప్రేరేపించి మనలను జాగృతం చేయుగాక!

Advertisements

చదువులలో మర్మం…

సరస్వతి! నమః తుభ్యమ్
వరదే! కామరూపిణి!
విద్యారంభం కరిష్యామి,
సిద్ధిః – భవతు మే సదా!!

(సరస్వతి మాటా, నీకు నమస్కారం, ఓ వర ప్రదాయినీ, కామరూపిణీ, నేను విద్యారంభం చేయబోతున్నాను. నాకు ఎల్లప్పుడూ విద్యాల సిద్ధి కలుగుగాక!) అని సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రసిద్ధమయిన ప్రార్థన.

చాడువులతల్లిగా మనం పూజించుకొనే శక్తి స్వరూపిణి సరస్వతిమాత. సరస్వతీ పూజ సందర్భంగా విద్య గురించి నాలుగు మాటలు.

భారతీయ సంప్రదాయలో విద్యకు ఎంతో విలువ ఇచ్చారు. దానికిచ్చిన విలువ ధర్మవర్తనకూ, సచ్చీలానికీ తప్ప మరి దేనికీ ఇవ్వలేదు. ‘విద్య లేనివాడు వింత పశువు’ అంటుంది మన సంప్రదాయం.

విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే!

(విద్య సురక్షితంగా దాచబడ్డ ధనంలాంటిది. మనుషులకు విద్యే ఇతరులను ఆకర్షించగల సౌందర్యం విద్యే కీర్తి. అది సకలభోగాలనూ కలిగించగలదు. అది మార్గాదర్శనం చేసే గురువు. దేశాంతరంలో కూడా మన యోగక్షేమాలు కనిపెట్టి ఉండే బంధువు. విద్య విశిష్టమైన దేవతాస్వరూపం. దానికి సాటివచ్చే సంపద మరొకటిలేదు. దాని వల్ల రాజసత్కారం పొందవచ్చు. విద్య లేనివాడు అసలు మనిషేనా!) అని భర్తృహరి సుభాశితాన్ని కమ్మగా తెలుగులో చెప్పాడు ఏనుగు లక్ష్మణ కవి.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న. విద్య అంటే ఏది? నేటి విధానంలో చదువుకొని బియ్యేలూ, ఏమ్మేలూ చేయడం విద్యా? ఉన్నత ఉద్యోగాలూ, ప్రభుత్యాధికారాలు సంపాదించుకొనేందుకు పనికివచ్చే ‘చదువు’ ను విద్య అనాలా? అసలది విద్య అనవచ్చా? విద్యవల్ల పరమ ప్రయోజనం ఉదరపోషణేనా? లేక మరేదయినా ఉందా? ఇవన్నీ లోతుగా ఆలోచించాల్సిన ఆసక్తికరమైన ప్రశ్నలు.

విద్యలో వివిధాలైన స్థాయిలను గుర్తించ వచ్చు.

చరిత్రో, భూగోళ శాస్త్రమో, రసాయనిక శాస్త్రాయో ఎల్ల తరబడి ఆధ్యయనం చేసి వాటిలో పాండిత్యం సంపాదిస్తే, అవి విద్యలా? అంటే, ఒక స్థాయిలో అవి విద్యలే. వాటిని అభ్యసించినవాళ్ళు ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకొని సంఘానికి ఆయారంగాల్లో సేవలు చేయవచ్చు, చేస్తున్నారు. మరోనలుగురికి శాస్త్రభోధ చేసి పుణ్యం కట్టుకొంటున్నారు. ఆ సేవ విశిష్టమైనదే, ఒక స్థాయిలో.

కానీ, విద్యకు అంతకంటే మౌలికమైన గొప్ప ప్రయోజనం కూడా ఉన్నది. విద్య ధర్మాధర్మ విచక్షణ కలిగించాలి. నైతికవర్తననూ, ధర్మబద్ధతనూ, సద్గుణాలనూ సచ్ఛీలాన్నీ పెంపొందించాలి. పైన చెప్పుకొన్న శాస్త్రజ్ఞానంవల్ల ఈ ప్రయోజనం కలగనూ వచ్చు, కలగకపొవచ్చు కూడా.

ఈ ప్రసిద్ధ శ్లోకం విద్యవల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలను మరొక విధంగా వర్ణిస్తున్నది.

విద్యా దదాతి వినయం,
వినయాత్ – యాతి – పాత్రితామ్|
పాత్రత్వాత్ – ధన మాప్నోతి,
ధనాత్ – ధర్మం, తతః సుఖమ్||

(విద్యవల్ల వినయం అబ్బాలి. దానివల్ల పాత్రత, అధికారర్హత లభిస్తుంది. దాని వల్ల ధనం పొందవచ్చు. ధనం వల్ల ధర్మాచరణ సాధ్యమవుతుంది. దాని వలన సుఖం లభిస్తుంది.) ఈ ప్రాధాన్యతలవరుస సమంజసంగా ఉంది.

అయితే 19 శతాబ్దంలో మొకాలే సంస్కరణల వల్ల ఈ పరంపర మారిపోయినట్లయి విద్యవల్ల ప్రభుత్వోద్యోగం, తద్వారా విదేశీపాలనకు సహకరించటం, దాని వల్ల ధనం, దాని వల్ల విదేశీయ ప్రభువుల పాదపూజా భాగ్యం, దానివల్ల సాటివారిని నిర్దాక్షిణ్యంగా పీడీంచేందుకు సర్వహక్కులూ, ఇలా కొత్తప్రయోజనాలు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ పరిస్థితి మెరుగయింది. కానీ విద్యవల్ల ధర్మాధర్మవిచక్షణ, నీటి బద్ధమైన నడవడికా అలవాడాలనే ధారణ పునరుద్ధరించ బడ్డట్టు కనిపించదు.

అసలు, విద్యకు ఉన్న ముఖమైన ప్రయోజనం ప్రహ్లాదుడి వంటి జ్ఞానులు ఇంకో విధంగా ప్రకటించారు.

హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడిని గురుకులవాసం నుంచీ వెనక్కు పిలిపించి, ‘నాయనా! నీకు గురువులేమి నేర్పించారు? నిన్ను గురుకులానికి పంపినప్పటి నుంచి ఎప్పుడు నువ్వు నీతివిదుడివవుతావా అని గాఢమైన ఉత్కఠంతో ఎదురుచూస్తున్నాను. నువ్వు నేర్చుకొన్న విద్య సారమేమిటో నాలుగు ముక్కలలో చెప్పు. విని సంతోషిస్తాను.

విద్యాసార మెరుంగ గోరెద, భవత్ –
విజ్ఞాత శాస్త్రంబులో
పద్యం బొక్కటి – చెప్పి,
సార్థముగా – తాత్పర్యంబు – భాషింపుమా’

అంటే ప్రహ్లాదుడు :

చదివించిరి నను గురువులు;
చదివితి ధర్మాది ముఖ్య శాస్త్రంబులు; నే
చదివినవి – కలవు పెక్కులు;
చదువులలో మర్మమెల్ల – చదివితి తండ్రీ
! అని అన్నాడు. ఇంతకీ ప్రహ్లాదుడు నేర్చుకొన్న చదువులలో మర్మమెల్ల ఏమిటీ? తనే చెప్పాడు.

తను హృత్ – భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా –
ర్చనముల్ – సేవయు, ఆత్మలో – ఎరుకయున్, సంకీర్తనల్ , చింతనం –
-బను – ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స –
-జ్జనుడై యుండుట భద్రమంచు తలతున్, సత్యంబు! దైత్యోత్తమా!

ఆ మహాభక్తుడి దృష్టిలో చదువులలో సారం, మర్మం ఏమిటంటే మనిషికి హరి భక్తికంటె ఉత్తమమార్గం మరొకటి లేదని చదువుల ద్వారా నేర్వవలసినది ఇంతకూ మించి మరొకటిలేదు. ప్రహ్లాదుడి దృష్టిలో జీవితానికే ఏకైక ప్రయోజనం హరిసేవ. విద్యకూ అంతే, భక్తి మార్గాన్ని చూపేదే చదువు. ‘చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు!’

పొతే వేదాంతశాస్త్రంలో చూస్తే ముండకోపానిశాత్తు రెండు రకాల చదువులను గుర్తిస్తుంది – పరావిద్యా, అపరావిద్యా. ‘ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మ యత్ బ్రహ్మవిదో వదంతి: పారాచ ఏవ, అపరా చ’. నేర్వవలసిన విద్యలు పరావిద్య, అపరావిద్య అనే రెండు అని బ్రహ్మజ్ఞానులు చెప్తారు – ముండకోపనిషత్ (1-1-4).

వీటిలో అపరావిద్య అంటే చతుర్వేదాలూ, ఆరు వేదాంగాలూ మొదలైనవి. ఇవి జ్ఞానానికి సాధనాలు. అక్షర పరబ్రహ్మజ్ఞానాన్ని సాక్షాత్కరింపజేసేది పరావద్య – వేదాంత విద్య. ఈ విద్యనెలా అభ్యసించాలో ఉపనిషత్తు కోంత వివరంగా బోధిస్తుంది.

మరయితే పర – అపర విద్యలు రెంటికీ భిన్నమైన లౌకిక విద్యాల మాటేమిటి? వీటిని ఉపనిషత్తు ‘అవిద్య’ అంటుంది. అవిద్య అంటే విద్యాహీనతా, నిరక్షరాస్యతా కాదు. సంసార సాగరమే పరమార్థమనీ, దానికీ నా ఆత్మకూ ఉన్న సంబంధం శాశ్వతమనీ భ్రాంతి అవిద్య. ఇది నిజమైన విద్యవల్ల తొలగించబడుతుంది.

సంసారః పరమార్థోయం, సంలగ్నః స్వాత్మవస్తుని!

‘అవిద్యా’ స్యాత్; విద్యయా – ఏషా నివర్తతే||

అని విద్యారణ్యుళ ‘వేదాంత పంచదశి’ అవిద్యను నిర్వచించింది.

అవిద్యని తొలగించగల బ్రహ్మవిద్య అంత త్వరగా పట్టుబడేది కాదు. ఇది లౌకిక విద్యాల కంటె కష్టమైంది. ఆ విద్య గురూపదేశం వల్లా, ఆత్మ – అనాత్మల గురించిన నిరంతర వివేచనవల్లా, ఉపనిషత్తులలో చెప్పిన ‘మహావాక్యా’ళ నిరంతర చింతనవల్లా, ఎన్నో జన్మల కృషితో మాత్రమే పట్టుబడుతుంది. ఇది గ్రంధపఠనంవల్లా, శాస్త్ర చర్చలవల్లా, ప్రవచన శ్రవనంవల్లా మేధాశక్తి వల్లా బోధపాడేది కాదు. నిరంతరసాధనతో, అపరోక్షంగా అనుభవపూర్వకంగా అవగతమయ్యది మాత్రమే. పరావిద్య మాత్రమే మానవ జన్మకు పరమావధి అయిన బ్రహ్మజ్ఞానానుభవాన్ని కలిగించగలదు.

ఈ విద్యకూ, లౌకికమైన చదువులకూ సంబంధమే లేదు పొమ్మన్నాడు ధూర్జటి:

ఏ వేదంబు పఠించె లూతా? భుజగంబే శాస్త్రముల్ – చూచె? తా –
-నే విద్యాభ్యసనం బొనర్చె కరి? చెంచే మంత్రమూ హించే. బో –
-ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు! నీ పాద సం-
-సేవసక్తియోగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

సాలెపురుగు ఏ వేదాలు చదివింది? పాము ఏ శాస్త్రాలు చదివింది? ఏనుగు ఏ విద్యలు చదివింది? ఏనుగు ఏ విద్యలు నేర్చింది? చెంచుతిన్నాడు ఏ మంత్రాలు నేర్చుకొన్నాడు? (కానీ శ్రీకాళహస్తీశ్వర కథలో వీలాందరికీ ముక్తి లభించలేదా?). జ్ఞానం – ఆవిర్భావానికి కారణం చదువులా? కానే కావు. నీ పాదసేవలో ఆసక్తి మాత్రమే ప్రాణికోటికి మోక్ష ద్వారాలు తెరిపించగలడు, శ్రీకాళహస్తీశ్వరా!

ఇది ఇలావుంటే సరస్వతీ ఉపాసకుడైన శ్రీనాథుడు ఆ దేవి రూపాన్ని ఈ క్రిందివిధంగా వర్ణించాడు.

సింహాసనము చారుసిత పుండరీకంబు
చెలికత్తె చెలువారు పలుకు జిలక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు
పసిడి కిన్నెరావీణె పలుకుదోడు
నలువ నెమ్మోము దమ్ములు కేళీగృహములు
తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాది విద్యలు విహరణ స్థలములు
చక్కని రాయంచ యెక్కిరింత

యెపుడు నే దేవికాదేవి యిందుకుండ
చంద్రచందన మందార సారవర్ణ
శారదాదేవి మామకస్వంత వీధి
నిండు వేడుక విహరించు చుండుగాత

ఆ తల్లి కూర్చున్న సింహాసనం అందమయిన తెల్లని పద్మం. ఆమెకు చెలికత్తె చక్కైటి పలుకులు పలికే హిలుక. అమ్మ అలంకరించుకున్న పువ్వు బాలచంద్రుడు. అమ్మ పాటలకు తోడుగా బంగారు కిన్నెరా వీణ మ్రోగుతుంటుంది. బ్రహ్మదేవుని ముఖపద్మాలే అమ్మవారు ఆడుకునే కేళీగృహాలు. సత్కవుల మనసే అమ్మవారి ప్రతిబింబం కనబడే తళుకుటద్దం. వేదాది సకల విద్యలు అమ్మవారి నివాసాలు. చక్కని రాజహంస ఆ తల్లి వాహనం. సితపుండరీకం, చిలుక, చుక్కలరాజు చంద్రుడు, పసిడి కిన్నెరా వీణ, బ్రహ్మముఖాలు, సత్కవుల మనస్సు, వేదాది విద్యలు, రాయంచ…ఇవన్నీ అమ్మకు సంహాసనాడులై సేవిస్తున్నాయి. ఆ దేవి తెల్లని రంగు గల వస్తువులతో, దుస్తులతో ధగధగా మెరిసిపోతోంది. అటువంటి దేవి నా హృదయంలో ఆనందస్వరూపిణిగా విహరించుతుండగాక అని కవిసార్వభౌముడు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నట్లే సరస్వతీ మాట మనకు తగిన విద్యలను నేర్పించి, నిత్యం మనలను ఆనందసాగరంలో ఉండేట్లు దీవించుగాక!

అమ్మలగన్న ‘అమ్మ’…

జగన్మాత సకలశాస్త్ర స్వరూపిణి. ప్రాశాబద్ధుడై, స్వార్థ పరుడై, సత్యాన్ని విస్మరించిన మనిషికి, మనః, చిత్త, బుద్ధులను ప్రక్షాళన చేసి, తాను ఉన్నానని గుర్తు చేసి, మోక్షమార్గాన్ని సుగమం చేస్తోంది ఆ తల్లి. వ్యక్తమైన ఈ సృష్టికి పూర్వం, అగోచరమైన, అతీతమైన, ‘అమ్మ’, సృష్టి తరువాత, సకల చరాచరరూపంలో వ్యక్తమై, పోషణ భారాన్ని వహించింది. పరాశక్తి ప్రభావం చేతనే, అచేతనమైన సదాశివశక్తి సచేతనమై, గుణమై, సచ్చితానంద మూర్తియై, సృష్టిస్థితిలయలకు ఆధారమైంది. జగన్మాత శక్తిని వర్ణిస్తూ సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు, “తల్లీ! ఈశ్వరుడు జగన్నిర్మాణ శక్తితో చేరితేనే జగాలను నిర్మించేంతటి శక్తిగాలవాడవుతాడు. శివ, కేశవ, బ్రహ్మలచే పరిచర్యలు పొందదగు నిన్ను, పుణ్య లేశమైనా చేయని నావంటివాడు మొక్కుటకు, కీర్తించుటకు అర్హత కలదా” అని వర్ణించారు.

సప్తశతిలో దేవీసూక్తం, జగన్మాత శక్తిని అమోఘంగా వర్ణించింది. “యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా”. సర్వమానవ ప్రవృత్తులన్నీ అమ్మ స్వరూపాలేనని దేవి వర్ణించబడింది.

మన భారతీయసంస్కృతి యొక్క మూలసూత్రం పారమార్థిక చింతన, పరమాత్మ మన ఇంద్రియాలను బహిర్ధ్రుష్టులతో కల్పించాడు. అందుకే మనిషి ఇంద్రియాలు ఎక్కువ భాగం బాహ్యవిషయాలకే ప్రాధాన్యత ఇస్తాయి. అది సహజం. వీటిలో బాటు అంతరింద్రియాలైన మనో, బుద్ధి, చిత్త, అహంకారాలను కూడా కల్పించాడు. మరి మన కర్తవ్యం ఏమిటి? విజ్ఞతతో, వివేకంతో, అంతరింద్రియాలను జాగృతం చేసి, ఆత్మాన్వేషణతో పరాశక్తి యొక్క ప్రజ్ఞని పరిపూర్ణంగా ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి. సాధించాలి.

దేవీగీతలో పరాశక్తి “తీర్థమున, కైలాస, వైకుంఠములలోకాక, నన్ను తెలుసుకొన్న జ్ఞాని హృదయకమల మధ్యమున నివశించెదను” అని తెలిపింది. అంతటి కృపామయి, ఆ తల్లి పాదాలను ఆశ్రయించటం మన కర్తవ్యం కాదా! అదే జేవన ధర్మం.

“తల్లీ! నన్ను పాతాళానికి త్రోసినా, నిఖిల సామ్రాజాధిపత్యం ఇచ్చినా, నిశ్చయంగా నీ పాద పద్మాలను వదలను” అని శరణంటే తప్పక మన వెన్నుదన్నై నిలుస్తుంది ఆ తల్లి.

వేదాలలో, ఉపనిషత్తులలో, దేవీశక్తి అద్భుతంగా వర్ణించబడింది. దేవ్యుపనిషత్తు శక్తి ఉపనిషత్తులలో ముఖమైనది. దేవీశక్తి ఉపనిషత్తులలో మరోముఖ్యమైనది త్రిపురతాపిన్యుపనిషత్తు. ఇందులో శక్తి ఉపాసనా విధులు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రనిర్మాణం. అందలి రహస్యాలు, ఇంకా ఎన్నో విధి విధానాలు వివరించబడ్డాయి. పరమాద్భుతమైన శక్తి రూపాలలో ముఖ్యమైనవి కాళీ, దుర్గ, పార్వతి, లలితా, సరస్వతి. వీరు మన కోసం ఇక్కడ కొలువయి నిత్య పూజలందుకునే శక్తిరూపాలు.

కాళీ

వైష్ణవశక్తి అయిన మహామాయే మహాకాళి. సర్వభూత లయకారకుడైన మహాకాలుని లయమోనర్చుకున్న శక్తి కాళి. కాలాన్ని లయిమ్పజేయునది కాళి. సృష్టికి పూర్వమున్న అంధకారరూపమే కాలీస్వరూపం. నిష్క్రయాతకంగా బ్రహ్మమందు నిక్లిప్తమైన శక్తే కాళి. 

ఋగ్వేదంలో కాళి ఆవిర్భావం చెప్పబడింది. దేవమాత అదితికి ఆదిత్యులు జన్మించారు. అందుచే సూర్యోదయాస్తమయాలు రెండూ అదితికి అన్వయింప బడ్డాయి. కాని, అదితి ఉదయత్వాన్ని తాను ఉంచుకొని, అస్తమయాత్వాన్ని దితికి అన్వయించింది. ఈ ఇద్దరు దేవతలు చీకటివెలుగులు, సృష్టిలయాలు, జనన మరణాలు, జ్ఞానాజ్ఞానాలు – వీటికి అధిదేవతలనారు. ఈ ఇద్దరితత్వాలు ఏకమై ‘కాళీమాత’ అనే సంయుక్త రూపం ఏర్పడిందని ప్రశస్తి.

కాళీ స్వరూపం బాహ్యానికి భయంకరం. సదాశివుని శావాసనంగా, ఆయన గుండెల మీద ఒక కాలును ఉంచి, కాళిక దిగంబరంగా నిలబడి ఉంటుంది. నల్లని రంగు, మెడలో 54 కపాలలతో కూర్చిన దండ, ఒక చేతిలో రక్తసిక్తమైన శిరస్సు రెండో చేతిలో కత్తి. ఇంకొక కుడి చేయి అభయముద్రలో ఉంది, ఎడమ చేయి అభయ ప్రదానం చేస్తున్నట్లుంటుంది. నుదుట మూడవకన్ను ప్రజ్వలిస్తుంటే, రక్తసిక్తమైన నాలుక వేలాడుతుంటుంది. ఆమె దిగంబరి. కాని, దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దేవత. తెల్లనిఛాయ శివుడు శుద్ధచిద్రూపుడై, శవాకృతిగా ఉండగా, క్రియారూపిణి అయిన కాళికాశక్తి శివునిపై ఆధారపడి ఉంది. సౌమ్య, రౌద్ర రూపాల సమన్వయాకరమే కాళీస్వరూపం. తాత్విక దృష్టితో కాళీ స్వరూపాన్ని పరిశీలిస్తే, ఆమె తత్వమయి. సృష్టికి అవసరమైన ఇచ్ఛాశక్తి. ఆమె ధరించిన కపాలాలు 54 సంస్కృత అక్షరాల సంపుటి. ఆ కపాలాలు ఆయా అక్షరాలను ఉచ్ఛరిస్తే. , ఆ శబ్దాలు ఏకస్వరమై అ, ఉ, మ స్వరూపమై ‘ఓం’కార మైనది. చండముండులను వధించి చాముండేశ్వరిగా ప్రసిద్ధి చెందింది.

దుర్గ

కాలీమాతతోబాటు పూజలందుకునే తల్లి దుర్గ. దుర్గముడనే రాక్షసుని చంపినా దుర్గ సర్వాలంకారశోభిత. సింహవాహిని, మహిషాసురుని సంహరించినది. 20 చేతులలో వివిధమైన ఆయుధాలను పట్టుకొని ఉంటుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణకై అనేక రూపాలు, నామాలు ధరించింది. శుంభ నిశుంభులను సంహరించటానికి విధ్యావాసిని అయి రాక్షససంహారం చేసింది. 100 ఏళ్లు వానలు లేక బాధలు పడుతున్న మునులు ప్రార్ధించగా ‘శతాక్షి’గా వారి బాధలను తీర్చింది. తన శరీరం నుండి క్షాకాలను పుట్టించి జనుల ఆర్తి తీర్చి ‘శాకంబరీ దేవి’గా ప్రసిద్ధి చెందింది. ఈ తల్లినే దేవదేవి, బ్రహ్మచారిణి, మహిషాసురమర్దిని, శివా, భగవతి మొదలైన అనేక నామాలతో కొలుస్తారు. ఈమె వాసుదేవుని సోదరి. సప్తశతిలో దుర్గకు 9 పేర్లు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చండీఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మాహాగౌరి, సిద్ధి. వీరు నవదుర్గలుగా పూజలందుకుంటున్నారు. 

శ్రీరామచంద్రుడు రావణుని వధించే శక్తిని పొందటానికి దుర్గాని పూజించాడట. శ్రీకృష్ణపరమాత్మ గోలోకంలో దుర్గను ఆరాధించాడట. త్రిపురసంహారానికి ముందు పరమశివుడు దుర్గను తలచుకొన్నాడట. మధుకైటభులచే బాధించబడిన బ్రహ్మ, దుర్గను వేడుకోన్నాడట. దుర్గాసుని శాపానికి గురైన ఇంద్రుడు, దుర్గను శరణన్నాడట. ఈమె పాతాళంలో వైష్ణవి, యమలోకంలో కాలరూపిణి, కుబేరలోకంలో సౌందర్యవతి, ఆగ్నేయ ద్వీపాలలో మహానంద, ఈశాన్యదేశాలలో మృగవాహిని, ఉత్తర దేశములో శూలధారిణి, నైఋతి దిశలో రక్తదంతి, దక్షిణాన రామేశ్వరి, సింహళంలో దేవమోహినిగా వాసికెక్కి ఆరాధింపబడుతోంది. దేశ సాంప్రదాయాలననుసారించి దుర్గ రూపంలో మార్పులు, చేర్పులు చేయబడ్డాయి. ఏ పేరైనా, ఏ  రూపమైనా, దుర్గ సర్వేసర్వత్రా ఆరాధ్యదేవత. దుర్గారాధన దేవీ ఉపాసకులకు అత్యంత ముఖ్యం.

పార్వతి

పర్వతరాజు కుమార్తెగా జన్మించిన సతీదేవియే పార్వతి. అచంచలమైన పర్వతశక్తి పార్వతి. కొన్ని ఉపనిషత్తులలో పార్వతి, ‘ఉమ’ అనే పేరుతో చెప్పబడింది. రుద్రాధ్యయంలోని నామం “సోమాయనమః” – వివరిస్తే స – ఉమ అని వ్యాఖ్యానించబడింది. ఉమతో కూడిన సోముడే  పరమశివుడు. కొన్ని పురాణాలలో శివుని భర్తగా పొందదలచి, తపస్సు చేయాలని బయలుదేరిన పార్వతిని ఆమె తల్లిదండ్రులు వారించారట. ఉ+మా = తపం మానుము అని అర్ధం. కనుకనే పార్వతికి ‘ఉమ’ పేరొచ్చింది. ‘ఉమ’కి ఇంకొక అర్థం “ఉ=శివ, మా=లక్ష్మి” అంటే శక్తితో కూడిన శివత్వం అని అర్థం చెప్ప బడింది. ఉ=శివ, మ=పరిమితము – అంటే శివుని పరిమితమొనర్చు శక్తి గలదని కూడ అర్థం చెబుతారు. “ఉమా” అంటే గులాబీరంగుతో తేజోమయమైన శరీరం కలదని అన్వయింపబడింది. సర్వజీవరాశిలో తేజోరూపంలో ఉన్న శక్తి ‘ఉమా’. ఉ=శ్రేష్టమైన, మా=చిత్తస్థితి. అంటే, గొప్పదైన చిత్త స్థితిని కలుగచేయునది ‘ఉమ’. అ+ఉ+మ – ‘ఓం’, కాని, కొందరు తాత్వికులు ఉ+మ+అ=ఉమ, ప్రణవరూపమని వర్ణించారు. శివసూత్రాలలో ‘ఉమ’ పదానికి అర్థం, యోగుల ఇచ్ఛాశక్తిగా పేర్కొనబడింది. పర్వతరాజపుత్రి పార్వతి గౌరవర్ణం కలది, కనుక ‘గౌరి’గా ప్రఖ్యాతి పొందింది. శివా, పార్వతి, గౌరి, ఉమా – పేరేదైనా ఈ నామాలన్నీ శివపరాలే.

లలిత

శీలలితాదేవి గురించి చెప్పాలంటే సాహసమే. లలితా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి ఈరోజుల్లో ఇంటింటా నిత్యపారాయణగా జరుపబడుతోంది. లలితా సహస్రనామావళికి వివరణ రాసిన భాస్కరరాయులు మొదటి శ్లోకంగా శ్రీలలితను ప్రార్థించాడు. సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాతగా, శ్రీమహారాజ్ఞిగా కొనియాడబడింది. పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి, చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోకమాత లలిత.
ల – సర్వవిద్యలకు లక్ష్యమైనది,
లి – రూపము లేనిది,
త – సంసారం నుండి తరింపజేయునది, శ్రీలలిత.

శోభ, విలాసం,మాధుర్యం, గాంభీర్యం, స్థైర్యం, జేజం,అర్థం ” లాలిత్యం, ఔదార్యం – ఈ 8 పదాల “లలిత” పదములలో నిక్షిప్తం. చెరకుగడ ధనస్సుగా, కుసుమాలను అస్త్ర, బాణాలుగా ధరించి, ఉత్తమగుణాలు కలిగి, గణాతీతమైనది శ్రీలలిత. పంచబ్రహ్మాసనాసీన అయిన లలితకు లక్ష్మీ, సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ సేవిస్తుంటారు.పంచ బ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం, చిత్క ళాసనం, వర్నాసనం – 10 దిక్కులకు, 14 భువనాలకు, 7 లోకాలకు అధిపతిన లలిత శ్రీమహారాజ్ఞి. బ్రహ్మాండమే ఆమె మహా సామ్రాజ్యము. ఆ తల్లి రెప్పపాటులో కాలం పుట్టింది. విశ్వమంతా తానే అయి వృద్ధిక్షయాలు లేని పూర్ణస్వరూపం లలిత. అమ్మ చేతి గోళ్ళ నుండి దశావతారాలు ఆవిర్భావించాయట. బ్రహ్మ, విష్ణు, రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి, త్రిపుర సుందరగా కొలువబడుతోంది. సుషుప్తనాడులలోని శక్తి కనుక త్రిపురసుందరి. మనః, బుద్ధి, చిత్తాలలో వశించునది కనుక త్రిపురసుందరి.

విశ్వమంతా త్రితత్త్వాత్మికం. అందులో శక్తి కనుక త్రిపురసుందరి. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు దూర్వాసుడు – ఈ 12 మంది మహానీయుల పూజలందుకొంటున్న మహాపూజ్య. ఆ తల్లికి 64 కళలూ ఉపచారాలే. 64 కోట్ల యోగినీగణంచే సేవింపబడు నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహకుండలాలు శ్రీలలితకు ఆభరణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం – ఈ 5 ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించే పంచతన్మాత్రలు. ఈ ఐదు తనన్మాత్రాలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి.

శ్రీసరస్వతి

సరస్వతి వేదకాలం నుండి అర్చామూర్తిగా ఋషీశ్వరులచే స్తుతించబడుతోంది. సృష్టికి ఆధారమైన ప్రణవనాదం “ఓం” కారం నుండి సర్వవిద్యలు ఉత్పన్నమయాయి. ప్రణవం సరస్వతీరూపం. అందుకే సకల విద్యలకు ఆధారంగా, ఆధిదేవతగా సరస్వతీ పూజింపబడుతోంది. సృష్టికారకుడైన బ్రహ్మ యొక్క సంకల్పశక్తి సరస్వతి. ఆ శక్తికే వాక్, వాణి, శారద,సరస్వతి అనే నామాలు.

వేదాలకు ఆదిమూలమైన సరస్వతి విద్యా, వివేకాల దివ్యతత్వం. “సరస్” శబ్దానికి, ప్రవాహం, చలనం అని అర్థం. అందుకే సరస్వతి బ్రహ్మ యొక్క చైతన్యశక్తిగా అన్వయింపబడుతోంది. జీవరాశులలో మాట్లాడే శక్తి గల వారి నాలుకపై వసించు దేవి సరస్వతి. సరస్వతీ సూక్తంలో ఆమె మహాసరస్వతిగా నుతింపబడింది. పరిజ్ఞానాన్ని, విముక్తి ప్రసాదించు తల్లి సరస్వతి.

సరస్వతీ వాహనం హంస. పాలను, నీళ్ళను వేరు చేయగల శక్తి ఒక్క హంసకే ఉందని చెబుతారు. అంటే, ప్రపంచంలో సదసత్తులను విడదీసి, సద్వస్తువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అర్థం. వీణను ధరించిన ఆమె నాదరూపిణి. ఆమె దేహం రంగు తెల్లని తెలుపు. పరిపూర్ణ పరిశుద్ధ తత్వానికి, ప్రశాంతతకు గుర్తు. తెలుపు అన్ని వర్ణాల సమిష్టిరూపం. సరస్వతి సకల విద్యల సమిష్టిమూర్తి. వివిధ శక్తి స్వరూపాలతో కొలువబడుతున్న పరాశక్తి స్వరూపం పరాశక్తి స్వరూపం వర్ణానాతీతం. శివశక్తి – ‘శివా’, విష్ణుశక్తి – ‘లక్ష్మి’, బ్రహ్మశక్తి ‘వాణి’, ‘కు’ అను మాయను నశింప జేయు ‘కుమారి’, చండముండులను సంహరించిన “చాముండేశ్వరి”, దుష్టశిక్షణ చేయు ‘చండిక’. విశ్వంలోని సర్వశక్తుల సమ్మేళనం ఆ తల్లి అమ్మలగన్న ‘అమ్మ’.

వాగ్దేవికి వందనం!

“చదువుల తల్లియైన సరస్వతీదేవిని శ్రీపంచమినాడు విద్యార్థిని విద్యార్థులు పూజిస్తే, చదువుల్లో సత్వర పురోగతి ఉంటుంది. విజ్ఞాన వికాసాలు వృద్ధి చెందుతాయి.”

క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి దోయజాతభావచిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్  

నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవుని మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి, నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను.

ఈ సమస్త విశం శబ్దమయం. నాదం తోనే జగత్ సృష్టి ప్రారంభమైంది. ఆ నాదశక్తికి ప్రతిరూపంగా, సరస్వతీమాత బ్రహ్మవిద్యాస్వరూపిణియై శోభిస్తుంటుంది. విద్యకు అధిష్టాత్రి సరస్వతీదేవి. ఆ తల్లి మాఘశుద్ధ పంచమి నాడు అంటే శ్రీపంచమినాడు ఆవిర్భవించింది. శాస్త్రవాక్కు, శ్రీపంచమినాడు విధిగా సరస్వతీదేవిని ఆరాధించాలని దేవిభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీపంచమినాడు సరస్వతీదేవిని పుస్తకాలు లేక విగ్రహా రూపంలో ఆవాహన చేసి పూజిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని, జ్ఞాపకశక్తి మేధ, బుద్ధి, వృద్ధి చెందుతాయని చెప్పబడింది. అందుకే ఈరోజున జ్ఞానాభివృద్ధి కోసం దేవతలు సైతం సరస్వతీదేవిని పూజిస్తారట.

సర్వజీవులలో చైతన్యస్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణే ‘సరస్వతీ’. ‘శ్రీమాతా’ అని కీర్తించబడిన ఆ తల్లి విశ్వేశ్వరుని వాక్, బుద్ధి, జ్ఞానాది ధీశక్తులకు అధిష్ఠాత్రి. సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకూ, పలుకూ ఎరుక ఏర్పడుతున్నాయి.

మాఘశ్య శుక్ల పంచమ్యాం…
మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః
వసవో యోగినస్సిద్ధ నాగా గంధర్వ రాక్షసాః
మద్వరేణ కరిష్యంతి కల్పేకల్పే లయావధి
భక్తియుక్తశ్చ దత్త్వావై చోపచారాణి షోడశ

మాఘశుద్ధ పంచమినాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు…అందరూ సరస్వతీదేవిని ఆరాదిస్తారని దేవీ భాగవతం చెబుతోంది.

మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి. అందుకే సూర్యుడు,

సర్వ చైతన్య రూపాం తాం ఆద్యం విద్యాంచ
ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్

అని ప్రార్థించాడు. ఏ విద్యను గ్రహించాలన్నా అమ్మ అనుగ్రహం తప్పదు.

చత్వారి వాక్పరిమితా పదాని తానీ
విదుర్భ్రాహ్మాణా యే మనీషిణీః
గుహాత్రీణి నిహితా నేజ్గ్యంతి
తురీయం వాచో మనుష్యా వదంతి

– అనిపించి సరస్వతీసూక్తంలో వాక్ స్వరూపం గురించి చెప్పబడింది. వాక్యం యొక్క స్వరూపం నాలుగు విధాలుగా ఉంటుంది.

1. పరా
2. పశ్యంతీ
3. మధ్యమా
4. వైఖరీ

మనలో మాట పలకాలన్నా  భావం స్ఫురింపచేసేదే “పరా”. మాట పలికే ముందు ‘పర’ ద్వారా ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘పశ్యంతీ’. ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘మాధ్యమా’ ఆ మాటలు శబ్దరూపంలో పైకి వినబడేదే ‘వైఖరీ! యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృత్, కంఠ, నాలుకలు. వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే. ఇక, భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని, పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును, జంతువులు ‘మధ్యమా’ వాక్కును, మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తున్నారు.

ఆ తల్లి శ్వేతపద్మవాసిని కనుక "శారదా" అని అన్నారు. అందుకే పోతనామాత్యుడు  –

శారదనీరడెందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార పేనరజతాచలకాశ ఫణీశకుంద మం
దార సుధాపయోధిసిత తామర సామరవాహిని శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

అని ప్రార్థించాడు. సరస్వతీదేవి తెలుపుదనాన్ని సందర్శించి అర్చించాలని కోరుకున్నారు పోతన. తెల్లని పద్మముపై కూర్చుని, ఒక కాలు నిలువుగా ఒక కాలు దానిపై అడ్డంగా మడుచుకుని కూర్చున్నట్లు, లేక నిలబడి, ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్లు పద్మపురాణంలో చెప్పబడింది. ఆ తల్లి తెల్లనిపువ్వులు ధరించి, తెల్లనిపూసల

కంఠాహారం ధరించి, ఆ కంఠాహారంపై తెల్లని గంధంపూతతో దర్శనమిస్తుంది. అందుకే ఆ తల్లిని కూచిమంచి తిమ్మకవి ఈ క్రింది విధంగా స్తుతించాడు.

బలుతెలిపుల్గు వారువము, బంగరు వీణయ, మిణ్కు టందెలున్
జిలుక తూటారిబోటియును, జిందపు వన్నియమేను బొత్తమున్
జెలువపు దెల్ల దమ్మి విరి సింగపుగద్దెయు గల్గి యొప్పున
ప్పలుకుల చాన, జానలరు పల్కులొసంగెడు గాత నిచ్చలున్

"బాగా తెల్లనైన పక్షి హంసనే గుర్రపువాహనంలా చెసుకున్న తల్లి, బంగారువీనను, మెరిసే అందెలను, చిలుకను, పుస్తకాన్ని ధరించి, శంఖంవంటి తెలుపు మేనితో ప్రకాశిస్తూ, అందమైన తెల్లని పద్మాన్నే ఆసనంగా చేసుకున్న "వాగ్దేవి" సరస్వతి, చక్కని పలుకులను నాకు నిత్యం అనుగ్రహించుగాక" అని కవీశ్వరుడు వేడుకుంటున్నాడు. అందుకే ఆ తల్లిని ప్రతి శ్రీపంచమినాడు భక్తి శ్రద్ధలతో పూజించుకోవలెను. శ్రీపంచమినాదు విద్యార్థినీ విద్యార్థులు ఆ తల్లిని పూజించడం వల్ల, చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు.